6, జులై 2024, శనివారం

14 వ సామాన్య ఆదివారం

14 వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు 2:2-5, 2 కొరింతి 12:7-10, మార్కు 6:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క పిలుపు గురించి అదే విధముగా ఆ పిలుపులో ఎదురయ్యేటటువంటి తిరస్కరణ గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో తిరస్కరణ ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనము ధైర్యం కోల్పోకుండా ముందుకు దైవశక్తితో సాగాలి. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచిన విధానము  చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల చెంతకు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు, ప్రజలు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ,తనకు అవిధేయత చూపించినప్పటికీ ఆయన మాత్రము వారి శ్రేయస్సు కొరకై ప్రవక్తలను పంపుచున్నారు ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఇతరులు మనకు హాని చేసినప్పటికీ మనము మాత్రము వారికి మేలు చేయుటకే ప్రతినిత్యము ప్రయత్నం చేయాలి ఎందుకనగా దేవుడు సైతము తనకు విరుద్ధముగా నడుచుకున్న వారిని శిక్షింపక వారిని రక్షించుట నిమిత్తమై వారి కొరకు ప్రవక్తలను పంపుచునే ఉన్నారు. రక్షణ చరిత్రలో అనేక సందర్భాలలో ప్రవక్తలను ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రవక్తలను తిరస్కరించారు అంటే దేవుడిని తిరస్కరించినట్లే ఎందుకనగా ఏసుప్రభువు కూడా సువిశేషములో ఎవరైతే మిమ్ములను ఆహ్వానిస్తారో వారు మమ్మును కూడా ఆహ్వానిస్తారు అని తెలుపుచున్నారు, ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుడిని కూడా తిరస్కరిస్తారని అర్థం. మత్తయి 10:40. ప్రజలు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు మాత్రమే ప్రవక్తను పంపించనున్నారు. వారికి తెలుపుచున్న సత్యము ఏమిటంటే కనీసం వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నారు అని గ్రహిస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడుమున యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తున్నారు.
యెహెజ్కేలు ప్రవక్త, ప్రజల తప్పిదములను వేలెత్తి చూపారు, వాటిని ఖండించారు అలాంటి సందర్భాలలో ప్రజలు తనను ఎదిరించారు తన యొక్క సందేశాన్ని పెడచెవిని పెట్టారు ఎన్నో కష్టాలకు గురి చేశారు అయినప్పటికీ భయపడలేదు, పారిపోలేదు ఎందుకంటే దేవుడు వారికి ముందుగానే భయపడకూడదు అని ధైర్యమని ఇచ్చారు. (యెహె 2:6-7). ప్రజలు ఏలియా, హోషయ, యెషయా, యిర్మియ, యెహెజ్కేలు మరియు మిగతా ప్రవక్తలను తిరస్కరించినప్పటికీ వారు ప్రభువు సందేశమును తెలియజేశారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కృప గురించి మాట్లాడుచున్నారు ఆయన కష్టములలో, బాధలో ఉన్న సందర్భంలో దేవునికి ప్రార్థింపగా ప్రభువు అతనికి ఇచ్చిన అభయం నా కృప నీకు చాలును. దేవుడు తనకు అన్ని సమయంలో శక్తిని ఒసగుతారు అని అభయమునిస్తున్నారు కాబట్టి పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువు కొరకు ఎన్ని అవమానాలైన హింసలైన భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపుతున్నారు దానికి కారణం దేవుని కృప ఆయనకు ఎప్పుడు ఉంటుంది.
ఈనాటి సువిశేష పఠణములో ఏసుప్రభు నజరేతు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి నిరాదరణ గురించి మార్కు సువార్తికుడు తెలుపుతున్నారు. ప్రభువు మొదటిగా ప్రార్థన మందిరంలో బోధించిన సందర్భంలో అందరు కూడా ఆయన యొక్క జ్ఞానము చూసి ఆశ్చర్యపడుచున్నారు మరలా అదే ప్రజలు ఆయన యొక్క గతం గురించి, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో మనం కూడా చూసే అంశం ఇది ఒక వ్యక్తి మంచిగా ప్రసంగం చెబుతున్నారంటే వెంటనే వారు ఆయన యొక్క గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు, తరువాతనే ఆ వాక్యమును పాటించటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏసుప్రభు యొక్క జీవితంలో కూడా తన యొక్క సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు అందుకే ఏసుప్రభు ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో ఆదరింపబడురు అని తెలుపుచున్నారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ కేవలము కొన్ని అద్భుతాలు మాత్రమే ప్రభువు చేశారు. మనము గమనించవలసిన అంశం ఏమిటంటే మన జీవితంలో మనము అంగీకరించబడినా, అంగీకరించక పడకపోయినా ముందుకు వెళ్లాలి మనకు అప్ప చెప్పినటువంటి పనిని నెరవేర్చాలి. ఏసుప్రభును తన ప్రజలే తనను నిరాకరించినప్పుడు కృంగిపోలేదు, పరిచర్య మానుకోలేదు ఆయన ధైర్యంతో ముందుకు సాగి తండ్రి చిత్తమును నెరవేర్చారు అదే విధముగా మనము కూడా తిరస్కరించబడినపుడు దైవ శక్తితో ముందుకు సాగి దేవుని చిత్తమును నెరవేర్చాలి. 

Fr. Bala Yesu OCD

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...