1, జులై 2022, శుక్రవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

30, జూన్ 2022, గురువారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం, మత్తయి 9: 1-8

మత్తయి 9: 1-8 

అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి,  ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 

యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అక్కడ ఆ పట్టణములో కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలు అక్కడ ఉన్నవారికి దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. తన రోగంతోనే కాదు తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు. మరియు ఆ విధంగా చూస్తున్నారు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసంను చూసి ఈ మాటలు అంటున్నారు. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు వారు ఆయనను తీసుకొని వచ్చారు. వీరు తమ కోసం కాక వేరె వారి కోసం , వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి మరియు యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి ఆయనను స్వస్థత పరుస్తున్నారు. విశ్వాసం అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సు కూడా విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి. 

ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం.  వారికి దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు. కనుక వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. 

"ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి,  ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి."  ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే  యేసు ప్రభువు తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ధర్మ శాస్త్ర బోధకులకు   మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతారు. 

ప్రార్ధన : ప్రభువా! మా  జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి  మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి.  మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచెయ్యండి. ఆమెన్. 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...