12, నవంబర్ 2022, శనివారం

33వ సామాన్య ఆదివారం

 

33 సామాన్య ఆదివారం

మలాకీ 4: 1-2

 2 తెస్స 3: 7-12

 లూకా 21: 5-19


నీతిగల జీవితం మరియు దేవుని రాజ్యానికై కృషి

 

మొదటి పఠనం:

పండితుల అంచనాల ప్రకారం మలాకీ గ్రంథం క్రీ. పూ. 460 సంవత్సరంలో యిస్రాయేలు ప్రజలు బాబులోనియా ప్రజలు యెరూషలేము దగ్గరలో, చేరువలో ఉన్నప్పుడు లేదా బాబులోనియా ప్రవాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వ్రాసారు అని చెప్పవచ్చు. యూదా ప్రజలు క్రీ. పూ. 460 - 450 సంవత్సరంలో బాబులోనియా ప్రవాసం నుండి యెరూషలేము తిరిగివచ్చి, నేలమట్టం చేసిన వారి దేవాలయాన్ని హగ్గయి ప్రవక్త మరియు జెకర్యా ప్రవక్తల సహాయంతో పునఃనిర్మిస్తారు. యూదా ప్రజలు తిరిగి వచ్చిన సమయానికి వారికి రాజులు, మరియు నాయకులు లేరు, కానీ ప్రధాన అర్చకులు లేదా యాజకుల పాలన ఉండేది. యూదా ప్రజలు యెరూషలేము తిరిగి వచ్చిన సమయానికి, వారికి ఆస్తిపాస్తులు లేవు, సంపదలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఎందుకంటే బాబులోనియా రాజు అంతా నాశనం చేశాడు. యూదా ప్రజలు దేవాలయాన్ని నిర్మించినా కూడా పూర్వ వైభవాన్ని వారు పొందుకోలేదు. దేవుడు వారికి ఎలాంటి మేలులు చేయలేదు. ఎందుకంటే వారు బాబులోనియా ప్రవాసంలో ఉన్నప్పుడు వారందరు కూడా మలినమయ్యారు, అపవిత్రమయ్యారు, దైవత్వాన్ని కోల్పోయారు.

ఏవిధంగా అంటే అన్యులతో వివాహమాడి అపవిత్రులయ్యారు. ఎదోమీయులను, అరబ్బీయులను వివాహమాడి పవిత్రతను కోల్పోయారు. అందువలన, దేవుడు వారికి మేలులు చేయడం లేదు. కారణము చేత విశ్వాసము కోల్పోయిన యాజకులు మరియు ప్రజలు ఇక మేమెందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుడిని ఎందుకు ఆరాధించాలి, మా బాగోగులు మేము చూసుకుంటాము అని వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మలాకీ ప్రవక్త దేవుని వార్తగా వారితో విధంగా పలుకుతున్నారు.

గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు. కానీ దేవుని యెడల భయభక్తులు చూపువారిపై దేవుని రక్షణము ఉదయించే సూర్యునివలే ఉండును, ఆరోగ్యము కలుగును, మరియు పంటలు కూడా బాగా పండును. అని నాటి మొదటి పఠనంలో చూస్తున్నాం. అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనము జీవము బడయుదుమని , పాటించకపోతే నాశనం అవుతామని వచనాలలో చూస్తాం. (ద్వితీ 4: 1, 5: 32-33, సిరా 35: 16-18, 21-22).

అదేవిదంగ దేవుని ఆజ్ఞలను పాటించడమే నరుని ప్రధాన ధర్మం (ఉప 12: 13-14). మొదటి పఠనం ద్వారా మనం గ్రహించవలసినది,

Ø నీతిగల జీవితం లేదా ప్రభువుకు ప్రియమైన జీవితాన్ని జీవిస్తే ఆశీర్వదించబడతాము.

Ø అపవిత్ర జీవితాన్ని, అబద్ధపు జీవితాన్ని జీవిస్తే నాశనానికి గురి అవుతామని అర్ధమవుతుంది.

