22, జూన్ 2024, శనివారం

12వ సామాన్య ఆదివారం

12వ సామాన్య ఆదివారం 
యోబు 38:1, 8-11, 2 కొరింతి 5:14-17,  మార్కు 4:35-41
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల జీవితంను ఏ విధముగా ప్రశాంత పరుస్తారు అనే అంశమును తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు ఉంటూనే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధముగా తన ప్రజలకు తోడుగా ఉండి వారిని బలపరుస్తారు అనే అంశము ఈనాటి పఠణాలలో క్షుణ్ణంగా అర్థమవుచున్నది.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు యోబుకు ఇచ్చిన సమాధానము గురించి తెలపబడినది. యోబు జీవితము మొదటిలో బాగానే ఉన్నది. ఆయన పిల్లాపాపలతో, సిరిసంపదలతో, మంచి పేరుతో సంతోషంగా జీవించాడు కానీ సైతాను తన యొక్క జీవితమును శోధించినప్పుడు యోబు అన్నీ కోల్పోయాడు. ఆయన సంపదలు పోయాయి, తన యొక్క ఇష్టమైన కుటుంబము  దూరమైపోయింది, స్నేహితులు దూరమయ్యారు, తనకు అనారోగ్యం సోకింది ఈ విధముగా అన్ని కోల్పోయిన సందర్భంలో తన జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాడు "నా యొక్క దీనస్థితికి కారణం ఏమిటి అన్నది" యోబు దేవుడిని తన యొక్క పరిస్థితికి కారణం ఏమిటి అని పదేపదే అడగగా దేవుడు అతనికి సమాధానమిచ్చారు. యోబుతో యావే దేవుడు సమాధానమిచ్చే సందర్భంలో తన స్థితికి కారణం ఏమిటి అని చెప్పలేదు కానీ దేవుడు ఆయనయే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది అని తెలిపారు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి యోబు యొక్క విశ్వాసము స్థిరమైనది అని ఈ లోకమునకు నిరూపించుట కొరకై ఆయన జీవితంలో కష్టాలను దేవుడు అనుమతించారు. అయినప్పటికీ ఆయన కష్టాలు ముగిసిన సందర్భంలో యోబును దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించి తనను ప్రశాంత పరిచారు. (యోబు 42:10). వాస్తవానికి యోబు యొక్క గ్రంథం బహుశా యూదులు  బానిసత్వంలో ఉండినప్పుడు వ్రాసి ఉండవచ్చు. ఈ గ్రంథంలో మరీ ముఖ్యంగా రచయిత మానవుని యొక్క బాధలకు కారణం ఏమిటి అనేటటువంటి అంశము తెలపాలనుకున్నారు కానీ దానికి తగిన సమాధానము ఇవ్వలేదు. యోబు గ్రంథం తెలిపే ఇంకొక అంశము ఏమిటి అంటే ఈ లోకంలో మంచివారు కష్టాలు అనుభవించవచ్చు, దుర్మార్గులు సంతోషిస్తూ జీవించ ఉండవచ్చు కానీ చివరికి దేవుడు కష్టాలు అనుభవించే మంచి వారిని ఆశీర్వదిస్తారు దుర్మార్గులను శిక్షిస్తారు. యోబు యొక్క జీవితంలో మనము గ్రహించవలసిన అంశము ఏమిటి అంటే మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సందర్భంలో దేవుని శక్తి మీదే ఆధారపడుతూ విశ్వాసము కోల్పోకుండా ఆయనను నమ్ముకొని ముందుకు సాగాలి. యోబు వలె విశ్వాసములో పటిష్టంగా ఉండాలి.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని తెలిపారు. క్రీస్తు నందు ఉన్నవారు పాత జీవితమును ముగించి కొత్త జీవితమును ప్రారంభిస్తారు అనగా వారి కష్టాలు తొలగించబడి సంతోషకరమైన జీవితము జీవిస్తారు అని అర్థం. క్రీస్తు నందు జీవించటం చాలా కష్టం కానీ అలా జీవించిన వారికి దేవుడు సమస్తమును సమకూర్చును. పౌలు గారు క్రీస్తునందు జీవించుట కొరకు అనేక కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి మనం కూడా క్రీస్తునందు జీవించటానికి ప్రయత్నం చేయాలి. 
ఈనాటి సువిషేశ పఠణంలో దేవుడు శిష్యుల యొక్క జీవితమును ప్రశాంత పరిచిన విధానము ధ్యానిస్తున్నాము. ఈ సువిశేషం ద్వారా మనం కొన్ని విషయాలు  ధ్యానించాలి. 
1. మన జీవితంలో (Sudden incidents )హఠాత్తుగా జరిగే అంశాలకు ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. 
