12, నవంబర్ 2022, శనివారం

33వ సామాన్య ఆదివారం

 

33 సామాన్య ఆదివారం

మలాకీ 4: 1-2

 2 తెస్స 3: 7-12

 లూకా 21: 5-19


నీతిగల జీవితం మరియు దేవుని రాజ్యానికై కృషి

 

మొదటి పఠనం:

పండితుల అంచనాల ప్రకారం మలాకీ గ్రంథం క్రీ. పూ. 460 సంవత్సరంలో యిస్రాయేలు ప్రజలు బాబులోనియా ప్రజలు యెరూషలేము దగ్గరలో, చేరువలో ఉన్నప్పుడు లేదా బాబులోనియా ప్రవాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వ్రాసారు అని చెప్పవచ్చు. యూదా ప్రజలు క్రీ. పూ. 460 - 450 సంవత్సరంలో బాబులోనియా ప్రవాసం నుండి యెరూషలేము తిరిగివచ్చి, నేలమట్టం చేసిన వారి దేవాలయాన్ని హగ్గయి ప్రవక్త మరియు జెకర్యా ప్రవక్తల సహాయంతో పునఃనిర్మిస్తారు. యూదా ప్రజలు తిరిగి వచ్చిన సమయానికి వారికి రాజులు, మరియు నాయకులు లేరు, కానీ ప్రధాన అర్చకులు లేదా యాజకుల పాలన ఉండేది. యూదా ప్రజలు యెరూషలేము తిరిగి వచ్చిన సమయానికి, వారికి ఆస్తిపాస్తులు లేవు, సంపదలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఎందుకంటే బాబులోనియా రాజు అంతా నాశనం చేశాడు. యూదా ప్రజలు దేవాలయాన్ని నిర్మించినా కూడా పూర్వ వైభవాన్ని వారు పొందుకోలేదు. దేవుడు వారికి ఎలాంటి మేలులు చేయలేదు. ఎందుకంటే వారు బాబులోనియా ప్రవాసంలో ఉన్నప్పుడు వారందరు కూడా మలినమయ్యారు, అపవిత్రమయ్యారు, దైవత్వాన్ని కోల్పోయారు.

ఏవిధంగా అంటే అన్యులతో వివాహమాడి అపవిత్రులయ్యారు. ఎదోమీయులను, అరబ్బీయులను వివాహమాడి పవిత్రతను కోల్పోయారు. అందువలన, దేవుడు వారికి మేలులు చేయడం లేదు. కారణము చేత విశ్వాసము కోల్పోయిన యాజకులు మరియు ప్రజలు ఇక మేమెందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుడిని ఎందుకు ఆరాధించాలి, మా బాగోగులు మేము చూసుకుంటాము అని వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మలాకీ ప్రవక్త దేవుని వార్తగా వారితో విధంగా పలుకుతున్నారు.

గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు. కానీ దేవుని యెడల భయభక్తులు చూపువారిపై దేవుని రక్షణము ఉదయించే సూర్యునివలే ఉండును, ఆరోగ్యము కలుగును, మరియు పంటలు కూడా బాగా పండును. అని నాటి మొదటి పఠనంలో చూస్తున్నాం. అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనము జీవము బడయుదుమని , పాటించకపోతే నాశనం అవుతామని వచనాలలో చూస్తాం. (ద్వితీ 4: 1, 5: 32-33, సిరా 35: 16-18, 21-22).

అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటించడమే నరుని ప్రధాన ధర్మం (ఉప 12: 13-14). మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసినది,

Ø నీతిగల జీవితం లేదా ప్రభువుకు ప్రియమైన జీవితాన్ని జీవిస్తే ఆశీర్వదించబడతాము.

Ø అపవిత్ర జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని జీవిస్తే నాశనానికి గురి అవుతామని అర్ధమవుతుంది.

