23, అక్టోబర్ 2021, శనివారం

30 వ సామాన్య ఆదివారం

30 వ సామాన్య ఆదివారం

 యిర్మియా 31:7-9 , హెబ్రీ 5: 1-6, మార్కు 10:46-52 

ఈనాటి దివ్య పఠనాలు దేవునికి తన ప్రజల పట్ల వున్న అమితమైన ప్రేమ, దయ, క్షమ అనే అంశములను గురించి బోధిస్తున్నాయి. 

తండ్రికి తన బిడ్డల పట్ల ఉన్న మమకారం ఎప్పుడు కూడా మరువనిది అని కూడా ఈనాటి పఠనాల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇస్రాయేలు ప్రజల మీద చూపిన గొప్ప ప్రేమ అర్థమగుచున్నది. 

తండ్రి దేవుడు ప్రజల యొక్క ఆధ్యాత్మిక అంధకారంను తొలగించి వారి యొక్క  జీవితములో సంతోషం అనే వెలుగు నింపుచున్నారు. 

దేవుడు యిస్రాయేలు  ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో 31 వ అధ్యాయం 1-4 వచనాలలో అర్థమగుచున్నది. 

దేవుడు ప్రతి సారి కూడా యిస్రాయేలు ప్రజలను నా ప్రజలు అని సంబోధిస్తున్నారు అలాగే నేను వారు దేవుడిని పలుకుచున్నారు. 

ఈ బంధం తండ్రి , బిడ్డల ప్రేమ బంధం విడదీయలేని బంధం, ఎందుకంటే ఎన్నిసార్లు యిస్రాయేలు ప్రజలు తండ్రిని  కాదని అన్య దైవములను పూజించినా ఆ తండ్రి తన బిడ్డలను మరలా ప్రేమిస్తూనే , క్షమిస్తూనే  ఉన్నారు. 

ఈనాడు మనం  విన్న మొదటి పఠనంలో  యిస్రాయేలు  పునరుద్ధరణకు సంబంధించి  దేవుడు చేసిన వాగ్ధానాలు వింటున్నాం. 

బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యిస్రాయేలు ప్రజలను దేవుడు విముక్తి చేస్తారు. ఉత్తర దేశమైన బాబిలోనియా నుండి యిస్రాయేలు ప్రజలను  స్వదేశమైన యూదాకు తిరిగి రప్పిస్తారని తెలుపుచున్నారు. ఇక్కడ దేవుడు తన ప్రజలను ఇచ్చే  ఆ స్వేచ్ఛ గురించి , ఆయన తన ప్రజలకు ఇచ్చే సంతోషం గురించి ధ్యానించాలి. 

బానిసత్వంలో స్వేచ్ఛ లేదు, ఆనందం గా గడపడానికి సమయం లేదు, సమూహంగా దేవున్ని  ఆరాధించడానికి స్థలం లేదు. ఎటు చూసినా ఇబ్బందియే,  అంతగా బాధపడే ఒక స్థలం నుండి దేవుడు వారికి విముక్తి  చేస్తున్నారు. వారికి జీవాన్నీ సమృద్దిగా దేవుడు ఇస్తున్నారు. 

మళ్ళీ వారు సంతోషముగా యెరుషలేములో ఆరాధనాలు చేయవచ్చు ,  దేవుడు వారిని తన బిడ్డలుగానే గౌరవించారు. వారిలో ఆనందం  నింపారు. మరలా  ఒకసారి పూర్వ వైభవమును వారికి అందచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను తోడై వుంటా అన్నారు. 

దేవుడు అంటున్నారు 8 వ  వచనంలో నేల అంచుల నుండి వారిని కొనివత్తును అని, అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా మరిచి పోవటం లేదు. అందరిని కూడా స్వేచ్చా వంతులను మరియు తన బిడ్డలుగా చేయాలన్నదే,  దేవుని  యొక్క ఆశ.  ఇప్పటివరకు  బాధలలో ఉన్న గ్రుడ్డి వారు, కుంటివారు ,గర్భవతులు, సంతోషంగా తిరిగి ఒక మహా సమూహంగా వస్తారని ప్రభువు తెలుపుచున్నారు. దేవుడే స్వయంగా వారిని నడిపించుకొని వస్తారు. వారికి చేరువలో ఉంటారు. 

