20, నవంబర్ 2021, శనివారం

34 వ సామాన్య ఆదివారం (క్రీస్తు రాజు మహోత్సవం)

క్రీస్తురాజు మహోత్సవం

దానియేలు 7 : 13 -14 

దర్శన గ్రంధము 1 : 5 - 8 

యోహాను 18 : 33 - 37

క్రీస్తునాధుని యందు ప్రియా సహోదరి సహోదరులారా. ఈనాడు తల్లి తిరుసభ 34వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించియున్నది. క్రీస్తు ప్రభువు విశ్వమంతటికి రారాజు అన్న విషయాన్నీ ప్రపంచమంతటికి చాటిచెప్పడానికి తల్లి శ్రీసభ సామాన్య ఆదివారాల్లో చివరిదైన 34వ ఆదివారాన్ని  క్రీస్తురాజు మహోత్సవానికి అంకితం చేస్తుంది. 

శ్రీసభ చరిత్రలో మొదటినుంచి క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకునేది కాదు. పదకొండవ భక్తినాధ పోపుగారు 1925 డిసెంబర్ 11 వ తేదీన ఈ మహోత్సవాన్ని దైవాక్యర్చన క్యాలెండరులో చివరి ఆదివారాన జరుపుకోవాలని ప్రకటించారు.  ప్రజల పాప జీవితం, విచ్చలవిడి తనం, అధికార వ్యామోహాలు, ప్రభువును వారి జీవితాలనుంచి త్రోసివేసి జీవించడంలాంటివి చూసి పోపుగారు, అందరికి ఒక్కరే రాజు, అధికారి వున్నారు, ఆయనే క్రీస్తుప్రభువు అని లోకమంతటికి తెలియజేయడం కోసం ఈయొక్క మోహోత్సవాన్ని  విశ్వమంతటా ప్రకటించియున్నారు. ఈ పండుగ ప్రారంభమై 96  సంవత్సరాలే  అవుతున్నా క్రీస్తుప్రభువు రాజు అని వినడం, అనడం శ్రీసభలో కొత్తెమికాదు. 

క్రీస్తు పుట్టక పూర్వం, పుట్టినప్పుడు, క్రీస్తు మరణిస్తున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా ఆయనను రాజు అని అంగీకరించడం మనం పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాం. క్రీస్తు పుట్టక పూర్వమే  జెకర్యా ప్రవక్త క్రీస్తుని రాజుగా గుర్తించి ఇలా పలుకుతున్నారు, "యెరూషలేము కుమారి! నీవు ఆనందము చెందుము. అదిగో! నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు" (జెకర్యా 9: 9). క్రీస్తు పుట్టిన సమయాన కూడా ఆయనను మానవాళి రాజుగా అంగీకరించడాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దిక్కునుంచి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజు వద్దకు వెళ్లి, " యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?" (మత్తయి 2: 2) అని అడుగుతూ క్రిస్తునాధుని రాజుగా అంగీకరిస్తున్నారు.  అదేవిధంగా క్రీస్తు నాధుడు మరణించే సమయాన కూడా ఒక రాజుగా అంగీకరింపబడ్డారు. పిలాతు తెలిసితెలియక " నీవు యూదుల రాజువా?" (మత్తయి 27: 11) అనే ప్రశ్నద్వారా, మరియు "నజరేయుడగు యేసు యూదుల రాజు " (యోహాను 19 : 19 ) అని క్రీస్తు సిలువపై ఫలకం పెట్టించుటద్వారా క్రీస్తుప్రభువు రాజు అని భయలుపరుస్తున్నారు. కనుక క్రీస్తుప్రభువు రాజు అను సత్యాన్ని మానవాళి తెలిసీతెలికుండానే అంగీకరించింది.

క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభసందర్భంలో మన క్రీస్తు రాజు ఎటువంటి వాడు, ఆ రాజు రాజ్యం ఎటువంటిది, ఆ రాజ్యానికి అర్హులం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసుకోవడం చాలా మంచిది. 

