1, జులై 2022, శుక్రవారం

సామాన్య 14వ ఆదివారం

సామాన్య    14వ ఆదివారం

యెషయా  66: 10-14
గలతి 6: 14-18
లూకా  10: 1-12, 17-20

ప్రచారకులను పంపుట - సువార్త వ్యాప్తి - దైవ రాజ్య స్థాపన


ఈనాడు తల్లి తిరుసభ 14వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నది. ఈనాటి పఠనాలను మూడు అంశాల రూపేనా అర్ధం చేసుకుందాం. 
1  ప్రచారకులను పంపుట
2  సువార్త వ్యాప్తి
3 దైవ రాజ్య స్థాపన  
వీటిని విపులంగా ధ్యానిద్దాం.

1.  ప్రచారకులను పంపుట

ఈనాటి సువార్త పఠనంలో డెబ్బది ఇద్దరు శిష్యులను ప్రభువు పంపుచున్నారు (లూకా 10 : 19 ). “70”  సంఖ్య  పవిత్రగ్రంథంలో చిహ్నాపూర్వకమైన సంఖ్య . పూర్వ నిబన్ధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను యెడారికి నడిపించుకుని రావడంలో నాయకత్వం వహిస్తూ ఆ బాధ్యతా భారంతో అలసిసొలసి పోయినప్పుడు యావే ప్రభువు మోషే సహాయకులుగా డెబ్బది మందిని నియమిస్తారు (సంఖ్యా 11 : 16 - 17 ). ఇంకా పవిత్రగ్రంథంలో  ఎన్నో  చోట్ల  డెబ్భై  సంఖ్య  యొక్క  ప్రాముఖ్యతను చూస్తున్నాం. 

ఈరోజు కూడా ప్రభువు డెబ్బది రెండు  మందిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణకునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను (లూకా 10 : 1 ). ఇద్దిరిద్దరిని పంపేది కేవలం ఒకరికి ఒకరు సహాయంగా ఉండడానికి మాత్రమే కాక ఇద్దరి సాక్షానికి చట్టరీత్య ఎంతో విలువ ఉంటుందని కూడా పంపుచున్నారు. ఇంకా ప్రభువు వారితో పంట విస్తారము కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్ధింపుడు అనెను (లూకా 1 : 2 ). అంటే ప్రార్ధన ద్వారా దేవునితో కొనసాగింపు అనుబంధాన్ని మరియు నిర్మిత అవినాభావ సంబంధాన్ని  కలిగి యుండి, పరిచర్యలో వచ్చే కొరతలు ప్రభువుకు తెలియజేసి, ఆ కొరత తీరుటలో మధ్యవర్తిత్వాన్ని వర్తిస్తు, వారి ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని అర్ధము. వీరు తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె పంపబడుచున్నారు.

ఎందుకు ? ఎందుకంటే వీరు సువార్త పరిచర్య  స్వీకరించేటటువంటి  ప్రజలు మరియు వీరు తిరిగేటటువంటి ప్రదేశాలు వీరికి పూర్తిగా అనుకూలంగా మద్దతుగా ఉండకపోవచ్చు.  ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి.  ఎన్నో ఇబ్బందులను అధిగమించాలి. ఎన్నో సమస్యలతో పోరాడాలి.  వీటన్నిటిలో గొర్రెపిల్లవలె ఉండి తోడేళ్లపై విజయాన్ని సాధించాలి. 

ఆ తరుణంలో వీరు పరిపూర్ణ పరిత్యాగాన్ని, పేదరికాన్ని పాటిస్తూ ప్రజల ధాతృత్వంపైన ఆధారపడివుండాలి. జాలెనైనను, జోలెనైనను, పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున ఎవరిని కుశల ప్రశ్నలు అడగరాదు (10 : 14 ) అని ప్రభువు సెలవిస్తున్నారు.  వారికి అప్పగించిన భాధ్యతపై వారి మనసులను కేంద్రికరించి హృదయాలను లగ్నము చేసి శ్రద్ధ వహించి ఈ బాధ్యత నెరవేర్పునకు కృషి చేస్తూ  ముందుకు సాగాలి.  

2.  సువార్త వ్యాప్తి

ఈ డెబ్బది ఇద్దరు పంపబడటానికి ముఖ్య కారణం: సువార్త వ్యాప్తి. సువార్త అనేది స్థంబించినటువంటి ఒక వస్తువుగా ఉండకూడదు. సువార్త అన్ని వేళల అన్ని ప్రదేశాలలో అందరికి వ్యాపించబడాలి. సువార్త వ్యాపించబడాలి అంటే నువ్వు నేను సువార్త సైనికులుగా మారాలి . సువార్త వ్యాపింపచేయాలి అనే తపన కలిగిన వారందరు ఈనాటి రెండవ పఠనంలో (గలతి 6 : 14 - 18 ) చూస్తున్న విధంగా పౌలు గారితో కలిసి “నేను మరి ఇతరములైన దేనియందుగాక మన ప్రభువగు యేసు క్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును.  ఏలయన ఆయన సిలువ మూలముననే నాకు ఈలోకము, నేను ఈలోకమునకు సిలువ వేయబడితిమి” అని చెప్పగలగాలి. ప్రభువే స్వయంగా చెప్తున్నారు "నన్ను అనుసరింపగోరు వాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి 16 : 24 ).

పునీతులు కూడా చెప్తుంటారు శిలువే మా  సంపద అని. అవును ఎప్పుడైతే సిలువ మన సంపద అవుతుందో సిలువ వేయబడిన క్రీస్తు మన సర్వసం అవుతారు. అప్పుడు సువార్త వ్యాప్తిలో ఎదురయ్యే ప్రతి సవాలును, ప్రతి కష్టాన్ని నష్టాన్ని , ప్రతి అడ్డంకిని, ఇబ్బందిని తణుకు బెణుకు లేకుండా ఎంతో ధైర్యంతో ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగగలుగుతాము  . మన బోధనలో క్రీస్తుప్రభుని భాధలు, సిలువ మరణము, పునరుత్తనము, మహిమ ప్రధాన అంశాలు కావలి. మన జీవితాలనుండి సిలువను వేరుచేయలేమను సత్యాన్ని ప్రతిక్షణం గ్రహించాలి మరియు   మన జీవితంలో జీవించాలి.  

క్రీస్తుప్రభుని జీవితంలో మరణం తధ్యం, ఆ మరణం కూడా సిలువ మరణమే. క్రైస్తవులుగా క్రీస్తువలె సిలువను హత్తుకొని జీవించాలి. పేతురుగారివలె క్రీస్తు కావలి, సిలువ వద్దు అనే భావంతో ఉండవచ్చు కానీ  తరువాత పేతురుగారికి అర్ధమైంది సిలువలేకుండా క్రీస్తు లేరు అని.

   పేతురుగారు నేను బోధించేది మీరు సిలువ వేసిన క్రీస్తును అని ధైర్యంతో భోధించగలిగారు. పునీత పౌలు గారు పలుకుతున్నవిధంగా ఎవరైతే క్రీస్తునందు, క్రీస్తుమరణంలో మరణిస్తారో వారు క్రీస్తుతో పాటు పునరుత్తానమౌతారు (రోమా  6 : 4 ).  అతడు నూతన సృష్టి ( గలతి 6 : 15 ). తమ తమ జీవితములలో సిలువ సూత్రమును పాటించువారికి సమాధానము, కనికరము తోడుగా ఉంటుంది (గలతి 6 : 16 ). సువార్త వ్యాప్తికై ఎంతగానో ప్రయాణించి శ్రమించిన పౌలుగారు సైతము యేసుక్రీస్తు సిలువనందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును (గలతి 6 : 14 ) అని నొక్కి వక్కాణించుచున్నారు. సువార్త వ్యాప్తికై శ్రమిస్తున్న ప్రతి ఒక్కరినోట ఇదే మంత్రంగా మారాలి. ఇదే వారి చెవులలో మారు మ్రోగాలి. తద్వారా శిలువే మన సంపద కావలి. 

