26, మార్చి 2022, శనివారం

తపస్సు కాల 4 వ ఆదివారం (మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత)

 

మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత
 

మొదటి పఠనం: ఐగుప్తు  అపకీర్తిని దేవుడు మన  నుండి తొలగిస్తాడు . అంటే దాస్యాత్వం నుండి మనలను విమోచించి స్వతంత్రులుగా  జీవించే వారిగా మనందరిని  తీర్చిదిద్దుతాడు.

రెండవ పఠనం  , క్రీస్తునందు జీవిస్తే, క్రీస్తు మనలను తనతో సఖ్యపరచుకొని నూతన సృష్టిగా మనలను మారుస్తాడు

 సువార్త పఠనము , తప్పిపోయిన  కుమారుడి ఉపమానం ద్వారా మన తప్పులను తీసుకొని, తండ్రి చెంతకు తిరిగి రావాలని, ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు వారి   మనస్తత్వానికి  స్వస్తి చెప్పాలని, పెద్దకుమారుడిలాగా తండ్రి దగ్గర ఉంటూ, దూరంగా జీవించే జీవితానికి సెలవు చెప్పి, దేవునితో మరియు  తోటి మానవునితో  సఖ్యతగా, సమాధానంగా జీవించాలని విశద పరుస్తుంది

 ఈ విధంగా ఈ నాటి మూడు పఠనాలు తండ్రి దేవుడు   అవధులు లేని ప్రేమకలవాడని, మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాప పడి పాపం అనే  బానిసత్వం నుండి దేవుని ప్రేమ అనే స్వతంత్ర  జీవితానికి మరలి వచ్చి, నూతన సృష్టిగా మారమని ఈలాగున  దేవునితో, మానవునితో  సఖ్యత  పడమని మనందరిని   ఆహ్వానిస్తున్నాయి  వీటిని మనం మూడు అంశాలా రూపేనా  ధ్యానిస్తూ అర్ధం  చేసుకుందాం.

1. తండ్రి నుండి దూరంగా  వెళ్ళడం

2.మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం

3.నూతన సృష్టి – ఉత్సవం

 ఈనాటి సువార్త పఠణం లో తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో మూడు ముఖ్య పాత్రలను చూస్తున్నాము  1.  తండ్రి 2 .చిన్నకుమారుడు 3 .పెద్దకుమారుడు

 చిన్న కుమారుడు  తన తండ్రితో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడు.  అందుకే తనకు రావాల్సిన  ఆస్తిలో  భాగాన్ని పంచిపెట్టామని,  తన తండ్రిని బలవంతం చేసి తన బాగాన్ని నెగ్గాడు . (లూకా 15 :12 )ఈ కుమారుడు తన తండ్రి హద్దులు,  అవధులు  మరియు అంతం లేని ప్రేమను,  చేతులారా ఇక అవసరం లేదుగా అనుకున్నాడు. తను  సత్వహగా జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు . దూర దేశంలో దీనికంటే ఇంకా ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, భోగావీలాస  జీవితం లభిస్తుందని,  తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూర దేశాలకు వెళ్లి అక్కడ భోగ విలాసాలకు అలవాటుపడి  ఇదే సర్వస్వం  అనుకోని, తన చిల్లర స్నేహితులే ప్రేపంచం  అనుకోని , వాళ్ళు ఎళ్ళకాలం తనతో ఉంటారు అనుకోని, డబ్బు శాశ్వతం అనుకోని భ్రమపడ్డాడు (లూకా 15 ;13 -14 ),అందుకే తన ధనమును విచ్చల విడిగా ఖర్చుపెట్టి సుఖమయ జీవితానికి అలవాటుపడ్డాడు. కానీ కరువు  దాపరించడం వళ్ళ, తన సుఖమయ జీవితానికి, భోగ విలాస జీవితానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తనతో  జీవితాంతం ఉంటారనుకున్న స్నేహితులు, ఇప్పుటి  దాక తనతో ఉండి, ఈ దరిద్రపు స్థితిని చూసి వదిలేసారు, ఒంటరయ్యాడు. కనీసం తినడానికి తిండి లేదు ,ఉండటానికి ఇల్లులేదు, ఎంచేయాలో అసలు తెలియదు ,చివరికి ఒక యజమానిని  ఆశ్రయించగా, తాను తన పొలంలో పందులను మేపుటకు పంపెను,  తర్వాత చెసేది కూడా ఏమిలేదు, ఎంతో హీనా స్థితికి దిగజారి చివరకు పందులు తిను పొట్టుతో తన పొట్టను నింపుకొని ఆశపడ్డాడు.  కానీ ఎవరు ఏమి ఇవ్వలేదు ,(లూకా 15 ;15 - 16 ),ఇదంతా ఓ తండ్రి ప్రేమమయ తండ్రి నుండి దూరంగా వెళ్ళుట ఫలితమే. ఈ రోజు నీవు నేను తండ్రి ప్రేమ నుండి కరుణ నుండి,తండ్రి సాన్నిధ్యం నుండి దూరంగా వెళ్ళామా?

 2. మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం :

 తప్పిపోయన కుమారుడు ఎంతో హీనా స్థితికి దిగజారుడు,కడుపు నింపుకోవడానికి పందులు తిను పొట్టు మాత్రమే గతి, అన్నపుడు గుర్తుకొచ్చింది తండ్రి ప్రేమ.  అప్పుడు తండ్రి నుండి తాను అనుభవించిన రాజసం, వైభవం, జాగ్రత్త, అనురాగం ఒక్కోక్కటి గుర్తుతెచ్చుకొని, నెమరు  వేసుకుంటూ బోరున ఏడువసాగాడు. ఇక అనుకున్నాడు: నా తండ్రి వద్ద ఎందరో  పనివారికి పుష్టిగా  భోజనం దొరుకుతుంది కాని  ఇక్కడ నేను ఆకలికి మల మల మాడుచున్న.(లూకా 15 ;17 ) ఈలాగున  తన పాపపు స్థితిని గ్రహించాడు. ఇక లాభం లేదు! నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి,తండ్రి నేను పరలోకమునకును ,  నీకును ద్రోహం చేశాను ఇప్పుడు నేను ని కుమారుడను  అని అసలు అనిపించోకోదగను. నీ పని వారిలో ఒక్కరిగా పెట్టుకోనుము అని చెప్పెదనని ,  ఆలోచించుకుంటూ తండ్రి వద్దకు బయలుదేరెను.(లూకా 15 ;19). తన తండ్రి చెంతకు తిరిగి వచ్చెను. తన  తండ్రి  చెంతకు తిరిగి రావాలి అనేది  ఓ గొప్ప అభినందనీయ నిర్ణయం. ఎందుకు అంటే ఈ నిర్ణయం ద్వారా తన తండ్రితో మరల  జీవించాలి అనుకున్నాడు. తన తండ్రి ప్రేమను తనివితీరా అనుభవించాలి అనుకున్నాడు. తన తండ్రి సాన్నిధ్యంతో తండ్రి వద్ద ఉండాలి అనుకున్నాడు.

కాని  పెద్ద కుమారుడు తండ్రి  సాన్నిధ్యంలో ఉన్న కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు ఇది  ఎంతో దుర్లభమైన జీవితం. అటు తండ్రితో,  ఇటు  తమ్ముడితో సఖ్యత లేదు.  స్వార్థం,  నిరాకరణ, అసూయా అనే దుర్గుణాలతో నిండి ఉన్నాడు.  ఇతరుల శ్రేయస్సును, ఎదుగుదలను మరు మనసును, తట్టుకోలేక పోయాడు.

ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చిన్న కుమారుడని పోలి ఉన్నానా, పెద్ద కుమారుడని పోలి ఉన్ననా ?,పెద్దకుమారుడి లాగా ఈర్షతో జీవిస్తే , జీవితానికి ఒక అర్ధం ఇవ్వలేం.  జీవితంలో నిజమైన సంతోషాన్ని  పొందలేము,తండ్రి దేవుని ప్రేమను అనుభవించలేం.    కాని  చిన్న కుమారుడిలాగా మన పాపపు స్థితిని గ్రహించి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం చెంది, దేవుని వద్దకు తిరిగి వస్తే దేవుని అనుగ్రహాలు, అవధులు లేని ప్రేమని ,కరుణని పొందగలం.

  3 . నూతన సృష్టి ఉత్సవం

 ఎవడైనను క్రీస్తునందున్న  యెడల అతడు నూతన సృష్టి. పాత  జీవితం గతించినది.  క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది.(2 కోరింతి  5 :17 ), అని ఈనాటి రెండో పఠనంలో మనం  మనం చదువుతున్నాం. చిన్న కుమారుడు తన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకున్నాడు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి ఇక క్రీస్తునందు ఉండాలి అనుకొన్నాడు, తోటి వారితో దేవునితో సఖ్యత పడ్డాడు. ఒక నూతన సృష్టి గా మారాడు.

 పెద్ద కుమారుడు మాత్రం తండ్రి వద్ద ఉన్నాడు, కాని  తండ్రి నందు ఉండలేకపొయ్యాడు. తన స్వార్ధం,నిరాకరణ మరియు  అసూయా దానికి కారణం. తన జీవిత స్థితిని గ్రహించలేకపొయాడు. తాను తండ్రికి  తగిన కుమారుడు అనుకున్నాడు,  కానీ తండ్రితో సఖ్యతను సంపాదించుకోలేకపొయాడు. ఓ పాతసృష్టిలానే  మిగిలిపోయాడు. ఎంత దురదృష్టకరణం! పెద్ద కుమారుడిలా కాక, మనం మన పాపపు బానిసత్వం నుండి విమొచించబడి దేవుని దగ్గరకు తిరిగి రావాలి.  (యెహోషువ 5 ;9 -12 ), ఒక నుత సృష్టిగా మారాలి. అప్పుడు ఒక  ఉత్సవం జరుగుతుంది. స్వయానా తండ్రి దేవుడే మనలను  ఆహ్వానిస్తాడు .ఏవిధంగా అంటే పరుగున వచ్చి, కౌగలించుకొని  ముద్దు పెట్టుకుంటాడు. అంతటితో ఆగడు, మనకు మేలిమి  వస్త్రములను, వెలికి ఉంగరమును ,కాళ్ళకు చెప్పులను ఇస్తాడు. అంటే ఇక మనం బానిసలం కాదు, స్వతంత్రులమని , తనకు చెందిన వారమని, తన రాజరికంలో వా రమని దానికి  అర్ధం.  క్రోవిన దూడను వాదించి విందు ఏర్పాటు చేస్తాడు (లూకా 15 ;20 -23 ), ఎందుకు అంటే? తప్పిపోయన మనం తిరిగి తండ్రి వద్దకు వచ్చేం . పాతజీవితానికి మరణించిన మనం నూతన జీవితానికి జన్మించం. ఈ తపసు కాల నాలుగవ  ఆదివారం మనమందరం మన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకొని పశ్చాత్తాప పడి ,దేవుని చెంతకు తిరిగి వద్దాం.  నూతన సృష్టిగా మారుదాం. మన తోటి  వారితో,  దేవునితో, వెల్ల వేళలా  సఖ్యతతో జీవిద్దాం .

 BR. SUNIL INTURI 

 

 

19, మార్చి 2022, శనివారం

తపస్సు కాలం 3 వ ఆదివారం(2)

తపస్సు కాలం 3 వ ఆదివారం

నిర్గమ 3: 1-8, 13-15, 1 : కొరింతి 10: 1-6 , 10-12 , లూకా 13 : 1-9

ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క ఓర్పు, సహనం గురించి తెలుపుచున్నాయి. 