దేవుడు తన ప్రజలను నడిపించుకొని వస్తారు, వారిని చేయిపట్టి నడిపిస్తారు. ఆనాడు ఇదే యిస్రాయేలు  ప్రజలను ఎలాగైతే వాగ్దత్త భూమికి, సంతోష స్థలాలకు  నడిపించారో అదే విధంగా మరొక సారి ఈనాటి విశ్వాస యిస్రాయేలు  ప్రజలను కూడా అదేవిధంగా ప్రేమతో నడిపిస్తారు అని  యిర్మియా తెలుపుచున్నారు. 

వారు ఏడుపులతోను  ప్రార్ధనలతో తిరిగి వస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఆ దేవుని యొక్క గొప్పదైన ప్రేమను  జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అవిశ్వాసులుగా జీవించిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. అదేవిధంగా బానిసత్వంలో గడిపిన చీకటి సమయాలను గుర్తించుకుంటూ ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప స్వేచ్ఛను, ఆయన యొక్క అనంత ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. 

ఇంకొక విధంగా చెప్పాలంటే వారి యొక్క ఆనందం వల్ల కూడా ఏడ్చి ఉండవచ్చు. ప్రభువు అంటున్నారు వారిని తిన్నని మార్గమున నడిపింతును, అంటే ఇక  అన్య దైవముల వైపు  ప్రయాణం చేయరని మంచి వైపు, దేవుని వైపు మాత్రమే ప్రయాణం చేస్తారని,  వారి గమ్యం తప్పరని అర్ధం. దేవుడు నిర్ధేశించిన స్థానంకు వారు చేరుతారని అర్ధం. 

వారు కాలు జారీ పడిపోరు అంటున్నారు అంటే వారి పట్ల అంత శ్రద్దగా  ఉంటారని దీని యొక్క అర్ధం. యిస్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో దేవుడు మరొక సారి తన గొప్ప ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ప్రజలు కూడా  దేవునికి సంతోషంతో కృతజ్ఞతగా పాటలు పాడుచున్నారు. 

రెండవ పఠనంలో దేవుడు యాజకుల యొక్క ఎన్నికను గురించి  వారి యొక్క  జీవితం గురించి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు  జీవించిన విధంగా  ప్రతి యాజకుడు జీవించాలి. క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మిగతా లేవీయుల యాజకత్వం కన్నా  భిన్నంగా  ఉన్నది ఎందుకంటే  స్వయంగా  తండ్రి దేవుడే తన కుమారున్నీ ఈ పనికి నియమించారు. 

తండ్రికి -ప్రజలకు మద్య  ఒక నిచ్చెనలాగా ఉండుటకు, దేవుని యొక్క ప్రతినిధిగా నిత్య యాజకుడు క్రీస్తు ప్రభువు ఉన్నారు. ప్రతి గురువు కూడా దేవుని యొక్క ప్రతినిధే.  

ప్రతి యాజకుడు కూడా ప్రజల మధ్య నుండే ఎన్ను కొనబడిన వాడే . హెబ్రీ 5:1 , ద్వితీ 18:15 ఆయన కూడా సామాన్యుడే బలహీనుడే అయినప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని, అభిషేకించి బలవంతున్ని  చేశారు. 

వారిని ఎన్ను కొన్నది ప్రజలను దీవించుటకు.  ద్వితీ 10:8, సంఖ్యా 6:24-26 

వారిని ఎన్ను కొన్నది వాక్యమును ప్రకటించుటకు. ద్వితీ 31:11 , మార్కు 16:15 

తన సేవ చేయుటకు, స్తుతించుటకు ఎన్నుకొనెను.  2 రాజుల దిన 29:11 

ప్రజల కోసం బలులను సమర్పించుటకు ఎన్ను కొనబడిన వారు.  2 రాజుల దిన 29:24 ప్రజల పాపముల కొరకే కాదు యాజకుడు బలులు సమర్పించేది,  తన పాపముల కొరకు కూడా. ఈ యొక్క యాజకత్వ పదవి దేవుడు ఇచ్చినదే, ఆయనకు విధేయులై జీవించాలి. 

ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు,  బర్తిమయి  అను అంధుడికి చూపునిచ్చే విధానం చదువుకుంటున్నాం. యేసు ప్రభువు  యెరుషమలేముకు  ప్రణయమయి వెళ్ళే సమయములో యెరికో మీదుగా వెళ్లుచున్నారు. 

జక్కయ్యది కూడా యెరికో పట్టణమే. యెరికో నుండి యెరుషలేము  వెళ్లుచున్నా ప్రభువు గూర్చి విని, పదే  పదే  ప్రాధేయపడి అడుగుచున్నాడు. 

