10, ఏప్రిల్ 2021, శనివారం

పాస్కాకాల రెండవ ఆదివారము

 పాస్కాకాల రెండవ ఆదివారము

(1) అపో. కా 4: 32-35, (2) 1 యోహాను 5: 1-6,  యోహాను 20: 19-31

క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము పాస్కాకాల రెండవ ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా తల్లి శ్రీసభ మనకు ఉత్తాన క్రీస్తు యొక్క ప్రతక్ష్యరూపము గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారిలో నుండి ఉత్తానము అయిన యేసు, తన శిష్యులకు కనిపించారు. యేసు చనిపోయిన నాటి నుండి 40 రోజుల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. తాను సజీవుడనని వారికి చాలా విధములుగా తెలియజేసారు. యేసు శిష్యులకు కనిపించినది తాను ఎప్పుడూ జీవిస్తున్నాడని శిష్యులకు నిరూపించడానికే మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, అనాధలుగా మనలను విడిచిపెట్టడని తెలియజేయుటకును, శక్తిని ఇచ్చుటకు కూడాను. ఆ రోజులలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనే విశ్వాసము ఉండేదని యెషయా ప్రవక్త గ్రంథములో ఇమ్మానుయేలు (యెషయా 7:14) అను వాక్యంలో చూస్తున్నాము. మనుష్య జాతితో చేసిన వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో యుగాంతము వరకు వశించునని వారి నమ్మిక. ఆ నమ్మకము యేసు ప్రభువు ఉత్తానములో పూర్తవుతుంది. ప్రభువు ఇప్పుడు తన ప్రజలతో జీవిస్తున్నాడు. దర్శన గ్రంథములో మనము చూస్తున్నాము; సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును. వారే ఆయనకు ఆలయము. వారే అయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును (దర్శన 21:3).

ఈ నాటి సువిశేషములో మనము గమనించినట్లయితే పునరుత్తానము తర్వాత తండ్రి మహిమలో చేరిన క్రీస్తు తన శిష్యులను మర్చిపోలేదు. ఆ రోజు ఆదివారము తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు(యోహాను). క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా వాగ్దానము నెరవేర్చే దేవుడు తన శిష్యుల వద్దకు వచ్చారు. అయన ఎప్పుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈ దర్శనాలు సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభువు యొక్క దర్శనాల ప్రత్యేకత ఏమిటంటే వాటిన్నంటిలో ఆయనే ముందుటారు. శిష్యుల యొక్క లోతైన విశ్వాస ఫలముగాని, వారి దృఢ నమ్మకము గాని, నిరీక్షణాల ద్వారా గాని కాదు క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చేది. ఆయన తనకు తానుగా వారి యొద్దకు వస్తున్నారు.

 

ఆయన బలపరిచితే తప్ప మనకు ఏమి అర్ధం కాదు. ఆయన క్షమియించిన మాగ్దలా మరియమ్మ మరియు ఎమ్మావు గ్రామమునకు ప్రయాణము చేసిన ఇద్దరు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన వారితో చెప్పినప్పుడే ఆయనను గుర్తించగలిగారు. శిష్యుల ఎన్నిక సమయములో ప్రభువు పలుకుతున్నారు మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను(యోహాను 15:16). ఈరోజు కూడా ఆయన మన మధ్యకు వస్తున్నారు. తన దర్శనాల ద్వారా తన స్నేహ సంబంధమును మరల మనయందు కలిగిస్తున్నారు. ఆయన దర్శనాలకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఎవరు ముందుగా ఊహింపశక్యము కానిది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరు ఊహించలేదు. ఆయన రాకడ గురించి తెలుసుకుంటే ఒక విషయము అర్థమగుచున్నది. తన శిష్యుల అవసరతలలో పరుగెత్తుకు వచ్చారు క్రీస్తు ప్రభువు. కన్నీరు కార్చిన మాగ్దలా మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. ఎమ్మావు మార్గములో శిష్యుల హృదయాలను ప్రజ్వలింపచేయుటకు వచ్చారు. రాత్రంతయు శ్రమపడి చిన్న చేప కూడా దొరకని శిష్యులకు సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన వారి యొద్దకు వచ్చారు. అందుకే ఉత్తాన ప్రభువు దర్శనాలు మనకు ఇచ్చే సందేశమేమిటంటే, మన అవసరతలలో కూడా ఆయన మన సమీపముననే ఉంటారు.

పునరుత్తానము అయిన ప్రభువు అందరికి దర్శనము ఇవ్వలేదు. ఈ భాగ్యము తన స్నేహితులకు, శిష్యులకు మాత్రమే దొరికింది. క్రీస్తు నాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు ఈ విషయాన్ని చాల స్పష్టముగా వివరిస్తున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలోనుండి లేపి మూడవ నాడు మరల మాకు కనబడునట్లు చేసెను, దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు(అపో కా 10: 40-41) పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఉత్తానమైన ప్రభువు మొదట సారిగా దర్శనమిచ్చింది తనను ఎక్కువగా ప్రేమించినవారికి, వెదకినవారికి మాత్రమే. ప్రభువు యొక్క దర్శన భాగ్యము పొందాలంటే సహృదయ సంభందం కలిగిఉండాలని ప్రభువును నేర్పిస్తున్నారు. తనను వెదికే వారికి ఈరోజుకు కూడా ప్రభువు తన దర్శనాలను ఇస్తున్నారని మనము వింటున్నాము. ఆయన యొక్క దర్శనాలు, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని స్ఫూరింపచేస్తున్నాయి. ఉత్తాన ప్రభువు మనతో ఉన్నారని మనము గుర్తించలేకపోతున్నాము. ఈనాటి సువిశేషములో మనము గమనించినట్లయితే యూదుల వలన భయము నిమిత్తము గదిలో చేరి తలుపులు వేసుకున్న శిష్యులకు దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాము. అయితే ఆ శిష్యులు మనలో కొందరి వలె బయటి నుండి అద్భుతముగా దేవుడు లోపలికి వచ్చాడని ఆలోచించారు. కానీ అది కాదు అక్కడ జరిగినది. వారితో పాటు ఆ గదిలో ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆయన తనకు తానుగ బయలుపరచకముందు కూడా ఆయన వారితో ఉన్నారని వారికి తెలియజేయుటకు ఆయన 40 రోజులు వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షమవడము, నిష్క్రమించడము జరిగింది. ఈ 40 రోజుల అనుభవాలను బట్టి ఆయన ఎల్లపుడు మనతోనే ఉంటున్నాడని మనకు బోధపడుతుంది.

 

క్రీస్తు ప్రభువు ఉత్తానమైనప్పుడు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుచేతనంటే, బహుశా వారి వారి నిరాశ నిస్పృహలకు మరియు భయాందోళనలకు బందీలై క్రీస్తు ఉత్తాన పరామరహస్యమును, సత్యమును మర్చిపోయారు. ఆ స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు శాంతి సందేశాన్ని ఇస్తున్నారు. ఉత్తాన క్రీస్తు ఒసగుచున్న శాంతి సమాధానాలు ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కావు. ఆయన మనలో ఉండి మనకు ఒసగేవి ఆంతరంగిక శాంతి సమాధానాలు. క్రీస్తు ప్రభవు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సమయములో వారి ఆలోచనలను తప్పు పట్టలేదు. తనను ఎరుగనని బొంకిన పేతురును, విశ్వసించని తోమాసును విడిచిపెట్టలేదు. కానీ వారికి తన ప్రేమను తెలియజేస్తున్నారు. వారు అయన ప్రియమైన శిష్యులు, స్నేహితులని వారికి ప్రత్యేక భాద్యత ఉందని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ శిష్యుల వలె భయానికి బందీలమై మన యొక్క కర్తవ్యాన్ని మరిచి పోయే అవకాశము ఉంది. భయాందోళనల సమయములో మనము వాటినే తలచుకుంటుంటాము. వాటిలోనే లీనమై మన గమ్యాన్ని మరచిపోతాము. అంతేకాక అశాంతికి, నిరాశ నిస్పృహలకు గురి అవుతాము. కాబట్టి, ఈ సమయములో ఉత్తానుడైన క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే సందేశము మీకు శాంతి కలుగునుగాక. ఇది విరిగిన మనసులకు ఒసగే కానుక. వీటితో పాటు ప్రభువు మనకు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మాట ఇస్తున్నారు. ఆ ప్రభువు ఒసగే శాంతి సమాధానాలను స్వీకరించి ఆ ప్రభువుతో కలసి మన జీవితాప్రయాణాన్ని కొనసాగిద్దాము.

ఆమెన్.

Bro. Manoj OCD


3, ఏప్రిల్ 2021, శనివారం

యేసు పునరుత్తాన మహోత్సవము

 నేడు యేసువు పునరుత్తానుడైనాడు  

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని సోదరులారా ఈనాడు మనము యేసు క్రీస్తుని యొక్క పునరుత్తాన పండుగను కొనియాడుచున్నాము. సిలువ శ్రమలను అనుభవించి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి ఈనాడు సజీవుడై లేచాడు.  నేనె జీవమును అని పలికిన ప్రభువు, మరణాన్ని సైతం జయించి జీవముతో లేచాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం అంత ప్రభుని యొక్క పునరుత్తానం మీదనే ఆధారపడి ఉంది. ప్రభుని పునరుత్తానం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన మూలరాయి. పునరుత్తానం లేనిదే క్రైస్తవత్వం లేదు, పునరుత్తానమును నమ్మని వాడు క్రైస్తవుడే కాడు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు ; క్రీస్తు ప్రభువు సజీవులు కాకపోయి ఉంటె నేను బోధించే బోధన అంత వ్యర్థమే.  ప్రభువు మరణించారు అనేది ఎంత సత్యమో మూడవనాడు సజీవులుగా లేచారు అనేది కూడా అంతే సత్యము. క్రైస్తవులకు, క్రైస్తవత్వానికి, క్రైస్తవ విశ్వాసానికి మూలం ఈ పునరుత్తానం. ప్రభువు పునరుత్తానం కాకపోయి ఉంటె ఈనాడు క్రైస్తవత్వం ఉండేదికాదు.