-ప్రజల యొక్క హృదయ పరివర్తనంకై దేవుడు మానవాళి పట్ల ఎంత ఓర్పుగా ఉన్నారో తెలుపుచున్నవి. 

-దేవుడు మానవులను అర్థం చేసుకొని వారియొక్క దీనస్థితికి జాలిపడి వారిపట్ల సహనంతో మెలగుతారు. 

-ఓర్పుగా ఉండటం దేవునియొక్క సహజ లక్షణం. అది దేవుని గొప్ప లక్షణం. తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్ష వేయరు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలోనే ఆదాము అవ్వ తప్పు చేసిన సరే తన యొక్క మనస్సు బాధపెట్టిన సరే వారే వస్తారని, క్షమించమని అడుగుతారని దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నారు. మరియొక సారి వారు రాకపోయే సరికి దేవుడే వారిని వెదకుచు వారిపట్ల సహనంతో ఉంటున్నారు. 

-ఇశ్రాయేలీయులయొక్క మార్పు కోసం కూడా దేవుడు ఎంతో ఆశగా సహనంతో ఉంటున్నారు. అందుకు కాబట్టే ప్రవక్తల తర్వాత ప్రవక్తలను పంపుతున్నారు. 

-దేవుని వలే మనకు కూడా సహనం కావాలి. ఏవిధంగానైతే  రైతు పంట కోసం  ఎలాగ సహనంతో ఉంటారో మనం కూడా మన పొరుగు వారి మార్పుకోసం సహనంతో ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి జీవించాలి.

-పునీత అగస్టీను గారి తల్లి కుమారుడి కోసం భర్త కోసం వారియొక్క మార్పుకోసం ఎన్నో సంవత్సరాలు సహనంగా ఉన్నారు.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపినటువంటి గొప్ప దయను గురించి చెప్పబడినది. 

-మోషే ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకొంటూ, దేవుడి వరిపట్ల తనయొక్క దయను చూపిస్తున్నారు. 

-మోషే ప్రవక్త ఎప్పుడైతే దేవుని కొండయైన హోరేబు దగ్గరకు వచ్చారో అప్పుడు అతనిని దేవుడు ఎన్నుకొంటున్నారు. 

-దైవ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు. 

-దైవ పిలుపునందుకొన్నది ఎందుకంటే దేవుని ప్రజలను నడిపించుటకు. ప్రజల యొక్క జీవితంలో పాపం యొక్క ఆవశ్యకతను తెలిపి, వారు దేవుని వైపు మరల్చే లాగ చేయుటమే దైవ ఇలుపు ఉద్దేశం .

-ఈనాటి మొదటి పతనం ద్వారా దేవుడు చాల విషయాలు మనకు తెలియచేస్తున్నారు. 

1. మనం దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలు మారిపోతాయి. మోషే ప్రవక్త దేవుని కొండయైన హోరేబు  వద్దకు వచ్చారు. దేవుడున్న స్థలంకు వచ్చిన్నప్పుడు దేవుడు తనను ఎన్నుకుంటున్నారు, ఆయన ఎన్నిక ప్రత్యేకమైనది. 

-దేవుడు మోషేకు దైవ పిలుపును అందచేస్తున్నారు. మోషే జీవితంలో ఒక గొప్ప మలుపు కలిగేలా దేవుడు చేస్తున్నారు. 

- మోషేను అనేక మందికి నాయకుడిగా చేస్తున్నారు. ఆయన జీవితాన్ని మార్చుతున్నారు. 

-ఆయనకు దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. తన ద్వారా ద్వారా బానిసత్వంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛనిస్తానన్నారు. 

- దేవునికి దగ్గరగా వచ్చిన వారి జీవితాలు చాలా మారిపోయాయి. జక్కయ్య యేసయ్యను చూడాలని వచ్చారు అప్పుడు ఆయన జీవితం మార్చబడుతుంది. 

