15, జులై 2023, శనివారం

15వ సామాన్య ఆదివారం

             15వ సామాన్య ఆదివారం
యెషయ 55:10-11
రోమియులు 8 18-23
మత్తయి 13:1-23

ఈనాటి దివ్య పఠణాలు దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి గొప్ప శక్తిని గురించి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్కు మనందరినీ కూడా ఎంతో ప్రభావితం చేసి, మార్చి వేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించిన సందర్భంలో అది కొన్నిసార్లు ప్రజల యొక్క జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాని సందర్భంలో మనం నిరాశ చెందకూడదు అని కూడా ఈ దివ్య పఠణాలు మనకు సెలవిస్తున్నాయి. ఒక విధముగా చెప్పాలి అంటే ఈనాడు మనం విన్నటువంటి ఈ దివ్య పఠణాలు మనకు గుర్తు చేసే అంశం ఏమిటంటే ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును మనము వ్యక్తిగతంగా స్వీకరిస్తూ ఉన్నాము అలాగే దేవుని యొక్క వాక్కు మన జీవితములను ఫలభరితము చేస్తూ ఉన్నదా లేదా. దేవుని యొక్క వాక్కు యొక్క గొప్పతనము. కీర్తన 119:9-11, 105
2 తిమోతి 3:16
హెబ్రీ 4:12
ఈనాటి మొదటి పట్టణంలో యెషయ ప్రవక్త బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు.యెషయ  ప్రవక్త ప్రభువు యొక్క వాక్కును వానతోను,మంచుతోను పోల్చి చెబుతున్నారు. వానయు, మంచు ఈ రెండిటికి కూడా జీవమును ఇచ్చే శక్తి ఉన్నది. ఎందుకంటే వాన భూమి మీద పడిన సందర్భంలో అది కొత్త మొలకలు పుట్టే లాగా సహాయపడుతూ ఉంది. అదే విధంగా వానయు, మంచుయు జీవన మనుగడను కొనసాగిస్తుంటాయి ఎందుకంటే నీరు లేకపోతే మనం, జంతువులు, వృక్షములు బ్రతుకలేం. దేవుని యొక్క వాక్కు మన అందరిలో కూడా కొత్త జీవమును పుట్టిస్తుంది.ప్రభువు యొక్క వాక్కు ప్రకటించిన సందర్భంలో అది మనలో ఏదో ఒక విధమైన ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. యెషయ ప్రవక్త పలికినటువంటి ఈ మాటల యొక్క సంపూర్ణ అర్ధాన్ని గ్రహించాలి అంటే ఆనాటి సందర్భం తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా  దేశంలో బానిసత్వపు జీవితం గడుపుతున్నారు. అక్కడ అనేక కష్టాలు పడుతూ తమకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా? అని ఆశతో ఎదురు చూస్తూ నిరాశతో నిస్పృహలతో కృంగి నశించి బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్కు ద్వారా ఊరటనిస్తున్నారు. యావే దేవుడు తప్పనిసరిగా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తిని దయచేసి మనకు తిరిగి తీసుకొని పోతారని, రక్షణ ప్రసాదిస్తారని ప్రవక్త ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. ఇస్రాయేలు ప్రజలు ప్రభువు యొక్క వాక్కును కూడా విశ్వసించాలి అని యెషయ ప్రవక్త తెలియజేస్తున్నారు. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనదని విశ్వాసనీయమైనదని సృష్టికి మూలమైనదని, నడిపించే వాక్కుని, ప్రేమించే వాక్కు అని, క్షమించే వాక్కు అని ప్రవక్త తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క మాటకు తిరుగులేదు, అది తన కార్యాన్ని తప్పక సాధిస్తుంది. ఏ విధముగానయితే కురిసిన వర్షం వృధాగా పోదో అలాగే ప్రకటించినటువంటి దైవవాక్కు వృధాగా పోదు. వానయు మంచు పంట ఎదుగుదలకు కృషి చేస్తాయి అలాగే దైవ వాక్కు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సంతోషకరమైనటువంటి వార్త ప్రకటించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశలు పుట్టుకొని వచ్చాయి. ఇది దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నశించిపోవుటను గురించి తెలియజేస్తున్నారు. ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నశించి పోతూ ఉంటుంది.  ఏసుప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి పునీత పౌలు గారు రోమీయులను దేవుని యొక్క వాక్కును విశ్వసించమని కోరుతున్నారు. ఆదాము యొక్క పాపము ఈ లోకంలోకి వినాశనమును తీసుకుని వచ్చింది అదేవిధంగా ఈ సృష్టికి మరియు మానవాళికి నాశనమును తీసుకొని వచ్చింది. ఆదికాండము 3:14-19 మనకు తెలిపే అంశము ఏ విధముగా సృష్టి నాశనం అవుతున్నది మానవుని ఒక పాపము వలన. పౌలు గారు తెలిపే అంశమేమిటంటే క్రీస్తు ప్రభువు మనలను రక్షిస్తారు.
