3, మార్చి 2022, గురువారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  సాతాను శోధనలు - క్రీస్తును విజయము 

క్రీస్తు  నాధుని యందు  మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా  ఈనాడు  తల్లి తీరుసభ  మనలను అందరిని కూడా తపస్సు కాలపు మొదటి ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి పరిశుద్ద పఠనాల ద్వారా  మనలను అందరిని కూడా సాతానుకు బానిసలు కాకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్చతో జీవించమని లేదా దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించమని కోరుతుంది. 

ఎందుకంటే ఈ యొక్క పాపము లేదా సాతాను కీడులలో నుండే కదా క్రీస్తు ప్రభువు తన శ్రమలు, మరణ, పునరుత్థానల ద్వారా మనలను స్వేచ్ఛ పరులను చేసెను. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా  సైతాను పై  ఆధిపత్యం  చూపించలేదా? తన మరణ  పునరుత్థానాల ద్వార  మనకు రక్షణ తెచ్చెను గదా?  మనలకు  పాప విమోచనగావించే కదా?

మరి మనము  ఆ పాపపు  జీవితాన్ని జీవించడం ఎంత మాత్రం సమంజసమో! మనం అందరం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఈనాటి పరిశుద్ద గ్రంధ పఠనాలలో  చూస్తే, శోదనల గురించి వింటున్నాము. మరి ముఖ్యంగా  సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఆ సైతాను ఏవిధంగా  శోధించిందో చూస్తున్నాం. 

 యిస్రాయేలు ప్రజలు, ఎడారి ప్రాంతంలో వారికి  తినడానికి ఏమి  దొరకనటువంటి సంధర్భంలో  వారు శారీరక  ఆకలితో, దేవున్ని మరియు  మోషే ప్రవక్తను నిందిస్తున్నారు. 

ఏదైన మేలు జరగనప్పుడు  మనం దేవుని నిందించాలనుకోవడం ఒక శోదనే. ఉదా: మనము యొబు జీవితం చూసుకున్నట్లయితే  తన భార్య, తన చెంతకు వచ్చి, నీవు సర్వాన్ని  కోల్పోయావు, నీవు జీవించడం వ్యర్ధము, కాబట్టి  నీ దేవున్ని శపించి నీవు కూడా చచ్చిపో, అన్నప్పుడు  యొబు  ఆ శోదనకు వెళ్ళి , దేవునితో గొడవ పడతాడు, నీవు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని. 

కానీ చివరికి తన తప్పు తెలుసుకుంటాడు, దేవుని క్షమాపణ కోరతాడు. మరి మనం జీవితంలో కూడా యిస్రాయెలు  ప్రజల వలె యొబు వలె  మనకు మేలు  జరగని  సందర్భాలలో  మనం  దేవుడిని  నిందిస్తున్నామా? విశ్వాసాన్ని, లేదా నమ్మకాన్ని కోల్పోతున్నమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఎందుకంటే ఈ సాతాను అవకాశం కోసం  పొంచి ఉంటుంది. మనకు ఏమైనా కొదవఅయినప్పుడు , దేవునకు మనం ప్రార్దన చేసిన విననప్పుడు, దేవుడు మనలను విడనాడినట్లు ఉన్నప్పుడు, మనం బాధలలో, కష్టాలలో ఉన్నప్పడు, సాతాను మనలను దేవుడిని నిందించమని శోధిస్తుంది. 

సువిశేషం పఠనంలో చూస్తే  :-  క్రీస్తు ప్రభువుకి సాతాను శోదన మనం చూస్తున్నాం .  క్రీస్తు ప్రభువుకి ఈ శోదనలు ఒక్కసారి మాత్రమే వచ్చినవి కావు, అవి అనునిత్యం  క్రీస్తు జీవితంలో ఉన్నవే. తాను కన్ను మూసేంత వరకు, అంతా సమాప్తమైనది  అనేంత వరకు కూడా శోధింపబడ్డారు. 