-నతానియేలు దేవుని దగ్గరకు వచ్చారు దైవపీలుపును పొందుకున్నారు.

-మోషే దేవుని యొక్క స్థలం దగ్గరకు వచ్చారు దేవుని పని కోసం ఎన్నుకొనబడినారు. 

- మనం దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తారు. యాకోబు 4 :8 . 

-మనం కూడా దేవునిదగ్గరకు రావాలి నిర్మలమైన మనసు కలిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనలను కూడా మార్చుతారు. అదేవిధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలను మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. 

2. దేవుడు కనులారా ప్రజలయొక్క బాధలను చూశారు అని నిర్గమ 3 :7 వ వచనంలో చెప్పబడింది. ఈ మాట యొక్క అర్థమేమిటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డారని వారిలో హృదయ పరివర్తనం చోటు చేసుకుందని, వారు దేవుని వైపు మరలినారని అర్థం. ఎన్నో సంవత్సరాలుగా  వారు మారతారని దేవుడు ఎదురుచూసిన సమయం వచ్చినదని కాబట్టియే వారిని విముక్తులను చేయుటకు దేవుడు వారికోసం మోషే ను ఎన్నుకొంటున్నారు. 

-మన జీవితాల నుండి దేవుడు అదేవిధంగా హృదయ పరివర్తనం కోసం ఎదురు చూస్తున్నారు. 

-దయ, కనికరం కలిగిన దేవుడు ప్రజల దగ్గరగా ఉంటూ వారి జీవిత మనుగడను పరిశీలిస్తు వారి మార్పుకోసం ఎంతో ఎదురుచూస్తాడు.  

3. దేవుడు మోషేతో అన్నారు ఇప్పుడు నీవున్న స్థలం పవిత్రమైనది నీ చెప్పులు విప్పుము అంటున్నారు. 

- విడవటం అంటే కేవలం చెప్పులు మాత్రమే కాదు పాపమును కూడా విడిచిపెట్టడం. 

చాలామందికి దేవునియొక్క స్థలం పవిత్రత విలువ తెలియటంలేదు. అందుకే దేవాలయాన్ని ఎలాపడితే అలా వాడుతున్నారు. 

- దేవాలయంలో మొబైల్స్ వాడటం, ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం చేస్తుంటారు. ఇవన్నీకూడా మనం తరుచుగా దేవాలయంలో చేస్తుంటాం ఎందుకంటే మనకు నిజంగా దేవునియొక్క పవిత్రత విలువ తెలియటం లేదు. 

4.  మోషే ప్రవక్త దేవుడి పేరు అడుగుచున్నారు.

“నేను ఉన్నవాడను” అని దేవుడు సమాధానం ఇస్తున్నారు.

ఉన్నవాడను అంటే అన్ని సమయాలలో వున్న దేవుడు.

-సృష్టి కాక మునుపే ఉన్నవాడు. 

-సృష్టిని చేసినప్పుడు ఉన్నవాడు. 

-సృష్టిని నడిపిస్తున్నప్పుడు వున్నవాడు. 

-మన సంతోషంలో ఉన్నవాడు. 

-మన భాదలలో ఉన్నవాడు. 

-మన నిరాశలలో, సమస్యలలో ఉన్నవాడు. 

- తన ప్రజలకి ఎప్పుడు దగ్గరగా ఉన్నవాడు, వారిని రక్షించుటకు వున్నవాడు అని భావం. ఆయన నిద్రపోయే వ్యక్తికాదు. 

-యావే దేవుడు తనను తాను వున్నవాడనని సంబోధించుకుంటున్నారు. యేసు క్రీస్తుప్రభుని ఇమ్మానుయేలు అంటున్నారు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థం. మత్తయి 1 :22- 23 .

-యేసుప్రభువు అంటున్నారు ఎల్లప్పుడూ మీతో ఉండుటకు మీకు నేనొక ఆదరణ కర్తను పంపిస్తాను అని. యోహను 14: 16-17.