ఈ బర్తిమయి  జీవితములో దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసం మనం అర్ధం చేసుకోవాలి.( లూకా 18:35-43.) క్రీస్తు ప్రభుని  గురించి  ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు . వినుట  వలన విశ్వాసం కలిగింది. వినుట  వలన మేలు కలుగుతుంది అని భావించాడు. క్రీస్తుని గురించి వినుట  వలన తన బాధలు పోతాయని నమ్మకం కలిగింది, క్రీస్తుని గురించి వినుట  వలన, పేదవారి పట్ల నిలిచే దేవుడు తనకి మంచి చేస్తారన్న నమ్మకం ఆయనలో కలిగింది. 

ఆయన ప్రేమ గురించి విని ఉండవచ్చు, దానితో ఆశ కలిగింది. బిక్ష గాడు సాధారణంగా చేసే పని ఏమిటంటే అడగటం, ప్రతి ఒక్కరినీ అడుగుతుంటారు. 

కొందరు బిక్ష గాళ్లు ఇవ్వకపోతే వదిలివేస్తారు. బర్తిమయి తనను ఎంతమంది ఆపినా సరే వదిలి వేయటం లేదు, పట్టు వీడటం లేదు. ఆయనకు బహుశా మత్తయి 7:7 వచనపు దేవుని మాటలు గుర్తుండవచ్చు. అందుకే వెంటనే అడుగుచున్నాడు. 

దేవుడు అనేక సార్లు మన జీవితం గుండా ప్రయాణం చేస్తారు. కాని చాలా సార్లు మనం అది గుర్తించము, బర్తిమయి దేవుడుండే స్థలంకు వెళ్లుచున్నారు. యోషయా 55:6 దేవుని కోసం అన్వేషించండి అని చెబుతుంది. బర్తిమయి మాత్రము యేసు ప్రభువును గుర్తించి, విని, పిలుస్తున్నాడు. వెంటనే ప్రభువు సమాధానము ఇస్తున్నారు.  యిర్మీయా 33:3 వాక్యంలో ప్రభువు అంటారు.  నీవు పిలుతువేని నేను జవాబిత్తును అని.  కీర్తన 34:6. మోషే పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. ఏలియా దేవున్ని పిలిచారు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.(కార్మెల్ పర్వతంవద్ద). 

బర్తిమయి దెవున్ని పిలిచారు, ఆయనకు స్పందించారు, సమాధానం ఇచ్చారు. సుసన్న దేవున్ని పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. యిస్రాయెలు, దేవున్ని ఐగుప్తులో పిలిచారు  దేవుడు సమాధానం ఇచ్చారు.  బర్తిమయి  దేవుడిని కరుణించమని కోరుతున్నారు. తన యొక్క దీన స్థితియందు, దయ ఉంచామని అడుగుచున్నాడు. తన బలహీనత పట్ల, పాపముల పట్ల కనికరం కలిగి తనను ఆదుకోమని ప్రార్థిస్తున్నాడు. 

మనం కూడా దేవుడిని అడుగవలసినది, కరుణయే. ఆనాడు  యిస్రాయేలు ప్రజలు దేవుని కరుణ కొరకు ప్రార్థించారు. కాబట్టే వారికి దేవుడు మరల జీవితాన్ని ప్రసాదించారు. 

బర్తిమయిలో చూసే గొప్ప విషయం  ఏమిటంటే తనకు, దేవుని వరం పొందుటకు దేవుడిచ్చిన,  అవకాశమను చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎవరు తనను ఆపినా సరే ఆగటం లేదు. 

బర్తిమయి క్రీస్తును మెస్సయ్య గా గుర్తించారు. అందుకే దావీదు కుమారా, అని సంబోధిస్తున్నారు. మనం అడిగే ప్రతిదీ, దేవునికి నచ్చితే, దేవుడు మనకు సహాయం చేయడానికి, మన చెంతకు వస్తారు. ప్రభువు బర్తిమయి ఆక్రందన విని ఆగిపోయాడు. ప్రభువు పిలుపు వినగానే బర్తిమయి తనపై వస్త్రం విడిచిపెట్టి  ప్రభువు వద్దకు పరుగు తీశారు. అప్పటి వరకు ఆ వస్త్రం తన పడక, దాని మీదే ఆధారపడి జీవించారు, అదియే తన ఆస్తి , ఎన్నో సంవత్సరాలుగా ఆ దౌర్భాగ్య స్థితిలో గడిపి ఉండవచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు చెంతకు రావటం వలన, ఆయన నూతన జీవితం, ప్రసాదిస్తారని గ్రహించి దుప్పటి వదలి వస్తున్నారు. క్రీస్తుతో జీవించాలి అంటే పాతది  వదలి వేయాలి. 

బర్తిమయి జీవితంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు 

1. క్రీస్తు ప్రభువును మెస్సయ్య గా గుర్తించట 

2. క్రీస్తు చెంతకు రావడం , విశ్వాసంతో పట్టు విడువకుండా  అడుగటం 

3. ప్రభుని యొక్క దయ , క్షమ కరుణ కోరుట 

4. క్రీస్తుని వెంబడించుట. 

ఈ రోజు  బర్తిమయి చూపుని అడిగిన విధంగా మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక అంధకారం తొలగించి మంచిని చూచేలా, మంచి చేసేలా ,మంచి చెంతకు వెళ్ళేలా చేయమని ప్రార్ధించుదాం. బర్తిమయి ఎంతకాలం గ్రుడ్డివాడో ఎవరికి తెలియదు ,ఆయన గ్రుడ్డివాడు కాబట్టి పట్టించుకునే వారు లేరు. బర్తిమయి, యేసుప్రభుని చూడకుండానే నమ్మారు. ఆయన ప్రభువు ఏ మార్గము గుండా వస్తారో ముందే తెలుసుకొని, అక్కడ కాచుకొని ఆయన కొరకు, ఆయన వచ్చే స్థలం వద్దకు వచ్చి ఎదురు చూస్తున్నాడు. 

చూడక నమ్మువారు ధన్యులు యోహను 20 : 29 . క్రీస్తు ప్రభుని, విని నమ్మే ధన్యులు ఎల్లప్పుడు దేవుడి యొక్క జీవమును , ఆశీర్వాదాలు పొందుతారు. యోహను 5:24 ,20:31,రోమి 10:9-10. బర్తిమయి క్రీస్తును తన రక్షకునిగా, తనకు విముక్తి కలుగచేసే వానిగా, తన నాయకునిగా గుర్తించి ఆయన్ను సంప్రదించారు. దేవున్ని భోజనం పెట్టమని ,సంపదలు ఇవ్వమని అడగలేదు కానీ అతి ప్రధానమైన దయ చూపమని అడుగుచున్నారు. ఆనాడు సుంకరి అడిగినది అదే లూకా 18:13-14 . 

By Rev. Fr. Bala Yesu OCD

16, అక్టోబర్ 2021, శనివారం

29 వ సామాన్య ఆదివారం (3)

 29 వ సామాన్య ఆదివారం  (3)

ఈనాటి దివ్య పఠనాలు: యెషయా:53 :10 -11, హెబ్రీ:4 :14 -16 ,మార్కు:10 :35 -45 

         ఈనాటి దివ్య  పఠనాలు నిజమైన నాయకునికి ఉండవలిసిన  లక్షణం గురించి భోదిస్తున్నాయి. 

    దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడు సంఘమును నడిపించే నాయకుడు అదేవిధంగా కుటుంబమును నడిపించే ప్రతియొక్క నాయకుడు ఎలాగ జీవించాలన్నది, ఎలాగ వారు ఇతరులకు సేవచేయాలన్న విషయం గురించి ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

    ఈనాటి మొదటి పఠనంలో, బాధామయ సేవకునియొక్క నాల్గవ గీతం గురించి యెషయా గ్రంధంలో చదువుకుంటున్నాం.

        ఈయెషయా గ్రంధం 52 :13 -53 :12 వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకుపడిన బాధలను మనం వింటున్నాం.

సేవకుడు దేవునికొరకు అనేక రకాలైన అవమానాలు, నిందలు,శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారు.ఆయన యొక్క భాధలలో దేవుణ్ణి విస్మరించలేదు, ఆయనయందు విశ్వాసం కోల్పోలేదు. ఈ బాధామయ సేవకునియొక్క నాల్గవగీతంలో దేవుడు తెలియజేస్తున్నారు ఎలాగ ఒక సేవకుడు జీవించాలి.సేవకునికి  దైవప్రజలమీద అధికారం ఇవ్వబడింది.ఆయన యొక్క అధికారం సేవచేయుటకు,మాత్రమే వినియోగించులున్నారు,కానీ, ఎలాంటి సుఖ సంతోషాలను పొందటానికి కాదు. ఈనాటి మొదటి పఠనంలో,ప్రభువు సేవకున్ని భాధాభరితున్ని చేయుట నా సంకల్పము అని అన్నారు (10 వ) ఇక్కడ దేవుడు సేవకునియొక్క జీవితంలో కష్టాలుఒసగినప్పుడు ఆకష్టాలను అయన ప్రేమతో స్వీకరించాడు.