ఎలా అంటే : - మనుష్య కుమారునిగా, ఒక సాదారణ వ్యక్తిగా మరణించే ముందు తండ్రి దేవుడు తనని  వీడనాడాడు లేదా తనని  వేరు చేశాడని భావించి ఉండవచ్చు కాబోలు. అందుకే నా దేవా నా దేవా , నన్నేల విడనాడితివి  అని బిగ్గరగా ఏడ్చాడు. 

కానీ :-  క్రీస్తుకు తెలుసు, ఇది  తండ్రి చిత్తమే అని , అందుకే  తండ్రి ! నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను .  అంతా సమాప్తమైనది అని అంటున్నాడు. 

ఈరోజు  సువిశేషంలో  చూస్తే 

 సాతాను మొదటి ప్రయత్నం :-  క్రీస్తు ప్రభువు  నలువది దినాలు ఉపవాసమున్నాడు,  ఈ  యొక్క  సందర్భాన్ని  ఉపయోగించుకోవాలని  ఆలోచించి, ఆ సాతాను క్రీస్తుని శారీరక ఆకలి తీర్చడం కోసం శోధిస్తుంది. 

ఇక్కడ సాతాను మూర్ఖత్వం కాకపోతే క్రీస్తు 4,000 మందికి 5,000 మందికి ఆకలి తీర్చిన దేవుడు తన ఆకలి తీర్చుకోలేడా ! సాతానును లెక్క చేయలేదు, సాతాను ఓడిపోయింది. 

సాతాను రెండవ ప్రయత్నం  :- రాజ్యాలన్నీ నీకిస్తాను, ఆధికారాన్ని నీకిస్తాను, నాకు మ్రొక్కు అంటుంది. ఇక్కడ కూడా సాతాను మూర్ఖత్వమే. ఎందుకంటే, సకల సృష్టిని సృజించిన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈ లోకాధిపతి, సర్వ అధికారికి, ఆయన ముందు సాతాను కుప్పిగంతులు. క్రీస్తు ప్రభువు బహుశా నవ్వుకొని ఉండవచ్చు కాబోలు సాతాను యొక్క మూర్ఖత్వాన్ని చూసి అప్పుడు కూడా  క్రీస్తు ప్రభువు లొంగలేదు. పైగా సాతానుకి " నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుము, సేవించుము"  అని వ్రాయబడి ఉన్నదని  గుర్తు చేస్తాడు. 

సాతాను మూడవ ప్రయత్నం :- నీవు ఈ శికరము పై నుండి క్రిందకు దూకు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు, అని శోధిస్తుంది. ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో లాజరును జీవంతో ఇచ్చిన దేవుడు,  ఒక్క మాటతో స్వస్థతలు  చేసిన దేవుడు,  ఒక్క   మాటతో సముద్రాన్ని  శాసించిన, అద్భుతాలు, చేసిన క్రీస్తుకు,  ఇది ఒక శోధన. 

అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు  సాతానుతో  ప్రభువైన  నీ దేవుని శోధింపరాదు అని చెబుతున్నారు. సాతాను మళ్ళీ ఓడిపోయింది. ఇలా క్రీస్తు ప్రభువు సీలువలో మరణించేంత వరకు కూడా శోధిస్తూనే వుంది. 

అద్భుతాలు, మహిమలు చేయగల  శక్తిగల దేవుడు క్రీస్తు ప్రభువు అయిన కూడా, తాను స్వార్ధంగా ఆలోచించలేదు. తన స్వంత ప్రయోజనాలకు, పేరుకు గాని ఎప్పుడు ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క  చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రజల సంతోషం కోసమే తన శక్తులను ఉపయోగించాడు. మరి మనం శక్తి సామర్ధ్యాలు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం?ఆత్మ పరిశీలన చేసుకోవాలి? 

రెండవ పఠనం :-  పునీత పౌలుగారు రోమియులకు తెలియ చేస్తున్నారు. మనకు "ప్రభువుఒక్కడే "ఆయనను మన  హృదయంతో విశ్వసిస్తే, నీతిమంతులం అవుతాం. నోటితో ప్రభువే నా దేవుడు అని ఉచ్చరిస్తే రక్షింపబడతాం,  అని తెలియ చేస్తున్నారు. 

క్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. సాతాను వచ్చి నాకు మొక్కుము అన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు కూడా ఇవే మనకు దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే సేవిస్తాను అని. 

ఈనాడు మనము క్రీస్తువలె జీవిస్తున్నామా ? మనకు దేవుడు ఎవరు ధనమా , పేరు ప్రఖ్యాతలు, అధికారమా,  బందువులా, మిత్రులా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత సిలువ యోహను గారు కూడా ఇటువంటి  మాటలనే తన యొక్క జాగ్రత్తలు తెలియ చేస్తారు. ప్రతి మనిషి కూడా మూడు విధాలుగా శోధింపబడుతాడు, వాటిని జాగ్రత్తగా ఎదుర్కోనమని  తెలియచేస్తున్నారు. 

మొదటిగా : వ్యక్తిగతంగా,  ఎదురయ్యే శోధన , ఇది మానసికంగా కావచ్చు, శారీరక సుఖా:ల ద్వార కావచ్చు, లైంగిక శోధన , ఆహార శోధన , నిర్లక్ష్య కావచ్చు. 

రెండవదిగా : ఈ లోక సంబందమైన శోధన 

-బందువుల ద్వారా , స్నేహితుల ద్వారా కావచ్చు 

-సంపదల ద్వారా, ధనము ద్వారా కావచ్చు . 

మూడవదిగా : సాతాను శోధన 

వక్రబుద్ది జీవతం 

- ఆధికారం కోసం 

-గొప్పవారు కావాలని, పేరు పొందాలని, 

-ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చేయాలని ఎంత నీచానికైనా మనిషి దిగజారుతాడు. 

ఇలాంటి మూడు సందర్భాలలో మనం దేవున్ని మర్చిపోతాం, దేవునికి దూరంగా జీవిస్తాం, అవే సర్వస్వం  అని నమ్మి మోసపోతాం. చివరికి జీవితం నాశనం చేసుకుంటాం. కాబట్టి వీటన్నింటికి  జాగ్రత్త కలిగి దేవునియందు విశ్వాసముంచి  జీవించమని తెలియచేస్తున్నారు. 

కావున మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ శ్రమలు అనునిత్యం ఉంటాయి. ఈ నలువది  రోజులు మాత్రమే నేను ఈ విధంగా జీవించాలి అని కాదు. ప్రతి నిత్యం కూడా మనం సాతానును గెలవాలి. 

చివరిగా ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనలను బానిసత్వం నుండి స్వతంత్రులను చేయుటకు ఈ లోకానికి వచ్చారు, మనలను విముక్తులను చేశారు. కానీ ఇంకా మనం సాతాను బానిసత్వంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్ .

BR. SUBHASH 

26, ఫిబ్రవరి 2022, శనివారం

8 వ సామాన్య ఆదివారం (2)

8 వ సామాన్య ఆదివారం 

 సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

నేటి దివ్య పఠనాలు మన యొక్క అనుదిన జీవితంలో వినియోగించే మనిషి యొక్క మాటల గురించి తెలియజేస్తుంది. 

యేసు ప్రభువు ఏ విధంగానైతే తన యొక్క భూలోక జీవితమంలో మంచి మాటలు  మాట్లాడుతూ అనేక మంది జీవితాలలో సంతోషంను నింపుతూ,   ప్రేమను పంచుతూ  జీవించరో మనం కూడా అలాగే మృదువైన  మాటలు మాట్లాడుతూ అందరి జీవితంలో మంచిని పంచాలి. 

మన యొక్క మాటతో పాటు మనస్సు కూడా మంచిగ ఉండాలి. దేవుడు మానవునికి మాటనిచ్చింది, ఆయనను స్తుతించడానికి, ఆయనను గురించి ఇతరులకు తెలియజేయడానికి, ఇది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.

 మన యొక్కమాట ద్వారా తోటి ప్రజలతో స్నేహబంధం ఏర్పరుచుకొని వారితో సమాధానంగా  సంతోషంగా ఉండవచ్చు. 

