20, జులై 2024, శనివారం

16వ సామాన్య ఆదివారం


యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34

ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపాడుతుంటారు అని అంశమును తెలుపుచున్నవి. దేవునికి ప్రజలకు ఉన్నటువంటి బంధము ఏ విధంగా ఉన్నదంటే కాపరికి మందకు ఉన్నటువంటి బంధం ఇవి రెండూ కూడా ఎప్పుడు కలసి ఉంటాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త యొక్క మాటలను చదువుకుంటున్నాము. యిర్మియా ప్రవక్త క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో యూదా రాజధాని అయినటువంటి యెరుషలేములో పరిచర్యను చేశారు. ఆయన అనేక మంది రాజులను, ప్రజలను, నాయకులను దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించమని తెలిపారు. దేవుని యొక్క దృష్టిలో ఏది  ఉత్తమం దానిని ప్రకటించారు. యిర్మియ సత్యమును ప్రకటించుటవలన అనేక బాధలను అనుభవించవలసి వచ్చింది. యిర్మియా ప్రవక్త సెద్కియా కాలంలో ప్రవచించారు. ఆయన ఒక బలహీనమైన రాజు, నిలకడత్వం లేని వ్యక్తి. ప్రవక్త యొక్క సందేశాన్ని ఆలకిస్తాడు కానీ దానిని ఆచరణలో ఉంచడు. అప్పుడు యూదా రాజ్యం బాబిలోనియా చక్రవర్తికి లోబడుతుంది. యిర్మియా ప్రవక్త రాజును బాబిలోని రాజుకు లోబడి జీవించమని తెలిపినప్పుడు దానిని ఆచరించలేదు దానికి బదులుగా రాజభవనంలో ఉన్న కొంతమంది సలహాదారులు ఐగుప్తు సహాయం రాజు సహాయం కోరమని తెలియజేశారు కానీ యుద్ధం చేసిన తర్వాత యూదా ప్రజలు ఓడిపోయారు దానికి గాను బాబిలోనికి బానిసత్వానికి వెళ్లారు. 
నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి ప్రభువే స్వయముగా తన గొర్రెలను ప్రోగు చేసి వారి కొరకు కాపరులను నియమిస్తాను అని తెలుపుచున్నారు. దేవుడే స్వయముగా ఒక కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చుతారు అనేటటువంటి అంశమును కూడా తెలుపుచున్నారు (కీర్తన 23). ఆయన యొక్క శ్రద్ధ వలన తన మంద పోషించబడుతుంది, అభివృద్ధి చెందుతుంది. తన మందను ఎన్నడూ విడిచి పెట్టినటువంటి కాపరులను కూడా నియమిస్తానని తెలుపుచున్నారు. యావే ప్రభువు తనకు ఉన్నటువంటి ప్రేమ వలన ప్రజల కొరకు మంచి కాపరులను నియమిస్తానని తెలుపుచున్నాను.
దేవుడు ఎవరికి అయితే తమమందనం చూసుకొనమని బాధ్యతను అప్పగించి ఉన్నారో వారు సరిగా వ్యవహరించకపోతే దేవుడు వారిని శాపగ్రస్తులుగా చేస్తుంటారు అని పలికారు. దేవుడు నమ్మి బాధ్యతను అప్పగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా నెరవేర్చాలి. తండ్రికి కుటుంబ బాధ్యతను అప్పగించారు, గురువుకు విచారణ బాధ్యతను అప్పగించారు, ఉపాధ్యాయునికి పిల్లల బాధ్యతను అప్పగించారు, వైద్యులకు రోగుల బాధ్యతను అప్పగించారు, రాజకీయ నాయకులకు దేశ ప్రజల బాధ్యతను అప్పగించారు ఈ విధముగా చాలా విధములైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి వానిని మనము సక్రమముగా ప్రజల యొక్క, ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై వినియోగించాలి. 
అందరి కొరకై దేవుడు దావీదు వంశము నుండి మంచి కాపరి అయినటువంటి ఏసుప్రభువును, మనలను పరిపాలించు నిమిత్తము పంపిస్తారు అని కూడా యిర్మియా ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుడు ఉత్తమ కాపరిగా ఉంటూ యూదులను అన్యులను ఐక్యము చేశారు అని తెలిపారు. ఏసుప్రభు యూదులను మరియు అన్యులను సఖ్యపరచి వారిని ఒకటిగా చేశారు. ఏసుప్రభు నందు విశ్వాసము ఉంచినటువంటి వారందరూ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఒకే ప్రజగా జీవిస్తారు అని తెలిపారు  (గలతి 3:28-29). క్రైస్తవులుగా మారిన యూదులు ఏసుప్రభువును మెస్సయ్యగా గుర్తించి అంగీకరించారు, అదే విధముగా అప్పటివరకు అన్య దైవములను పూజించిన అన్యులు కూడా యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించి విశ్వసించి ఆయనను వెంబడించారు.
ఈనాటి సువిశేష భాగంలో ఏసుప్రభు యొక్క శిష్యులు పరిచర్యను ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సంఘటనను చూస్తున్నాం. శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక రకములైన అద్భుతములు చేసి దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరచి తిరిగి వచ్చారు వారి యొక్క స్థితిని చూసినటువంటి ప్రభువు వారికి కొద్దిపాటి విశ్రాంతి కావాలి అని భావించారు. అందుకే ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని భావించారు కానీ అదే సందర్భంలో ప్రజలు అనేకమంది ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. 
ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశములు ఏమిటంటే 
1. ఏసుప్రభువుకు తన శిష్యులు మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ.  ( వారి యొక్క శారీరక బలహీనతను అర్థం చేసుకున్నారు)
2. ప్రతి ఒక్కరి జీవితంలో కొద్ది సమయం విశ్రాంతి (A time of introspection) తీసుకోవాలి ఎందుకంటే ఆ విశ్రాంతి సమయంలో మనం ఎలాగ జీవించాము అని ఆత్మ పరిశీలన చేసుకొనుట కొరకై.
3. ప్రభువు తన యొక్క ప్రజల యొక్క అవసరతను గుర్తించి వారికి బోధించారు. 
4. దేవుని యొక్క వాక్కు కొరకై ప్రజలకు ఉన్నటువంటి గొప్ప తపన. 
5. దేవుని కొరకై తపించేవారు ఎప్పుడు దేవుని విషయంలో ముందే ఉంటారు. ప్రజలు ఏసుప్రభువు చూడటానికి వారి కంటే ముందుగా కాలినడక మీదనే వచ్చారు.
6. ఏసుప్రభు యొక్క సహనము మనము అర్థం చేసుకోవాలి అలసిపోయినప్పటికీ ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇవ్వవలసిన సమయం దేవుడు వారికి ఇస్తున్నారు. 
7. ప్రభువు కాపరి వలె తన మందమీద కనికరమును చూపించారు మనం కూడా అదే విధంగా జీవించాలి.
ఈ యొక్క పరిశుద్ధ పఠణముల ద్వారా దేవుడు మనందరిని కూడా కాపరులుగా ఉంచుతూ మనకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమముగా నెరవేర్చమని తెలుపుచున్నారు. 
యిర్మియా తన బాధ్యతను నెరవేర్చిన విధంగా, పౌలు తన బాధ్యతను నెరవేర్చిన విధంగా మరియు శిష్యులు తమకు ఇచ్చిన పనిని సక్రమంగా చేసిన విధంగా మనకి కూడా దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కాపరి వలె మంచి చేస్తూ మంద కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. 
Fr. Bala Yesu OCD

13, జులై 2024, శనివారం

15వ సామాన్య ఆదివారం


ఆమోసు 7:12-15, ఎఫేసి 1:3-14, మార్కు 6:7-13
ఈనాటి పరిశుద్ధ గ్రంధం పఠణములు, దేవుని పిలుపు- మానవ స్పందన గురించి తెలుపుచున్నాయి. ప్రతి పఠణం కూడా దైవ పిలుపును విశ్వాసముతో స్వీకరించి ప్రభువు యొక్క సేవ చేయాలి అనే అంశమును తెలియజేస్తున్నాయి.
మొదటి పఠణంలో యావే దేవుడు ఆమోసు ప్రవక్తను  ఉత్తర ఇస్రాయేలు ప్రజలు చెంతకు పంపించిన విధానము చదువుకుంటున్నాము.  
యావే ప్రభువు క్షీణించే ప్రజల మధ్యకు ప్రవక్తను  పంపారు. ఆమోసు ప్రవక్త సామాజిక న్యాయం కొరకు పోరాడిన వ్యక్తి. గొర్రెల మందను కాసుకునేటటువంటి వ్యక్తిని దేవుడే స్వయముగా పరిచర్యకు పిలిచారు అని తెలిపారు. ఆమోస్ ప్రవక్త తాను భుక్తి కోసం పనిచేయటం లేదు కేవలము దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే నిస్వార్థముగా పనిచేస్తున్నాను అని తెలిపారు. క్రీస్తుపూర్వం ఎనిమిదివ శతాబ్దంలో పాలస్తీనా దేశం లో ఉత్తర రాజ్యంలో జేరోబవాము రాజు ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నారు. ఈ రాజు యొక్క పరిపాలన కాలంలో మత విలువలు అడుగంటిపోయాయి, అవినీతి పెరిగింది, ధనికులు అన్యాయంగా పేదవారిని దోచుకొనుట సాధారణమైంది. ఒక ప్రక్కన ధనికులు సుఖసంతోషాలతో జీవిస్తుంటే, పేదవారు మాత్రము ఆకలి బాధతో అలమటించేవారు. రాజు సైతం దేవుడిని మరచి అన్య దైవములను కొలవటం ప్రారంభించారు ఇట్టి సందర్భంలో ప్రభువు ఆమోస్ను ప్రజల యొక్క శ్రేయస్సు కొరకై, వారి జీవిత విధాన మార్పు కొరకై పంపిస్తున్నారు. ప్రవక్త ప్రజల యొక్క తప్పిదములను వారి అవినీతిని పండించారు, విగ్రహారాధనను రూపుమాపారు. యావే దేవుని యొక్క మాట విననట్లయితే బానిసత్వం లోనికి వెళ్ళవలసి ఉన్నది అని ప్రవక్త గట్టిగా ఉపదేశించారు, వాస్తవానికి అది జరిగినది కూడా. బేతేలు క్షేత్రం వద్ద పలికిన ఈ మాటలు అ అచ్చటి అర్చకుడైన అమాస్య ప్రవక్తకు నచ్చలేదు అందుకే ఆమోసుతో, నీవు నీ ప్రాంతమునకు వెళ్లి ప్రవచనములు పలుకుతూ భోజనమును సంపాదించుకోమని హేళనగా మాట్లాడారు, ఇకమీదట బేతేలులో ప్రవచించవద్దు అని కూడా హెచ్చరించారు కానీ ఆమోస్ మాత్రము ధైర్యముగా దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చారు.
ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు కేవలం పొట్టకూటిపై ప్రవక్తలగా చలామణి అయ్యేవారు రాజు యొక్క మెప్పు కొరకు పని చేసేవారు. రాజు ఏది చెబితే అదే దైవ చిత్తము గా బోధించారు రాజును మెప్పించుట కొరకు చెడును కూడా మంచిగానే బోధించేవారు ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే దేవుడు అమోస్ ప్రవక్తను ఎన్నుకొని సత్యమును బోధించుటకు పంపించారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క పిలుపుని గురించి తెలుపుచూ ఆయన మనలను సృష్టికి పూర్వమే పవిత్రులుగా ఉండుటకు నిర్దోషులుగా ఉండుటకు ఎన్నుకున్నారు అని తెలిపారు. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహాలను వసగి ఉన్నారు. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులము కావించబడ్డాము, మన పాపాలు క్షమించబడ్డాయి. 
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు తన యొక్క అపోస్తులను సువార్త సేవకై పంపించిన విధానము చదువుకుంటున్నాము. ఆమోసు ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల‌ వద్దకు పంపిన విధంగా, పౌలు గారిని అన్యుల వద్దకు పంపిన విధంగా, ఏసుప్రభు తన శిష్యులను కూడా దైవ సందేశ నిమిత్తమై వివిధ ప్రాంతాలకు ఇద్దరు చొప్పున పంపిస్తున్నారు. ఈ యొక్క సువిశేషంలో ధ్యానించవలసిన ప్రధానమైన అంశములు; 
1. అందరూ రక్షింపబడాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశం. 
2. దేవుని యొక్క సందేశము ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి అందుకే ప్రభు తన శిష్యులను పంపిస్తున్నారు.
3. శిష్యులు ప్రజలలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దయ్యములను పారద్రోలి వారికి మేలు చేయాలి. 
4. అపోస్తులను ప్రతినిత్యము ఏసుప్రభు మీదే ఆధారపడి జీవించాలి. 
5. దేవుని పనిలో కొన్నిసార్లు తిరస్కరణలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. 
6. అపోస్తులు హృదయ పరివర్తనను ప్రకటించి అనేక మందికి స్వస్థత చేకూర్చారు.
7. దేవుడు ఎల్లప్పుడూ తాను ఎన్నుకున్న వారికి తోడుగానే ఉంటారు అనే విషయం మనం ప్రభువు వెల్లడిస్తున్నారు ఎందుకనగా ప్రజల జీవితంలో అద్భుతాలు జరగటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు అనేటటువంటి ఒక కారణం. 
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఏ విధముగానయితే దేవుని యొక్క సందేశము కొరకై పిలవబడిన వారి గురించి మరియు వారి యొక్క సేవ జీవితం గురించి తెలియచేయబడినదో మనము కూడా దేవుని చేత జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకొనబడినటువంటివారం కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను పంచాలి ఆయన సేవ చేయాలి. 
Fr. Bala Yesu OCD.

6, జులై 2024, శనివారం

14 వ సామాన్య ఆదివారం

14 వ సామాన్య ఆదివారం 
యెహెజ్కేలు 2:2-5, 2 కొరింతి 12:7-10, మార్కు 6:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క పిలుపు గురించి అదే విధముగా ఆ పిలుపులో ఎదురయ్యేటటువంటి తిరస్కరణ గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో తిరస్కరణ ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనము ధైర్యం కోల్పోకుండా ముందుకు దైవశక్తితో సాగాలి. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచిన విధానము  చదువుకుంటున్నాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజల చెంతకు ఒక ప్రవక్తను పంపిస్తున్నారు, ప్రజలు తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ,తనకు అవిధేయత చూపించినప్పటికీ ఆయన మాత్రము వారి శ్రేయస్సు కొరకై ప్రవక్తలను పంపుచున్నారు ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఇతరులు మనకు హాని చేసినప్పటికీ మనము మాత్రము వారికి మేలు చేయుటకే ప్రతినిత్యము ప్రయత్నం చేయాలి ఎందుకనగా దేవుడు సైతము తనకు విరుద్ధముగా నడుచుకున్న వారిని శిక్షింపక వారిని రక్షించుట నిమిత్తమై వారి కొరకు ప్రవక్తలను పంపుచునే ఉన్నారు. రక్షణ చరిత్రలో అనేక సందర్భాలలో ప్రవక్తలను ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రవక్తలను తిరస్కరించారు అంటే దేవుడిని తిరస్కరించినట్లే ఎందుకనగా ఏసుప్రభువు కూడా సువిశేషములో ఎవరైతే మిమ్ములను ఆహ్వానిస్తారో వారు మమ్మును కూడా ఆహ్వానిస్తారు అని తెలుపుచున్నారు, ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుడిని కూడా తిరస్కరిస్తారని అర్థం. మత్తయి 10:40. ప్రజలు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు మాత్రమే ప్రవక్తను పంపించనున్నారు. వారికి తెలుపుచున్న సత్యము ఏమిటంటే కనీసం వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నారు అని గ్రహిస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడుమున యెహెజ్కేలు ప్రవక్తను పంపిస్తున్నారు.
యెహెజ్కేలు ప్రవక్త, ప్రజల తప్పిదములను వేలెత్తి చూపారు, వాటిని ఖండించారు అలాంటి సందర్భాలలో ప్రజలు తనను ఎదిరించారు తన యొక్క సందేశాన్ని పెడచెవిని పెట్టారు ఎన్నో కష్టాలకు గురి చేశారు అయినప్పటికీ భయపడలేదు, పారిపోలేదు ఎందుకంటే దేవుడు వారికి ముందుగానే భయపడకూడదు అని ధైర్యమని ఇచ్చారు. (యెహె 2:6-7). ప్రజలు ఏలియా, హోషయ, యెషయా, యిర్మియ, యెహెజ్కేలు మరియు మిగతా ప్రవక్తలను తిరస్కరించినప్పటికీ వారు ప్రభువు సందేశమును తెలియజేశారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు దేవుని యొక్క కృప గురించి మాట్లాడుచున్నారు ఆయన కష్టములలో, బాధలో ఉన్న సందర్భంలో దేవునికి ప్రార్థింపగా ప్రభువు అతనికి ఇచ్చిన అభయం నా కృప నీకు చాలును. దేవుడు తనకు అన్ని సమయంలో శక్తిని ఒసగుతారు అని అభయమునిస్తున్నారు కాబట్టి పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువు కొరకు ఎన్ని అవమానాలైన హింసలైన భరించటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపుతున్నారు దానికి కారణం దేవుని కృప ఆయనకు ఎప్పుడు ఉంటుంది.
ఈనాటి సువిశేష పఠణములో ఏసుప్రభు నజరేతు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి నిరాదరణ గురించి మార్కు సువార్తికుడు తెలుపుతున్నారు. ప్రభువు మొదటిగా ప్రార్థన మందిరంలో బోధించిన సందర్భంలో అందరు కూడా ఆయన యొక్క జ్ఞానము చూసి ఆశ్చర్యపడుచున్నారు మరలా అదే ప్రజలు ఆయన యొక్క గతం గురించి, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో మనం కూడా చూసే అంశం ఇది ఒక వ్యక్తి మంచిగా ప్రసంగం చెబుతున్నారంటే వెంటనే వారు ఆయన యొక్క గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు, తరువాతనే ఆ వాక్యమును పాటించటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏసుప్రభు యొక్క జీవితంలో కూడా తన యొక్క సొంత ప్రజలే తనను అర్థం చేసుకోలేదు అందుకే ఏసుప్రభు ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో ఆదరింపబడురు అని తెలుపుచున్నారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ కేవలము కొన్ని అద్భుతాలు మాత్రమే ప్రభువు చేశారు. మనము గమనించవలసిన అంశం ఏమిటంటే మన జీవితంలో మనము అంగీకరించబడినా, అంగీకరించక పడకపోయినా ముందుకు వెళ్లాలి మనకు అప్ప చెప్పినటువంటి పనిని నెరవేర్చాలి. ఏసుప్రభును తన ప్రజలే తనను నిరాకరించినప్పుడు కృంగిపోలేదు, పరిచర్య మానుకోలేదు ఆయన ధైర్యంతో ముందుకు సాగి తండ్రి చిత్తమును నెరవేర్చారు అదే విధముగా మనము కూడా తిరస్కరించబడినపుడు దైవ శక్తితో ముందుకు సాగి దేవుని చిత్తమును నెరవేర్చాలి. 

Fr. Bala Yesu OCD

16వ సామాన్య ఆదివారం

యిర్మియా 23:1-6, ఎఫేసి 2:1-6, మార్కు 6:30-34 ఈనాటి పరిశుద్ధ గ్రంథము పఠణములు దేవుడు మంచి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అన్నియు సమకూర్చి వారిని కాపా...