4, జూన్ 2022, శనివారం

పెంతెకోస్తు మహోత్సవము

పెంతెకోస్తు మహోత్సవము

 అ.కా. 2:1-11
1 కొరింతి 12:3-13
 యోహాను 20:19-23

క్రీస్తునాధునియందు ప్రియమైన సహొదరీ సహోదరులారా! ఈనాడు తల్లి తిరుసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. నిజానికి పెంతెకోస్తు పండుగ తల్లి శ్రీసభ పుట్టినరోజు. పెంతెకోస్తు పండుగరోజున పవిత్రాత్మ రాకడను కొనియాడుతున్నాము. నేడు పవిత్రాత్మ అగ్నిజ్వాలలుగా మానవాళిపైకి దిగివచ్చిన ఆనందదాయకమైయిన శుభదినం. పవిత్రాత్మ శ్రీసభను నిర్మించి, ప్రభువు ఒసగిన ప్రేషితకార్యాన్ని గుర్తుచేసి, ఆత్మవరాలతో అందరిని నింపి దైవసేవకు పిలిచిన రోజు. 
పెంతెకోస్తు అనునది యూదుల పండుగ. పెంతెకోస్తు అనగా “50  వ రోజు “అని అర్దం. యూదులు పాస్కా పండుగ అనంతరం ఏడు వారాల తరువాత అంటే  50 రోజుల తరువాత పెంతెకోస్తు పండుగను కొనియాడేవారు. ఇది యూదుల మూడు ప్రధాన పండుగలలో ఒకటి. యూదులు ముఖ్యంగా   కొతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు ఈ పండుగను చేసేవారు. 

పెంతెకోస్తు - ప్రభుని వాగ్ధానము నెరవేరిన రోజు :
పెంతెకోస్తు పండుగను ప్రభువు చేసిన వాగ్ధానము నెరవేరిన రోజు అని కూడా పిలవవచ్చు.  క్రీస్తు ప్రభువు కలవరపడుచున్న  తన శిష్యులకు పవిత్రాత్మను అనుగ్రహిస్తానని వాగ్ధానం చేసియున్నారు. "నేను మిమ్ము అనాధలుగా వదిలి పెట్టను. మీతో ఎల్లపుడు ఉండుటకు మీకు ఒక ఆదరణ కర్తను పంపుదును" (యోహాను 14 : 16 ), "నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లి మీకు ఒక ఆదరణ కర్తను పంపిస్తాను" (యోహాను 16 :7 ) అని ప్రభువు సువిశేషంలో వాగ్ధానమొనర్చినట్లు మనం చూస్తున్నాం. 
ప్రభువు తాను చేసినా ఆ వాగ్ధానము ఈనాటి మొదటి పఠనంలో నెరవేరడం మనం చూస్తున్నాం. పవిత్రాత్మ అగ్నిజ్వాలలు రూపంలో నాలుకల రూపంలో శిష్యులందరిపై క్రుమ్మరింపబడి, ప్రతి ఒక్కరు పవిత్రాత్మ శక్తి ధ్వారా అన్య భాషలలో మాట్లాడసాగిరి (అ. కా. 2 : 2 - 4 ). అక్కరికి వెళ్లిన ప్రతి ఒక్కరు శిష్యులు వారి వారి సొంత భాషలలో మాటలాడుట విని కలవరపడి, ఆశ్చర్యపోయిరి (అ. కా. 2 : 6 - 7 ). ఈ విధముగా ప్రభువు శిష్యులకు తాను వాగ్ధానము చేసిన పవిత్రాత్మను దయచేసారు. 

ఈనాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని రాకడను కొనియాడుతున్న మనమందరము ఆయనను గౌరవించాలి, ప్రార్ధించాలి, మరియు ఆరాధించాలి. మనం ఎన్నడును పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు, ఏ  కార్యము చేయకూడదు.  

ఎందుకు పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు? ఏ కార్యము చేయకూడదు? 
“ఎవ్వడేని మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాటలాడిన క్షమింపబడును గాని, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పలికినవానికి ఈ జీవితమందైనను, రాబోవు జీవితమందైనను క్షమాపణ లభింపదు" (మత్తయి 12 : 31 - 32) అని క్రీస్తుప్రభువు చాలా స్పష్టముగా చెప్పుచున్నారు. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో కూడా 'దయామయుడగు పవిత్రాత్మను అవమానపరచువాని  గతి ఏమవుతుందో, అతడెట్టి నీచమైన శిక్షార్హుడో' అని విచారించడాని మనం చూస్తున్నాం (హెబ్రీ 10: 29). కనుక త్రిత్వంలో ఒకరైనటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరున్ని మనం ఈనాడు గౌరవించాలి, ఆరాధించాలి. 

పవిత్రాత్మను పొందాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయ పరివర్తన చెందాలి :
పవిత్రాత్మను పొందాలంటే ప్రతిఒక్కరు  ముందుగా పాపం నుండి వైదొలగి హృదయ పరివర్తన చెందాలి. "మీరు హృదయపరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు" (అ. కా. 2 : 38 ) అని అపొస్తలుల కార్యంలో మనకు తెలియజేయబడుతుంది. అనగా, పవిత్రాత్మను పొందుటకు హృదయ పరివర్తనం అనేది ఒక ముఖ్యమైన వారధి లేదా ధ్వారం వలె ఉన్నది.

2 . దేవునియందు విధేయత :
పవిత్రాత్మను పొందుటకు రెండవదిగా మనం చేయవలసిన ముఖ్య కార్యము దేవునియందు విధేయత కలిగియుండాలి. "దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మ.........." (అ. కా. 5 : 32 ). ఎవరైతే దేవునియందు విధేయత భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టివారికి ప్రభువు పవిత్రాత్మను అనుగ్రహిస్తారు. 

పవిత్రాత్మను పొందుటవలన కలుగు మేలు ఏమిటి ?

1 . పాపములను క్షమించు అధికారం?
ఈనాటి సువిశేషం ద్వారా  ప్రభువు ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ పొందుట ద్వారా పాపములను క్షమించు అధికారమును ఒసగుచున్నారు. "ప్రభువు వారిమీద శ్వాస ఊది 'పవిత్రాత్మను మీరు పొందుడు.ఎవరి పాపములనైనను మీరు క్షమించి యెడల అవి క్షమించబడును; ఎవరి పాపములనైనను మీరు క్షమింపని యెడల అవి క్షమింపబడవు"(యోహాను 20 : 22 -23 ) అని ప్రభువు పలుకుచు మనకు పాపములను క్షమించు ఒక గొప్ప అధికారమును పవిత్రాత్మద్వారా ఒసగుచున్నారు. 

2 . దేవుని రాజ్యంలోకి ప్రవేశం:
పవిత్రాత్మ మనకు దేవుని రాజ్యంలోకి చేరడానికి ప్రవేశాన్ని కల్పిస్తుంది.  "ఒకడు ఆత్మ వలన, నీటి వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 3 : 5 ) అని పరిసయ్యుడైన నికోదేముతో ప్రభువు పలుకుచున్నారు. పవిత్రాత్మను స్వీకరింపని యెడల మనకు దైవ రాజ్యంలో స్థాన ఉండదని నికోదేము ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. 

3 . దేవుని పుత్రులం:
 పవిత్రాత్మ ద్వారా మనమందరము దేవుని పుత్రులం అవుతాం అని పునీత పౌలు గారుతెలియజేస్తున్నారు. "దేవుని ఆత్మద్వారా నడుపబడువారు దేవుని పుత్రులు.......... దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని 'అబ్బా! తండ్రీ!' అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని  సాక్షమిచ్చును (రోమా 8 : 14 - 16 ).