 మన యొక్క ప్రతి వాక్కు ద్వారా మన భావాలను, ఆలోచనలను వ్యక్త పరచి  ఇతరులతో  స్నేహ బంధాన్ని కలిగి మన మాటలు  జీవించడానికి ఉపయోగపడతాయి

 దేవుడిచ్చిన మాటను  సద్వినియోగం చేసుకుంటే ఆ  జీవితం సుఖంగా ఉంటుంది 

మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది మాట్లాడే ప్రతి మాట వెనుకు  తీసుకోవలేం, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడే మాటలను  దుర్వినియోగం చేసుకుంటే అతని లేక ఆమె జీవితం కష్టాల పాలౌవుతుంది. 

మన జీవితంలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం మన యొక్కనోటి మాటయే. మన యొక్క సంభాషణలో  నోటి మాటలో శుద్ధి , సౌందర్యం లోపించినప్పుడు మన కుటుంబాలలో   కలహాలు మొదలవుతాయి. 

ఈనాటి మొదటి పఠనంలో సీరా ఎలియజర్ పుత్రుడైన యేసు రచయత మనిషి యొక్క  మాట తీరుకు అతడి మనసుకు ఉన్న సంభంధాన్ని తెలియచేస్తునారు. 

మనిషి మాట్లాడే ప్రతి మాట బయటకు మనకు  వినిపిస్తుంది. కాని అతని లేక ఆమె మనసు  మనకు కనిపించదు.  అయితే మనిషి మాట్లాడే మాటయే తన యొక్క అంతరంగమును  బయటకు వెల్లడిస్తుంది. 

సిరాకు  3 ఉపమానాల  ద్వారా మనిషి మాటలు, అంతరంగిక భావాల గురించి తెలుపుచున్నారు. 

1. జల్లెడ యొక్క ఉపమానం

2. కుమ్మరి పాత్రలు చేసే విధానం 

3. పండును బట్టి చెట్టు యొక్క స్వభావం 

  ఈ మూడు కూడా మన వ్యక్తిగత జీవితంలో రోజు చూసే ఉదాహరణలే.  ఇవి మనకు చాలా ముఖ్యమైన విషయాలు  నేర్పిస్తాయి. 

ఊపిన జల్లెడ - రైతు పంట కోసినప్పుడు మంచి గింజలనుండీ చెడు గింజలను వేరు పరచడానికి  రైతు వినియోగించే సాధనమే జల్లెడ. 

జల్లెడ పట్టడం ద్వారా మనకు మేలిమి  వస్తువులు దొరుకుతాయి.  అలాగే మనం మాట్లాడే ప్రతి  ఒక్క దానిలో  మంచి పదాలు  ఉంటాయి, అలాగే చెడ్డవి ఉంటాయి.

జల్లెడ క్రీంద పొట్టు కనబడినట్లు మన యొక్క సంభాషణలో కూడా  పోట్టు వంటి లోపాలతో కూడుకున్న పదాలు కనిపిస్తాయి. మన యొక్క మాటల్లో తప్పులు కనపడుతుంటాయి. 

   రెండవదిగా కుమ్మరి చేసే కుండలు : ఒకవేళ అతను మంచి మట్టిని వాడింది  లేనిది  వాటిని అవంలో వేసినప్పుడే అర్ధమవుతుంది. మంచి మట్టిని వాడక పోతే, అవి అగ్నిలో వేసినప్పుడే పగిలిపోతాయి. ఆవం లోని అగ్ని కుండ గట్టితనాన్ని పరిశీలించినట్లే ఒక వ్యక్తి యొక్క మాటతీరు , అతని సంభాషణ వలన అతను ఎలాంటివాడో అర్ధం అవుతుంది.  మట్టి పాత్రలు విలువ ఆవంలో తెలిసిన విధంగా మనిషి యొక్క విలువ ఆయన మాటలో  అర్థం అవుతుంది. 

