21, జనవరి 2023, శనివారం

 

మూడవ సామాన్య ఆదివారం

యెషయా 8:23-9:3

1 కొరింతి 1:10-13,17

మత్తయి 4:12-23

ఈనాటి దివ్య పఠనాలు  దేవుడు వెలుగుగా ఉండి, తన ప్రజలను అంధకారము నుండి వెలుగులోనికి నడిపిస్తారు అనే అంశం గురించి బోధిస్తున్నాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు అవసరం, లేకుంటే మన అందరి జీవితాలు అంధకారంలాగా మారతాయి. చీకటిలో మనం ప్రయాణం చేయలేము అందుకే యావే దేవుడు తన ప్రజలను వాగ్దాత భూమికి నడిపించుటకు రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా నడిచి దారి చూపించారు.

దేవుని యొక్క వెలుగును వెంబడించినట్లయితే మనందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. ఈరోజు మనందరం కూడా ఒక వెలుగులాగా ఉండాలి అనే అంశం గురించి దివ్య పఠనాలు బోధిస్తున్నాయి.

ఈనాటి మొదటి పఠనం లో  దేవుడు ఇస్రాయేలు ప్రజలను వెలుగులోనికి నడిపించిన విధానంను తెలుసుకుంటున్నాం.

ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క అపనమ్మకం  వలన, అవిశ్వాసం వలన చేసిన తప్పిదాల వల్లనే అంధకారంలోనికి పంపబడ్డారు.

క్రీస్తుపూర్వం 733 వ సంవత్సరంలో అసీరియా రాజు దండెత్తి వచ్చి, సెబూలూను, నప్తాలి భూభాగాల్ని ఆక్రమించాడు, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మనవి చేయుటకు బదులుగా ప్రక్కన ఉన్న ఇరుగుపొరుగు, రాజుల యొక్క సహాయంను కోరారు, వారి యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఆధారపడ్డారు అందుకనే ఇశ్రాయేలు పూర్తిగా పతనం అయిపోయింది.

తిగ్లాత్ పీలేసర్ దురాక్రమణాల అనంతరం ఉత్తర పాలస్తీనా (ఇశ్రాయేలు) భూభాగమంతా యూదేతర జాతులకు నివాసంగా మారిపోయింది, అన్య మతాలకు, అన్నయ్య దేవతారాధనలకు నిలయమైంది, ఫేనేసియ దేశస్తులు, సమరీయులు అక్కడ నివసించేవారు ఇశ్రాయేలు ప్రజల యొక్క అంధకారమేమిటంటే వారి యొక్క పతనమైన జీవితం, వారి యొక్క బానిసత్వం, స్వేచ్ఛ లేకపోవటం దేవుని విస్మరించి జీవించడమే వారి యొక్క అంధకారపు జీవితం.

మనందరి జీవితాలలో కూడా కొన్ని చీకటి క్షణాలు ఉంటాయి మనం ఎంతగానో ప్రేమించే వారు చనిపోవడం,

- మన యొక్క జీవిత స్వామిని కోల్పోవడం.

- అనుకున్నది జరగకపోవటం.

- అయినవారు దూరం అవటం.

- అనుకోకుండా అస్వస్థతకు గురికావటం.

- ప్రమాదానికి గురికావటం.

- జీవితం అంతా అతలాకుతలం అవటం.

- విజయం సాధించకపోవడం.

- జీవితం మనకు అనుగుణంగా లేకపోవడం.

ఈ విధంగా చాలా చీకటి క్షణాలు మన జీవితంలో ఉంటాయి,  చీకటి క్షణాలు శాశ్వతమైనవి. చీకటి తరువాత దేవుని యొక్క వెలుగు మనకు అందజేయబడుతుంది.

ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో గొప్ప అంధకారం ఏమిటంటే వారి యొక్క బానిసత్వమే.బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే వారిలో వెలుగు లేదు. బానిసత్వంలో ఉన్న సమయంలో వారి యొక్క జీవితం కష్టాలతో, బాధలతో ఇబ్బందులతో చీకటమయమయ్యింది. ఆకలి దప్పికలకు అలమటిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.

అంతటి అంధకార పరిస్థితులు ఏర్పడినందుకు ఇస్రాయేలు ప్రజలు తమ యొక్క దేవుణ్ణి, రాజులను, ప్రవక్తలను నిందించేవారు.

వారి యొక్క నిరుత్సాహ సమయాలలో అన్య దైవముల నుండి సలహాలను పొందేవారు. నిజమైన యావే దేవుని మరిచిపోయారు. దేవుని యొక్క ఒడంబడికను, ఆజ్ఞలను మరచిపోయారు, అందుకే వారు తిగ్లాత్ పీలేసర్ చేతిలో ఓటమిని చవిచూచారు. అస్సిరియా బానిసత్వంకు తీసుకొని పోబడ్డారు.

అంతా కోల్పోయిన ప్రజలకు యెషయా  ప్రవక్త సంతోషకరమైన విషయమును తెలియజేశారు, అదేమిటంటే అంధకారమున నడిచిన ప్రజలు వెలుగును చూస్తారు అని.

ఎవరైతే తమ యొక్క జీవితంలో కష్టాలు, బాధలు దేవుని కొరకు అనుభవిస్తారో వారు దేవుని సంతోషమును చూస్తారు అని అర్థం.

మన యొక్క విశ్వాసం కూడా అంధకారంలో మొదలై వెలుగుకు ప్రయాణమైపోతుంది.

దేవుని యొక్క వెలుగు మనమేమిటో తెలియజేస్తుంది, కేవలం ఆయన యొక్క వెలుగులో మన యొక్క బలహీనతలు, పాపం, బలాలు అన్నీ తెలుసుకొనవచ్చు.

ఈనాటి రెండవ పఠనం లో పునీత  పౌలు గారు కొరింతు సంఘంలో ఉన్న వారందరికీని ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి జీవించమని కోరుచున్నారు.

సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య ఎటువంటి విభజనలు  లేకుండా ఐక్యంగా ఉండాలని పౌలు గారి కోరిక.

కొరింథీలో ఉన్న కొందరు పోలో అనుచరులు అని, క్రీస్తు అనుచరుడని కొందరు, పేతురు అనుచరులని కొందరు, పౌలు అనుచరులని వివిధ రకాలుగా విభజించబడ్డారు, అది సరి అయినది కాదు ఎందుకంటే అందరూ కూడా ప్రకటించేది క్రీస్తు ప్రభువును గురించియే.

- క్రీస్తు విభజించబడలేదు

- క్రీస్తును గురించి మా సువార్త ప్రకటన

- క్రీస్తునందే జ్ఞానేస్నానం పొందుచున్నాం కాబట్టి అందరూ కూడా క్రీస్తునకు చెందిన వారం కాబట్టి కలిసిమెలసి ఐక్యంగా జీవించాలి అని పౌలు గారు తెలుపుచున్నారు.

ఏసుక్రీస్తు యొక్క నామమును విశ్వసిస్తున్న అందరూ ఒకటై ఉండాలి.

కొందరు పోలో అనుచరులుగా మారారు ఎందుకంటే ఆయన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, అలాగే దైవ సంబంధిత తనాలలో దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి అందుకే ఆయనను వెంబడించేవారు.

- కొందరు పేతురు అనుచరులు ఎందుకంటే ఆయన దేవుని చేత నాయకునిగా ఎన్నుకోబడిన వ్యక్తి.

- కొందరు పౌలు యొక్క అనుచరులు ఎందుకంటే ఆయన అన్యుల యొక్క అపోస్తులుడు హృదయ పరివర్తనం చెంది దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వ్యక్తి.

- కొందరు వారి యొక్క విశ్వాసం వలన క్రీస్తు ప్రభువు యొక్క అనుచరులుగా మారారు.