 

సువిశేష పఠనం:

కొందరు ప్రజలు మాత్రం దేవాలయపు రాళ్ళ అందాన్ని చూచి, దేవునికి అర్పించబడిన వస్తువుల అందాన్ని చూసి మిగుల సంతసించుచున్నారు. దేవాలయపు అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారే కానీ అందులో ఉన్న దేవుడిని మాత్రం నిరాకరిస్తున్నారు. వారి హృదయాలు మాత్రం కపటముతో, క్రోధముతో నిండియున్నవి. మనం కూడా మనకు ఉన్న సంపదలను చూసి మురిసి పోతుంటాం. అందమైన కార్లు, ఫోన్, పెద్ద పెద్ద భవనాలే మనకు సర్వస్వము అనుకుంటుంటాం. నిజమైన విలువైన సంపద, శాశ్వత సంపద క్రీస్తు ప్రభువే అని మర్చిపోతుంటాం

ఈనాడు మనమందరం విలువైన సంపదను గుర్తించాలి, సంపద ద్వారా కలుగు ఫలములను ఆస్వాదించాలి. లోకంలో మంచి వారును, చెడువారును ఇద్దరూ ఉంటారు. ఉదా: పొలములో గోధుమలు చల్లినప్పుడు గోధుమలతో పాటు, పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. కానీ రెండు పెరిగిన తరువాత కోతకాలపు రోజున గోధుమలను గిడ్డంగులలో వేసి, పిచ్చి మొక్కలను కాల్చివేసిన విధంగా ప్రభువు రాకడ కూడా అదేవిధంగా ఉండును. తీర్పు దినమున విధంగానే పుణ్యాత్ములను, పాపాత్ములను వేరు చేస్తారు. సువిశేష పఠనంలో చూస్తున్నాం అసహజమైనటువంటి విషయాలు. గొడవలు, హింసలు మరియు క్రూరమైన జీవితం కుటుంబంలో సంఘంలో ప్రతిచోటా, విధమైన జీవితం సువిశేష పఠనం తెలియజేస్తున్నది. కుటుంబాన్ని, సంఘాన్ని విభజించువారు మన మధ్యలోనే ఉంటారు, వస్తుంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని పలుకుతున్నారు.

ఒకవేళ అలాంటి వారి మాటలు విని, మీరు మీ సమయాన్ని విశ్వాసాన్ని కోల్పోతే దేవుని రక్షణ మీరు పొందుకోలేరు, అంతే కాకుండా దేవుని పట్ల సహనాన్ని కోల్పోతే ప్రాణాలు కోల్పోతారు అని సువిశేషం మనకు తెలియజేస్తుంది.

సువిశేషం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:

Ø లోకపు బాహ్యపరమైన అందాలకు, విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా హృదయమనే ఆలయంలో నివసించే దేవుడికి, దేవుని కుమారునికి మనమందరం ప్రాధాన్యత ఇవ్వాలి.

Ø మరియు కుటుంబము, సంఘమును విభజించే వారు మనతోనే ఉంటారు, కాబట్టి వివేకముతో, సహనము కలిగి జీవించమని సువిశేషం కోరుతున్నది.

రెండవ పఠనము :

పునీత పౌలు గారు తెస్సలొనిక ప్రజలకు సోమరి పోతులుగా జీవించకుండా, ప్రభువు రాజ్యం కొరకు కృషిచేయమని, కష్టపడమని తెలియజేస్తున్నారు. ఏవిధంగా అంటే పౌలు గారి జీవితమునే ఉదాహరణగా చూపిస్తున్నారు. పౌలు గారు చేసిన కృషి, త్యాగముల వలనే క్రైస్తవ జీవితం లేదా క్రీస్తు ప్రభుని చాలా వరకు చాటి చెప్పారు.

అలా దేవుడి రాజ్యాన్ని వ్యాపింపచేసిన వారికి, ఆరాజ్యం కోసం కృషి చేసే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో చోటు దక్కుతుందని తెలుపుచున్నారు.

పని చేయని వాడు భోజనానికి అనర్హుడు” అంటే పరలోక భోజనం అని అర్ధం.

కాబట్టి రెండవ పఠనం ద్వారా మనం గ్రహించ వలసిన విషయం ఏమిటంటే సోమరి పోతులుగా ఉండకుండా దేవుని రాజ్యానికి కృషి చేయమని తెలుపుచున్నది.

మనలో కూడా మంచిగా, నీతిగా జీవించే వారు ఉంటారు. అలాంటివారు విశ్వాసాన్ని సహనాన్ని కోల్పోవద్దు. మనలోకూడా సోమరిపోతులవలె, నిర్లక్ష్యపు జీవితాన్ని జీవించేవారు ఉంటారు. అలాంటివారు మారుమనస్సు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క శిక్షకు గురికాకూడదు.

చివరిగా మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినికూడా నీతిగల జీవితాన్ని జీవించమని మరియు దేవుని పట్ల సహనంతో, భయభక్తులు చూపుతూ జీవించమని, దేవుని రాజ్యానికై కృషి చేయమని కోరుకుంటుంది.