4 . మన బలహీలతలో సహాయపడును:
మన బలహీనతలో పవిత్రాత్మ మనకు సహాయపడునని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో తెలియజేస్తున్నారు. "బలహీనులమైన మనకు పవిత్రాత్మ సహాయపడును. ఏలయన, మనం ఎట్లు ప్రార్ధింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా ఆత్మయే మన కొరకు దేవుని ప్రార్ధించును (రోమా 8 : 26 - 27 ). 
5 . జీవమును ఒసగును:
పవిత్రాత్మ మనకు జీవమును ఒసగును అని పవిత్ర గ్రంధము తెలియజేయుచున్నది. "క్రీస్తును మరణమునుండి  లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన, మీయందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును ఒసగును" (రోమా 8 : 11 ) అని పౌలు గారు పవిత్రాత్మ వలన కలుగు ఫలమును బోధిస్తున్నారు. 

కనుక క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా!  పెంతెకోస్తు పండుగ అనగా పవిత్రాత్మ రాకడను జరుపుకుంటున్న  ఈ శుభదినాన అందరము ఆ పవిత్రాత్మ  సర్వేశ్వరుడు మన యందు, మన కుటుంబాల యందు నివసిస్తూ, ఎల్లప్పుడూ మనలను ఆ ప్రభుని మార్గంలో నడిపిస్తూ, శాంతి సమాధానంతో మనలను నింపమని ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్ధించుదాం. 

Br. Joseph Kampally 

28, మే 2022, శనివారం

ప్రభువు మోక్షరోహణ పండుగ

 అపో. కా 1:1-11, ఎఫెసీ  1: 17-23, లూకా 24:46-53 

ఈ రోజు తల్లి శ్రీ సభ యేసు క్రీస్తు ప్రభువు యొక్క మోక్ష రోహణ పండుగ  జరుపుకొంటుంది. ప్రభువు పునరుత్థానం  అయిన నలభై రోజులు శిష్యులకు దర్శనమిస్తూ , వారి విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వారిని సువార్త పరిచర్యకు తయారు చేస్తూ, వారు సంపూర్ణంగా  దేవుని యొక్క  అనుభూతిని పొందిన తరువాత శిష్యులకు పరలోకంలో  నివాసం కల్పించుటకు యేసు క్రీస్తు ప్రభువు, తన తండ్రి చెంతకు  తిరిగి వెల్లుచున్నారు. యోహను 14:2-3. 

యేసు ప్రభువు పూర్వం తాను ఉన్న స్థలమునకు వెల్లుచున్నారు. పరలోకం నుండి దిగివచ్చిన  దేవుడు మనకు పరలోక విషయాలను బోధించి మనలను పరలోకం నడిపించుటకు , మనలను పరలోకంకు  చేర్చుటకు మార్గం చూపించారు. 

తాను వచ్చిన స్థలంకే మరలా తిరిగి వెల్లుచున్నారు. ఆయన పరలోకం వెళ్ళిన సరే లొకాంతము వరకు మనతోనే ఉంటారు. మత్తయి 28:20. దివ్య సత్ప్రసాదంద్వారా, దివ్య సంస్కారముల ద్వారా, ప్రార్ధన ద్వారా, వాక్యం చదవటం, ధ్యానించటం ద్వారా దేవుడు మనతోనే ఎప్పడూ ఉంటారు. 

క్రీస్తు ప్రభువు పరలోకంకు వెళ్ళటం ద్వారా దేవుని పనిని ఈ లోకంలో కొనసాగించాలి.  దేవుడు మనలను  భౌతికంగా విడిచి వెళ్లినందుకు ఒక విధంగా మనం బాధ పడాలి. ఇంకొక విధంగా  సంతోషించాలి. ఎందుకంటే త్రీత్వంలో  పవిత్రాత్మ దేవున్ని మనకు తోడుగా ఉండుటకు పంపిస్తానన్నారు. పవిత్రాత్మ ఆదరణకర్తగా , ఓదార్చువాడుగా  మనకు తోడుగా ఉండటానికి పంపిస్తానన్నారు. 

ఈరోజు  మనం చదువుకున్న మొదటి పఠనంలో పునీత లూకా గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థాన సన్నివేశంను  వివరించారు. దానితో పాటు  శిష్యులకు పవిత్రాత్మను ఇస్తానని వాగ్ధానం చేశారు. 