ఈనాటి సువిశేషం లో యేసు క్రీస్తు ప్రభువు వారు అందరూ అర్థం చేసుకునే విధంగా ఉపమాన రీతిగా దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని గురించి తెలియజేస్తున్నారు. విత్తువాడు విత్తనములు వెదజల్లుటకు వెళుతున్నారు. విత్తనాలు చల్లే సందర్భంలో కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతినేలపడ్డాయి, ఇంకొన్ని విత్తనాలు,  కొన్ని ముళ్ళ పొదల మధ్య పడ్డాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై పడినవి. ఈ ఉపమానంలో చల్లబడిన విత్తనము ఒక్కటే కానీ ఆ విత్తనములు పడినటువంటి స్థలములు నాలుగు రకములు.
విత్తనము చల్లినది దేవుడే ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం. చల్లబడినటువంటి స్థలములు మనందరిని కూడా సూచిస్తున్నాయి. ప్రతి ఒక్క రైతు విత్తనములు చల్లిన సందర్భంలో ఒక మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. పంట వేసే సందర్భంలో ఏ రైతు కూడా తాను వేసిన విత్తనాలన్నీ ఫలిస్తాయని తలంచడు. కొన్ని విత్తనాలు గాలికి  కొట్టుకొని పోవచ్చు, కొన్ని విత్తనాలు మొలకలు రావచ్చు కొన్ని విత్తనాలు తాలు గింజలు ఉండవచ్చు కాబట్టి ఆయన 100% ఫలమును ఆశించడు కానీ వేసినటువంటి పంట మాత్రం తప్పకుండా లభిస్తుందని విత్తనాలు వెదజల్లుతాడు. ఈ విత్తనాలు పడినటువంటి నాలుగు స్థలాలు మన జీవితములను ఏ విధంగా పోలి ఉన్నాయి అని తెలుసుకుందాం.
1. త్రోవ పక్కపడిన విత్తనాలు
త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలక ఎత్తటానికి చాలా కష్టం ఎందుకంటే నేల గట్టిగా ఉంటుంది కాబట్టి. నేల మీద పడిన విత్తనాలు భూమిలోనికి స్వొచ్చుకపోలేనందువలన వాటిని పక్షులు వచ్చి తిని వేస్తాయి. అలాగే ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు ఆ విత్తనాలను త్రొక్కి వేస్తారు. ఈ యొక్క స్థలమును పోలిన వారు దేవుని యొక్క వాక్కును నామమాత్రంగా వింటారు ఆ యొక్క వాక్కు లోనికి పోనందువలన వారి యొక్క జీవితంపై ఎటువంటి ప్రభావితం ఉండదు. వాస్తవానికి ఈ యొక్క విత్తనాన్ని పోలిన వారు వారి యొక్క హృదయములను ఈ లోక సంబంధమైన విషయంతో మూసేస్తారు అందుకని దేవుడి యొక్క వాక్యం వారిలో ప్రవేశించదు కావున ఆ యొక్క వాక్యం ఎటువంటి ప్రతిఫలమును వారి జీవితంలో ఇవ్వదు.