ఒకే సంఘంలో వివిధ రకాల అనుచరులను చూసిన పౌలు గారు మీరందరూ ఎటువంటి వర్గము, బేదము లేకుండా అందరూ కూడా ఒకే హృదయం, మనసు, ఆలోచన కలిగి జీవించాలని తెలుపుచున్నారు.

ఆనాడు కొరింతు లో  ఉన్న భేదాభిప్రాయాలు ఈనాడు మన మధ్యలో కూడా ఉన్నాయి.

కొన్ని కొన్ని ప్రాంతాలలో, విచారణలలో ప్రజలు వారి యొక్క భాషను బట్టి, ప్రాంతమును బట్టి, వారి యొక్క వర్గమును బట్టి, సంపదలను బట్టి, విభజించబడుతున్నారు, దానిని పౌలు గారు ఖండిస్తూ తెలిపిన మాట ఏమిటంటే యేసు ప్రభువు ఒక్కరే కాబట్టి ఆయనను విశ్వసించే మనందరం కూడా ఒకటిగా కలిసిమెలిసి జీవించాలి.

సంఘాలలో ఎటువంటి విభజనలు  లేకుండా జీవించాలంటే మనందరం స్వార్థమును ప్రాంతీయ అభిమానం ను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్కు చేత నడిపించబడాలి.

దేవుని యొక్క వాక్కు మన జీవితాలను మార్చిన సందర్భంలోనే అందరూ ఒకే మనస్సు, ఆలోచన కలిగి జీవించగలరు.ఈనాటి సువిశేష పఠనం లో  యేసు ప్రభువు తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించిన విధానంను తెలుసుకుంటున్నాం.

బాప్తీస్మ యోహాను చరసాలలో బంధింపబడిన తర్వాత యేసుప్రభు తన యొక్క పరిచర్యను, దైవ రాజ్య స్థాపనను ప్రారంభించారు.

ఏసుప్రభు జేబులోను, నెప్తాలి ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని తమ యొక్క బోధను ప్రారంభించడంలో యెషయా  ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరింది.ఈ జెబూలోను, నెప్తాలి ప్రాంతపు ప్రజలు పాపంలో చిక్కుకున్న ప్రజలకు చిహ్నం. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందు అందరూ దాదాపుగా అంధకారంలో జీవిస్తున్న వారే మరణపు నీడలో మూలుగుతున్న వారే, పాప కోపంలో చిక్కుకున్నవారే, అన్య దైవములను పూజించేవారే, అలాంటి దేనా వ్యవస్థలో ఉన్న మానవులపై క్రీస్తు జ్యోతి ప్రకాశిస్తుంది.

యేసు ప్రభు ఈ లోకమునకు వెలుగు - యోహాను 8: 12.

ఎవరైతే ఆయనను విశ్వసించి జీవిస్తారో వారి యొక్క జీవితాలు అంధకారంలో ఉండకుండా వెలుగులో ఉంటాయి - యోహాను 12:46.

అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చుటకు ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించారు.

మనం పాపం చేసిన ప్రతి సందర్భంలో అంధకారంలోనికి వెళుతున్నాం, అందుకే క్రీస్తు ప్రభువు మనలను రక్షించి మనలో వెలుగును నింపుచున్నారు.

పాపం చేయని ప్రతివాడు వెలుగు వలె ప్రకాశవంతంగా, నీతిగా, నిజాయితీగా, ఆనందంగా జీవించగలడు.

మానవుల యొక్క జీవితం చీకటి వెలుగుల మధ్య ఉంటుంది చీకటి వెలుగుల మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది, అందువల్లనే క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అని పిలుస్తాం.

ఏసుప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, ఈ లోకంలో ఉన్న అందరికీ వెలుగునిచ్చుటకు ఆయన వచ్చారు.

- దేవుని యొక్క వెలుగు సంతోషామునకు గుర్తు.

- దేవుని యొక్క వెలుగు నిరీక్షణకు గుర్తు.

- దేవుని యొక్క వెలుగు రక్షణకు గుర్తు.

- దేవుని యొక్క వెలుగు ప్రేమకు గుర్తు.

- దేవుని యొక్క వెలుగు ఆనందమునకు గుర్తు.

ఆయన వెలుగును పొందిన మనం ఇతరులకు కూడా వెలుగును పంచాలి అనేక మంది ఇంకా చీకటినే ఇష్టపడుతున్నారు చీకటినే ప్రేమిస్తూ జీవిస్తున్నారు.

మనందరం క్రీస్తు జ్యోతిని కలిగి ఉన్నాము మన యొక్క జ్ఞాన స్నాన సమయంలో పొంది ఉన్నాము ఆ వెలుగులో జీవించాలి.

ఏసుప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరైతే తన యొక్క అవసరతలో ఉన్నారో వారి చెంతకు వెళ్లారు - లూకా 5:31-32, లూకా 19:10.

ఏసుప్రభు తన పరిచర్య ద్వారా అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు- యోహాను 8: 12,12:35-36,రోమి 23:12.

తన పరిచర్య ద్వారా మరణించిన వారిని జీవింప చేశారు - యోహాను 5:24.

ప్రభు యొక్క పరిచర్య ద్వారా అనేకమంది అక్రమ మార్గముల నుండి అవినీతి నుండి, పాపం నుండి, చెడు వ్యసనముల నుండి, వెలుగునకు నడిపించబడ్డారు. ప్రభువు పరిచర్య మొదటిగా హృదయ పరివర్తనం అనే అంశం మీద ప్రారంభమైంది, హృదయ పరివర్తన ద్వారానే మనలోకి వెలుగు వస్తుంది క్రీస్తు ప్రభువు ఇచ్చిన వెలుగులో మనం నడిస్తే ఇక అంధకారంలో మనం ఉండము.

ఈనాటి సువిశేష రెండవ భాగంలో యేసు ప్రభువు తన సేవకై శిష్యులను పిలుస్తున్నారు.

ఏసుప్రభు గలీలియో ప్రాంతమంతా పర్యటించారు, ఎవరైతే తన యొక్క వాక్కును ఆలకించుటకు సిద్ధంగా ఉన్నారు వారి చెంతకు ఏసు ప్రభువు వెళ్లారు.

ఏసుప్రభు తన యొక్క సేవకు జాలరులను ఎన్నుకుంటున్నారు, ఆయన కాలంలో మామూలుగా సేవకులే గురువులను ఎన్నుకునే వారు, కానీ ఏసుప్రభువు మాత్రం భిన్నంగా ఉంటున్నారు ఆయనే ప్రజల స్థలాలకు వెళ్లి తన సేవకై కొంతమందిని ఎన్నుకుంటున్నారు.

దేవుడు మనల్ని వెతుకుతూ వస్తున్నారు, శిష్యులను వెతికి తన సేవకే ఎన్నుకొన్నారు జాలరులు సాధారణమైన వ్యక్తులు అయినప్పటికీ ప్రభువు వారిని తన సేవకు వెన్నుకుంటున్నారు వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదు వారిని ఎన్నుకొన్నది, వారి యొక్క అందుబాటులో ఉండే విధానం బట్టి "He did not see there ability at rather there availablity." తన పనిని ఎవరైతే సక్రమంగా చేస్తారో వారినే దేవుడు ఎన్నుకుంటున్నారు.

ఎందుకు ప్రభువు జాలరులను ఎన్నుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

1. చేపలు పట్టే వారికి (జాలరులకు) సహనం ఎక్కువ.

2. జాలరులకు ధైర్యం ఎక్కువ.

3. తమ ప్రాణాలు త్యాగం చేయడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

4. జాలరులు పట్టుదల కలిగిన వారు.

5. ఏ సమయంలో ఎక్కడకు చాపలు పట్టడానికి వెళ్లాలో బాగా తెలిసినవారు.

6. తమ ప్రయత్నంను విడిచిపెట్టని వారు.