 

బ్రదర్ . సుభాష్ OCD

 

5, నవంబర్ 2022, శనివారం

32వ సామాన్య ఆదివారం

 32వ సామాన్య ఆదివారం

2 మక్కబీ 7:1,2 9-14

2 తెస్స 2:16-3:5

లూకా 20:27-36

ఈనాటి దివ్య పఠనాలు మరణించిన తరువాత రాబోయే పునరుత్థానం గురించి బోధిస్తున్నాయి. దైవర్చన సంవత్సరంలో చివరి రోజులలోకి ప్రవేశిస్తున్న మనకు తల్లి శ్రీ సభ మన యొక్క జీవిత చివరి రోజుల గురించి బోధిస్తుంది. నవంబర్ రెండవ తారీకున మనం సకల ఆత్మల సంస్మరణ దినమును కొనియాడం. మన యొక్క మరణం తరువాత మరలా పునరుత్థానం ఉందని మనం నిరీక్షిస్తున్నాం. ఈనాటి దివ్య పఠనాలు కూడా తెలిపే ప్రధాన అంశం ఏమిటంటే మనకు మరణం తరువాత పరలోక జీవితం ఉందని, మనం కూడా క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా అంతిమ దినమున ఆత్మ శరీరములతో లేపబడతాం అని తెలుపుచున్నవి. మరణం తరువాత జీవితం అనేది క్రైస్తవ విశ్వాసానికి మూలం. క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా మనందరం కూడా పునరుత్థానం అవుతామని తెలియజేస్తుంది.

ఈనాటి మొదటి పఠనము లో యూదా  కుటుంబంలో ఉన్న ఒక తల్లి ఏడుగురు సోదరులకు దేవుని పట్ల తమకు గల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. యూదా ప్రజలు మోషే ప్రవక్త ఇచ్చిన ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించేవారు. చరిత్ర ప్రకారం చూసినట్లయితే సిరియా రాజు పాలస్తీనా దేశంను క్రూరంగా పరిపాలిస్తున్నా కాలం అది. సిరియా రాజు యూదులను తమ యొక్క మత ఆచారాలను సంస్కృతులను పాటించమని వారిని బలవంతం చేశారు. అలాంటి క్లిష్ట సందర్భంలో కొంతమంది యూదులు మోషే ధర్మ శాస్త్రంను విడిచిపెట్టి సిరియా రాజు ప్రకారంగా నడుచుకున్నారు కానీ కొంతమంది యూదులు మరణమునకు,హింసలకు భయపడకుండా మోషే ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించారు. ఎవరైతే రాజు యొక్క ఆజ్ఞను దిక్కరించారో వారు క్రూరంగా హింసించబడ్డారు. అంతియోకు ఎఫీఫనే అనే రాజు ఆయన ఆజ్ఞను ఎదురించిన యూదులను శిక్షకు గురి చేశాడు కొంతమంది యూదులు మాత్రము తమ విశ్వాసంలో పటిష్టంగా ఉన్నారు. వారిలోని వారే ఈనాడు మనం చదువుతున్న తల్లి ఏడుగురు కుమారులు. వారి యొక్క విశ్వాస జీవితం గొప్పది ఎందుకంటే మరణమునకు భయపడుటలేదు మరణం తరువాత మరలా పునరుత్థానం ఉంటుందని విశ్వసించారు. ఈ కుటుంబంలో ఉన్న తల్లిని ఒక విధంగా మెచ్చుకోవాలి ఎందుకంటే తన బిడ్డలకు యావే దేవిని యందు గొప్ప విశ్వాసం ఉంచుట నేర్పించింది. ధర్మశాస్త్రం ప్రకారం యూదులు పంది మాంసం భుజంపకూడదు కాబట్టి అంతియోకు ఎఫిఫనే అనే రాజు వారిని పంది మాంసం భుజించుటకు బలవంతం చేశారు అయినప్పటికీ వీరు ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసంను విడిచిపెట్టలేదు.

వారికి దేవునియందు స్థిరమైన విశ్వాసము ఉన్నది అందుకే వారు దేవునికి విధేయత చూపుతూ సాక్షులై జీవించారు.

వీరు విశ్వాసం కోసం ప్రాణాలు త్యాగం చేశారు పవిత్ర గ్రంథంలో చాలామంది వ్యక్తులు విశ్వాసం కోసం ప్రాణ త్యాగం చేశారు. దానియేలు యొక్క స్నేహితులను బంగారపు విగ్రహమును ఆరాధించమని బలవంతం చేసినప్పటికీ వారు రాజు బంగారపు విగ్రహానికి నమస్కరించలేదు, ఆరాధించలేదు. దానియేలు 3:6.

షడ్రకు, మేషకు, అబెద్నేగులు యావే దేవుని మాత్రమే ఆరాధిస్తాం వేరే వాళ్లను ఆరాధించమని గట్టిగా చెప్పారు. దానియేలు 3:18. స్తెపాను గారు విశ్వాసం కొరకే మరణించారు- అఫో 7:58.

శ్రీ సభ తొలి మూడు శతాబ్దాలలో అనేకమంది విశ్వాసులు తమకు దేవుని యెడల ఉన్న విశ్వాసం వలన మరణించటానికి సైతం సిద్ధంగా ఉన్నారు. అనేక సందర్భాలలో మనందరం కూడా కాంప్రమైజ్ అయిపోతుంటాం కానీ ఇక్కడ ఈ తల్లి కుమారుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ కావడం లేదు ఎంతో గొప్ప విశ్వాస జీవితం వీరిది.

 ఈ తల్లి కుమారుల యొక్క సాక్షి పూరితమైన జీవితం మనందరికీ ఆదర్శం కావాలి ఎందుకంటే దేవుడిచ్చిన జీవితం దేవునికి సమర్పించుటకు సిద్ధంగా ఉన్నారు. యావే దేవుడి ఏకైక రాజు అని విశ్వసించారు మిగతా అన్య రాజులను తమ రాజులుగా అంగీకరించుటకు సిద్ధంగా లేరు. వారి విశ్వాసం బెదరని విశ్వాసం చెరగని విశ్వాసం ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మకం కోల్పోని విశ్వాసం వారిది. మన జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు చాలా సందర్భాలలో దేవునియందు విశ్వాసం కోల్పోతాం కానీ వీరు దేవిని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఈ తల్లి కుమారులకు పునరుద్ధానం యందు నమ్మకం ఉంది అందుకే మరణం కు భయపడలేదు ఈ ఏడుగురి తల్లి చాలా గొప్పది కళ్ళముందే కుమారులు మరణించినప్పటికీ దేవుని యెడల విశ్వాసం కోల్పోలేదు, మరణంతో అంతా కాదని దాని తరువాత మరొక జీవితము ఉందని వారు గ్రహించారు. మరణించిన తరువాత వారు మరలా సజీవులై లేస్తారని వారు గట్టిగా నమ్మారు

ఎన్నో హింసలు భరించటానికి వారు సిద్ధంగా ఉన్నారంటే వారికి దేవుని యెడల ఉన్న నమ్మకం అలాంటిది. తమ దేవుడు వారిని ఆపదల నుండి ఆదుకుంటారని అపార నమ్మకం. యావే దేవుడిని ఈ కుటుంబం అమితంగా ప్రేమించింది కాబట్టే యావే దేవుని కొరకు ప్రాణాలు సమర్పించుటకు సిద్ధంగా ఉన్నారు.

తాత్కాలికమైన ఇహలోక జీవితం కంటే శాశ్వతమైన పరలోక జీవితం మేలైనది అని విశ్వసించారు. ఈ విశ్వాసం వలన వారు హింసలు ఎంతో ప్రేమతో ధైర్యంగా భరించారు.

ఈనాటి రెండవ పఠనములో   పౌలు గారు తెస్సలోనికా  ప్రజల కొరకు చేసిన ప్రార్థనను వింటున్నాం. పౌలు గారు తెస్సలోనికా ప్రజలు ఎల్లప్పుడూ దేవుని యొక్క పని చేయుటకు సిద్ధంగా ఉండమని, సత్క్రియలను చేయమని తెలుపుచున్నారు.

ఈనాటి సువిశేష పఠనము లో  యేసు ప్రభువు పునరుత్థాన జీవితం గురించి తెలుపుతున్నారు.