 మూడవదిగా చెట్టు యొక్క పండు అది ఎలాగా ఫలములనిస్తుంది అని తెలుపుచున్నారు. చెట్టుకు అన్నీసక్రముగా ఇస్తే మంచి పండ్లనే ఇస్తుంది.  అంటే చిన్నప్పటినుండియే చిన్న బిడ్డలకు  మంచి విషయాలు నేర్పిస్తే  భవిష్యత్తులో మంచి మాటలు ప్రవర్తన కలిగి జీవిస్తారు. 

ఈ మొదటి పఠనము ద్వారా దేవుడు మన యొక్క మాటలు మంచిగా ఉండాలని తెలుపుతున్నారు. మానవ జీవితంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట విలువైనది. శరీరానికి  ఒక దెబ్బ తగిలితే ఆ గాయం తొందర్లోనే మాయం అవుతుంది. కానీ మాట ద్వారా మనసుకు అయిన గాయం మానటం కష్టం. 

మనం మాట్లాడే మాటలు మనకు  స్నేహితులను చేస్తుంది.  అదే మాటల వల్ల  మనకు శత్రువులు  కూడా తయారవుతారు. 

మనం మాట్లాడే మాటలు చాలా సార్లు జీవితాలు నిర్మిస్తాయి, నిలబెడతాయి  అవే మాటలు కొన్ని సార్లు జీవితాలను కూల్చుతాయి. 

 మన యొక్క వాక్కు ద్వారా ఎందరో జీవితాలలో  వెలుగు నింపవచ్చు,  ప్రేమించవచ్చు.  అదే మాట ద్వారా మనం కొందరిని ద్వేషించేవచ్చు. 

మాట్లాడిన ప్రతి మాటకి రెండు అర్థాలు ఉంటాయి positive మరియు negative  అయితే మనం ఎలాంటి tone  ఉపయోగించం  అన్నది కూడా ముఖ్యం. 

మన యొక్క సంభాషణల  ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించవచ్చు, ఓదార్పును ఇవ్వవచ్చు, ప్రేరణ కలిగించవచ్చు . 

ఒకచిన్న అగ్గిపుల్లతో ఎలాగైతే ఒక పెద్ద అడవిని కాల్చి వేయవచ్చో అలాగే  మన యొక్క నాలుకతో మాట్లాడే మాటలు చాలామంది  జీవితాలను  కూల్చుతాయి.  ఇతరులను పాపంలోనికి నెట్టేది  కూడా మన యొక్క మాటలే ఎందుకంటే తప్పుగా మాట్లాడుట  వలన వేరే వాళ్ళు ప్రేరేపించబడి పాపం చేస్తారు. 

కాబట్టి మన యొక్క సంభాషణలో  మన మంచిగా ఆలోచనలు   చేసి మంచిగా మాట్లాడి జీవిస్తే ఈ లోకంలో శాంతి సమాధానాలు, ప్రేమ, ఆనందం ఉంటుంది. మన మాటలద్వారా ఆశీర్వదించవచ్చును శపించవచ్చును. సృష్టిలో కేవలం మానవులు మాత్రమే మాట్లాడే వారు. మనకు మాత్రమే గొప్ప వరం దేవుడు దయచేశారు. కావున మనం కూడా మాటలనే మాట్లాడాలి.

రెండవ పఠనంలో పౌలు గారు మరియొకసారి యేసుప్రభువు యొక్క పునరుత్తానం గురించి ప్రకటిస్తున్నారు. పౌలు గారు యేసు క్రీస్తు ప్రభువుకు మరణంను జయించగల శక్తి ఉన్నదని తెలుపుచున్నారు, అందువలనే యేసుప్రభువు మరణించిన తరువాత శరీరంతో పునరుత్తానమయ్యారు.

క్రీస్తు ప్రభువునందు జ్ఞానస్నానం పొందిన మన అందరంకూడా పవిత్రాత్మ ద్వారా ఇహలోకంలో దేవుని యొక్క అనుచరులుగా, విశ్వాసులుగా జీవించే మనందరం కూడా పునరుత్తానమవుతామని, దానికి నిదర్శనం యేసు క్రీస్తు పునరుత్తానమే అని పౌలు గారు తెలుపుచున్నారు.

ఈ లోకానికి మరణం పాపం చేయుట వలన వచ్చింది. పాపం చేయుటవల్ల అవిధేయులై, దేవుని చట్టాన్ని సరిగా పాటించలేం, ఇంకా పాపపు జీవితం నే కొనసాగిస్తాం. అయితే పాపంలో ఉన్నవారందరిని రక్షించడానికి ప్రభువు ఈలోకంలో జనిమించారు. ఎటువంటి పాపం చేయకుండా మన కోసం సిలువ శ్రమలు మరణం, పునరుత్తానం ద్వారా మనకు రక్షణ దయచేశారు అని పాలుగారు తెలుపుచున్నారు.

యేసుక్రీస్తుప్రభువు పాపమును జయించారు, మరణమును జయించారు, కాబట్టి మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యాలు నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలని పౌలు గారు తెలుపుచున్నారు.

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మనయొక్క జీవితంలో చాల విలువైన విషయాలను బోధిస్తున్నారు.

1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివానికి మార్గం చూపించగలడా?

2. శిష్యులు గురువు కంటే అధికుడు కాదు

3. పరులను గూర్చి తీర్పు చేయకూడదు

4. అంతరంగిక శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడుట, బోధించుట.


1. ఒక గ్రుడ్డివాడు వేరొక గ్రుడ్డివాడిని నడిపిస్తే ఏమవుతుందో అందరికి తెలుసు. వారిద్దరూ పడిపోయే అవకాశం ఉంది, దారి తప్పి పోతారు, గమ్యం చేరలేరు. చాల సందర్భాలలో మనం ఎలాంటి వారిని అనుసరిస్తున్నామో అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరిని వెంబడించాలో, ఎవరిని మన యొక్క నాయకులుగా అనుసరించాలో వారిపట్ల జాగ్రత్తగ ఉండాలి.

అన్ని తెలిసిన వ్యక్తులు మాత్రమే మనం అనుసరించాలి, మనలను సన్మార్గంలో నడిపించే వారినే వెంబడించాలి. దైవ జ్ఞానం లేని గ్రుడ్డివారిని, దేవుడంటే విశ్వాసం లేని వారిని తల్లిదండ్రులంటే భయభక్తులు లేని వారిని మనం అనుసరిస్తే మన జీవితాలు కూడా అంధకారంలోకి నడిపించబడతాయి.

ప్రతిఒక్కరు మొదటిగా తమ యొక్క జీవితాన్ని పరిశీలించుకుని, ఆ తరువాత ప్రజలను హెచ్చరించమని, నడిపించమని తెలుపుచున్నారు.

పరిసయ్యులు ప్రజలకు నాయకులుగా వ్యవహరించే వారు. అయితే పరిశయ్యులు తమ అంతరంగాన్ని చక్క పరచుకోనంతవరకు వారు గ్రుడ్డి నాయకులే. గ్రుడ్డి నాయకులు వేరే వారికీ దేవుని మార్గం ఎలాగా చూపించగలరు?

యేసు ప్రభువు మనందరియొక్క నాయకుడు ఎందుకంటే ఆయన మాత్రమే మనలను తండ్రి మార్గంలోకి నడిపిస్తారు. ఆయనయే ఈ లోకానికి వెలుగు. మన జీవితాలు మంచిగా ఉంచకుండా, వేరొకని మంచిగా జీవించమని చెప్పుట సరిఅయిన పద్దతి కాదు అని ప్రభువు తెలుపుచున్నారు.మంచి సమాత్రుకగా ఉన్నవారే వేరొకరికి మార్గం చూపించగలరు.

2. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు

 శిష్యులు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికిని ఆయన పొందినది మొత్తం గురువు దగ్గర నుండియే .. కాబట్టి శిష్యుడు గురువు కన్నా అధికుడు కానేరడు. శిష్యుల యొక్క జీవితంలో వెలుగును నింపింది గురువే నేర్పింది గురువే, దరి చూపించింది గురువే, జీవితం జారీచేసింది గురువే కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువుకన్నా చిన్నవారమే. మన గురువు దేవుడే ఆయన కన్నా మనం ఎప్పుడు చిన్నవారమే కాబట్టి మన గురువుకు విధేయించాలి, గౌరవించాలి.

3. మన కంటిలో దూలం ఉంచుకొని వేరొక వ్యక్తి కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిస్తాం.

మనందరికీ గురువింద గింజ తెలుసు పైన ఎర్రగా ఉంటుంది, క్రింద నల్లగా ఉంటుంది. చాలా సందర్భాలలో మనందరం పైకి మంచి వరమని, పవిత్రులమని భావిస్తాం కానీ అది వాస్తవం కాదు. మనం వేరొక వ్యక్తుల మీదనే ఎక్కువ (focus, attention) శ్రద్ధ ఉంచుతాం కానీ మన జీవితాలను మనం పరిశీలించుకోము.

పరిసయ్యులు సామాన్య ప్రజల జీవితాల మీదనెను శ్రద్ధ (focus) పెట్టారు కానీ తమ జీవితాల గురించి మరిచి పోయారు. -ఇతరుల గురించి తీర్పుచేశారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ (యోహాను 8: 3-11) యొక్క సువిశేష భాగంలో అక్కడా అందరూ పాపం చేసినవారే కానీ ఆ స్త్రీ పట్టుబడింది కాబట్టి ఆమెను శిక్షించాలని అనుకున్నారు. మన పాపాలు మనం తెలుసుకోవాలి, శారీరక శుద్ధి మాత్రమే కాదు అంతరంగిక శుద్ధి అవసరం. ఇతరుల గురించి తీర్పు చేయుటకు మనం అర్హులము కాదు. దేవుడు ఒక్కరే సత్యవంతుడు , పవిత్రుడు. మనలో చాలా మంది ఇతరులలో ఉన్న తప్పిదాలే వెదుకుతారు కానీ మంచిని చూడలేరు. మనం ఎవ్వరిని తీర్పు చేయకుండా నిందించకుండా, ప్రేమతో జీవించాలి. దేవుడే మన తీర్పరి.

4. అంతరంగిక శుద్ధి కలిగి జీవించాలి

మనయొక్క అంతరంగ పరిశుద్ధంగా ఉంటే మన మాటలుకూడా పరిశుద్ధంగా మంచిగా ఉంటాయి. మనయొక్క మాటలు అన్ని హృదయంనుండి, మనస్సునుండి వెలువడతాయి. మన హృదయాంతరాళంలో ఏవయినా స్వార్థం, క్రోధం, అసూయా, పగలు, ద్వేషాలు వున్నట్లైతే వాటి ద్వారా మన మాటలు చేతలు, ప్రవర్తన అవినీతి కరంగా ఉంటాయి. అంతరంగ జీవితం కు బాహ్య జీవితం కు సంబంధం ఉన్నది. ఇది కూడా విశ్వాసం చేతలు లాంటిది, రెండూకూడా ముఖ్యమే ఒకటి ఉంటే సరిపోదు.

పరిసయ్యులు బాహ్య జీవితానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అంతరంగిక జీవితం మర్చిపోయారు. మాటలు, బోధనలు మాత్రమే వున్నాయి కానీ చేతలు లేవు. మంచి జీవితం లేదు. అందుకే ప్రభువు వారిని కపట వేషధారులు అని అంటున్నారు.

ప్రజల యొక్క మెప్పుకోసమే అనేక కార్యాలు చేసేవారు, దేవుణ్ణి స్తుతించారు కానీ వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మనం కూడా మంచి జీవితం అనగా అంతరంగికంగా మరియు బాహ్యంగా పవిత్రులై ఉండాలి.

మనందరం కూడా మంచి ఆలోచనలు కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ ఒక మంచి విశ్వాసం జీవితం జీవించాలని ప్రభువు తెలుపుచున్నారు. మన సంభాషణలు యేసుక్రీస్తు సంభాషణల వలే మంచిగా పవిత్రంగా ఉండాలి.

Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...