ఈసేవకునిలో వున్న కొన్ని లక్షణాలు ఏమిటి;

1 .అయన తన దేవునియందు వినయము విధేయతను కనపరిచాడు.ఎందుకంటే, దేవుడు స్వయంగా ఈ సేవకుడు శ్రమలు పొందాలన్నపుడు ఆయన శ్రమలు అనుభవించుటకు తాను సిద్ధముగా వున్నానని,వినయమును,విధేయతను తెలియపరుస్తున్నాడు.- యెషయా:53 :7 .

2. ఆయన ఇతరుల కొరకు జీవించినవ్యక్తి.పరుల పాపపరిహారం కోసం తన జీవితమునే త్యాగం చేస్తున్నారు.ప్రజల యొక్క పాపములను తనమీద వేసుకొని వారికొరకు ప్రాణత్యాగం చేస్తున్నారు.ఈ సేవకునిలో వంద సంవత్సరాలు జీవించాలన్న ఆశలేదు. కానీ దేవుని కొరకు దేవుని ప్రజలకొరకు జీవించాలన్న మంచిమనస్సు ఉంది యెషయా:15 :13 .

3 . అయన ప్రేమించే సేవకుడు: అయన కేవలము ప్రేమవలన అయన జీవితమును పరులకోసం త్యాగం చేసారు.ఎన్ని భాధలు పొందినా,ఎంత హింసించినా,అయన మాత్రము నోరు విప్పలేదు.ఎంతో ప్రేమవుంటేనే అలాగ భరించగలిగి శ్రమలలో దేవుని సంతోషమును చూసిన సేవకుడు.పౌలు గారు చక్కగా వివరిస్తారు ప్రేమ సమస్తమును భరించును 1 కోరిం:13 :7 . పౌలు గారు చెప్పిన విధముగా ప్రేమకు సహనం ఉంది,వినయము ఉంది,అదేవిధముగా ఆ సేవకుని హృదయం దైవ ప్రేమ, మానవ ప్రేమతో నిండిఉంది.కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.

4 . బాధామయ సేవకుడు దైవజ్ఞానము కలిగిన వ్యక్తి: ఈ సేవకునికి ప్రభువు యొక్క మనస్సు తెలుసు, ఆయన సంకల్పం తెలుసు.అందుకే ఆయన చిత్తమును నెరవేర్చుతూ,అన్నిటిని సహించుకొని,ముందుకు సాగారు.దేవుడుయొక్క ప్రతిమాట, ఆయన చిత్తం గ్రహించుకొని దాని ప్రకారము సేవ చేస్తూ,శ్రమల కాడిని మోసి,తన ప్రాణ త్యాగం చేసి అనేకమందియొక్క సంతోషమునకు కారణమయ్యారు.

5 .దేవుడుసేవకునికి ఇచ్చు ప్రతిఫలం : బాధామయ సేవకుడు తన కోసం పడిన ఏశ్రమనుకూడా తండ్రి దేవుడు మరచి పోలేదు.తన శ్రమలలో భాగస్తుడయ్యారు.తనకు తోడుగావున్నారు.ఆయనపట్ల సంతోషముగావున్నారు.ఎందుకంటే తన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చారు. ఈ సేవకుడు ఎన్ని భాధలు అనుభవించాడో,దానికి అన్ని రెట్లు ఎక్కువగా అతడిని గొప్పవానిగా దేవుడు చేశారు.యెషయా :53 :12 .

ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రేమ కాబట్టి మనం జీవితములో,కూడా కష్టాలు వస్తాయి, శ్రమలను ఎదుర్కోవాలి.అయితే వాటన్నిటిని ఈ బాధామయ సేవకుని వలే భరించాలి. ప్రతి శ్రమవెనుకాల ప్రతిఫలం దాగివుంటుంది.దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తే,అవి తరువాత దీవెనలుగా మార్చబడతాయి.కాబట్టి ఈ సేవకునిలో వున్న లక్షణాలు మనం పాటించుకుందాం.

