25, జూన్ 2022, శనివారం

సామాన్య కాలపు 13 వ ఆదివారము

   సామాన్య కాలపు 13 వ ఆదివారము

 రాజులు 19: 16, 19-21, గలతీ 5: 1, 13-18, లూకా 9: 51-62

స్వేచ్చా  జీవితానికి పిలుపు
క్రీస్తు నాదునియందు ప్రియ స్నేహితులారా! ఈనాడు తల్లి తిరుసభ మనలను అందరినికూడా సామాన్య కాలపు 13 వ ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది.  

ఈ నాటి మూడు గ్రంథపఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ స్వతంత్రులుగా జీవించుటకై పిలుపునిస్తుంది”.
ఈ నాటి మూడు పఠణాలను మనం మూడు ప్రశ్నల రూపంలో ధ్యానించవచ్చు.  

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?
ఈ నాటి మూడు పఠనాలను మనం ధ్యానించినట్లైతే, దైవ సేవకులకు కావలసింది సంపూర్ణ జీవిత సమర్పణ, లేదా ఈ లోకాన్ని పూర్తిగా త్యజించాలనే సారాంశం మనకు అర్థమవుతుంది.

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
దేవుని పిలుపు ఎవరికి, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరు గ్రహించలేరు. దేవుని పిలుపు వివిధ రకాలుగా ఉంటుందని మనము ఎఫెసి 4: 11 -13 వచనాలలో చూస్తున్నాం.

దేవుని పిలుపు గురువులకు, గురుజీవితాన్ని అభ్యసించేవారికి, కన్యాస్త్రీలకు, ఉపదేసులకు, మాత్రమే కాదు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో భాగమైన మనకందరికి కూడా, దేవుని సేవలో భాగము ఉంది, లేదా మనందరమూ పాత్రులము.
దేవుని సేవ చేయుటకు, అందరు అర్హులే. కొందరు ఉపాధ్యాయులుగా, మరికొందరు కుటుంభంలో తల్లిదండ్రులుగా, సంఘపెద్దలుగా, మరికొందరిని దేశ పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా, వారి జీవితాలు దేవునిచే నిర్ణయించబడి ఉంటాయి. ఆయా బాధ్యతలకు అనుగుణంగా జీవించడమే మనము చేస్తున్నటువంటి దేవుని సేవ అని మనం గ్రహించాలి.

మొదటి పఠనంలో చూసినట్లయితే
దేవుడు ఏలీయా ప్రవక్త ద్వారా ఎలీషా ప్రవక్తను దైవ సేవకునిగా పిలుస్తున్నారు. ఆబేల్మేహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఈ ఎలీషాఅతనిని ప్రవక్తగ నియమిస్తున్నారు.
మరి ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి తన అంగీని తీసి ఎలీషా పై కప్పెను. అంగీ ధరించడం అంటే ఒక సేవకు గుర్తు. ఇలాంటి సన్నివేషాన్ని మనము క్రీస్తు ప్రభువు జీవితంలో కూడా చూస్తున్నాం. యోహాను 13: 4 - 6 వచనాలలో చూస్తే క్రీస్తు ప్రభువు తన నడుముకి తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి వారికి సేవ చేస్తూ, మీరును ఒకరినొకరు ప్రేమించండి, సేవ చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు.

అలాగే ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మీద తన అంగీని కప్పినవెంటనే ఎలీషా ప్రవక్త, తన ఎద్దులను వధించి, అరకని వంట చెరుకుగ వాడి, మాంసమును వండి తన శిష్యులకు వడ్డించి, వారికి సేవచేశాడు. ఏలియా ప్రవక్తను అనుసరించాడు.
 నాటి సువిశేష పఠనంలో మనం శిష్యుల యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండాలి అని చూస్తున్నాం.

ఒకడు యేసును వెంబడించుటకు తన వెంట వస్తాను అని అన్నాడు, యేసు చెంత ఏమీలేవు, తాను ఉండుటకు స్థలము కూడ లేదు అని సమాధానం చెప్పగనే, నిరాశ చెంది ఉండవచ్చు.
మరియొకరిని యేసు ప్రభువు పిలిచారు, "నన్ను అనుసరించు" అని అన్నారు. కానీ అతడు తన తండ్రి చనిపోయిన తరువాత, దేహాన్ని సమాధి చేసి వస్తానంటున్నాడు.

మరియొకడు నేను మిమ్ము అనుసరిస్తాను, కానీ ముందు నా కుటుంబంలోని వారికి చెప్పివస్తాను అంటున్నాడు.
వీరి ముగ్గురికి సమాధానముగా, యేసు వారితో "దేవుని రాజ్యాన్ని ప్రకటించండి". అంటే మొదట దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి అంటున్నారు. కుటుంబాలు ఉన్నాయి, లేదా సొంత పనులు ఉన్నాయి, అని వెనుతిరగ కూడదు.

2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?
దేవుని పిలుపునకు అనుసరించి వెనుతిరగడం "నాగటి మీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదుఅంటున్నారు. బంధాలకు బానిసలు కావద్దు అంటున్నారు.

ఎందు కంటే స్వార్థంతో మన సొంత కుటుంబాలకోసమే మనము జీవించకూడదు. క్రీస్తు ప్రభువు తెలియని ప్రజలు, జీవితాలలో నిరాశకు లోనైన వారు, గ్రుడ్డివారు, కుంటివారు, విధవరాండ్రు, పేదవారు, నిస్సహాయులు, ఈలోకంలో, మన దేశంలో, రాష్ట్రంలో, మన సమాజంలో, చాల మంది ఉన్నారు. వారిని మనకుటుంబంలో ఒకరిగా, చూసుకోవాలి. వారిని ప్రేమించాలి, క్రీస్తు ప్రభువు వారికి నిత్య జీవితాన్ని దయచేస్తాడన్న ఆశ వారికి కలుగ చేయాలి, క్రీస్తు ప్రభువే మనకు సంపూర్ణ జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయనయే నిత్య జీవము అని బోధించాలి. అలాంటి వారి జీవితాలు అభివృద్ధిలోకి తీసుకొనిరావాలి. ఇలాంటివారికి సేవచేయడానికి వెనుకాడవద్దు అని క్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు.
మరి  ఇలాంటి  సేవా  జీవితం  జీవించడం , “ మనిషిగా  పుట్టిన  ప్రతి  ఒక్కరి భాద్యత ”. అందుకే దేవుడు మన అందరిని ఎన్నుకుంటున్నాడు.  మరి  ఈ  రెండు  పఠనాలుకూడా దీని గురించబోధిస్తున్నాయి. మనము  దైవ  సేవకునిగా  జీవించాలంటే ఇలాంటి  లక్షణాలు  కలిగి  జీవించాలి .

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?  
-సేవా భావం కలిగి ఉండటం.

క్రీస్తువలె అందరిని సమానంగా, ఏ వర్గ, కుల, మత బేధాలు లేకుండా ప్రేమించే గుణం.
-చెడును, పాపాన్ని ద్వేషించే గుణం.

-ఇతరులకు చేతనైన సహాయం చేసే గుణం.
-నిజాయితీగా బ్రతికే గుణం.

-సత్యం కోసం జీవించే గుణం.
-కోప పడక, శాంతి, సమాధానాలతో జీవించే గుణం. 

ఇవన్నీ  కలిగిన  వారే  నిజమైన మనుషులుగా , దేవుని  యొక్క  బిడ్డలుగా  పిలువబడతారు.
దేవునికి ప్రియమైన వారీగా పిలుస్తారు. ఇలాంటి వారిదే  దేవుని రాజ్యము అని దివ్య గ్రంథ పఠనాలు  తెలియచేస్తున్నాయి.

దేవుని సేవ చేయాలంటే, మనలను మనము, ప్రజలకు, దేవుని ప్రణాళికకు, పిలుపునకు, సంపూర్ణంగా సమర్పించుకోవాలి .అప్పుడే  మనకు,  పైన  పేర్కొన్న విధంగా  జీవించడం  సాధ్యమవుతుంది.
ఇలా  జీవించినవారు  చాలామందిని   ఉదాహరణలుగా  చెప్పవచ్చు .

-క్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ - దేవుని కుమారుడై కూడా మానవాళి కోసం మరణించాడు, ప్రజలతో జీవించాడు.
-మరియ తల్లి.