సువార్తికులలో  కేవలం లూకా గారు మాత్రమే ప్రభువు యొక్క  మోక్ష రోహణంను చక్కగా వివరించారు. ప్రభువు యొక్క  శిష్యులు ఆయనను చూడటం అదే చివరి సారి.  వారందరు యేసు ప్రభువును చూస్తుండగా  ప్రభువు వారి కనుచూపు మేర నుండి మేఘాల్లో అదృశ్యమయ్యారు. 

మొదటి పఠనంలో లూకా గారు యేసు  ప్రభువు యొక్క పునరుత్థానం  తరువాత ఏ విధంగా శిష్యులతో వున్నారో, ఎలాగా వారిని బలపరిచారో, ఎంత గొప్పగా వారిని తీర్చి దిద్దరో, అలాగే వారికి  పవిత్రాత్మ దేవుని ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు గురించి తెలిపారు. 

లూకా గారు  ఆయన వ్రాసిన సువార్త మరియు అపోస్తులుల కార్యములు తెయొఫీలూ అనే వ్యక్తికి అంకితం చేశారు. లూకా 1:1.

 తెయొఫీలూ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి కాబట్టియే లూకా గారు ఆయనను ఘనత వహించిన తెయొఫీలు అని సంబోదిస్తున్నాడు. 

 తెయొఫీలూ అనగా దేవుని చేత ప్రేమించబడిన వాడు అని మరియు దేవుని స్నేహితుడని అర్ధం. ఆయన పాలస్తీనాకు బయట జీవించారు. అందుకే లూకా గారు ఆయనకు ప్రభువు  విషయాలు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. 

తెయొఫీలూ అను వ్యక్తి దేవునిలో ఎదగాలని కోరుకున్న వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవున్ని వెంబడించిన వ్యక్తి. 

తెయొఫీలుకు దేవుని పట్ల తృష్ణవుంది. ఆయన్ను తెలుసుకోవాలనే దాహంతో ఉన్నారు. రెండు పుస్తకాలు ఆయన కోసమే లూకా గారు వ్రాసారంటే  ఆయనకు   ఎంత ప్రగాఢమైన కోరిక వుందో మనం  తెలుసుకోవాలి. తేయొఫీలూ క్రీస్తు ప్రభువు యొక్క జీవితంకు ఆకర్షింపబడ్డారు. 

యేసు ప్రభువు పునరుత్థానం  తరువాత శిష్యులకు దర్శన మిస్తూ, శాంతి యుతంగా జీవించుట గురించి బోధించారు. అలాగే దేవుని ముంగిట ఎలా జీవించాలి అనే విషయములను నేర్పించారు. 

దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు శిష్యులలో  ఒక ఆశను కలిగించారు. మనిషి జీవితంలో కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితే జీవితం నిలబడుతుంది అని ప్రభువు నేర్పించారు.  బ్రతుకు మీద ఆశలు కల్పించారు. 

ప్రభువు పరలోకంకు వెళ్ళేంత వరకు సువార్తను ప్రకటించుచునే వున్నారు. తన తండ్రికి సంపూర్ణ, విధేయత చూపుతూ తనకున్నది, మొత్తం కూడా తండ్రిని మహిమ పరుచుటకే అని భావించి ఆయనకు విశ్వాస పాత్రునిగా జీవించారు. 

దేవుడు మనకిచ్చిన వరములన్నీ మంచిగా వినియోగించి పరలోకంకు వెళ్ళాలి. పరలోకంలో ప్రవేశించే వరకు  మన యొక్క వరాలను మనం దేవున్ని మహిమ పరచడానికే వినియోగించాలి. యోహను 9:4, 1 పేతురు 4:10 . 

యేసు ప్రభువు ఈ భూలోకంలో పరిచర్య  చేసి తండ్రి చెంతకు తిరిగి వెళ్ళే సమయం వరకు పవిత్రాత్మ  దేవుని శక్తి తో  పనిచేసి బోధించారు. యేసు ప్రభువు పవిత్రాత్మ మీద ఆధారపడి జీవించారు. తనను తాను సమర్పించుకున్నారు. 