నేటి సువిశేష పఠనము లో సద్దుకయ్యులు  ఏసుప్రభువును ఒక కష్టతరమైన ప్రశ్న అడుగుచున్నారు అది ఏమిటంటే ఏడుగురు సహోదరులు ఒక స్త్రీని వివాహమాడారు కానీ వారిలో ఏ ఒక్కరికి సంతానం కలగలేదు పునరుత్థాన మందు ఆమె ఎవరి భార్య అగును  అని

సద్దుకయ్యులు ఈ ప్రశ్న ఎందుకు అడిగారంటే వారు మృతుల యొక్క పునరుత్థానమును విశ్వసింపరు ఏసుప్రభువును హేళన చేయుట కొరకు, అందుకే ప్రభువు వారు విశ్వసించే తోర (మొదటి ఐదు పుస్తకాలు) నుండి సమాధానం ఇచ్చారు.

ద్వితీయోపదేశకాండము 25: 5 వచనం ప్రకారం సోదరులు కలిసి నివసించుచుండగా ఒకడు సంతానం లేక చనిపోయినచో అతని భార్య కుటుంబంకు చెందిన పురుషుని వివాహమాడరాదు ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవుని న్యాయప్రకారంగా పెండ్లి చేసుకుని తన సోదరునికి మారుగా భర్త ధర్మము నెరవేర్చవలెను. యావే దేవుడు మన దేవుడు సజీవులకు దేవుడే కానీ మృతులకు కాదు. నిర్గమ 3:6 యావే దేవుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులదేవుడను అని అంటున్నారు అంటే ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో సజీవులగా జీవిస్తున్నారు ఆయన దృష్టికి అందరూ సజీవులే. ఏసుప్రభు మరణం తరువాత రాబోయే జీవితం ఇప్పుడు ఉన్న భూలోక జీవితం లాగా ఉండదని అది క్రొత్త జీవితం అని తెలుపుచున్నారు. పునరుత్థాన జీవితంలో వివాహ బంధాలు లేవు. అది శాశ్వతమైన జీవితం అక్కడ అందరూ దేవదూతల వలె దేవుని బిడ్డల వలే జీవిస్తారు. మన యొక్క మరణం తరువాత జీవితం మరొక లాగా ఉంటుంది సద్దుకయ్యులు మృతుల యొక్క పునరుద్ధానం ఆత్మలను అదేవిధంగా దూతలను విశ్వసింపరు అందుకనే మరణం తరువాత జీవితం కూడా ఈ భూలోకంలో లాకే ఉంటుందని భావించారు.  సద్దుకయ్యులు  వ్రాతపూర్వకంగా (written) ఉన్నది విశ్వసించేవారు నోటి(vocal) ద్వారా చెప్పబడింది విశ్వసింపరు వారు కొద్ది మంది అయినప్పటికీ వారు పాలనాధికారులు, వారు రోమా చక్రవర్తులకు సహకరించి జీవించేవారు, అధికారం కోసం డబ్బు కోసం ఆశపడేవారు.

వితంతువును ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి వివాహమాడుటకు కారణం ఏమిటంటే ఆమెకు సమాజంలో రక్షణ కల్పించుట కొరకు, ఆమె హక్కులు కాపాడుట కొరకు, ఆమెకు తోడుగా నిలుచుట కొరకు (ద్వితీ 25:5-10).

మన జీవితం ఈ లోకంలో ముగిసిన తరువాత పరలోకంలో అది కొనసాగింపుగా ఉండదు. అది ఒక కొత్త జీవితం ఆ క్రొత్త జీవితం అందరిదీ కూడా కాదు ఎవరైతే దేవుని చేత తీర్పునొంది పరలోకంలో ప్రవేశిస్తారో వారికి జీవితం క్రొత్తగా ఉంటుంది. మన దేవుడు సజీవులకు దేవుడు, ఎందుకంటే మోషే కన్నా 600 సంవత్సరాలు ముందు చనిపోయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను సజీవుడగు దేవుడను అని తెలిపారు, అంటే వారు దేవునికి దగ్గరగా సజీవులుగా ఉన్నారు. దేవునికి అందరూ సజీవులే - లూకా 20:38. సద్దుకయ్యులకు ప్రభువు తెలిపే సత్యం ఏమిటంటే మృతులకు పునరుద్దానం కలదని తెలుపుచున్నారు. పునరుద్ధానం తరువాత ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు అని తెలిపారు (లూకా 20:34-35).

దేవుని దృష్టిలో అందరూ సజీవులే అని తెలిపారు. అందరూ దేవుని బిడ్డలుగా పరిగణింపబడతారు. మరణం తరువాత పరలోక జీవితం కొత్తగా ఉంటుంది.

 BY. FR. BALAYESU OCD

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...