జాలరులకు చాలా ఓర్పు, తెలివి, సహనం నెమ్మదితనం ఉంటాయి అందుకే ప్రభువు వారిని తన యొక్క సేవకై ఎన్నుకుంటున్నారు.

ఏసుప్రభు వారి యొక్క సామర్థ్యం బట్టి వారిని ఎన్నుకోవడం లేదు కానీ వారు ఎప్పుడూ కూడా ఎంతటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా మరియు అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని ఎన్నుకుంటున్నారు.

ఏసుప్రభువు సామర్దులను  తన పని కోసం ఎన్నుకోవడం లేదు, పేతురు ఆంధ్రేయ,  యోహాను, యాకోబులు తమ పనిలో నిమగ్నమై ఉన్న వారిని దేవుడు ఎన్నుకుంటున్నారు.

- మోషే గొర్రెలు మేపే సమయంలో దేవుడు ఆయన్ను ఎన్నుకున్నారు.

- దావీదు రాజు గొర్రెలు కాచే సమయంలో దేవుడు తనను పిలిచారు.

- అదేవిధంగా శిష్యులను కూడా చేపలు పట్టే సందర్భంలో తన సేవకు పిలుస్తున్నారు.

ఏసుప్రభు పిలిచిన వెంటనే ఆయన యొక్క మాటను అనుసరించి సమస్తమును పరిత్యజించి ఆయన్ను వెంబడించారు. వారు అన్నీ విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నారు దేవుని వెంబడించారు మనం కూడా ప్రభువు కొరకు సిద్ధంగా ఉండాలి.

ఈ శిష్యులలో మనం చూసే గొప్ప విషయం ఏమిటంటే కలిసి పని చేయుట అన్నదమ్ములుగా ఉన్నవారు కలిసిమెలసి పనిచేస్తున్నారు. ఈనాడు ఎంతమంది అన్నదమ్ములు కలిసి పనిచేస్తున్నారు.

ఏసుప్రభు శిష్యులను ఒక వెలుగుగా ఉండుటకు పిలుస్తున్నారు తమ యొక్క బోధన ద్వారా పరిచర్య ద్వారా వారు అనేకమందిలో ఉన్న అంధకారమును తొలగించి వెలుగును నింపారు.

మనం కూడా ప్రభువు యొక్క వెలుగుని ఇతరులకు పంచుతూ సంతోషంగా జీవించూద్దాం.


Fr. Balayesu OCD

 

14, జనవరి 2023, శనివారం



2వ సామాన్య ఆదివారం

యెషయా 49:3,5-6

1 కొరింతి 1:1-3

యోహాను 1:29-34

 

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరం కూడా దేవుని యొక్క గొర్రె పిల్ల వలె జీవించి, దేవునికి సాక్షులై జీవించాలని తెలుపుచున్నాయి.

దేవుని యొక్క సేవకై ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి సాక్షులై జీవించాలి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలోకి ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చటానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకునిగా, అనుచరునిగా, అపోస్తులుగా ఉండాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలుపుచున్నాయి.

మానవ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, ఆ దైవ ప్రణాళికకు తగిన విధంగా మనం జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో రెండోవ బాధామయ సేవకుని గీతం ద్వారా ఒక సేవకుని ఎన్నిక గురించి చెప్పబడింది.

ఈ సేవకుడు దేవుని యొక్క పని కోసం ఎన్నుకోబడ్డాడు, దేవుడే ప్రత్యేకంగా ఆయనను అందరిలో మి న్నగా తన సేవకు ఎన్నుకొన్నాడు.

దేవుని యొక్క ఎన్నిక చాలా గొప్పది, ఎందుకంటే ఎన్నుకొనేముంది దేవుడు వారి కొరకు ప్రార్ధించారు, వారి యొక్క సేవను విశ్వసించారు, వారి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారికి దేవుడు తన యొక్క సేవ బాధ్యతలు అప్పజెప్పారు దేవుడు సేవకులను తమ యొక్క స్వార్థం కోసం కాదు ఎన్నుకొన్నది, ప్రజల కొరకు నిస్వార్ధ హృదయులై ఉండటానికి.

దేవుని యొక్క సేవకుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం బాధ్యత ఏమిటంటే, ప్రజలందరిని దేవుని చెంతకు తీసుకొని రావాలి, ఇదే మాటలను పౌలు గారు కూడా పలుకుచున్నారు - గలతీ 1:15, రోమి 1:1, అపో 22:21.

తన యొక్క సేవకుని యావే దేవుడు ఇశ్రాయేలు తో పోల్చి పిలుస్తున్నారు - యెషయా 49:3.

ఈ మాటలు ఏసుప్రభు యొక్క జీవితానికి అక్షరాలా వర్తిస్తాయి ఎందుకంటే కేవలం మెస్సయ్య యొక్క జీవితం వలన తండ్రి దేవునికి కీర్తి కలుగును.

ఒక సేవకునిగా ఏసుప్రభు తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. తల్లి గర్భముననే దేవుడు తన సేవకుని తన యొక్క పని నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకుడు ప్రజలందరినీ దేవుని చెంతకు చేర్చాలి, అనగా వారిని పుణ్య మార్గంలో నడిపించాలి. దేవుని యొక్క బాధ్యతలు విధులు తెలుపుతూ వారిని ముందుకు నడిపించాలి.

ఒక సేవకునిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలో సృష్టించబడ్డాము - హెబ్రి 10:7, యోహాను :38, యోహాను 4:34.

కేవలం దేవుని ప్రజలను ఆయన చెంతకు చేర్చుట మాత్రమే కాదు ప్రవక్త యొక్క ముఖ్యమైన పని, వారికి జ్యోతి లాగా ఉండాలి.

ప్రజలను సత్యం వైపు నడిపించేటువంటి వెలుగుగా సేవకుడు ఉండాలి.

ఆరవ వచనంలో ప్రభువు అంటున్నారు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిస్తున్నాను అని. అంటే ప్రవక్తగా, సేవకునిగా తన యొక్క పరిచర్య బాధ్యతలు సేవా తత్వం అందరికీ చెందినవి.

ఒక జ్యోతిగా అంటే వెలుగుగా ఉండాలి అని తెలుపుచున్నారు, వెలుగు దారిని చూపిన విధంగా ప్రజలు పుణ్య మార్గంలో నడుచుటకు ఒక ప్రవక్త, సేవకుడు ప్రజలకు దారి చూపించాలి.

తనలో ఎటువంటి అంధకారం లేకుండా ఇతరులను ముందుకు నడిపించాలి. వెలుగు తన కొరకు తాను ఎప్పుడూ ప్రకాశించదు అదే విధంగా ఒక సేవకుడు కూడా ఎప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఒక వెలుగు లాగా మనం కూడా ఇతరుల కొరకు జీవించాలి.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకులందరికీ దేవుడే స్వయంగా శక్తిని ఒసగుతారు. వారి యొక్క పరిచర్యకు అవసరమైన ప్రతి యొక్క అనుగ్రహం దేవుడు దయ చేస్తారు.

మనందరం కూడా సేవకులుగా దేవుని యొక్క సాధనములు మాత్రమే కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ప్రభువు యొక్క సేవ చేయాలి.

జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మనలను తన సేవకు ఎన్నుకొన్నారు కాబట్టి మనం ప్రభువు కొరకు జీవించాలి. ఆయన నామంను ప్రకటించాలి అనేకమందిని ప్రభువు చెంతకు చేర్చాలి దేవునికి సాక్షులై జీవించాలి.

ఈనాటి రెండవ పఠనం లో పునీత పౌలు గారు తాను దేవుని యొక్క సంకల్పానుసారంగా అపోస్తులుడుగా దేవుని యొక్క పరిచర్యకై ఎన్నుకొన్నబడ్డారని పౌలు గారు కొరింతి వాసులకు తెలియజేస్తున్నారు.

