14, ఆగస్టు 2021, శనివారం

మరియ తల్లి యొక్క మధురమైన స్వభావం


మంచి మనసు కలిగి ఎందరో హృదయాలను

       సొంతం చేసుకొని రివ్వుమంటూ తన ప్రేమతో

                     ఏకం చేసుకునే తల్లి మరియతల్లి.

 

యవ్వన ప్రాయములో దేవుని వాగ్దానాన్ని స్వీకరించి

                 ఆ దేవుని పుత్రుని ఈ లోకానికి ప్రసాదించిన 

                                ఓ అద్భుతమైన తల్లి మరియ తల్లి. 


పాపములో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు 

             వెలుగును చూపిన

                            ఓ వరప్రసాదాల తల్లి మరియ తల్లి.


 నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసి 

           ఈ లోకానికి ఓ మరచిపోలేని చిరు దివ్వెను

                               ప్రసాదించిన తల్లి మరియ తల్లి. 


 లోకరక్షకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకోసం 

       తన సర్వస్వాన్ని వదిలివేసి దేవుడే తన సర్వస్వంగా భావించి

                     ఆ దేవుడినే ఈ లోకానికి తెచ్చిన వన్నె తల్లి మరియతల్లి.


 కార్మెల్ మఠవాసులంతా ఒక్కటిగా చేరి

      ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలను ఆలకించి

                 ఉతర్యము అను తన రక్షణకవచాన్ని ప్రసాదించిన

                                 గొప్ప కరుణగల తల్లి మన  మరియతల్లి.           

                                                                                                       బ్రథర్. జోసెఫ్ మారియో. ఓసిడి.

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

పరిశుద్ధ కన్య మరియ మోక్షరోపణ మహోత్సవము

దర్శన 11; 19, 12; 1 -6, 10 

1కొరింతి 15; 20 -26 

లూకా 1;39 -56 

క్రీస్తునందునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నాడు మనం 20 వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. అదేవిధంగా తల్లి శ్రీసభ పరిశుద్ధ కన్య మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లైతే తల్లి మరియ మాత గొప్పతనాన్ని మరియు దేవుడు ఆమెయందు చేసిన గొప్ప కార్యాలను గురించి తెలియచేస్తున్నాయి. నిష్కళంక కన్యక అయిన దేవమాత తన భూలోక జీవిత యాత్రను ముగించిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకమునకు కొనిపోబడిందని నవంబర్ 1, 1950 వ సంవత్సరంలో 12 వ భక్తినాథా పోపు గారు మరియమాత మోక్షారోపణ పండుగను విశ్వాస సంవత్సరంగా ఆమోదించారు.

మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లైతే హానోకు, మోషే మరియు ఏలీయా ప్రవక్తలు మాత్రమే దేవుడు పరలోకంలోకి తమ ఆత్మా శరీరాలతో తీసుకుపోయాడని చూస్తున్నాము. పవిత్త్ర గ్రంథంలో ఈ ముగ్గురు వ్యక్తులగురించి మాత్రమే తెలియచేస్తుంది. కానీ మరియమాత మోక్షారోహానమవడం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయినా కాథోలికులమైన మనం ఎందుకు ఈ పండుగను కొనియాడుచున్నాము? ముందుగా రక్షణ గ్రంథ చరిత్రలో చూసుకున్నట్లైతే ఆదికాండము మూడవ అధ్యాయంలో చూసుకున్నట్లైతే ఒక స్త్రీ అవిధేయత వల్ల ఈలోకానికి పాపం వచ్చింది. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లైతే మరియమాత విధేయత ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఏ విధంగా అంటే సాక్షాత్తు ఆ దైవ కుమారుణ్ణి ఆమె తన గర్భమునందుమోసి, క్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చి రక్షణ తీసుకొని వచ్చింది. అదేవిధంగా కాథోలికులమైన మనం. సాక్షాత్తు దైవ కుమారుణ్ణి ఆమె గర్భమునందు తొమ్మిది మాసాలు నివశించాడు కాబట్టి ఆమెను వాగ్ధత్త మందసము లేదా దేవుని మందసము అని విశ్వసిస్తున్నాం.

సమువేలు 2 వ గ్రంథంలో 6; 6 -7 చూసుకున్నట్లైతే దావీదు మహారాజు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు ఎడ్లబండిని గతుకులలో ఈడ్చడం వలన మందసము జారీ క్రిందకి పడిపోయెను. దానిని మోస్తున్న ఉస్సా అనే వ్యక్తి చేయి చాచి మందసము తాకిన వెంటనే ప్రక్కకు కూలి చనిపోతాడు ఎందుకంటే దైవ మందసము ఎంతో పవిత్రమైనది. ఆ మందసంలో మోషే చేతి కర్ర, మన్నా, మరియు పది ఆజ్ఞలు ఉన్నవి. అలాంటిది పట్టుకోగానే చనిపోయారంటే , మరియ తల్లి ఇంకా ఎంతో పవిత్రమైనది. చూడండి సాక్షాత్తు క్రీస్తుభగవానుడు తొమ్మిది మాసాలు ఆమె గర్భంలో నివశించారు. అలాంటి శరీరం ఈ లోకంలో నశించిపోవడం దేవునికి ఇష్టంలేదు. కనుక ఆమె చనిపోయిన తరువాత ఆత్మా శరీరాలతో పరలోకంలోకి తీసుకువెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.

యోహాను 14; 3 వ వచనంలో క్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు. నేను ఉండు స్థలంలోనే మీరును ఉందురు,  అని తన తల్లిని తనతో ఉండుటకు మరియ తల్లిని మొక్షానికి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా ఈ నాటి మొదటి పఠనం దర్శన గ్రంథంలో చూసుకున్నట్లైతే దివియందు ఒక స్త్రీ దర్శనమిచ్చెను . సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై  పండ్రెండు నక్షత్రములుగల కిరీటము ఉండెను (దర్శన 12 ;1 ). ఇక్కడ ఈ స్త్రీ యే మరియ తల్లి అని ఆమెను మోక్షమునకు తీసుకుపోయిన తర్వాత దేవుని వద్ద ఉన్నది అని కథోలికుల విశ్వాసం. ఈ నాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లైతే, మరియ మాత ఎలిజబెతమ్మను దర్శించిన ఘట్టాన్ని మరియు మరియమ్మ స్తోత్రగీతాన్ని గురించి వింటున్నాం. ఎప్పుడైతే మరియతల్లి జక్రయ్య, ఎలిజబెతమ్మల ఇంటిలోనికి ప్రవేశించిందో, ఇల్లంతయు కూడా వెలుగుతో నింపబడింది. మరియు ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఎందుకంటే దేవుని తల్లి ఆ గృహములోకి అడుగుపెట్టగానే వారి జీవితాలు మరియు ఇంటిలో వెలుగు వచ్చింది. 

మరియు ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఈ విధంగా అంటుంది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భం ఆశీర్వదింపబడెను, చూడండి ఎంతటి పవిత్రమైనదో మరియ తల్లి. ఆమె పవిత్ర మైన జీవితం జీవించింది కాబట్టి దైవ కుమారుడు ఆమె గర్భం నందు జనియించారు. ఆమె నిష్కళంకమైనది. అందుకనే మనం చూస్తున్నాం లూకా 1; 48 లో తర తరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ మాత దేవునికి స్తోత్రగీతంలో తెలియచేస్తుంది.

కావున ఇలాంటి మరియ తల్లిని మరియు ఎంతో పవిత్రంగా జీవించిన తల్లిని ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిన తల్లిని దేవుడు తప్పక పరలోకంలోకి ఆత్మా శరీరంలా ద్వారా తీసుకెళ్లాడని మనం విశ్వసిస్తున్నాం.  కావున ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైతే దేవునికి సాక్షులుగా జీవిస్తారో, ఆ ఆజ్ఞలను తప్పకుండ పాటిస్తారో, వారందరు దేవుడిని దర్శిస్తారు. మరియు మనందరము  పాప  జీవితమునుండి బయటికి వచ్చి మన పాపాలన్నీ త్యజించి దేవుని బిడ్డలుగా జీవిస్తే ఆయన రాకడ సమయమున ఆయనకు చెందుతామని ఈ నాటి రెండవ పఠనం ద్వారా పునీత పౌలుగారు తెలియచేస్తున్నారు. కావున మనందరము  మరియ తల్లి ఏవిధంగా జీవించి దేవునికి విధేయురాలై దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో మనం కూడా ఆమె బాటలో నడవాలని ఆమె వలె  జీవించాలని ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేసుకుందాం.

-బ్రదర్. సాలి. రాజు ఓ.సి.డి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...