-పునీత మదర్ థెరెసా.
-అనేకులైన పునీతులుఇంకా పునీత, మరియు సేవా జీవితాలను జీవిస్తున్నవారు, వీరందరి త్యాగ జీవితాన్ని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

రెండవ  పఠనంలో  చుస్తే  
              పునీత పౌలుగారు, గలతీయ ప్రజలకు క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మరియొక సారి వారికి  గుర్తుచేస్తున్నారు , హెచ్చరిస్తున్నారు.
ఏవిధంగా అంటే , క్రీస్తు  తన  మరణము ద్వారా పాపానికి బానిసలమై జీవిస్తున్న మానవాళి అంతటిని తన  బలిద్వారా, తండ్రి చిత్తానుసారము, సిలువలో మరణించి, మనకు స్వేచ్చాజీవితాని ఒసగారు, మనలను  పాపమునుండి , పాపమునే  బానిసత్వమునుండి విముక్తులను  చేసారు .

కాని మనందరమూ,  పాపమూ ద్వారనైతే దేవునికి దూరమయ్యామో, దేవుని రాజ్యానికి దూరమయ్యామో, తిరిగి  అలాంటి  జీవితాన్నే  మనము  జీవిస్తున్నాము .
శారీరక కోరికలు అనే ఆకలి ద్వారా, ఆదాము  అవ్వలు , పాపము  చేసి  పాపానికి బానిసలు అయ్యారో, అలాంటి  జీవితాన్ని, మరల  మనకు  తెలిసి  కూడా  చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం .

శరీర   కోరికలకు  బానిసలైన  వారు  దేవుని  రాజ్యానికి  వారసులు  కారు  అని  పవిత్ర  గ్రంధం  చెబుతుంది .
గలతీయులు  5 : 19 -21 .
శరీర కోరికలు; జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయా, క్రోధము, స్వార్ధము, కక్షలు, వర్గత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము విందు  వినోదములు, మొదలగునవి .

ఇలాంటి  జీవితాన్ని  జీవించేవారు  దేవుని  రాజ్యానికి వారసులు కార, అంటే  శరీరానుసారము  జీవించే  వారు  దేవునిరాజ్యనికి వారసులు కారు అని అర్థం .
ఒక్కసారి  మనం  ఆత్మ  పరిశీలన  చేసుకుందాం .

ఈనాడు రెండవ పఠనంలో చూస్తున్నాం ; ఏలయన ధర్మశాస్త్రమంతయు కూడా  “ నిన్ను  నీవు  ప్రేమించుకొనినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము ”. అను  ఒక్క  ఆజ్ఞలో  నెరవేరియున్నది గలతీయులు 5: 14.
మానవునియొక్క  ప్రధాన  ధర్మం  దేవుని  ఆజ్ఞ  పాటించడమే  ఉపదేశకుడు  12: 13 -14 .

నరులు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును, రహస్యమైనవి కావచ్చును. కానీ వాటి కన్నిటికిని భగవంతుడు తీర్పు తీర్చును.
యోహాను13:34-35 “నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను మీరును ఒకరినొకరు ప్రేమింపుడు. నేను  మిమ్ము  ప్రేమించినట్లే  మీరు  ఒకరినొకరు  ప్రేమించుకొనుడు .

మీరు  పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకొందురు.
ఉదాహరణకి మనము గమనించినట్లయితే

మనము ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఉదాహరణకి దొంగతనము చేసేటప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా ఇది తప్పు చేయవద్దు అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మన శరీరము మాత్రం, మనలను ఆ తప్పు వైపే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ పని మన శరీరానికి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగె మనము ఏ పని చేసిన కూడా రెండు విధాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆత్మవైపునుండిమరియు శరీరమునుండి. మనము దేనికి ప్రాధాన్యతనునిస్తామో మన జీవితం కూడా అలానే ఉంటుంది. మనము శరీరానికి ప్రాధాన్యతను ఇస్తే మనము దేవునికి దూరమవుతాము. ఆత్మకు ప్రాముఖ్యతను ఇస్తే దేవునికి
ఆత్మ ఫలాలు: ఆత్మాను సారంగా జీవించటం. గలతి 5: 22

ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదు.
ప్రియ స్నేహితులారా మరి మనము ఎలా జీవిస్తున్నాం. మన స్వార్థం కోసం, మన ఇష్టానుసారంగా, పగలతో, ద్వేషాలతో, ఒకరిమీద ఒకరం అసూయా కలిగి, సైతానును, శరీర వాంఛలకు బానిసలవలె జీవిస్తున్నాం.

కాబట్టి మనం దేవుని శిష్యులుగా జీవించాలంటేదైవ రాజ్యంలో ప్రవేశించాలంటే, సైతానుకు దూరంగా, ఈ లోక ఆశలకు దూరంగా, శరీర వాంఛలకు దూరంగా, ఏ వర్గ, కుల, మత భేదాలు లేకుండా జీవించుదాం. క్రీస్తు నేర్పించిన విధంగా ఒకరినొకరు ప్రేమించుకుందాం.

 


 Br. సుభాష్ 

23, జూన్ 2022, గురువారం

యేసు తిరు హృదయ పండుగ

యేసు తిరు హృదయ పండుగ 

యెహెఙ్కేలు 34 :  11- 16, రోమియు 5: 5-11, లూకా 15: 3-7.

ఈ రోజు తల్లి తిరుసభ యేసు ప్రభునియొక్క తిరు హృదయ పండుగను కొనియాడుచున్నది యేసు ప్రభువు మనలను ఎంతగ ప్రేమించారో ఆ ప్రేమకు మనం తిరిగి ఎలాంటి సమాధానం ఇస్తున్నాం. అని ధ్యానించాలి. ఈ రోజు మనందరం ప్రత్యేకంగా దేవునియొక్క హృదయం ఎలాంటిది అని తెలుసుకోవాలి. చాల సందర్భాలలో మనం ఇతరులను చూసినప్పుడు ఆయన/ ఆమె హృదయం మంచిదికాదు కఠినమైనది అని చెబుతుంటారు. అలాగే కొంతమంది ఆమె / ఆయన హృదయం చాలా మంచిది అని తెలుపుతారు.  ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు దేవుని హృదయం గురించి తెలుపుచున్నాయి. మన హృదయం ఎలాంటిది అని మన యొక్క క్రియలు తెలియచేస్తాయి. తత్వ వేత్త అయినా అరిస్టాటిల్ గారు హృదయ మనేది మానవ శరీరం కు కేంద్రం అని , అన్ని భావనలు పుట్టుటకు ప్రధాన స్థలం అని తెలిపారు. ( heart is the center of all our emotions)

గుండెను  జీవితంతో  కూడా  పోల్చి చెప్పవచ్చు ఎందుకంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి బ్రతుకు ఆగిపోతుంది. 

దేవుని యొక్క హృదయం ఎలాంటి అన్నది  యేసు ప్రభువు తప్ప మిగతా ఏ వ్యక్తులు వివరించలేదు. క్రీస్తు ప్రభువే ఈ లోకంలో జనియించి  తరువాత తన యొక్క సువార్త పరిచర్య ద్వారా తండ్రియొక్క హృదయం ఎలాంటిది అని వివరించారు. 

ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే (ప్రేమికులరోజు) ప్రేమలో ఉన్న వారు వారి ప్రేమను వ్యక్త పరుచుటకు హృదయం బొమ్మగీసి దానికి మధ్యలో బాణం గుర్తు పెట్టి అటు ఇటు వారి పేర్లు వ్రాస్తుంటారు. ఎందుకంటే హృదయం ప్రేమకు గుర్తుగా ఉంది కాబట్టి తన ప్రేమ ఈ విధంగా వ్యక్త పరుచుట కోసం.

హృదయం  ప్రేమకు  గురుతు  అదేవిధంగా వ్యక్తిత్వ కేంద్రానికి కూడా గురుతుగా ఉంటుంది. 

-యేసు ప్రభువు యొక్క హృదయం ఆయన యొక్క గొప్ప ప్రేమకు మరియు ఆయన యొక్క మానవత్వంకు ఒక చిహ్నంగా ఉంటుంది. 

యేసుప్రభువు యొక్క తీరు హృదయాన్ని సంఘానికి పరిచయం చేసినటువంటి భక్తులు పునీత యోహానుగారు : ఆయన ప్రభువు సిలువ మీద మరణించేటప్పుడు సిలువ క్రియందనే ఉన్నారు. క్రీస్తు ప్రక్కన ఈటెచే పొడవ బడడాన్ని కళ్లారా చూశాడు. (యోహాను 19 : 33-37) ఆయన హృదయం దగ్గర ఉన్న ప్రక్కటెముక దగ్గర సైనికులు గాయంచేసినప్పుడు రక్తం నీరు స్రవించాయి అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. వాటి నుండియే శ్రీసభ ఏర్పడినది అని కొందరి విశ్వాసం. 

-తెరువబడిన క్రీస్తు హృదయం మనకు రక్షణ నిది అని ధన్య క్రిసోస్టమ్ అన్నారు. అదేవిధంగా ప్రభువు హృదయం యొక్క విశిష్టతను తెలుసుకున్న పునీత బొనవెంచర్ “నీ హృదయంలోనికి రావడానికి మాకు మార్గం ఏర్పాటు చేయడానికే  మీ ప్రక్కను తెరిపించావు అని అన్నారు . ఈలోక వ్యామోహాల నుండి వైదొలగి నీ హృదయంలో నివాసం ఉండుటకు ఒక వరమివ్వమని” ప్రార్థించారు. మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క హృదయంనుండి జనిమించిన వారమని పునీత జస్టిన్ గారు అన్నారు. క్రీస్తు సంఘం ప్రభుని హృదయం నుండి పుట్టింది . ఆయన యొక్క శరీర రక్తాలతో పోషించబడుతుంది.

క్రీస్తు ప్రభువు హృదయం తండ్రి దేవుని హృదయం లాంటిదే, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కనిపించని తండ్రి దేవుని ప్రతిరూపమే  కొలొస్సి 1: 15.

యేసు ప్రభువు కూడా అన్నారు నన్ను చుస్తే నాతండ్రిని చూసినట్లే అని యోహాను 14: 9. అంటే నా ప్రేమను వ్యక్తిత్వమును చుస్తే మీకు దేవుని (తండ్రి ) గురించి తెలుస్తోంది అని అర్థం. 

క్రీస్తు హృదయం దేవునికి మనపైన ఉన్న ప్రేమకు నిదర్శనం. యావే దేవుని ప్రేమను పరిశుద్ధ గ్రంధం చక్కగా వివరించింది.

ఆయన ప్రేమ తల్లిని మించిన ప్రేమను మరివి చేయి విడువని ప్రేమ -యెషయా 49:15. 

యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చి తండ్రి యొక్క అనంతమైన ప్రేమను చూపించారు.

ఈ నాటి మొదటి పఠనంలో కూడా మంచి కాపరి జీవితం ద్వారా తాను ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో తెలుపుచున్నారు? పాత నిభందన గ్రంధంలో అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలును శిక్షించారని చదువుతాం కానీ నూతన నిభందన గ్రంధంలో అలాగే ప్రవక్తల గ్రంధంలో క్షుణ్ణంగా చదివితే దైవ ప్రేమ ఎలాంటిదో అర్థమగుచున్నది. దేవునియొక్క హృదయం గురించి యెహెఙ్కేలు ప్రవక్త దేవుని హృదయం ఎలాంటిదో తెలుసుకొని ఆయన్ను మంచి కాపరిగా సంభోదిస్తున్నారు. తండ్రిని, కుమారుణ్ణి మంచికాపరిగా పవిత్ర గ్రంధం పిలుస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన హృదయం ఎలాంటిదో ధ్యానించుదాం. తండ్రి, కుమారుల హృదయం ఒక్కటే. 

1. యేసు ప్రభువు హృదయం పరితపించే హృదయం- ఈ లోకంలో పాపంలో తప్పి పోయిన వారందరిని రక్షించాలని - పరితపించే హృదయం కలిగినటువంటి వారు యేసు ప్రభువు -లూకా19:10. విశ్వాసంలో తప్పిపోయిన వారిని రక్షించాలని పరితపించే హృదయం. భాద్యతలు నెరవేర్చుటలో విఫలమైన వారిని బలపరిచే హృదయం కలిగిన వారు యేసు ప్రభువు.

- ప్రభువు యొక్క ఆలోచన, ద్యాస ఎల్లప్పుడూ మన గురించియే అందుకే ఆయన హృదయం మన కోసం పరితపిస్తుంది.

2.  యేసు క్రీస్తు హృదయం జాలి కలిగిన హృదయం. ప్రభువు రోగులను, భాదపడు వారిని చూసినప్పుడు ఆయన యొక్క హృదయం కరిగి పోయింది. - కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూసి ఆయన హృదయము తరుగుకొని పోయింది. మత్తయి 9: 36. 