 

సువిశేష పఠనం:

కొందరు ప్రజలు మాత్రం దేవాలయపు రాళ్ళ అందాన్ని చూచి, దేవునికి అర్పించబడిన వస్తువుల అందాన్ని చూసి మిగుల సంతసించుచున్నారు. దేవాలయపు అందానికి ప్రాముఖ్యతనిస్తున్నారే కానీ అందులో ఉన్న దేవుడిని మాత్రం నిరాకరిస్తున్నారు. వారి హృదయాలు మాత్రం కపటముతో, క్రోధముతో నిండియున్నవి. మనం కూడా మనకు ఉన్న సంపదలను చూసి మురిసి పోతుంటాం. అందమైన కార్లు, ఫోన్, పెద్ద పెద్ద భవనాలే మనకు సర్వస్వము అనుకుంటుంటాం. నిజమైన విలువైన సంపద, శాశ్వత సంపద క్రీస్తు ప్రభువే అని మర్చిపోతుంటాం

ఈనాడు మనమందరం విలువైన సంపదను గుర్తించాలి, సంపద ద్వారా కలుగు ఫలములను ఆస్వాదించాలి. లోకంలో మంచి వారును, చెడువారును ఇద్దరూ ఉంటారు. ఉదా: పొలములో గోధుమలు చల్లినప్పుడు గోధుమలతో పాటు, పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. కానీ రెండు పెరిగిన తరువాత కోతకాలపు రోజున గోధుమలను గిడ్డంగులలో వేసి, పిచ్చి మొక్కలను కాల్చివేసిన విధంగా ప్రభువు రాకడ కూడా అదేవిధంగా ఉండును. తీర్పు దినమున విధంగానే పుణ్యాత్ములను, పాపాత్ములను వేరు చేస్తారు. సువిశేష పఠనంలో చూస్తున్నాం అసహజమైనటువంటి విషయాలు. గొడవలు, హింసలు మరియు క్రూరమైన జీవితం కుటుంబంలో సంఘంలో ప్రతిచోటా, విధమైన జీవితం సువిశేష పఠనం తెలియజేస్తున్నది. కుటుంబాన్ని, సంఘాన్ని విభజించువారు మన మధ్యలోనే ఉంటారు, వస్తుంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని పలుకుతున్నారు.

ఒకవేళ అలాంటి వారి మాటలు విని, మీరు మీ సమయాన్ని విశ్వాసాన్ని కోల్పోతే దేవుని రక్షణ మీరు పొందుకోలేరు, అంతే కాకుండా దేవుని పట్ల సహనాన్ని కోల్పోతే ప్రాణాలు కోల్పోతారు అని సువిశేషం మనకు తెలియజేస్తుంది.

సువిశేషం ద్వారా మనం గ్రహించవలసిన విషయాలు:

Ø లోకపు బాహ్యపరమైన అందాలకు, విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా హృదయమనే ఆలయంలో నివసించే దేవుడికి, దేవుని కుమారునికి మనమందరం ప్రాధాన్యత ఇవ్వాలి.

Ø మరియు కుటుంబము, సంఘమును విభజించే వారు మనతోనే ఉంటారు, కాబట్టి వివేకముతో, సహనము కలిగి జీవించమని సువిశేషం కోరుతున్నది.

రెండవ పఠనము :

పునీత పౌలు గారు తెస్సలొనిక ప్రజలకు సోమరి పోతులుగా జీవించకుండా, ప్రభువు రాజ్యం కొరకు కృషిచేయమని, కష్టపడమని తెలియజేస్తున్నారు. ఏవిధంగా అంటే పౌలు గారి జీవితమునే ఉదాహరణగా చూపిస్తున్నారు. పౌలు గారు చేసిన కృషి, త్యాగముల వలనే క్రైస్తవ జీవితం లేదా క్రీస్తు ప్రభుని చాలా వరకు చాటి చెప్పారు.

అలా దేవుడి రాజ్యాన్ని వ్యాపింపచేసిన వారికి, ఆరాజ్యం కోసం కృషి చేసే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో చోటు దక్కుతుందని తెలుపుచున్నారు.

పని చేయని వాడు భోజనానికి అనర్హుడు” అంటే పరలోక భోజనం అని అర్ధం.

కాబట్టి రెండవ పఠనం ద్వారా మనం గ్రహించ వలసిన విషయం ఏమిటంటే సోమరి పోతులుగా ఉండకుండా దేవుని రాజ్యానికి కృషి చేయమని తెలుపుచున్నది.

మనలో కూడా మంచిగా, నీతిగా జీవించే వారు ఉంటారు. అలాంటివారు విశ్వాసాన్ని సహనాన్ని కోల్పోవద్దు. మనలోకూడా సోమరిపోతులవలె, నిర్లక్ష్యపు జీవితాన్ని జీవించేవారు ఉంటారు. అలాంటివారు మారుమనస్సు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని యొక్క శిక్షకు గురికాకూడదు.

చివరిగా మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినికూడా నీతిగల జీవితాన్ని జీవించమని మరియు దేవుని పట్ల సహనంతో, భయభక్తులు చూపుతూ జీవించమని, దేవుని రాజ్యానికై కృషి చేయమని కోరుకుంటుంది.

 

బ్రదర్ . సుభాష్ OCD

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...