 ఈనాడు క్రైస్తవ మతం మరియు మనము ఇలా ఉన్నాము అంటే మూలం పునరుత్తానమే, పునరుత్తాన విశ్వాసమే. ఇంకా ఎంతో మంది ప్రభువు పునరుత్తానములో సందిగ్ధంగా ఉన్నారు ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో, అవిశ్వాసముతో ఉన్నారు. మనము చరిత్రను పరిశిలించినట్లైతే మొదటిగా సమాధి ఎదుట ఏర్పరిచిన పెద్దరాయి అనగా సమాధిని మూయుటకు ఉపయోగించిన పెద్దరాయి పెద్ద గొలుసులతో కట్టబడి ఉంది. సమాధిని కాపలా కాయుటకు సైనికులు ఉన్నారు. కానీ ప్రభుని శరీరము దొంగలించబడినది అని సైనికులు మరియు యూదా పెద్దలు అంటున్నారు. రోమా సైనికుల ఆచార ప్రకారం సైనికులు విధులలో ఉన్నపుడు మెలకువతో, జాగ్రత్తతో కాపలా కాయవలయును. ఏ చిన్న తప్పు జరిగిన విధులలో ఉన్న సైనికుడు దానికి సమాధానం చెప్పాలి. కాపలా కాయుచున్నపుడు కునుకు తీసిన, విధిలో ఉండక పోయిన, ఆజాగ్రత్తతో ఉన్న వారికీ శిక్ష విధిస్తారు. ఆ శిక్ష మరణ దండన. గొలుసు తీసినప్పుడు, రాయి తొలిగించినపుడు శబ్దానికి ఎంత నిదురలో ఉన్న మెళుకువలోకి వస్తారు. మాగ్దలా మరియమ్మ తెల్లవారు జామున సమాధి యొద్దకు వెళ్ళినపుడు అక్కడ ఎవ్వరు కనిపించలేదు సైనికులతో సహా. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతిక దేహాన్ని శిష్యులు వచ్చి తీసికొని వెళ్లారు అని కాపలా ఉన్న సైనికులు సాక్ష్యం ఇచ్చారు. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతికదేహాన్ని తీసుకొని వెళ్ళినది శిష్యులేనని సైనికులకు ఎలా తెలుసు, బండరాయిని తొలిగించినపుడు గొలుసులను తీసినప్పుడు మేలుకొని సైనికులు ప్రభువు భౌతికదేహమును శిష్యులు తీసుకొని వెళ్లారని ఎలా తెలుసు. ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్లుగానే పునరుతానుడైనాడు అని దేవదూత సాక్ష్యం ఇస్తున్నారు.మరీ ముఖ్యముగా ఆయన పలుమారులు శిష్యులకు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ చూసి, విని కూడా మనము ఇంకా వెలిగించి కుంచం క్రింద ఉంచిన దీపము వలె ఉన్నాము. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైనే ఉంచెదము గాని గంప క్రింద ఉంచారు గదా! 

పునీత పౌలు గారు అన్నవిధముగా ఉష్ణ కాలమున వేగుచుక్క మీ హృదయములను నింపువరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. పాపము అనే అంధకారమున ఉన్న మనము ఉష్ణకాల వేగుచుక్క హృదయములను వెలుతురుతో నింపునట్లు మనము ప్రభువు యొక్క పునరుత్తాన వెలుతురుతో నింపబడి గంప క్రింద ఉంచిన దీపము వలే కాక దీప స్తంభము పైన ఉంచిన దీపము వలె అందరికి వెలుగునిద్దాం. పౌలు గారి వలె అందరికి ప్రభువు వెలుగును పంచుదాం ఆయన పునరుత్తానములో పాలుపంచుకుందాం. ఈ పునరుత్తానము మనలను పాపములను నుంచే కాక అన్నింటినుంచి కూడా విముక్తులను, స్వతంత్రులను చేస్తుంది. ఈ పునరుత్తానము ద్వారా ప్రభువు మనకు నూతన జీవితాన్ని ఇస్తున్నారు. పొందిన జీవితము ద్వారా ప్రభుని పునరుత్తాన వెలుగులో జీవించుటకు ప్రయత్నిద్దాం.

Br. Lukas

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...