15, జూన్ 2024, శనివారం

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బోధిస్తున్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయములో వారి జీవితంలో ఒక నమ్మకమును కలుగ చేస్తున్నారు. దేవుడు ఎత్తైన దేవదారు మీద ఒక కొమ్మను విరిచి దానిని పర్వతం మీద నాటుతారు అని అన్నారు. ఆ యొక్క చెట్టు పెద్దదిగా ఎదిగి గొప్ప దేవదారు వృక్షం అగును అని తెలుపుచున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ఉద్దేశించి ప్రభువు పలికినటువంటి మాటలు.
ఇశ్రాయేలు ప్రజలు తాము చేసినటువంటి పాపమునకు ఫలితముగా బానిసత్వ జీవితమును జీవింపవలసి వచ్చినది. అన్యదైవములను పూజించినందుకు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు. వారి యొక్క బాధలో ఉన్న సమయంలో దేవుడు వారిని మరలా స్వీకరించటానికి సిద్ధపడ్డారు అందుకుగాను ప్రభువు పలుకుచున్నారు నేనే స్వయముగా కొమ్మను నాటుదను అది ఎదుగును అని తెలుపుచున్నారు అనగా యావే ప్రభువు త్వరలో ఇశ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి మరల వారికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తారని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే రాబోయే కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జన్మించి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేకమంది దేవుని యొక్క బిడ్డలగా మార్చబడతారు మరియు దేవుని యొక్క రాజ్యము విస్తరిల్లుతున్నది అని అర్థం. 
మొదటి పఠణము ద్వారా గ్రహించవలసిన అంశములు ఏమిటి అంటే;
1. దేవుడు మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతుంటాము, దీవించబడతాం. ప్రభువు ఏ విధముగానయితే ఇశ్రాయేలు ప్రజలకు భద్రతను కల్పిస్తూ, తోడుగా ఉంటూ వారు అభివృద్ధి చెందే విధంగా ప్రజలును దీవించారు. అలాగే దేవుడు మనతో ఉంటే మనం కూడా దీవించబడతాం.
2. ప్రభువు ఎత్తైన చెట్లను నరుకుతాను అని తెలుపుచున్నారు దీనిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని దేవుడు తమ యొక్క పదవుల నుండి తొలగిస్తారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో దేవుడు ఎలాగ గర్వాత్ములను అధికారం నుండి పడగొడతారు తెలుపుతూ దీనులను ఏ విధంగా దీవిస్తారో తెలిపారు. (లూకా 1:51,52)
3. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని తెలుపుతున్నారు ఎందుకనగా పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేసేది దేవుడు మాత్రమే అనగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలలో నమ్మకమును దయచేసి దేవుడే అలాగే గర్వముతో , భయము, భక్తి లేకుండా జీవించే వారి యొక్క జీవితాలు సంతోషము లేని జీవితాలుగా మారతాయి. దేవుడు తన ప్రజల జీవితంలో ఏదైనా చేయవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఈనాటి సువిశేష భాగములో కూడా ఏసుప్రభు పరలోక రాజ్య వ్యాప్తి గురించి రెండు ఉపమానముల ద్వారా తెలియచేయుచున్నారు. ఈ రెండు ఉపమానములలో ఎదుగుదల అనేది గొప్పదిగా ఉంటుంది. ప్రారంభం చిన్నదిగా ఉన్న ముగింపు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదగాలి అది విశ్వాసములో అవ్వొచ్చు, చదువులోనైనా అవ్వొచ్చు, ప్రార్థనలో నైనా అవ్వొచ్చు, సంపదల్లోనైనా అవ్వొచ్చు.  ప్రభువు విత్తు వాడిని ఉదాహరణగా తీసుకొని ఆ విత్తనములు వెదజల్లినప్పుడు ఏ విధంగానైతే ఎవరికీ తెలియకుండా మొలకలు వస్తాయో అదే విధముగా ప్రభువు యొక్క రాజ్యము కూడా ఎవరు ఊహించని విధంగా విస్తరిల్లుతుంది అని తెలిపారు.
రెండవ ఉపమానము ఏసుప్రభు ఆవగింజను ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యం గురించి తెలుపుచున్నారు. ఆవ గింజ చూడటానికి చిన్నదైనప్పటికీ దాని యొక్క ఎదుగుదల ప్రభావము చాలా గొప్పది. ప్రభువు ఎందుకు ఆవగింజనే ఉదాహరణగా తీసుకున్నారు అని ధ్యానించినట్లయితే ఆవగింజ చిన్నది కానీ ఫలితం పెద్దది అలాగే మన జీవితంలో కూడా వినయముతో ప్రారంభించిన ఏ పని అయినా సరే అది విజయవంతమగుతున్నది  ఎందుకంటే ఆయన దీనులను ఆశీర్వదిస్తారు కాబట్టి.
ఆనాడు దేవుడు ఆదాము అవ్వతో ప్రారంభించిన సృష్టి ఏ విధంగానైతే గొప్పగా విస్తరిల్లినదో అలాగే ఏసుప్రభు 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభించిన తన యొక్క పరిచర్య ఈనాడు దేవుని రాజ్యం ఎంతగానో విస్తరిల్లినదో మనం చూస్తున్నాం దీనికి కారణం దేవుడు. శ్రీ సభ దినదినాభివృద్ధి చెందాలి అంటే దేవుని కృప సహకారం ఉండాలి. ఆయన కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము దినదినాభివృద్ధి చెందాలి దానికి గాను వినయముతో జీవించాలి.
Fr. Bala Yesu OCD

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ  సామాన్యకాలపు ఆదివారము  యెషయా 53:10-11 హెబ్రీయులకు 4:14-16 మార్కు 10:35-45 క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమ...