The Feast of Epiphany
క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12
ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడుచున్నది. ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగను కూడా పిలుస్తారు. సాక్షాత్కారం అనగ ఎరుకపరచుకొనుట. దేవుడు మొట్టమొదటిగా సారిగా తన్ను తాను అన్యులకు ఎరుకపరచుకొనుట. క్రీస్తు సాక్షాత్కార పండుగ ద్వారా మానవ లోకంలో దైవ సాక్షాత్కారం జరిగింది.
దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి తెరచాటు తొలగిపోయి ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారు. ఈ యొక్క పండుగను మూడు విధాలుగా పిలుస్తుంటారు;
1. ముగ్గురు రాజుల పండుగని
2. విశ్వాసుల పండుగని
3. అన్యుల క్రిస్మస్ పండుగని పిలుస్తారు
ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి బెత్లహేమునకు చేరి దివ్య బాల యేసును దర్శించుకున్నారు. అందుకు వారు దూర ప్రాంతం నుండి ప్రయాణం చేశారు. వారు అన్యులైనప్పటికిని ప్రభువుని ఆరాధించుటకు సుదీర్ఘ ప్రయాణం చేసి బెత్లహేము చేరుకున్నారు. ఎవరు ఈ ముగ్గురు జ్ఞానులు పేర్లు ఈ విధంగా ఉన్నాయి
1. కాస్పర్ (అరేబియా)-సాంబ్రాణిని సమర్పించారు.
2.మెల్కియోర్(ఇరాక్)-బంగారమును సమర్పించారు.
3. బల్తజార్(పర్షియా)- పరిమళ ద్రవ్యమును సమర్పించారు.
ఈ ముగ్గురు రాజులు సమర్పించినటువంటి కానుకలు ఏసుప్రభు యొక్క దైవత్వమునకు సూచనగా ఉన్నవి.
బంగారము ఏసుప్రభు యొక్క రాజత్వమునకు గురుతుగా ఉన్నది. సాధారణంగా మనము ఎవరినైనా చూడటానికి వెళ్లేటప్పుడు వారికోసం ఏదో వస్తువులను కానీ, ఫలాలు కానీ తీసుకుని వెళుతుంటాం జ్ఞానులు కూడా ప్రభువు యొక్క జీవితమునకు సంబంధించిన కొన్ని విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చారు
- మొదటి కానుక బంగారం. ఈ బంగారము ఏసుప్రభు యొక్క పరిశుద్ధతకు సూచనగా కూడా ఉంది. ఏసుప్రభు పరిశుద్ధుడని ఒక జ్ఞాని గ్రహించి ఆయనకు సమర్పించుటకు ఈ యొక్క బంగారము తీసుకుని వచ్చారు. ప్రభువు యొక్క దర్శనం కలగాలంటే మనకు కూడా పరిశుద్ధ మనస్సుతో ఆయన చెంతకు రావాలి.
- సాంబ్రాణి సువాసనకు గుర్తు ఈ యొక్క సాంబ్రాణిని ధూపం వేయుటకు వినియోగిస్తారు. ఏసుప్రభువు నిత్య యాజకుడు. యాజకుడు దేవాలయంలో ధూపం వేసి దేవునికి బలులు ప్రార్థనలు సమర్పిస్తారు కావున క్రీస్తు ప్రభువు సమర్పించే బలిని సూచించుట కొరకై ఈ యొక్క సాంబ్రాణిని సమర్పించారు.
- మూడవ కానుక పరిమళ ద్రవ్యం ఇది ఏసుప్రభువు యొక్క మరణమును సూచిస్తూ ఉంది. పూర్వకాలం యూదులు మరణించినప్పుడు వారి యొక్క దేహమును పరిమళ ద్రవ్యము పోసి భద్రపరిచేవారు ఏసుప్రభువు యొక్క మరణము ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే గ్రహించి ఆయన యొక్క మరణమును సూచించుట కొరకై దైవ ప్రణాళిక ప్రకారము ఈ యొక్క పరిమళ ద్రవ్యమును సమర్పించారు. యొక్క పరిమళ ద్రవ్యమును చాలా విధాలుగా వినియోగిస్తారు; వస్త్రాలకు, శరీరంకు అలాగే మృతదేహాలకు. పరిమళ ద్రవ్యమును ముక్కు రంధ్రంలో ఉంచిన ఆ యొక్క మృతదేహం కొద్ది కాలం వరకు నశించకుండా అలాగే భద్రంగా ఉంటుంది.
ఈయొక్క ముగ్గురు జ్ఞానులలో మనం గ్రహించవలసిన కొన్ని అంశాలు
1. జ్ఞానులలో గాఢమైన కోరిక ఉంది- లోకాలనేలే రాజును చూడాలనేటటువంటి గాఢమైనటువంటి కోరిక వారిలో ఉంది, ఆయన చూడాలని, తాకాలని, కానుకలు సమర్పించాలనే కోరిక వారిలో ఉంది
2. చీకటి నుండి వెలుగుకు ప్రయాణం. జ్ఞానులు యొక్క ప్రయాణం చీకటిలో సాగింది ఎందుకనగా కేవలం ఒక నక్షత్రమును ఆధారంగా చేసుకుని వారు బాల యేసు ఉన్న చోటును వెదికారు. మన జీవితాలు కూడా చీకటి నుండి వెలుగుకు సాగాలి. చీకటిలో ఉన్నప్పటికీ అవి వెలుగు వైపు వెళ్లాలి. కేవలము విశ్వాసము ద్వారానే నక్షత్రంను విశ్వసించి దేవుని యొక్క నక్షత్రమని తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు.
3. కానుకలు సమర్పించారు. ఏసుప్రభు యొక్క గొప్పతనమును గ్రహించి ప్రభువునకు విలువైన కానుకలు సమర్పించారు.
4. పాత మార్గమును విడిచిపెట్టి కొత్త మార్గము అనుసరించారు.
5. దేవుని యొక్క మాటలకు విధేయత చూపారు
6. దివ్య బాల యేసు నందు సాష్టాంగ పడి ప్రభువుని ఆరాధించి తమ యొక్క వినయమును వ్యక్తపరిచారు.
ఈ విధంగా మనందరం కూడా ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల నుండి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఇంకెన్నో ఉన్నాయి కావున వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభువుని దర్శించుకుని ఆయన యొక్క అనుభూతిని పొందుతూ జీవించటానికి ముగ్గురు జ్ఞానులు వలే ప్రతిరోజు ప్రయత్నిస్తూ చీకటి నుండి వెలుగు అయిన దేవుని చెంతకు చేరాలి.
Fr. Bala Yesu OCD