    రెండవ పఠనంలో రచయిత యేసు క్రీస్తు ప్రభునియొక్క యాజకత్వము గురించి భోదించారు.

    యేసుక్రీస్తు ప్రభువుయొక్క యాజకత్వం పాతనిభందనా గ్రంధంలో లేవీయుల యాజకత్వము కన్నా కొద్దిగా భిన్నముగా వుంటుంది. లేవియ గోత్రముకు చెందిన యాజకులకంటే,క్రీస్తుప్రభువుయొక్క యాజకత్వం గొప్పది.ఎందుకంటే,లేవీయులు దేవునికి బలులు మాత్రమే అర్పించే యాజకులు కానీ,క్రీస్తుప్రభువు తానే ప్రజలకోసం బలిగా అర్పించుకున్న గొప్ప యాజకుడు.లేవీయులు ఈ భూలోకములోవున్న దేవాలయములోకి మాత్రమే ప్రవేశించారు.(లేవి :16 :15 -17 ) కానీ యేసు ప్రభువు పరలోకమునుండి దిగివచ్చి, పరలోకంకు ఎక్కివెళ్లిన ప్రధాన యాజకుడు.

లేవీయులు అందరిని ప్రేమించుటలేదు, ఆపదలోవున్నవారిని ఆదుకొనలేదు ( మంచి సమరుయుని కథ) కానీ క్రీస్తుప్రభువు అందరినీ ప్రేమించారు, పేదలలో జీవించాడు,అందరిని దీవించాడు,అవసరంలో వున్న వారికి చేయూతనిచ్చారు. లేవీయులు సేవింపబడ్డరు,గౌరవింపబడ్డారు.కానీ క్రీస్తు ప్రభువు సేవచేసారు, సిలువ శ్రమలు అనుభవించారు.అందుకే క్రీస్తుప్రభువుని యాజక అగ్రగణ్యుడు అంటారు. మనం బలహీనతల యందు మనకు శక్తిని ఇస్తారు.అదేవిధంగా మనలాగా ఈ లోకంలో మానవునిగా జీవించి అన్నిటిలో కూడి,ఎటువంటి పాపం చేయని వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మన బలహీనతలు తెలుసు కాబట్టి,మనల్ని  దేవుడు అర్ధం చేసుకుంటారు.సానుభూతి చూపుతారు, ఆదుకుంటారు,కాబట్టి ఆయన సన్నిధికి సమీపించి మనలను, మన పాపాలు క్షమించమని మొరపెట్టుకోవచ్చు.

         ఈ నాటి సువిశేష పఠనంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అధికారం పట్లవున్నఆశని గూర్చి వివరిస్తున్నారు. నిజమైన అధికారమంటే తనను తాను తగ్గించుకుని, అందరికీ సేవచేయడమే అని క్రీస్తు ప్రభువు శిష్యులకు తెలుపుచున్నారు.

 పోయిన వారపు సువిశేష పఠనంలో ధన వ్యామోహమును గూర్చి వింటున్నాం.ఈ రెండు కూడా మానవుడిని, దేవుడికి దూరం చేస్తాయి.ఎందుకంటే ఎప్పుడు కూడా వారిమనస్సు, హృదయం వాటిమీదనే ఉంటుంది.వారు దేవుడిగురించి ఆలోచించుట చాలా తక్కువ. వ్యామోహం ఏదైనా సరే అది విశ్వాస జీవితానికి మంచిదికాదు.

   ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు తన యొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,ఇద్దరు శిష్యులు మీ రాజ్యంలో మారు రెండు స్థానాలు ఇవ్వమని జెబాదాయి పుత్రులు యాకోబు,యోహాన్నులు అడుగుచున్నారు.

 వీరిద్దరూ కూడా యేసు ప్రభువు చేత ప్రేమింపబడినవారే, ఎందుకంటే,చాలా సందర్భాలలో వీరిని తోడుగా తీసుకొని వెళ్లుచున్నారు (యాయీరు ఇంటికి,తాబోరు కొండకు,గేస్తేమనే తోటకు).

  యేసు ప్రభువు మరణం గురించి, పునరుతానము గురించి చాలా సందర్భాలలో ప్రస్తావించారు.ఆయన శ్రమలను గూర్చి చెప్పిన ప్రతిసారి కూడా శిష్యులు ఉన్నారు. అయినాకూడా వారు గొప్ప అంతస్థు గురించి ప్రభురాజ్యములో కుడి, ఎడమ స్థానం గురించి ఆలోచనలుచేయసాగారు. శిష్యులు యేసుప్రభువు మరణిస్తారని ఆలోచనలేదు. కేవలం ఆయన రాజ్యంస్థాపిస్తారని అందరి యొక్క ఆలోచన. ఇక్కడ మానవుని యొక్క స్వభావం స్పష్టంగా కనపడుతుంది.