క్రీస్తు ప్రభువే పవిత్రాత్మ మీద ఆధారపడి జీవిస్తే మరి మనమెంతగా ఆదారపడి జీవించాలి. 

యేసు ప్రభువు ఆజ్ఞలిచ్చి  వాటిని పాటించమని  తాను ఎన్నుకొన్నవారికి  తెలియజేశారు. అనేక మందికి  పరలోక విషయములు తెలియజేసినా ప్రభువు యొక్క మనసు , attention శిష్యుల మీదనే  ఉంది. ఎందుకంటే ఆయనకు  సాక్షులుగా  ఉండబోతున్నారు కాబట్టి. ప్రభువు పరిచర్యం మొత్తం కూడా శిష్యుల మీదనే ఆధారపడి ఉంది. శిష్యులె ప్రభువు యొక్క సందేశాన్ని మొదటిసారిగా అందించేవారు. ఆయన పునరుత్థాన వార్తను అదించేవారు శిష్యులే కాబట్టి ప్రభువు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారు విఫలమైతే ప్రభువు యొక్క పని విఫలమైనట్లే. అందుకే శిష్యుల మీద concentrate చేశారు. వారు విజయం పొందితే, ప్రభువు విజయం పొందినట్లే ఆయన యొక్క పని సంపూర్ణంగా పూర్తి అవుతుంది. 

ప్రతి యొక్క క్రైస్తవుడు కూడా ప్రభువు గురించి ప్రకటించాలి. 2 తిమోతి 2:2., మత్తయి 28:19-20 యోహను 20:21. 

అపో 1:3 వ వచనంలో ప్రభువు శిష్యులకు పునరుత్థానం అయ్యాక  కనిపించారని తెలుపుతుంది. నూతన నిబందన గ్రంధం లో, దాదాపు 10 సార్లు ఆయన దర్శనం గురించి వ్రాయబడింది. 

1. మగ్ధలా మరియమ్మకు దర్శనం ఇచ్చారు.  యోహను 20:11- 18

2. స్త్రీలకు దర్శనం ఇచ్చారు, ఖాళీ సమాధి గురించి చెప్పుటకు వెళ్తున్న స్త్రీలకు ప్రభువు దర్శనం ఇచ్చారు. మత్తయి 28: 8-10 

3. పేతురు గారికి దర్శనం ఇచ్చారు. లూకా 24:34, 1 కోరింథీ 15:5 

4. ఎమ్మావు మార్గంలో  శిష్యులకు దర్శనం ఇచ్చారు. లూకా  24:13-42 

5. శిష్యులకు తోమా గారు లేని సమయంలో ఇచ్చిన దర్శనం.  మార్కు 16:14, యోహను 20:19-25. 

6. చేపలు పట్టుటకు వెళ్ళిన శిష్యులకు దర్శనం ఇచ్చారు.  యోహను 20. 

7. ప్రభువు 500 మంది విశ్వాసులకు దర్శనం ఇచ్చారు.  1కోరింథీ 15:6 

8. శిష్యులందరు ఉన్నప్పుడు దర్శనం ఇచ్చారు. మత్తయి 28:16-20 

9. యకొబుకు దర్శనం ఇచ్చారు.  1 కోరింథీ 15:7 

10. ఆయన మోక్ష రోహణమప్పుడు విశ్వాసులకు దర్శనం ఇచ్చారు. ఇవి కాకుండా  ఇంకా   కోన్ని  బహుశ వ్రాయబడలేదు. యోహను 20:30-31. 

మోక్షరోహణ సమయంలో ప్రభువు శిష్యులను, విశ్వాసులను సాక్షులై ఉండమని తెలుపుచున్నారు.  8 వ వచనం. పవిత్రాత్మ పొందిన తరువాత భూదిగంతముల వరకు మనము దేవునికి సాక్షులై ఉండాలని ప్రభువు తెలిపారు. శిష్యులు పవిత్రాత్మ శక్తిని పొందిన తరువాత ఈ లోక ఆశలు ఏమియు వారు కొరలేదు. అధికారం కోసం, పేరు కోసం, ఆశ పడలేదు. కేవలం ఆయనకు సాక్షులై జీవించారు. 