 దైవ రాజ్య స్థాపన 

పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 14 : 18లో దైవరాజ్యము అంటే ఏమిటో నిర్వచిస్తున్నారు. "దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ ఒసగు నీతి, శాంతి, సమాధానములే". దైవరాజ్య స్థాపన అంటే దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, సంతోషములను మరి ముఖ్యంగా శాంతిని ఇతరులతో  పంచుకొని, ఈలోకమును ఒక పరలోకముగా మార్చడమే. ఈనాటి మొదటి పఠనములో (యెషయా 66 : 10 - 14 ) యావే ప్రభువు యెరూషలేము ప్రజలకు ఒక శుభసందేశాన్ని ఇస్తున్నారు "మీరు యెరూషలేముతో కలిసి ఆనందించి సంతసింపుడు....... మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు పాలిండ్లనుండి స్తన్యము గ్రోలి  సంతృప్తి చెందుదురు". యావే ప్రభువు మరల తన నివాసాన్ని ప్రజల మధ్య అనగా దేవాలయంలో ఏర్పరచుకున్నప్పుడు ఆ  పట్టణము ఆయన శాంతితో నిండిపోతుంది. ఆ ప్రజల మధ్య దేవుని శాంతి సంపదలు ఒక నది వలె ప్రవహిస్తాయి. ప్రజలు దేవుని అనుగ్రహముతో దీవెనలతో హాయిగా కాలం గడుపుతూ అభివృద్ధి చెందుతారు. యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం యేసు ఈ లోకంలో శాంతి నెలకొల్పడానికి వచ్చారు. అందుకే సువార్త పఠనంలో ప్రభువు తన శిష్యులను శాంతిని అందించడానికి పంపుతున్నారు. "మీరు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలుకుడు" ( లూకా 10 : 5 ). 

సమాధానమును  దేవుడు ఒక్కడే  ఇవ్వగలడు. ఇది దేవుని అనుగ్రహవరం. ఈలోక మానవులు ఇవ్వగలిగే శాంతి సమాధానములు క్షణికమే. దేవుడు అనుగ్రహించే శాంతి శాశ్వతం. ఈ శాంతిని పొందాలంటే దానిని స్వీకరించాలి. దానిని స్వీకరించాలంటే దేవుడు పంపిన వారిని ఆహ్వానించాలి. వారిని ఆహ్వానించడం అంటే స్వయంగా దేవుని ఆహ్వానించడమే. అప్పుడు దేవుడే స్వయంగా సమాధానమును మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ మనం దేవుడు పంపిన వారిని ఆహ్వానింపనియెడల దేవుని తిరస్కరించినట్లే. అందుకే ప్రభువు తన శిష్యులతో "మీరు ప్రవేశించిన పట్టణప్రజలు మిమ్ము ఆహ్వానింపనియెడల ఆ పట్టన వీధులలోకి వెళ్లి మీ కాళ్లకు అంటిన దుమ్మును వారికి విరుద్ధంగా అచ్చటనే దులిపివేయుడు. ఇంకా వారికి దేవుని రాజ్యము సమీపించినదని గ్రహించమని గుర్తుచేయుడు అని చెప్పెను" ( లూకా 10 : 10 - 12 ).  

దేవుడు పంపిన వారిని ఆహ్వానింపకపోవడం తేటతెల్లముగా దేవుని పరిత్యజించడం మరియు దేవుని తీర్పును సూచిస్తుంది.  ఈ డెబ్బది ఇద్దరు ప్రభువు వారికి అప్పగించిన పనిని పూర్తిచేసిన తర్వాత వారి అసాధారణ శక్తులను, అనుగ్రహాలను దేవుని సువార్త సైనికులుగా ఉండి వాటిని ఉపయోగించమని క్రీస్తు వారికి అధికారాన్ని ఇస్తున్నారు. 

 దేవుని రాజ్యాన్ని  నా అనుదిన ఆలోచనలు, మాటలు మరియు కార్యాలద్వారా స్థాపిస్తున్నానా? అని  నువ్వు  నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి.  దేవుని రాజ్యస్థాపన కేవలం గురువుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. ఆ రాజ్య స్థాపనకు చిహ్నం శాంతి. మన వ్యక్తిగత కుటుంబ మరియు సంఘ జీవితంలో దేవుని శాంతిని అనుభవించ గలుగుతున్నామా? శాంతి అనేది మన నిజ జీవితంలో ఒక పరిస్థితి. ఎవరు సృజిస్తారు ఈ పరిస్థితిని అంటే మానవులమైన మనము. దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించారు. కానీ ఆ శాంతిని మనలో నెలకొల్పుకొని జీవించడమే మానవులమైన మన బాధ్యత.  ఈ శాంతి అనే  పరిస్థితిని మన వ్యక్తిగత , కుటుంబ, మరియు సంఘ జీవితంలో సృజించుకుందాం. క్రీస్తు సైనికులుగా ఉండి సువార్తను వ్యాపింపచేద్దాం. దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. శాంతియుతంగా జీవించుదాం. ఆమెన్.

Br. Sunil Inturi OCD

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...