పేరుకోసం ,అధికారంకోసం,గుర్తింపుకోసం ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వం అర్ధమవుచున్నది.

   యేసు ప్రభువు మొదటిసారిగా తనయొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,పేతురుగారు దానికి అభ్యన్తరం పలికారు. అప్పుడు ప్రభువు తన సేవకులుగా ఉండాలంటే సిలువను మోయాలి అని పలికారు (మార్కు:8 :24 ). ఆయన ఆలోచనలు సరిచేశారు.

    రెండవసారి తన మరణం గురించి చెప్పినపుడు శిష్యులలో ఎవరుగొప్పఅని ఆలోచనలు చేశారు.అప్పుడు చిన్నబిడ్డను చూపించి,గొప్పవారు కావాలంటే,చిన్నబిడ్డలాగా దేవునిపై నమ్మకం ఉంచి,ఆయన మీద ఆధారపడి జీవించాలి అని తెలిపాడు మార్కు;9 :35 . 

       మూడవసారి మళ్ళీ మరణం గురించి చెప్పినపుడు,ఇద్దరు శిష్యులు తన రాజ్యంలో కుడి ఎడమల స్థానాలను ఆశిస్తున్నారు. అప్పుడు ప్రభువు, గొప్పవారు కాదలిస్తే,వారు సేవకుడిగా ఉండాలని తెలుపుచున్నాడు (44 వ వచనం).శిష్యులు అధికారంకోసం ఆశిస్తే, ప్రభువు సేవాగురించి భోధిస్తున్నాడు. అధికారం ఆశపడుతూ,శ్రమలను వద్దనుకుని జీవింప ప్రయత్నిస్తే,ప్రభువు మాత్రము అనుదిన జీవితములో శ్రమలు అంగీకరించాలని గట్టిగా చెబుతున్నారు. నిజమైన గొప్పదనం అంటే, ఇతరులకు సేవకునిగా ఉండి సేవచేయుటకు అని ప్రభువు చెబుతున్నారు.

  యోహాను యాకోబు అడిగిన వరం సరియైనది కాదు.ఎందుకంటే అధికారవరమును అడుగుచున్నవారు దానికోసం వారి తల్లిని కూడా తీసుకొనివచ్చి అడుగుచున్నారు (మత్త:20 :20 -21 ).వారికి ఎంత అధికారఆశ అంటే, వారు అడిగితే ఆ అధికారం రాదూ అనుకోని తన తల్లి చేత అడిగిస్తున్నారు.సలోమి మరియమ్మ గారి సోదరి వరుస అవుతారు (యేసుప్రభువుకు పిన్ని/పెద్దమ్మ వరుస).ఇక్కడ శిష్యులు ఏమిఅడుగుచున్నారో,వారికి సరిగా అవగాహన లేదు.మనం కూడా కొన్నిసార్లు ఏమిఅడుగుతామో అవగాహన లేదు.వారు (యాకోబు/యోహాను ) తనకు దగ్గర బంధువులు అయినప్పటికీ, వారికి యేసు ప్రభువు వారికి ఎలాంటి పక్షపాతం చూపించలేదు.ఆయనకు అందరూ సరిసమానులే.ప్రభువు వారి మధ్యలో వారికి విభేదాలు రాకుండా ఇలా మంచి నిర్ణయం తీసుకున్నాడు.

   మనమైతే ఎప్పుడూ కూడా మనవారి గురించి ఆలోచిస్తుంటాం. ఏదయినా పదవి ఖాళిగా ఉంది అంటే వెంటనే అది మనం బంధువులకు వచ్చేలా చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు మాత్రం వీరికి ఎలాంటి అధికారం ఇవ్వటం లేదు.