శిష్యులు దేవుని విషయాలను  అందరితో పంచుకున్నారు, ఈ వచనంలో మీరు అంటే కేవలం శిష్యులు మాత్రమే కాదు.  అందరు ప్రతి విశ్వాసి కూడా సాక్షియై జీవించాలి. సువార్తను ప్రకటించాలి. 

సాక్షులై జీవించుట అంటే  దేవునికొరకు జీవించుట, ప్రాణాలు సైతం సమర్పించుట. సాక్షులు క్రీస్తు ప్రభువు ఆలోచనలు కాదు తెలిపేది ,క్రీస్తు ప్రభువునే. 

ఈనాటి రెండవ పఠనంలో దేవుని విశ్వాసులు ప్రభు జ్ఞానమందు  ఎదుగుట కొరకు పౌలుగారు ప్రార్ధిస్తున్నారు. దేవుని యొక్క పవిత్రాత్మను పొందుకొని వారు ప్రభువుని తెలుసుకొనుటకు ప్రార్ధిస్తానని చెబుతున్నారు. 

విశ్వాసులు దైవ జ్ఞానంను  కలిగి జీవించాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడు క్రీస్తు ప్రభువే ఆయన తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. అలాగే విశ్వాసులు, తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలి.  ఆయన సృష్టి కర్త అని గ్రహించి, వారి యొక్క గొప్పతనం ధ్యానించుకొని వారి గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. 

దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు కాబట్టి విశ్వాసులందరు ఆయన జ్ఞానంలో ఎదగాలి. దేవుని జ్ఞానంలో ఏదగాలంటే మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. 

1. విశ్వాసికి విజ్ఞానము వుండాలి. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. 

2. విశ్వాసి దేవునితో సంబంధం కలిగి జీవించాలి.  దేవుడు ఎవరని గ్రహించి ఆయనతో బంధంను ఏర్పరుచుకోవాలి. 

3. విశ్వాసి దేవున యొక్క క్రియలు తెలుసుకొని రోజు రోజుకు ఆయనలో ఎదగాలి . తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి. 

రెండవ భాగంలో యేసు క్రీస్తు ప్రభువును తండ్రి లేవనెత్తిన విధానం గురించి పౌలు గారు తెలుపుచున్నారు. 

ప్రభువు చూపిన విధేయతను బట్టి సమస్తము ఆయన పాదముల క్రింద వుంచారు. తండ్రి కుమారున్నీ అధికంగా దీవించారు. మనందరం ఆయన శరీరంలో భాగస్తులము కాబట్టి ఆయన్ను గురించి ప్రకటించాలి. మన యొక్క క్రియల ద్వార , మాటల ద్వారా ప్రకటించాలి. 

ఈనాటి  సువిశేష పఠనంలో  యేసు ప్రభువు  చివరి సారిగా శిష్యులతో  మాట్లాడారు. ఆయన  పునరుత్థానం  తరువాత  చివరి  రోజు  ప్రభువుకు భూలోకంలో . ఇది మోక్ష రోహణంకు ముందు. ప్రతి ఆదివారం  విశ్వాస ప్రమాణంలో  మనం చెబుతాం. ఆయన పరలోకంకు ఎక్కి తండ్రి కుడి ప్రక్కన  కూర్చొని వున్నారని.  తండ్రి చిత్తాన్ని  సంపూర్ణంగా నెరవేర్చిన తరువాత ఆయన ప్రణాళికా ప్రకారంగా తండ్రి  చెంతకు తిరిగి వెల్లుచున్నారు. 

యేసు ప్రభువు  40 రోజుల తరువాత  మోక్షంకు ఎత్త బడ్డారు. తండ్రి కుమారున్నీ పునరుత్థానం ద్వారా మహిమ పరిచారు. మరొకసారి మోక్ష రోహణం ద్వారా మహిమ పరచి తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైయ్యేలా చేశారు. 

ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు  ప్రభువు యొక్క పట్టాభిషేకం రోజు.  ప్రభువుకు పరలోకంలో సన్మానం జరిగిన రోజు. ఆయన యొక్క త్యాగ క్రియలకు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినందుకు పరలోకంలో గొప్ప సన్మానం జరుగుతుంది. 

క్రీస్తు భూలోకంలో తనకొసగబడిన కర్తవ్యాన్ని జయ ప్రదంగా ముగించుకొని వస్తున్నాడని పరలోక దూతలు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

పిత దేవుడు , పవిత్రాత్మ దేవుడు కుమారున్ని పరలోకంలోకి ఆహ్వానించి తండ్రి  తన కుడి ప్రక్కన సింహాసనములను ఇచ్చారు. ఇది పరలోకంలో ఒక పండుగ దినం, సంతోషకరమైన  రోజు. ప్రభువు పరలోకంలోకి ప్రవేశించారు. ప్రభువు వలె మనమందరం కూడా పరలోకంలో ప్రవేశించాలి. 

ప్రభువు యొక్క మోక్ష రోహణంకు  మరియు క్రీస్తు జయంతికి ఒక దగ్గర సంబంధం వుంది. క్రీస్తు జయంతిలో త్రీత్వంలో వున్న పుత్రుడు, దైవ , మానవ స్వభావంతో ఈ లోకంలో జన్మించారు. 

మోక్ష రోహణం  ద్వారా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు దివ్య శరీరం ద్వారా దైవ స్వభావంతో మరల త్రీత్వంలో కలుస్తున్నారు, పరలోకంలో ప్రవేశిస్తున్నారు. 

ఏ శరీరంను అయితే శిష్యులు పునరుత్థానం తరువాత తాకారో అదే దివ్య  శరీరంతో ప్రభువు పరలోకానికి వెళ్లారు. క్రీస్తు జననం ద్వారా ప్రభువు భూలోకంలోనికి ప్రవేశించి  మానవులకు దగ్గరగా వున్నారు. ఆయన మోక్ష రోహణం ద్వారా మళ్ళీ తండ్రి దగ్గరకు వెళ్లారు. 

యేసు ప్రభువు అదే శరీరంతో పరలోకంకు  వెళ్లారు. యేసు ప్రభువు మోక్ష రోహణం అయ్యే ముందు ప్రపంచమంతట వెళ్ళి బోధించమని  శిష్యులకు చెప్పారు. 

సువార్తను ప్రకటిస్తూ  ప్రభువు యొక్క ప్రేమకు సాక్షులవ్వాలి. ప్రభు ప్రేమను ప్రపంచమంతట చాటి చెప్పాలి. 

ఈ ప్రకటించే బాధ్యత కేవలం గురువులది, కన్యస్త్రీలది మాత్రమే కాదు. అది అందరికి చెందినది. అందరు ప్రకటించాలి. పవిత్రాత్మ దేవుని సహకారంతో  మనందరం ప్రేమ వ్యాప్తికై కృషి చేయాలి. 

ప్రభువు యొక్క ప్రేమతో పాటు మనందరం విశ్వాసం గురించి , దేవుని  దయ గురించి , రక్షణము గురించి, క్షమను గురించి మనం బోధించాలి. 

అనుదినం దైవ అనుభూతిని పొందుతూ మనం దేవుని గురించి ప్రకటించాలి.   

యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 

1. మనం పరలోకంలో ప్రవేశించుటకు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలి. 

2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. 

3. దేవుని యొక్క ప్రేమను పంచి పెట్టాలి. 

4. పాపంను జయించి  హృదయ పరివర్తనం చెంది జీవించాలి. 

5. దేవుని సువార్తను ప్రకటించాలి. 

6. దేవుని యొక్క ఆనందంలో పాలు పంచుకొని జీవించాలి. 

 By Rev . Fr. BalaYesu OCD


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...