I. ఈ రాజు ఏటువంటివాడు?

1. తీర్పు తీర్చు న్యాయ తీర్పరి:

ఈ  రాజు “న్యాయముతో తీర్పు తీర్చువాడు (యెషయా 11 : 5 )  అని యెషయా ప్రవక్త పలుకుచున్నారు. అంటే మన రాజు న్యాయతీర్పరి. ఎందుకు క్రీస్తు మాత్రమే తీర్పరియై ఉన్నాడు. ఎందుకనగా  తండ్రిదేవుడే స్వయానా తీర్పుతీర్చె అధికారాన్ని కుమారునకు ఇస్తున్నారు. “తండ్రి ఎవరికిని తీర్పుతీర్చడు. తీర్పరిగా సర్వాధికారం కుమారునికి ఒసగబడెను “ (యోహాను 5 : 22 ) అని ప్రభువే స్వయానా పలుకుచున్నారు. ఈ లోకానికి కేవలం క్రీస్తుమాత్రమే తీర్పరి. తీర్పుతీర్చుటకు సర్వాధికారం తండ్రి ఆయనకు ఇచ్చివేసియున్నారు.

II. ఈ రాజు రాజ్యం ఎటువంటిది ? 

1. శాంతి సమాధానములు గల రాజ్యం :

"దేవుని రాజ్యమనగా తినుట, త్రాగుట కాదు. పవిత్రాత్మ యొసగె నీతి, శాంతి, సంతోషములే" (రోమా 14 : 17 ) అని పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖలో చాలా చక్కగా పలుకుచున్నారు. పరలోక రాజ్యములో పాపముగాని, కష్టనష్టాలుగాని, ఇంకా ఎటువంటి చెడుకు తావులేనటువంటి ఒక రాజ్యం. ఆ రాజ్యంలో శాంతి సమాధానంకు కొరత ఉండదు. ఎందుకంటే ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు అక్కడ నివసించు జనుల నడుమ శాంతిని నెలకొల్పును(జెకర్యా 9 :10 ) అని జెకర్యా ప్రవక్త పలుకుచున్నారు. ఈ రాజ్యమున ఉండేటటు వంటి  శాంతి కేవలం తాత్కాలికమైన శాంతి కాదు, ఈ రాజ్యమున శాంతి సదా, ఎల్లకాలము నెలకొనును (9 : 7 ) అని యెషయా ప్రవక్త పలుకుచున్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ ఈ క్రీస్తురాజు, ఇచ్ఛేటటువంటి శాంతి సమాధానం కోసం పరితపించాలి.

2 . నీతిన్యాయములు గల రాజ్యం :

ఈ రాజ్యం  ఎల్లప్పుడూ నీతిన్యాయములు గల రాజ్యం. ఆ రాజు విజ్ఞానముతో తన రాజ్యమును పరిపాలించును, తన రాజ్యమున నీతిన్యాయములు నెలకొల్పును (యిర్మీయా 23 : 5 ) అని యిర్మీయా ప్రవక్త పలుకుచున్నారు. ఎందుకంటె ఆ రాజు నీతిన్యాయములు గల రాజు కనుక. అందరికంటే ముందు అతనే నీతిని, ధర్మమును పాటించును (యిర్మీయా 33 : 15 ), అతనే న్యాయమును ప్రకటించును, న్యాయమునకు విజయము చేకూర్చునంతవరకు  అతను పట్టువిడువడు (మత్తయి 12 : 18 - 20 ) అని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. మనం ఎల్లప్పుడు నీతిన్యాయములతో జీవిస్తూ ఉండుటకు ప్రయత్నించాలి.

3  శాశ్వతమైన రాజ్యము: 

మన క్రీస్తురాజు యొక్క రాజ్యమునకు పరిమితి లేదు. ఈ రాజ్యమునకు హద్దులుగాని, నిర్ణిత సమయముగాని లేదు అని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. గాబ్రియేలు దూత మరియతల్లిని సందర్శించినప్పుడు  "క్రీస్తు యొక్క రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1 : 33 ) అని మరియతల్లితో పలుకుచున్నారు. ఎందుకని ఆయన పరిపాలించే రాజ్యము ఎల్లకాలము ఉంటుంది కాబట్టి. ఈ నాటి మొదటి పఠనంద్వారా కూడా ప్రభువు మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మొదటిపఠనంలో దానియేలు ప్రవక్త, క్రీస్తుని పరిపాలనా, మరియు అతని రాజ్యం గురించి ముందుగానే తెలియపరచియున్నారు. "అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే ఉండదు" (దానియేలు 7 : 14 ) అని దానియేలు ప్రవక్త పలుకుతున్నారు. మనమందరము ఇటువంటి శాశ్వతమైన రాజ్యం కోసం ఎల్లప్పుడూ వెదకాలి.