  యాకోబు యోహానులు ఇద్దరు కూడా ఉన్నవారే,(మార్కు:1 :20 ) వారికి వున్న సంపదలవల్ల అధికారం కూడా కావాలి అనే స్వార్ధపు ఆలోచనలలో వున్నారు.అందుకే ప్రభువు వారి ఆలోచనలను సరిచేస్తున్నారు (యోహా :18 :16 ). ఈ ఇద్దరు శిష్యులు యేసుప్రభువు యొక్క శ్రమల యొక్క సవాళ్లు అంగీకరించారు.అవసరమయితే ఆయనకోసం యెరూషలేములో మరణించడానికైనా సిద్ధం అని అన్నారు. యాకోబు గారియొక్క మరణ చరిత్ర మనకు ఆయన క్రీస్తుకొరకు పొందినాశ్రమలు బాప్తిస్మము గురించి వివరిస్తుంది.యాకోబుగారు హేరోదు అగ్రిప్పచే శిరచ్చేదం పొంది  మరణించారు   (అపో:12:2).  

    యేసు ప్రభువుయొక్క శ్రమలలో భాగస్థుడై మరణించిన మొదటి శిష్యుడు.యోహానుగారు కూడా తన తోటి క్రైస్తవుల వేద హింసల్ని,తీవ్రభాధను పొందటమే గాక, దేశ బహిష్కారణకు గురయ్యారు.వీరిద్దరూ క్రీస్తు శ్రమలలో పాలుపంచుకొని,దేవుని మహిమను పొందారు. వారు అధికారం గురించి అడిగినప్పుడు, ఆలోచించారోలేదో కానీ క్రీస్తు ప్రభువుయొక్క పునరుతానము తరువాత ఆయన కోసం జీవించాలి, మరణించాలి,ఆయన సేవ నిస్వార్ధంతో  చేయాలనే దృఢసంకల్పం కలిగిన సేవకులు వీరు.యేసు ప్రభువు తన తండ్రియే అందరికీ తన రాజ్యంలో స్థానం ఇస్తారని ప్రభువు తనయొక్క వినయాన్ని, విధేయతను చూపుచున్నారు. క్రీస్తుప్రభువుకు ఈలోకంమీద సర్వాధికారం ఇవ్వబడినది. అయితే దానిని ఎప్పుడూ కూడా సొంతలాభంకోసం వినియోగించలేదు.

    ప్రభువు దృష్టిలో అధికారం ఇవ్వబడినది కేవలం సేవకే అని స్పష్టమవుచున్నది. ప్రభువు తాను చూపిన అధికారులను ఆదేశించి పలుకుచున్నారు.వారు ప్రజలపై ఎంత కఠినముగా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ అధికారం పెత్తనం చెలాయించడాన్ని కాదు, కానీ అందరిలో ఒకడిగా ఉంటూ అందరికీ సేవచేయడమే, ఇదే నిజమైన గొప్పదనం అని తెలుపుచున్నాడు.

      గొప్పవారు కాదలిస్తే తనను తాను తగ్గించుకొని, ఇతరులను అంగీకరించి సేవచేయాలి అని భోధిస్తున్నాడు.ప్రథముడు కాదలిస్తే , బానిసగావుండాలి, ఎటువంటి పెత్తనం లేకుండా ఉండాలి అని భోధిస్తున్నాడు.

    మదర్ థెరెసా గారు తనను తాను తగ్గించు కొని అందరికీ సేవచేసారు. ఆసేవలో ప్రేమ, వినయం వున్నాయి.యేసుక్రీస్తు ప్రభువు నిజమైన సేవకునికి నిదర్శనం.ఆయన అందరికన్నా గొప్పవాడయినప్పటికీ, దేవుడైనప్పటికీ,తనను తాను తగ్గించుకున్నాడు.ఎవ్వరిమీద అధికారం చెలాయించలేదు. ప్రేమించాడు, తండ్రికి విధేయత చూపారు. పేదవారి పక్షాన పోరాడారు. అందరికీ సేవచేసారు.సిలువశ్రమాలు అనుభవించారు. శిష్యులపదాలు కడిగాడు.పేదవారిగా ఈలోకంలో జీవించారు.సుఖ సంపదలు విడిచిపెట్టారు.మనందరం కూడా క్రీస్తుప్రభువలె,సేవకు దూపం దాల్చి జీవించాలి.దేవుడిచ్చిన అధికారంతో ప్రేమిస్తూ,సేవచేస్తూ,దేవునికి దగ్గరగా జీవించాలి.మనం ఇతరులయొక్క శ్రేయస్సును కోరుకోవాలి. 1 కోరి:10 :24 , ఫిలి:2 :4 .

        అధికారం కేవలం సేవకుమాత్రమే కాబట్టి క్రీస్తు ప్రభువు వలే జీవించుటకు ప్రయత్నిద్దాము.ఆమెన్

Rev.Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...