పౌలు గారు కొరింతి సంఘస్తులకు తెలిపే అంశం ఏమిటంటే ఏ విధంగానైతే తాను దైవ సేవకై ఎన్నుకొనబడి పవిత్రపరచబడ్డాడో అదే విధంగా కొరింతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడ్డారు అని తెలిపారు.

ఏసుప్రభు యొక్క నామమును విశ్వసించే ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పించబడిన వారే ఆయన యొక్క సేవ నిమిత్తమై వారు పవిత్ర పరపబడతారు అని పౌలు గారు తెలిపారు.

దేవుని యందు జ్ఞాన స్నానం పొందిన విశ్వాసులు, వారు ప్రభువు శరీరం నందు భాగస్తులవుతారు. దేవుని యొక్క పరిశుద్ధత వారికి అందజేయబడుతుంది. దేవుని యొక్క కృప అనుగ్రహాలు అందరికీ అందజేయబడుతాయి. కావున వెలుగుగా మనం దేవుని యొక్క సేవ చేయాలి.

ఏసుక్రీస్తు ద్వారా మనం అందరం పరిశుద్ధపరచబడ్డాం కావున ఆ పరిశుద్ధ జీవితం అలాగే కొనసాగించాలి పరిశుద్ధతతో ప్రార్థిస్తూ దేవుని యొక్క సేవ చేయాలి.

దేవుని యొక్క సేవ ప్రతి ఒక్కరూ చేసిన యెడల ఈ భూలోకం పరలోకంగా మారుతుంది. పరిశుద్ధ మనస్సు కలిగి నిస్వార్థంతో దైవ సేవ చేస్తే దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం.

ఈనాటి సువిశేష పఠనం లో బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును మెస్సయ్యగా సర్వేశ్వరుని గొర్రె పిల్లగా చూపిస్తున్నారు.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఈ లోకానికి చూపిస్తున్నారు. తనుకు ఉన్న దైవ అనుభవమును బట్టి దైవత్వమును గుర్తించి ప్రజలకు బాప్తిస్మయోహాను గారు దేవుని చూపిస్తున్నారు.

ఒక దైవ సేవకునిగా మనందరం చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఇతరులకు చూపించాలి. మొదటిగా దైవ అనుభూతి మనం కలిగి ఉంటూ దేవుని ఇతరులకు చూపించాలి.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభు యొక్క స్వభావమును గొర్రె పిల్లతో పోల్చుతూ చెబుతున్నారు - యెషయా 53:7.

పవిత్ర గ్రంథంలో అన్నింటికన్నా అర్థవంతమైన పేరు ఏమిటంటే సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఈ పేరు 29 సార్లు పవిత్ర గ్రంథంలో చెప్పబడింది.

గొర్రెపిల్ల అనే పదం ఏసుప్రభు యొక్క వినమ్రతను, ప్రేమను, త్యాగాన్ని అదే విధంగా విజయంను సూచిస్తుంది.

గొర్రెపిల్ల దేవుని యొక్క బలి నిమిత్తమై వాడబడిన జంతువు. గొర్రె పిల్లగా ఏసుప్రభువును సంబోధించినప్పుడు యూదాలలో మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి.

1. పాప పరిహార దినోత్సవం నాడు ప్రధానార్చకుడు తన ప్రజల పాపాలన్నింటినీ ఒక గొర్రె పిల్లపై మోపి దానిని క్రూర జంతువులకు ఆహారంగా అడవిలోనికి తోలి వదిలేస్తారు - లేవి 16:20-22.

2. ప్రతిరోజు ఉదయం సాయంత్రం యూదుల పాప పరిహారం కొరకు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పిస్తారు - నిర్గమ 29:38-42.