III . ఈ రాజుయొక్క రాజ్యానికి అర్హులం కావాలంటే మనం ఏం చేయాలి?

1 . హృదయపరివర్తన :

"మీరు పరివర్తన చెంది, చిన్న బిడ్డవలె రూపొందిననే తప్ప పర లోక రాజ్యమును ప్రవేశింపలేరు" (మత్తయి 18 : 3 ) అని ప్రభువే స్వయానా పలుకుచున్నారు. ఈ క్రీస్తు రాజు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే హృదయపరివర్తన కలిగి, చిన్న బిడ్డలవలె నిష్కల్మషమైన మనస్సు కలిగి ఉంటే తప్ప పరలోకరాజ్యంలోకి మనం ప్రవేశించలేము.  

2 .  దేవుని చిత్తానుసారం జీవించాలి :

"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడు పర లోక రాజ్యములో ప్రవేశింపడు! కానీ, పర లోక మందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకరాజ్యమున ప్రవేశించును" (మత్తయి 7 : 21 ) అని క్రిస్తునాధుడు పరిశుద్ధగ్రంధంలో పలుకుతున్నారు. మనం జీవితాలను మన ఇష్టానుసారం, మనకునచ్చినట్టుగా కాకుండా, దేవుని చిత్తానుసారం, ఆయన వాక్యానుసారం జీవిస్తే కశ్చితంగా మనమందరం ఈ క్రీస్తురాజ్యంలో  వారసత్వం సంపాదించవచ్చు.

౩. సేవకరూపం దాల్చాలి:

దేవుని రాజ్యానికి అర్హులం కావాలంటే ప్రతిఒక్కరు సేవకరూపం దాల్చాలి. క్రీస్తు ప్రభువు ఒక దేవుడై యుండికూడా, ఈ విశ్వమంతటికి రారాజు అయ్యి కూడా తాను సేవచేయాడానికే వచ్చారని తెలియజేస్తున్నారు. "ఏలయన, మనుష్యకుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు" (మార్కు 10 : 45 ) అని మార్కు సువార్త ద్వారా ప్రభువు తెలియజేస్తున్నారు. క్రీస్తునియెక్క సేవచేసే వ్యక్తిత్వం ఎటువంటిదంటే, తాను దేవుడై యుండి కూడా మానవాళి యొక్క కాళ్ళు కడుగుటకు వెనుదీయలేదు (యోహాను 13  : 1 - 17 ) అని సువార్తలో చూస్తున్నాం. కనుక ప్రియా సహోదరి సహోదరులారా ! మనం  ఈనాడు క్రీస్తుని అనుసరించువారలం అని చెప్పుకోవాలి అంటే మనం కూడా ఇటువంటి సేవకరూపం దాల్చాలి అని ప్రభువు బోధిస్తున్నారు. 

కనుక  క్రిస్తునాధునియందు  ప్రియా సహోదరి సహోదరులారా ! ఈనాడు క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరినుంచి ప్రభువు ఆశించేది ఒక్కటే. మనమందరము ఆ రాజు రాజ్యములో వారసత్వం పొందడమే. ఆ వారసత్వం పొందాలి అంటే మనం హృదయపరివర్తన కలిగి, దేవుని చిత్తానుసారము జీవిస్తూ, సేవకారుపం దాల్చాలి. ఈనాడు మన జీవితాలకు, మనకుటుంబాలకు రాజు ఎవరు?ఎవరు మన జీవితాలను, మన కుటుంబాలను పరిపాలిస్తున్నారు?  ధనమా? అధికార వ్యామోహమా ? శరీరవాంచాలా? ఇతరులా? లేక విశ్వమంతటికి రాజైన క్రీస్తురాజునా? ఈనాటి దివ్యబలిపూజలో మన జీవితాలకు, మన కుటుంబాలను  క్రీస్తురాజు మాత్రమే పరిపాలించాలి అని ప్రార్థనచేద్దాం.



Bro. JOSEPH OCD

13, నవంబర్ 2021, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం

దానియేలు 12:1-3, హెబ్రీ 10:11-14,18  మార్కు 13:24-32

నేటి దివ్య గ్రంధ పఠనాలు దేవుడు ఎప్పుడు  మనతో ఉంటారనే విషయాన్ని గురించి

 బోధిస్తున్నాయి. మన  యొక్క  కష్ట కాలంలో  అంత్య దినములలో దేవుడు మనతో 

ఉంటారని తెలుపుచున్నా యి,  ఈ పఠనాలు.  అలాగే ఈ దివ్య పఠనాలు దేవుని  రెండవ 

రాకడను గురించి కూడా బోధిస్తున్నాయి. దేవుని యొక్క రాకడకై  అందరు  సంసిద్దులై జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో దానియేలు  ప్రవక్తకు కలిగిన నాల్గవ దర్శన వివరణ మనం

 వింటున్నాం.

మానవులు మరణించి సమాధి చేయబడిన తరువాత  మట్టిలో నిద్రించే చాలా మంది

 సజీవులగుదురు  అని చెపుతున్నాయి. ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న  

యూదులను నాలుగవ అంతియోకు అన్యాయంగా వారిని శిక్షకు గురిచేసి, చంపివేశారు. 

నాల్గవ అంతియోకు (సిరియా) గ్రీకు రాజు, ఆయన యూదా ప్రజలమీద అనేక రకాలైన 

 ఆంక్షలు విధించి, వారు గ్రీకు మతస్తుల ఆచారాలను , పద్దతులను ఆచరించాలని 

ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించారు, దేవాలయాన్ని ధ్వంసం 

చేశారు, దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే 

కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంధం తోర యొక్క భాగాలను కాల్చి వేశారు. ప్రజలు 

గ్రీకు దేవతలను , దేవుళ్లను ఆరాధించాలని ఒత్తిడి చేసిన సమయంలో ప్రవక్తకు దేవుని 

యొక్క అభయ సందేశాలు వినిపించబడ్డాయి.

దేవుని పట్ల విశ్వసనీయత కలిగి జీవించిన ప్రతి యూదుడు కూడా, మరణించిన 

తరువాత,శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలుపు చున్నారు.

దానియేలు ప్రవక్త, బాధలు అనుభవించే ప్రజలకు ఒక ఊరట ఇస్తున్నారు. యావే దేవుడు

ఎప్పుడు కూడా తన ప్రజలకు చేరువలోనే ఉంటారని, యూదులు కూడా యావే దేవుడు 

కష్టకాలంలో,  ఈ లోకంలోకి దిగి వచ్చి తమకు తోడుంటారని ప్రగాఢంగా నమ్మారు.

దానియేలు గ్రంధం 11:21-39 వచనములు మనం చదివితే అక్కడ సిరియా రాజు 

యొక్కఅహం, ఆయన యొక్క దురాలోచనలు , ఆయన యొక్క స్వార్ధం , ఆయన చేసే 

హింసలుఅన్నీ అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైన సరే ప్రజలలో ఒక విధమైన 

ఆశను,నమ్మకాన్ని కలుగజేస్తున్నారు ప్రవక్త.

వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం 

ఎలాగా జీవిస్తున్నమన్నదిముఖ్యం. దేవుని జీవ గ్రంధమునా వ్రాయబడిన  పేర్ల వారు 

జీవిస్తారు అని తెలుపుచున్నారు.దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ , దైవ ప్రేమ, సోదర 

ప్రేమ కలిగిన వారందరి యొక్క  పేర్లు జీవ గ్రంధ మందు వ్రాయబడుతాయి. 

నిర్గమ 32:32-33, కీర్తన 69:28.

2 వ వచనంలో చనిపోయి మట్టిలో నిద్రించే వారు సజీవులగుదురు అని ప్రవక్త

 తెలుపుచున్నారు. ఇదియే క్రైస్తవ విశ్వాసం మరియు యూదుల విశ్వాసం , అంతిమ 

దినమున అందరు కూడా లేపబడుతారని తెలుసుకున్నాం. పవిత్ర గ్రంధంలో ఆనాడు 

యెహెజ్కేలుప్రవక్త ఎండిన ఎముకలకు ప్రవచనం చెప్పగానే వారు సజీవులై లేచారు. 

యెహెజ్కేలు 37:7-8.

దీని ద్వార ప్రభువు చెప్పే విషయము  మనకు అర్థమగుచున్నది. దేవుని కొరకు 

చనిపోయిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినవారు మరలా దేవుని కృప 

వలన సజీవులౌతారని. యెహెజ్కేలు 37:13. యూదులు పునరుత్థాన భాగ్యం కలుగుతుంది అనివిశ్వాసించారు. 2 మక్కబీయులు 7:9 . ఏడుగురు  సోదరులు ప్రాణాలు 

 త్యాగం చేయడానికిసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మరణం గురించి భయం లేదు. 

మరణం తరువాత దేవునితోజీవం ఉందని  గ్రహించారు/విశ్వాసించారు.యూదా ప్రజలు 

తమ జీవిత అంత్య కాలం గురించి కలవర పడ్డారు. వారి కష్టాలలో దేవుడు దానియేలు 

ప్రవక్త ద్వార వారితో మాట్లాడి, బాధలను స్వీకరించి, నీతివంతమైన జీవితం గడపడం 

ద్వార ఆనందం గా మృత్యువుని చేరుకొమ్మని అభయమిచ్చారు.

ఈనాటి మొదటి పఠనంలో విశ్వాసుల జీవితాలను  బలపరచిన వారికి , దైవ జ్ఞానం 

బోధించిన జ్ఞానులకు, దేవుని యొక్క ధర్మము నేర్పించిన వారు ఎల్లప్పుడు కూడా దేవుని 

యొక్క బహుమతి పొందుతారని ప్రవక్త తెలియ పరుస్తున్నారు. వివేకవంతులైన 

నీతిమంతులకు దేవుని తీర్పువలన బహుమానం లభిస్తుందని, మూర్ఖులు, దుష్టులు 

శిక్షించబడతారని ఈనాటి మొదటి పఠనం వివరిస్తుంది.

రెండవ పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వంకు ఉన్న గొప్ప తనం గురించి

 తెలుపుచున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు  ఒకే రకమగు బలులు

 అర్పించినప్పటికి ప్రజల పాపాలను తొలగించ లేకపోయారు. కానీ క్రీస్తు ప్రభువు తన 

యొక్కబలి ద్వార అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు.

ఆయన సమర్పించిన బలికి రక్షణ సామర్ధ్యం ఉంది. యేసు క్రీస్తు సమర్పించిన ఈ ఒకే 

ఒక బలి విశ్వాసులను దేవుని ఎదుట  నీతిమంతులుగా చేస్తుంది,  శుద్దీకరిస్తుంది అధె 

విధముగా అందరిని  రక్షణ పొందుటకు  సహాయ పడుతుంది.  పాత నిబంధన 

గ్రంధంలోని  అన్నీబలులు కూడా క్రీస్తు ప్రభువు సమర్పించిన  కలువరి బలిలో 

పరిపూర్ణమైనవి. క్రీస్తు ప్రభువు ఈ బలి సమర్పించి  దేవుని కుడి ప్రక్కన 

ఆసీనుడైయున్నారు. ఆయన యొక్క యాజకత్వ సమర్పణ ద్వార, స్వీయ త్యాగం 

మనందరం నేడు శుద్దులుగా ఉంటున్నాం. పరిశుద్దత కలిగి ఉంటున్నాం. మనకు 

దేవుడు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ ద్వార 

 

మనమందరం పాపములనుండి శాశ్వతంగా పవిత్రులుగా చేయబడితిమి.

ఈనాటి సువిశేష పఠనం దేవుని యొక్క రాకడను గురించి బోధిస్తుంది. క్రీ. శ . 69 లో

 రోమియులు క్రైస్తవులను, అధే విధంగా నూతనంగా   క్రైస్తవత్వమును స్వీకరించిన

 యూదులను హింసలకు గురిచేస్తున్న కాలంలో తన ప్రజల యొక్క విశ్వాసాన్ని

 బలపరచడానికి దేవుడు మరలా  వస్తాడనే నమ్మకం కలిగిస్తూ మార్కు గారు ఈ 

వచనాలను వ్రాస్తున్నారు. తనకు కలిగిన దర్శనం వల్ల మనుష్య కుమారుని రాకడ 

జరిగినప్పుడుప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని అనగా సూర్యుణ్ణి 

చీకటి క్రమ్మటం, నక్షత్రాలు రాలి పడటం వంటి సంకేతాలు  కనిపిస్తాయని వివరించాడు.