శిష్యులు తమ యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అంత ప్రశాంతంగానే సాగింది కానీ ఒక్కసారిగా అలలు ప్రారంభమై సముద్రంలో పడవ మునిగేలాగా పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్స్, పక్షవాతం అనేవి హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అలాంటివారికి ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి మనము పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. 2020లో కరోనా వైరస్ సడన్గా అన్ని దేశాల్లో వ్యాపించి అనేకమంది జీవితాలను నాశనం చేసింది. శిష్యుల ప్రయాణం కూడా అప్పటివరకు బాగానే సాగింది కానీ ఒక్కసారిగా అంతా అతలాకుతలమైంది. 
2. మన కష్ట సమయాలలో దేవుడు మనతో ఉన్నారా అని మనకు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్య ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు కష్టాలు ఎదురవుతాయి అని చాలామంది భావిస్తూ ఉంటాం. శిష్యుల యొక్క జీవితంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నా వారి యొక్క పడవ మునగటం ప్రారంభించింది అంటే దేవుడు మనకు తోడుగానే ఉన్నప్పటికీ మన జీవితంలో ఆయన కష్టాలను అనుమతిస్తారు అది మరలా మనలను రక్షించుట కొరకే. మన విశ్వాసం బలపరచుట కొరకు.
3. మన యొక్క కష్ట సందర్భాలలో మనము విశ్వాసముతో దేవుని వైపు మరలాలి. శిష్యులు వారి యొక్క పడవ మునిగిపోవుచుండగా ఏసుప్రభు చెంతకు వెళ్లి వారి యొక్క మనవిని తెలిపారు. వాస్తవానికి సువిషేశంలో ఏసుప్రభు నిద్రిస్తున్నారు అని రాయబడి ఉన్నది వాళ్లందరూ భయంతో ఉంటే యేసు ప్రభువు మాత్రం హాయిగా నిద్రిస్తున్నారు అంటే శిష్యులు తన చెంతకు వస్తారా?, రారా?, అని ప్రభువు ఎదురు చూస్తున్నారు. మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు దేవుని వైపు రావాలి అని మరచిపోకూడదు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు. దేవుడు మాకు ఏమీ చేయటం లేదులే ఇంక దేవాలయానికి ఎందుకు వెళ్లాలి అనే ఆలోచనతో జీవిస్తుంటారు.
4. దేవుడు మన కష్టాలను చూసి మనల్ని ఆదుకుంటారు. శిష్యుల యొక్క పరిస్థితి చూసిన ప్రభువు వారిని ఆదుకున్నారు. వారికి తోడుగా నిలబడ్డారు వారి జీవితంలో సంతోషాన్నిచ్చారు.
5. మన కష్టాలు కొలది కాలం మాత్రమే. శిష్యుల యొక్క బాధ, భయం కొద్ది కాలం మాత్రమే ఉన్నది అది శాశ్వతంగా లేదు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు "Pain is never permanent' అని అంటారు అంటే ఏ బాధ కూడా శాశ్వతం కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది దాని తర్వాత సంతోషం ఉంటుంది. 
6. దేవుడు మన జీవితాలను ప్రశాంత పరుస్తారు. శిష్యులు ఎదుర్కొన్న భయాన్ని దేవుడు ప్రశాంత పరిచారు ఆయన సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు కాబట్టి సమస్తము ఆయన అధీనంలో ఉన్నది కావున ఆయన అలలను ప్రశాంత పరిచారు అదే విధముగా శిష్యుల యొక్క భయాన్ని భాదని తొలగించి సంతోషాన్నిచ్చారు. 
దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు కష్టాలు ఉన్న బాధలు ఉన్న అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు సాగగలం కాబట్టి దేవుని చెంతకు వస్తూ ఆయన మీద ఆధారపడుతూ మనము జీవించాలి ఆయనే మన జీవితాలను ప్రశాంతపరచి మన కష్టాలను తొలగించి మనలో సంతోషాన్ని నింపుతారు. 
Fr. Bala Yesu OCD

16వ సామాన్య ఆదివారం

యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34 ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపా...