13వ సామాన్య ఆదివారం
సొలోమోను జ్ఞాన 1: 13-15, 2: 23-24, 2 కొరింతి 8:7, 9,13-15
మార్కు 5:21-43
ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవునికి ఈ సృష్టి మీద మరియు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి తెలుపుచున్నవి. ఆయన సృష్టిని చేసినప్పుడు కంటికి అంతా బాగుగా ఉండెను.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏ విధముగా సృష్టిని చేసి ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా కాపాడుతున్నారని తెలుపుతుంది. దేవుడు మరణమును సృష్టించలేదు ఆయన సృష్టిని చేసిన సందర్భంలో ఏదీ కూడా తన కంటికి చెడుగా కనిపించలేదు అంతా కూడా బాగానే ఉన్నది. ఆయన ప్రణాళిక ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవించటానికి, అభివృద్ధి చెందడానికి మరియు మంచిగా ఉండటానికి సృష్టించారు కానీ సైతానే అసూయవలన మానవుడిని ప్రేరేపించి పాపంలోనికి నెట్టివేసి మరణంనకు గురిచేసినది. దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోలేదు కేవలం మానవుడు చేసిన తప్పిదం వలన తనంతట తాను మరణమును కొని తెచ్చుకున్నాడు. ఎవరి నాశనం వలన దేవుడు సంతోషించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.(యెహెజ్కేలు 18:23)
ఒకవేళ దేవుడే మనము నాశనం అవ్వాలి అని కోరుకున్నట్లయితే మన పాపాలకు ఆయన మనల్ని ఎప్పుడూ శిక్షించి ఉండవు కానీ అలా చేయలేదు.
ఆయన ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తన యొక్క ప్రవక్తలను పంపి ఉండేవారు కాదు అలాగే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు వెదకేటువంటి వారు కాదు మనము మంచిగా జీవించుట నిమిత్తమై దేవుడు మన కొరకు ప్రతినిత్యం కూడా కృషి చేస్తున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు మనందరం కూడా ఉదార స్వభావులై ఒకరికి ఒకరు సహయం చేసుకుని జీవించాలని తెలుపుతున్నారు ఏసుప్రభువు ఏ విధముగానయితే ఈ లోకంలో తనకు ఉన్నటువంటి మొత్తం కూడా విడిచిపెట్టి మన మధ్యకు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి తన అనుగ్రహాలను అందరికీ కూడా పంచి ఇచ్చి ఉన్నారో అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు, ఉన్నవారు ఇతరులకు సహాయం చేసి జీవించేటటువంటి సుగుణం కలిగి ఉండాలి అని పౌలు గారు తెలుపుచున్నారు. ఈనాటి సువిశేష పఠణంలో యేసు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించిన విధానము మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీకి స్వస్థత ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఈ రెండు సంఘటనలలో ఒకరి వయసు 12 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాల అనారోగ్యం . ఇక్కడ వీరిద్దరి యొక్క అచంచలమైనటువంటి విశ్వాసమును చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో వారి ప్రయత్నం చేసిన తర్వాత నిరాశలో ఉన్న సందర్భంలో దేవుని వైపు తిరుగుతూ కేవలం దేవుని శక్తి మీదే ఆధారపడుతూ యేసు ప్రభువుని ఆశ్రయించారు అందుకే ప్రభువు వారిద్దరి జీవితంలో మేలు చేశారు.
మోషే ధర్మ శాస్త్ర ప్రకారము రక్తస్రావంతో బాధపడే స్త్రీ అశుద్ధురాలుగా పరిగణింపబడుతుంది ఆమె దేవాలయమునకు వెళ్ళుటకు అనర్హురాలు అదేవిధంగా ఇతరులతో కలిసి ఉండటకు అనర్హురాలు. (లేవి 15:25-27) ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఖర్చు చేసింది ఏ వైద్యుడు కూడా తనకు స్వస్థత నివ్వలేదు తన యొక్క ప్రయత్నం తాను చేసిన తర్వాత చివరిసారిగా బహుశా యేసు ప్రభువు యొక్క మంచితనమును, స్వస్థతను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి కనీసం ఆయన యొక్క వస్త్రంను తాకినా స్వస్థత పొందవచ్చు అని భావించినది. ఏసుప్రభు ప్రయాణం చేసే సందర్భంలో చాలా మంది ఆయనను తాకారు కానీ వారెవరు స్వస్థత పొందినట్లు ప్రభువు పలకలేదు కేవలం ఈమెను గురించి మాత్రమే ఏసు ప్రభువు తెలిపారు ఎందుకంటే ఆమె నిజమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ఆశ్రయించి, ఆయన వస్త్రములు కూడా స్వస్థత ఉందని గట్టిగా నమ్మినది కాబట్టే తన విశ్వాసము ప్రకారంగా యేసుప్రభు అద్భుతం చేశారు.
యాయీరు కూడా ఒక అధికారి అయినప్పటికీ ఆయన తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడే సమయంలో తనకి మనవి చేయగా ఏసుప్రభువు అతని విశ్వాసం చూసి ఆ బిడ్డను స్వస్థతపరచ వచ్చి, ఆమెకు స్వస్థతనిచ్చారు. బాలిక మరణించినప్పటికీ కూడా ప్రభువు ఆమె కు నూతన జీవాన్ని ప్రసాదించారు. దేవుడు ఆమెకు జీవాన్ని ప్రసాదించి నా కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చారు అలాగే రక్తస్రావంతో బాధపడేటటువంటి ఆమెకు ప్రభువు ఆనందాన్నిచ్చారు.
ధ్యానించవలసిన అంశాలు
1. దేవుడు ఎవరు నాశనం అవ్వాలి అని కోరుకోరు కాబట్టి మనము కూడా నాశనం ణము కోరుకోకూడదు.
2. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలి.
3. దేవుని యందు పటిష్ట విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవుని మీద ఆధారపడి జీవించాలి.
5. మనకు దేవుడు తోడుగా ఉంటారు అని నమ్మకం కలిగి జీవించాలి.
Fr. Bala Yesu OCD