-మూడు రోజులు తన చెంత ఉండి, తన బోధనలను ఆలకించిన ప్రజల యొక్క ముఖములను చుసిన దేవుడు జాలితో ఉన్నారు. మత్తయి : 15 : 32 .

-లాజరు సమాధి వద్ద మార్తమ్మను చూసి జాలితో ఉన్నారు. యోహాను 11 : 33 -36 .

-నాయీను వితంతువు యొక్క పరిస్థితి చూసి ప్రభువు జాలితో వున్నారు. లూకా 7 : 13 .

క్రీస్తు ప్రభువుని హృదయం జాలితో నిండినది ఆయన వారిపట్ల జాలి చూపడం మాత్రమే కాదు చేసింది,  వారి యొక్క భాదలలో, ఆకలితో, అనారోగ్య స్థితిలో పాలు పంచుకొని వారికి తన యొక్క దీవెనలు ఇచ్చారు. 

గాయ పడిన వారి గాయాలు మాన్పాలనే జాలి కలిగి తానే స్వయంగా ప్రజల శారీరక మానసిక, ఆధ్యాత్మిక గాయాలను జాలితో మాన్పారు.

3. యేసు హృదయం రక్షించే హృదయం - ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినది మనలను రక్షించుటకే గాని శిక్షించుటకు కాదు. యోహాను 3 : 17. 

ఆయన చేసిన ప్రతియొక్క భోదన మనం పాపమును విడిచిపెట్టి మంచిని, సత్యమును తెలుసుకొని జీవితాలను సరిచేసుకొని మన యొక్క ఆత్మలను రక్షించుకోవాలన్నదే. 

-మన రక్షణ కొరకే తాను ప్రాణ త్యాగం చేశారు. మన రక్షణ కొరకే పరలోక మహిమను వీడి భూలోకంలోకి ప్రవేశించి మన మధ్య ఒకరిగా జీవించారు. 

4. యేసు హృదయం ప్రేమించే హృదయం - యేసు ప్రభువు మనందరిని ఎంతగానో ప్రేమించారు ఆయన ప్రేమవలనే ఈ లోకంలో మానవునిగా జనిమించారు. యోహాను 3 : 16. ఆయన ప్రేమ స్వరూపి, మొదట ఆయనయే మనల్ని ప్రేమించారు. 1 యోహాను 16, 19.

ఆయన మనందరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. యిర్మీయా 31 :3 . ఈలోకంలో ఎవ్వరుకూడా ఆయన వలె ప్రేమను చూపలేరు. 

-ప్రేమ వలనే శిలువను మోశారు.

-ప్రేమ వలనే విధేయత చూపారు. 

-ప్రేమ వలనే ప్రజలలో ఒకరిగా తగ్గించుకొని మెలిగారు. 

-ప్రేమవలనే తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరేవేర్చరు. 

యేసు ప్రభుని ప్రేమ అర్థం చేసుకున్న పౌలు ఆయన ప్రేమ విశాలమైనది, దీర్గమైనది, గాఢమైనది అని పలికారు- ఎఫెసీ 3 : 15 .

5. యేసు హృదయం ఏదైనా సరే ఇచ్చే హృదయం - ఉదార హృదయం.

- మనకు జీవమిచ్చారు- యోహాను- 10: 10.

-స్వస్థత నిచ్చారు- లూకా – 17: 12-19.

-క్షమను ఇచ్చారు -మార్కు -2: 1- 12.

-ఆశీర్వాదం ఇచ్చారు - మార్కు -10: 13-16.

-తన స్నేహం ఇచ్చారు - యోహాను -15: 12- 15.

తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభువు తన ప్రజలతో పంచుకున్నారు. 

ఆయనది ఉదార హృదయం.  తనకోసం ఏమి దాచుకోలేదు . సమస్తము ఇచ్చివేశారు. ప్రాణం సైతం.

6. యేసు ప్రభువు హృదయం దయ కలిగిన హృదయం - వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ   యొక్క పరిస్థితి చుసిన ప్రభువు ఆమె పట్ల జాలి కలిగి ఆమె పాపాలను క్షమియించారు. యోహాను 8 : 1 - 11 .

తప్పి పోయిన కుమారుడి పట్ల కూడా దేవుడు దయను చూపిస్తున్నారు. యోహాను 15: 11-32.

యేసు ప్రభువు దయార్ద హృదయం కలిగినవారు అందుకే చివరికి మరణించే ముందుకూడా ప్రజల మీద దయను చూపమని తండ్రిని ప్రార్థించారు. లూకా 23: 34.

పవిత్ర గ్రంధం ముఖ్యంగా పాత నిభందన గ్రంధం దేవుని యొక్క దయార్ద హృదయం గురించి తెలుపుతుంది. 

ద్వితియో -7: 9.

కీర్తన- 86: 15.

కీర్తన-145: 8-9.

మీకా -7: 18-19.

7. యేసుని హృదయం సేవా భావం కలిగిన హృదయం. ఈ లోకంలో యేసు ప్రభువు సేవకుని వలె సేవ చేశారు. లూకా 22: 24-27.

-ఆయన దేవుడైనప్పటికిని సేవకునివలె శిష్యుల యొక్క పాదాలు కడిగారు. యోహాను 13: 1-20.

ప్రభువు నిస్వార్థంతో, ప్రేమతో, కరుణతో ఈ లోకంలో సేవ చేశారు. 

యేసు తిరుహృదయం దర్శనం పునీత మార్గరీత గారికి కలిగింది. ఆ దర్శనంలో ఆమె ప్రభువు యొక్క హృదయాన్ని మండే హృదయంగా చూశారు, హృదయం చుట్టూ ముండ్ల కిరీటం ఉన్నట్లుగా, కంటి కిరణాలు ఉన్నట్లుగా కనిపించాయి. హృదయం మీద సిలువ ఉన్నట్లు దర్శనం కలిగింది. 

-మండుచున్న హృదయం ప్రేమకు చిహ్నం. యేసుని హృదయం మానవుల పట్ల వున్నా ప్రేమాగ్నిచే మండిపోతుంది అని అర్థం. 

-ముండ్ల కిరీటం - మనయొక్క పాపపు జీవితానికి గుర్తు మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనయొక్క పాపపు జీవితం ద్వారా మనం రోజు భాదపెడుతున్నాం. ముళ్ళు  మనకు నొప్పి కలిగించిన విధంగా మన యొక్క పాపపు జీవితం కూడా దేవుని భాదిస్తుంది.

మనయొక్క స్వార్థం, లోభం, దొంగతనం, చెడుతనము, అన్నీకూడా దేవుణ్ణి బాదిస్తునే వున్నాయి. ఈ చేదు గుణాలన్నీ ఆ ముళ్ల కిరీటంలో ఉన్న ముళ్ళు వంటివి.

-సిలువ - మన యొక్క రక్షణకు గుర్తు సిలువను మోసి మన కోసమే ప్రభువు మరణించారు. సిలువ ద్వారా తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు. సిలువలో విజయం ఉంది, ప్రేమ ఉంది, రక్షణ ఉంది.

- కాంతి కిరణాలూ- దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు గుర్తు తన యొక్క కాంతి కిరణాలచే మనలని దేవుడు పవిత్ర పరుస్తున్నారు. 

మనందరం ప్రభువు యొక్క హృదయం గురించి ధ్యానించే సమయంలో మన హృదయము కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. 

ఎందుకంటే హృదయమునుండే అన్ని జనిమిస్తాయి. మంచి అయినా, చెడు అయినా. సామెతలు 4: 23, మత్తయి 15: 19, మార్కు 7: 21.

మనము కఠిన హృదయంలా  కాకుండా ప్రేమించే వారిగా జీవించాలి. యెహెఙ్కేలు 36: 26.

ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు తన యొక్క హృదయం తో మనలను ఎంతగా ప్రేమించారో  తెలుసుకొని తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించాలి. ఆయన్ను తగిన విధంగా ప్రేమించాలంటే ఆయన ప్రేమ తెలుసుకోవాలి. 

-ఆయన ప్రేమను బైబులు చదవటం ద్వారా తెలుసుకోవచ్చు- 1తిమోతి 3: 16.

- ఆయన ప్రేమను ప్రార్తించుట ద్వారా తెలుసుకోవచ్చును. నిర్గమ 3: 14.

ఆయన ప్రేమను తెలుసుకోవాలనుంటే ఆయన సన్నిదికి రావాలి. యాకోబు 4: 8.

దేవుని యొక్క హృదయమును తెలుసుకొని ఆయన హృదయం వలే మనం కూడా మంచిని  అలవరుచుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.

Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...