3. గొర్రె పిల్లల రక్తమే ఐగుప్తులోని యూదుల కుటుంబాలలోని తొలిచూలు మగ శిశువులను కాపాడింది. అలాగే బాప్తిస్మ యోహాను పలికిన మాటలు ప్రతి ఏడాది పాస్కా పండుగనాడు తాము బలిగా అర్పించే గొర్రె పిల్లను గుర్తుకు తెచ్చి ఉండవచ్చు - నిర్గ 12:11.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును దేవుని గొర్రెపిల్ల అని పిలిచినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ గొర్రెపిల్ల దేవుని చేత ఎన్నుకొనబడినది దేవుని కొరకు సమర్పించబడే గొర్రెపిల్ల ప్రజల యొక్క పాప నిమిత్తమై తన యొక్క జీవితం ని త్యాగం చేసే నిష్కలంక గొర్రెపిల్ల.

మనంతట మనమే పాపం నుండి మరణం నుండి విమోచన పొందగలిగే మార్గం లేదు. అందుకు పరిహార మూల్యం చెల్లించక తప్పదు. మనందరి పాపం నిమిత్తమే క్రీస్తు ప్రభువు మన కొరకు మరణించారు - 1 పేతురు 2:24, హెబ్రి 9:28.

బాప్తిస్మ యోహాను గారు దేవునికి సాక్ష్యం ఇచ్చారు. తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చారు దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకునిగా తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు.

మన యొక్క విశ్వాస జీవితంలో యేసు క్రీస్తును ఇతరులకు చూపించాలి దేవునికి సాక్షలై జీవించాలి.

మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ప్రభువుకు సాక్షలై జీవించాలి.

బాప్తిస్మ యోహాను గారు దేవుని సేవ కొరకు జీవించిన వ్యక్తి మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

బాప్తిస్మ యోహాను మరియు యేసు ప్రభువు తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు అదే విధంగా మనం కూడా నెరవేర్చాలి.

బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువును ఉద్దేశించి పలికిన మాటలు ఆయన నాకంటే ముందుగా ఉన్న వ్యక్తి అని అన్నారు, సృష్టికి పూర్వము నుండి ఆయన ఉన్నవారు అని బాప్తీస్మ యోహాను గారికి తెలుసు - యోహాను 1:15.

బాప్తిస్మ యోహాను గారికి యేసు ప్రభువు గురించి వ్యక్తిగతంగా తెలుసు - లూకా 1:36.

బాప్తిస్మ యోహాను గారు గొప్ప విశ్వాసము ఉన్న దేవుని సేవకుడు, దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన వ్యక్తి సత్యమును ప్రకటించిన వ్యక్తి, దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప ప్రవక్త.

బాప్తిస్మ యోహాను గారు ప్రభువు యొక్క ఆత్మ యేసు ప్రభువు మీద దిగిరావడం చూసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.

యూదులకు పావురం పవిత్రమైనది. పావురం శాంతికి  చిహ్నం అదే విధంగా నిర్మలత్వంకు అమాయకత్వం కు గుర్తు.

పవిత్ర గ్రంథంలో పావురం పవిత్రాత్మకు గుర్తు పావురం యేసు మీదకి దిగిరావడం ద్వారా ఇతడే మెస్సయ్య అని తెలిపారు.

పాత నిబంధన గ్రంథంలో అనేకసార్లు దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకు వచ్చింది కానీ ఎవరి మీద ప్రత్యేకంగా నిలవలేదు, కేవలం యేసు ప్రభువు మీదనే ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది.

ఏసుప్రభు పొందిన జ్ఞాన స్నానం ద్వారా పరలోకం తెరవబడింది. ఆదాము, అవ్వ చేసిన పాపం ద్వారా మూసివేయబడిన పరలోకం మరలా క్రీస్తు ప్రభువు జ్ఞాన స్నానం ద్వారా తెరవబడింది.

ఏసుప్రభు జ్ఞాన స్నానం తరువాత సువార్త పరిచర్యను ప్రారంభించారు. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ప్రభువు కృషి చేశారు. దేవుని చేత పంపబడిన సేవకునిగా ఏసుప్రభువు పరిచర్యను చేశారు. మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారం కాబట్టి, ప్రభువు యొక్క సేవ చేయాలి.


Fr. Balayesu OCD

 

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...