- ఈ మూడు వాక్యాలలో దేవుడు తనను తాను ఉన్నవాడనని సంభోదించుకుంటున్నారు. -

-మన దేవుడు మనతో ఉండేవారు కాబట్టియే వారిని ప్రత్యేకంగా మనం అంటిపెట్టుకొని జీవించాలి. 

-దేవుడు తన పేరు తెలియచేయటం ఒక గొప్ప విశేషం. మనం ఒక వ్యక్తి పేరు చెబితే వారి గురించి మొత్తం తెలుసుకుంటాం. వారియొక్క వ్యక్తిత్వం, స్వభావం అన్నియు. దేవుని పేరు తెలియ చేయటం ద్వార దేవునికి  గొప్ప స్వభావం, ఓర్పు కలిగిన స్వభావం తెలుస్తుంది. 

-యావే దేవుడు మోషేతో "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దేవుడను అని చెప్పుచున్నారు. అంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానాలను జ్ఞప్తికి ఉంచుకొని వాటిని నెరవేర్చేదేవుడు , ప్రజల మధ్య నివసించే దేవుడని తెలియ చేయుటకు ప్రభువు ఈవిదంగా పలుకుచున్నారు. 

-ఈ నాటి రెండవ పఠనంలో పౌలుగారు కొరింతు ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు మల్లి చేయరాదని హెచ్చరిస్తున్నారు. 

-పౌలుగారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన మేలులన్నీ వివరిస్తున్నారు. ప్రభువైన యావే దేవుడు 40 సంవత్సరాలు మేఘము క్రింద ఎటువంటి ఇబ్బంది లేకుండా కాచికాపాడారు.

-ఎర్ర సముద్రం దాటుటకు మార్గం సిద్ధం చేశారు, ఎడారిలో వారికీ ఆహారం, నీరు సమృద్ధిగా ఇచ్చారు. 

-దేవుడు వారియొక్క జీవితంలో ఎటువంటి కొరత లేకుండా కంటికి రెప్పలా కాపాడిన కానీ ఇంకా వారిలో కొంతమంది దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. అవిశ్వాసులుగా జీవించారు. వారిలో చాలామంది వాగ్దానా భూమికి చేరలేదు అని పౌలుగారు వివరించారు. 

- ఇశ్రాయేలు ప్రజలు పడిపోయిన విధంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలని పౌలుగారు తెలుపుచున్నారు. 

-మనం జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా ఉంటాం. చాల సందర్భాలలో జాగ్రత్తగా చూసుకొని  నడువు అని చెబుతారు ఎందుకంటే మనం జాగ్రత్తగా నడిస్తే గమ్యం చేరతాం. ఎటువంటి ప్రమాదంలో పడిపోకుండా.

-మనయొక్క   ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితంలో మనం కూడా జాగ్రత్తగా ఉంటే  

 పాపంలో  పడిపోము  దేవుని  అంటిపెట్టుకొని  జీవిస్తాం .

-మనకన్నా ముందుగా జీవించిన వారు మనకు ఎప్పుడు సుమాత్రుకగా ఉంటారు కొంతమంది మంచి ఉదాహరణగా ఉంటారు. కొందరు చెడుకు ఉదాహరణగా ఉంటారు అంటే అలాంటి చెడు జీవితం జీవించకూడదు అనుటకు ఉదాహరణగా ఉంటారు. 

-ఇశ్రాయేలు ప్రజలకు ఉదాహరణగా పౌలుగారు చెప్పినప్పుడు మనందరి జీవితాలను పరిశీలించుకోమంటున్నారు వారి వలె కాకుండా మనం కూడా మంచి విశ్వాసులుగా ఉండుటకు ప్రయత్నయం చేయాలి.   

-దేవుని సొంత ప్రజలమని ఎవ్వరు అధిక విశ్వాసం వ్యక్త పరచకుండా మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క జీవితంలో వినయం కలిగి జీవించాలి.

- ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు మనందరి యొక్క హృదయ పరివర్తనం కోసం ఎంత సహనంగా ఉంటున్నారో అర్థమగుచున్నది.

-మన మందరం పాపాత్ములమే అందరుకూడా దేవుని శిక్షకు పాత్రులే కానీ దేవుడు మనందరి హృదయ పరివర్తనం కోసం ఇంకా మనలను సజీవులుగా ఉంచుతున్నారు మనయొక్క మార్పుకై.

-యేసుప్రభువు తానూ సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు చెప్పిన మొదటి ప్రసంగం "కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించమని ప్రభువు ప్రసంగించారు. మార్కు 1 : 15 .

-ప్రస్తుత సమాజంలో చాల మంది హృదయ పరివర్తన కోసం ఎదురుచూస్తుంటారు. 

-ఒక భార్య తన భర్త వ్యసనాలు మానుకొని జీవించాలనుకొంటుంది. 

-ఒక తల్లి తన బిడ్డ చెడు మార్గం విడిచి పెట్టి మంచి మార్గమును అనుసరించాలని కోరుకుంటుంది. 

-అలాగే మనం పని చేసే చోట మన యాజమానుడు మరలనుకుంటాం. 

-తల్లిదండ్రలు మారాలని బిడ్డలు, బిడ్డలు మారాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. 

-మనం పొరుగువారియొక్క హృదయ పరివర్తనంకోసం ఎదురుచూస్తున్నట్లు దేవుడు మనయొక్క హృదయ పరివర్తనం చెందటానికి ఎదురుచూస్తున్నారు.

-మనయొక్క పనుల్లో మార్పు ఉండాలి, ప్రార్థించే విధానంలో మార్పు ఉండాలి, మాట్లాడే విధానంలో మార్పు ఉండాలి, ఇతరులతో జీవించే విధానంలో అన్ని విషయాలలో హృదయ పరివర్తనం అవసరం. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది.

హృదయ పరివర్తనం చెందాలంటే రాతిగా వున్న హృదయం మాంసపు ముద్దలాగా మారాలి. యెహెఙ్కేలు 36 :26.

-హృదయ పరివర్తనం చెందనిచో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. లూకా 13 : 5 .

-దేవునియొక్క ప్రేమ మనపై దిగిరావాలంటే మనలో హృదయ పరివర్తనం చోటుచేసుకోవాలి. 

-యేసుప్రభువు అంటున్నారు హృదయ పరివర్తనం అవసరం లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తనం అవసరమున్న ఒక్క గొర్రె చాలు అని లూకా 15: 7.

-మనం హృదయ పరివర్తనం చెందుటకు దేవుడు చాల అవకాశాలను ఇస్తుంటారు. మన కన్నా మంచిగా ఉన్నవారు చనిపోయి మనం మాత్రమే బ్రతికి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి నాకు కూడా మరణం వస్తుంది, నేను ఇలా ఉంటె పరలోకంలో ప్రవేశించను అందుకే నా జీవితం మార్చుకోవాలి అనే ఆలోచన చేయాలి. 

-మన యొక్క పాపపు జీవితం నుండి హృదయ పరివర్తన చెందాలి. 

-మనయొక్క అపద్దపు సాక్ష్యములనుండి, మనయొక్క కపట వేష ధారమునుండి, మనయొక్క అన్యాయపు మార్గాలనుండి, మనయొక్క ఇహలోక వంచాలనుండి మనం హృదయ పరివర్తనం చెందాలి.

-యేసుప్రభువు రెండు ఉదాహరణలను తీసుకుంటున్నారు, పిలాతు గలిలీయులను చంపిన విధానము మరియు సిలోయము బురుజు కూలి మరణించినవారు. 

-పిలాతు గలిలీయ దేశస్తులు బలులు అర్పించేటప్పుడు వారిని హత మార్చాడు. విప్లవం లేవదీసే గలిలీయులను పిలాతు నాశనం చేశారు. చనిపోయిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని తెలుపుచున్నారు. 