వాస్తవానికి  నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు. దేవుని ఆజ్ఞల 

ప్రకారంగా జీవించని వారికి మాత్రమే అవి భయాన్ని కలుగచేస్తాయి. యేసు ప్రభువు 

యొక్క మాట వలన మనమందరం అత్తి చెట్ల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. అత్తి చెట్ల 

ఆకులు వసంత ఋతువు చివర్లోనే చిగురిస్తాయి. అవి అలా కనిపించినప్పుడు  ఒక క్రొత్త 

కాలం సంభవించినది అని మనకు తెలుస్తుంది. ఆకులు రాలిపోయాయి అంటే  చెట్టు 

చనిపోయింది అని కాదు అర్ధం, క్రొత్త ఆకులు వస్తాయి అని అర్ధం.  దేవుని యొక్క 

రెండవ రాకడ   జరిగినప్పుడు  కూడా క్రొత్త కాలం ప్రారంభమగుచున్నది, దానికి గాను 

అందరు కూడా విశ్వాసులుగా జీవించాలి. దేవునియొక్క రాకడ కోసం మనం ఎప్పుడు 

సంసిద్దులై జీవించాలి. లోకాంత్యం అంటే లోకం మొత్తంబూడిద కావడం కాదు. ఈ 

లోకంలో ఉన్న పాపం , ద్వేషం, సైతాను ఆలోచనలు అని కూడా వదలి లోకమంతా 

దేవుని  రాజ్యం ,ప్రేమ రాజ్యం , శాంతి రాజ్యంగా మార్చడమే. లోకమంతట నూతనత్వం , 

నవ జీవన వినూత్న చైతన్యం వర్ధిల్లీ ఉండటం. 

2 కోరింథీ 5:17 . యేసుప్రభువు చెప్పినటువంటి మూడు విషయాలు

-యెరుషలేము దేవాలయము ధ్వంసం

-లోకాంత్యం – దేవుని రాజ్యంగా మారటం

-క్రీస్తు ప్రభువు రెండవ రాకడ

మొదటి రెండు కూడా నెరవేరాయి కాబట్టి మూడవది తప్పక నెరవేరుతుందని ఆనాటి 

ప్రజలు విశ్వసించారు. దేవుని గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. తెలిస్తే ఆ 

సమయంలో సిద్దపడతారు. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు మనం సిద్ద పడాలి.

దేవుని యొక్క రాకడ కొన్ని విషయాలను తెలియ పరుస్తుంది.

1.   సర్వం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది.

2.  ఆయన క్రీస్తు నిజముగా దేవుడు అనే సత్యమును తెలియ పరుస్తుంది.

3.  దేవుడు మానవుల కష్టాలను తొలగించి వారికి సంతోషమును పంచి పెడతారు.

4.  దేవుడు రెండవ సారి వేంచేసే సమయంలో అందరు కూడా ఆయన మనుష్య కుమారుడని తెలుసుకొని విశ్వసిస్తారు. 27 వ వచనంలో  దూతలు దేవుడు ఎన్నుకొనిన వారిని ప్రోగుచేస్తారు.

1. ఎవరు ఎన్ను కొనబడిన వారు ? ఎవరైతే దేవుని యందు జ్ఞాన స్నానము పొంది ఉన్నారో

 అలాగే దేవుని కొరకు బాధలు అనుభవిస్తారో , ప్రార్థించే వారందరు ,సాయం చేసే వారందరు

 కూడా దేవుని యొక్క దూతల చేత  ప్రోగుచేయబడతారు. లూకా 18:7.

2.   ఎన్నుకొనబడిన వారు అంటే దేవుని యొక్క మెప్పు పొందిన వారు. రోమి 8:33

3.   పవిత్రులు , వినయవంతులు, సానుభూతి కలిగినవారు, సహనం కలిగిన వారు. కోలస్సీ 3:12.

ప్రపంచ నలుమూలల నుండి ఎన్నుకొనబడిన వారిని ప్రోగుచేస్తారు. మత్తయి 25:31-32.

-మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా జాగురుకులై  ఉండి  జీవించాలి.

మనం అంత్య కాలమునకు సిద్దపడాలి. దేవుని యొక్క ప్రకారం జీవిస్తే భయపదనక్కరలేదు.

 దేవుడు శాశ్వతంగా జీవించేవారు ఆయన పలోకిన ప్రతిమాట నెరవేరుతుంది. కాబట్టి మన

 జీవితంలో ఆయన రాకడ కోసం సిద్దపడుతూ జీవించాలి.

Rev.Fr. BalaYesu OCD


పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...