2. రాతి నేలపై పడిన విత్తనాలు
ఈ యొక్క నేలను పోలినటువంటి వారు ఎక్కువ భావోద్వేగాలను కలిగినటువంటి వారు వారు ఎప్పుడు కొత్తదనం కోసం ఎదురు చూస్తూనే ఉంటూ ఉంటారు కానీ జీవితంలో దేని మీద కూడా సరియైనటువంటి ఆసక్తి చూపనై ఉంటారు. ఇలాంటివారు దేవుని యొక్క వాక్కును విన్నటువంటి సందర్భంలో బాగానే ఉంటారు సంతోషిస్తారు ఆసక్తిగా వింటారు కానీ కొద్ది సమయంకే ఆ యొక్క వాక్కు నుండి వారు వేరే అంశముల వైపు పయనిస్తారు. మొదట్లో వారు చాలా ఆసక్తిగా ఉంటారు కానీ తర్వాత తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్కు మీద తగ్గిపోతుంది. పవిత్ర గ్రంథంలో యోహాను సువార్తలో దీనికి తగినటువంటి ఉదాహరణ ఉంది. ఏసుప్రభువుని వెంబడించే శిష్యులు అనేక అనేకమంది ఉన్నప్పటికీ ఎప్పుడైతే తాను ప్రజలకు తన యొక్క శరీర రక్తాలను భోజనంగా ఇస్తారని చెప్పారో అప్పుడు ఆ మాటలను వారు స్వీకరించడానికి అంగీకరించలేరు. ఆ మాటలు వారు జీర్ణించుకోలేకపోయారు. మొదట్లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారికి సంతోషంగానే, వినసొంపుగా ఉన్నాయి కానీ కొద్దిసేపటికే వారికి దేవుని మీద , దేవుని యొక్క ఆ వాక్కు మీద ఉన్నటువంటి ఆసక్తి పోయింది అందుకే వారు క్రీస్తు ప్రభువుని వెంబడించలేకపోయారు . యోహాను 6:60
3. ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనములు
ఈ విత్తనములు పోలిన వారు మొదట్లో దేవుని యొక్క వాక్యమును విని కొంత సమయం వరకు ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైన వ్యసనాలు, వ్యామోహాలు వారిని ఈ లోకానికి పరిమితం చేస్తాయి. సైతాన్ కి సంబంధించినటువంటి అలవాట్లు కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ కాలం పాటించలేరు. ఎవరి యొక్క ఆలోచనలైతే ధనం మీద గాని, అధికారం మీద కానీ పేరు ప్రతిష్టల మీద కానీ ఉంటాయో వారు ఎక్కువగా వీటి గురించే ఆలోచన చేస్తారే అలాంటి వారిలో దేవుని యొక్క వాక్కు ప్రభావం ఎక్కువగా ఉండదు. వారు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి అని అనుకోరు. చాలామంది దేవుని యొక్క వాక్కు ప్రకారంగా జీవించలేక పోతారు ఎందుకంటే దైవవాక్కు కన్నా ఈ లోక సంబంధమైన విషయాలే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలామంది ఈ విత్తనమును పోలి ఉంటారు ఎందుకంటే వాక్యమును వింటారు కానీ ఆ వాక్యానికి తగినటువంటి జీవితం జీవించరు.