-సిలోయము బురుజు కూలి 18 మంది చనిపోయారు అలా మరణించిన వారు మిగతా వారికంటే పాపాత్ములు కారు అని ప్రభువు తెలుపుచున్నారు. 

-ఈ రెండు సంఘటనలు అనుకోకుండా హఠాత్తుగా జరిగినవి. కాబట్టి వారు హృదయ పరివర్తనం చెందారో లేరో తెలియదు కానీ ఇది మన జీవితాలకు ఒక హెచ్చరిక.

- మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మనం మారాలి అని ప్రభువు తెలుపుచున్నారు.

- హృదయ పరివర్తనం అందరికి అవసరమే కాబట్టి దేవుడిచ్చిన తపస్సు కాలంలో హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

-రెండవ సంఘటన అత్తి చెట్టును చూపిస్తూ ప్రభువు మన పట్ల ఎంత సహనంగా ఉంటున్నారో తెలియ చేస్తున్నారు. 

మన జీవితాలు ఫలించటానికి దేవుడు ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటారు. దేవుని అనుగ్రహాలు దొరుకుతున్నాయి అయినా ఇంకా ఫలించుటలేదు. 

-అత్తి చెట్టును ఇశ్రాయేలు ప్రజలకు పోలికగా ఉంది. హోషేయ 9 : 10, మీకా 7 : 1, యిర్మీయా 8 : 13, 24 : 1 -10.

- దేవుడు ఆశించిన విధంగా వారు ప్రతి ఫలించలేదు. దేవుడు వారిని ఐగుప్తు దాస్యం నుండి విమోచించి, శత్రువుల నుండి రక్షించి వారి సొంత భూమినిచ్చారు అయినా కానీ వారు విగ్రహారాధనను పాల్పడి ఆశించిన ఫలములు ఇవ్వలేదు. నిర్గమ 32 : 1 -10 .

 -వాస్తవానికి అత్తి చెట్టు సంవత్సరానికి మూడుసార్లు ఫలముల నివ్వాలి కానీ ఇక్కడ మూడు సంవత్సరములు ఎటువంటి ఫలముల నివ్వలేదు. 

-ఆ చెట్టు ఫలించటానికి యజమానుడు అన్ని సకాలంలో ఇచ్చారు అయినా మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కనీసం మూడవ సంవత్సరం ఎటువంటి ఫలితం నివ్వలేదు. 

-అన్ని చేసినప్పుడు అది ఫలము ఇవ్వక పొతే మనం కూడా నిరాశ చెందుతాం. యజమానుడు మాత్రమే సహనంతో మూడు సంవత్సరములు ఎదురు చూశారు. 

-మూడు సంవత్సరాలు ఎదురు చూడటం అనేది ఎందుకంటే ఇజ్రాయెలీలు బానిసత్వంలోనికి వెళ్ళకముందు మూడు సంవత్సరాలు హృదయ పరివర్తనం చెందమన్నారు.

-బాప్తిస్మ యోహాను మూడు సంవత్సరాలు పరిచర్య, అలాగే యేసుప్రభువు యొక్క మూడు సంవత్సరములు బహిరంగ సువార్త వ్యాప్తి   కూడా హృదయ పరివర్తనకోసమే ప్రభువు ఎదురు చూశారు కాబట్టి మనం ఫలించాలి.

- మనం దేవుని యొక్క వాక్యం ఆలకించి అనుసరించి జీవించి ఫలించే వారిలాగా ఉండాలి దాని కోసం దేవుడు ఎదురుచూస్తున్నారు.

-దేవుని వలె ఒకరిపట్ల ఒకరు సహనం కలిగి జీవించి హృదయ పరివర్తనం చెందుదాం. క్రొత్త జీవితం జీవించుదాం.

  Rev. Fr. Bala Yesu OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...