4. సారవంతమైన నేల మీద పడిన విత్తనములు
ఈ నేలను పోలిన వారు దేవుని యొక్క వాక్యమును విని విన్నటువంటి వాక్యమును ఆచరించేవారు. వారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చిన వారు పడిపోరు విశ్వాసాన్ని కోల్పోరు దేవుని యొక్క వాక్కు అనుసారముగా ప్రతినిత్యం జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు అనుసరించే సందర్భంలో ప్రాణాలను సైతం కోల్పోవుటకు వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి వారి జీవితంలో వారు ముప్పదంతలుగా అరవ దంతులగా నూరంతులుగా ప్రతి ఫలమును చూస్తారు వారు అడిగిన ప్రతి వరమును దేవుడు దయచేసి ఉంటారు. మనందరం కూడా సారవంతమైన నేలను పోలిన వ్యక్తులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక అందుకే దేవుడు ప్రవక్తల తర్వాత ప్రవక్తలను రాజుల తర్వాత రాజులను యాజకుల తర్వాత యాజకులను సేవకుల తర్వాత సేవకులను సేవకుల తర్వాత సేవకులను పంపిస్తున్నారు వాక్యమును బోధించేలాగా చేస్తున్నారు ఆ వాక్యము ద్వారా మన అందరి జీవితాలు మారాలి అని మనందరి జీవితం ప్రతిఫలం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడి యొక్క వాక్యమును ఏ విధముగా స్వీకరిస్తున్నారు ఏ విధముగా ఆలకిస్తున్నాం ఏ విధముగా ఆచరిస్తున్నాం అని మనందరం కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఆ వాక్యము క అనుసారంగా మనం జీవించి మన జీవితాలను దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి.

Fr. Balayesu OCD

8, జులై 2023, శనివారం

పదునాల్గవ సామాన్య ఆదివారం

పదునాల్గవ సామాన్య ఆదివారం
జెకరియా 9: 9-10, 
రోమా 8: 9, 11-13, 
మత్తయి  11: 25-30

                      బ్రదర్. సుభాష్ ఓ.సి.డి

క్రీస్తుపూర్వం 538 వ సంవత్సరం యిస్రాయేలు ప్రజలు బబులోనియా బానిసత్వం నుండి తిరిగివచ్చిన కాలం.
యిస్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ఈ రాజులూ కూడా లేరు . యిస్రాయేలు ప్రజలు స్వతంత్రులు, కానీ ముఖ్య అధికారం మాత్రం యూదులు, పర్షియా, గ్రీసు మరియు రోమీయులది. కానీ యిస్రాయేలు ప్రజలకు ఏ రాజునూ లేడు. దేవాలయం ధ్వంసం చేయబడింది ప్రజల జీవితములో శాంతి లేదు.
ఈ సమయములో జెకర్యా మరియు హగ్గయి  ప్రవక్తలు ఇద్దరు కూడా దేవాలయ నిర్మాణంలో   యిస్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఆ సందర్భంలో జెకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను  సంతోష పరిచే వాక్యాలే  మొదటి పఠనంలో చూస్తున్నాము.
9. వచనంలో చూస్తున్నాం, యూదా మరియు యిస్రాయేలు ప్రజలారా మీరు సంతసించండి నేను మీ మధ్య నివసించబోతున్నాను. ఒక శాంతి యుతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాను. మీ శాంతి రాజు గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని చెపుతున్నాను. 
రాజులు గుఱ్ఱములపై  లేదా అశ్వములపై  లేదా రథములపైనా కదా ఊరేగింపుగా వస్తారు గాడిదమీద రావటం ఏమిటి?.
ఇక్కడ గాడిద అనే జంతువు వినమ్రతకు, శాంతి సూచనగా నిలుస్తుంది. 
గొప్ప రాజులుకూడా గాడిదపైన ఉరేగింపబడ్డారు. జాయిరు, యిస్రాయేలు ప్రజల ఏడవ నాయకుడు. తన ముప్పది మంది కుమారులతో ముప్పది గాడిదలపై స్వారీ చేసి గిలియాద్ దేశములో ముప్పది పట్టణములను దాడి చేసెను. (న్యాయాధిపతులు 10: 4) 
సొలొమోను మహారాజు కూడా గాడిదపై ప్రయాణించెను (1రాజుల  1 :33). దావీదు మహారాజు కుమారులు కూడా గాడిదపై పర్వతములలోకి పారిపోయాను (2వ సమూయేలు 13 : 29 ). దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము గాడిదపై స్వారీ చేసెను (2వ సమూయేలు 18 : 9 )
ఇక్కడ గాడిదను తక్కువ విలువగల  జంతువుగా కాకుండా గాడిదయొక్క వినమ్రతను ముఖ్యమైన అంశముగా మనం గ్రహించాలి.
10 వ వచనంలో ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు నుండి రథములను యెరూషలేమునుండి యుద్దఅశ్వములను  తొలగింతును ధనస్సులను  నాశనం చేసెదను.
ఇక్కడ రథములు, ధనస్సులు అధికారానికి గుర్తు. కానీ దేవుడు రథములను తొలగిస్తాను  అంటున్నాడు, ధనస్సులను నాశనం చేస్తా అంటున్నాడు.  అంటే అధికారాన్ని తీసివేస్తా అని చెపుతున్నాడు.
యుద్ధాశ్వములు యుద్దానికి ఉపోయోగించే జంతువులు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. రాజులకు ఒక శక్తి, బలం లాంటివి. దేవుడు వాటిని కూడా తొలగిస్తానని అంటున్నాడు.
యుద్దాలు శత్రుత్వానికి, చంపుకోవడానికి, చావడానికి గుర్తు. 
ఇక యుద్దాలు జరగవు, శాంతిని దయచేస్తాను అని అంటున్నాడు. మిమ్మలను శాంతితో పరిపాలించుటకు రాజు రాబోవుచున్నాడు అని ప్రభువు జెకర్యా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు.
సువిశేషం:
 25 - 27 వచనాలలో క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ వాక్యాలు యూదుల అధికారములను ధర్మశాస్త్ర బోధకులను, పరిస్సయులను ఉద్దేశించినవి. ఈ వచనంలో దేవుడికి క్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమను మనం గమనించవచ్చు.
అంతేకాక “విజ్ఞులకు, వివేకావంతులకు” ,” వీటిని”, “పసిబిడ్డలకు”  “మరుగు పరచి” “బయలు పరచి” అనే  పదాలను వింటున్నాము.
విజ్ఞులకు, వివేకవంతులు :- అంటే యూదులు అధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, గర్వాత్ములు క్రీస్తుని రాజుగాను, దేవుని  కుమారుడగును, రక్షకుడిగాను విశ్వశించని వారు నిరాకరించనివారు.
వీటిని :- క్రీస్తు చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, మంచి పనులు (పరమ రహస్యాలు) 
పసిబిడ్డలు :- అంటే వయస్సు పరంగా కాదు ఇక్కడ ప్రభువు వ్యక్తుత్వన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినమ్ర హృదయులు కలిగిన వారు, పేదలు, దరిద్రులు, పాపాత్ములు  క్రీస్తుని తమ రాజుగా స్వీకరించిన వారు, క్రీస్తు రక్షకుడిగా విశ్వసించినవారు.
మరుగుపరచి:- తొలగించి, తీసివేయబడి. విజ్ఞులు మరియు వివేకవంతుల, నుండి తీసివేయటం 
బయలు పరచటం:- పసిబిడ్డలు వంటి వ్యక్తుత్వం, మంచితనం కలిగిన వారికీ దేవుని ఆశిర్వాదములు బయలుపరచబడ్డాయి.
సొలొమోను మహారాజు  వలె విజ్ఞానం, వివేకం ఉంది దేవుని యందు విశ్వాసం మరియు మంచితనం లేకపోతె మరి ఎందుకు పనికిరాము, దేవునిచే తిరస్కరించబడుతాం.
28 - 30 వచనాలను ధ్యానిస్తే: - ఈ వచనాలు, జీవితంలో, మానసిక, శారీరక, ఆత్మలో, భారంగా నలిగి పోతున్న ప్రజలకు, క్రీస్తు పలుకుతున్న వచనాలు, “భారముచే అలసి సొలసి ఉన్న జనులారా నాయొద్దకు రండి విశ్రాంతినిస్తాను”. అని అంటున్నాడు. 
అంటే క్రీస్తు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. శాంతిని పొందుటకు, రక్షణ పొందుటకు, సంతోషంగా ఉండుటకు.
 పునీత  అగస్తీను  గారు " నా ఆత్మా నీలో కలవనిదే దానికి శాంతి లేదు" అని చెపుతారు. 
ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, మన ఆత్మలు దేవునిలో లీనమవుతాయో మనకు కూడా శాంతి లభిస్తుంది.
యూదుల మతాచారాలు వారి చట్టాలు, వారి పరిపాలన ప్రజలకు చాల భారమైంది, శాంతి లేని ఒక అన్యాయపు పరిపాలన యూదులు ప్రజలపై భారం మోపుదురు, కానీ వారి చిటికిన వ్రేలుకూడా సహాయం చేయడానికి కదుపరు. మత్తయి 23 : 4 
యూదా సిద్దాంతాలతో, చట్టాలతో ప్రజలు నలిగి సతమతమవుతున్నారు, కానీ వారు మాత్రం సుఖవంతమైన జీవితాన్ని జీవించేవారు. 
కానీ క్రీస్తు మాత్రం యూదులకంటే భిన్నంగా ప్రజల భారాన్ని కూడా మోశారు.
నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది . ఏమిటి దీని అర్థం?
ఇక్కడ క్రీస్తు ప్రభువు తన సిద్దాంతాలతో , ధర్మశాస్త్ర బోధకులు లేదా యూదుల చట్టాలను పోల్చి చెపుతున్నారు.
యూదుల చట్టాలు " ప్రాణానికి ప్రాణం , కంటికి కన్ను , పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, దెబ్బకు దెబ్బ నిర్గమ 21 వ అధ్యాయంలో చూస్తున్నాం.  ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతీకారం అనే చట్టం యూదులది. 
యేసు కాడి,  ప్రేమతో కూడినది, దైవ ప్రేమ, సోదర ప్రేమ.
క్రీస్తుని  చట్టం నీ శత్రువులను ప్రేమింపుము, వారికోసం ప్రార్థన చేయుము. క్రీస్తు చట్టంలో క్షమా , దయ , జాలి, సహాయం, కనికరం ఉంటాయి. కానీ యూదా చట్టంలో ఇవేవి ఉండవు.
క్రీస్తు ఈ లోకంలో శాంతిని నెలకొల్పడం కోసం గాడిదపైన వినమ్రుడై , ఉరేగించబడ్డాడు, శ్రమలు అనుభవించి , అవమానాలు పొంది, యూదులు మోపిన సిలువ అనే భారాన్ని మోసి మనకోసం మరణించాడు.
క్షమించు అనే మాట ద్వారా లోకమంతటికి శాంతిని నెలకొల్పాడు.
రెండవ పఠనం;
దేవుని ఆత్మ మనలో వాసమై ఉందని పునీత పౌలు గారు పలుకుతున్నారు.
కాబట్టి మనము ఇక శరీరానికి భానిసలము కాము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు. 
13 వ వచనంలో మనము శరీరాను సారంగా జీవిస్తే, మనం మరణిస్తాం. ఆత్మచే జీవిస్తే మరణించినను జీవిస్తాము అని అంటున్నారు. 
ఎందుకంటే ఒక సందర్భంలో పౌలుగారు ఈవిధంగా పలుకుతున్నారు మన హృదయాలు దేవుని ఆలయాలు కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడివలె జీవించాలని మనకు తెలియచేస్తున్నారు. 
చివరిగా ఈ మూడు పఠనాలు మనందరినీ కూడా సువిశేషంలో క్రీస్తు ప్రభువు బోధించిన విధంగా 29 వ వచనం . సాధుశీలుడుగను, వినమ్ర హృదయము కలిగి జీవించాలి అప్పుడే మన ఆత్మలకు శాంతి లభిస్తుంది.
మత్తయి 5 : 5  వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు.
మత్తయి 5 : 9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
కాబట్టి మనందరం కూడా క్రీస్తు వాలే శాంతి స్థాపకులుగా, మన కుటుంబాలలో , మన సంఘాలలో ఒక నిర్మలమైన జీవితాన్ని జీవించుదాం

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...