25, మార్చి 2023, శనివారం

తపస్సు కాల ఐదవ ఆదివారము

 

తపస్సు   కాల  ఐదవ  ఆదివారము


                                                        హెయిజ్కే : 37:12-14

    రోమా :8:8-11

    యోహాను :11: 1- 45

ఈనాటి మూడు పఠనములు విధముగా దేవుడు మనలను మరణము నుంచి జీవానికి నడిపిస్తారో అని వివరిస్తున్నాయి.

మొదటి పఠనము:

 మరణం ద్వారా నిరాశ నిస్పృహలో మునిగిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా సమాధులను  తెరచి మరలా  జీవాన్ని ప్రసాదిస్తానని అభయమిస్తు, దేవుడు జీవ ప్రదాత అని గుర్తు  చేస్తున్నాడు.   

 రెండవ పఠనము: క్రీస్తుని ఆత్మ మనయందు వుంటే నశించు మన శరీరములనుకూడా జీవంతో నింపబడతాయి. 

సువిశేష పఠనము:  క్రీస్తు లాజరును మృతులలోనుండి లేపిన విధముగా మనలనుకూడా మరణము నుండి జీవితానికి, నిరాశనుండి నిరీక్షణకు నడిపిస్తారు.

  వీటిని మూడు అంశాలద్వారా ధ్యానిస్తూ అర్ధం చేసుకుందాం.ఆలోచిస్తూ మన జీవితాలకు ఆపాదించుకుందాం.    

1.మరణం దాని పరమార్ధం .

2.దేవుడు జీవ ప్రధాత .

3.జీవం పొందుటకు మన కర్తవ్యం.

     I. విశ్వాసం.

Ii.మనకు మనం మరణించాలి .

Iii.దేవుని అనుసరణ.

 

1.  మరణం దాని పరమార్ధం .:

    మరణం అంటే ప్రాణాన్ని/ జీవాన్ని శాశ్వతంగా కోల్పోవడం. మరణం ఎప్పుడు , ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ( కీర్త: 89: 48 )( సిరా: 7:36 ).

ఒకరు ముందు మరొకరు తరువాత. కానీ ప్రతిఒక్కరు మరణించాల్సిందే. మనకు మనము ఎంత దగ్గరిగా ఉంటామో  మనకి కూడా మరణం అంతే దగ్గరగా ఉంటుంది. మనము ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రులమైనా కావచ్చు, ఆర్ధికంగా ఎంత ధనవంతులమైనా కావచ్చు, భౌతికంగా ఎంత ఆరోగ్యవంతులమైనా, ఆకారంగా ఎంత ధృడవంతులమైనా, చూడటానికి  ఎంత అందముగా వున్నా , సమాజములో ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నా మరణం సంభవిస్తుందంటే వణికి పోతాం , భయపడతాం.

కానీ  క్రైస్తవులమైన మనము మరణానికి  భయపడనవసరంలేదు. ఎందుకంటే, ఆదాము  పాపము మూలముననే  మృత్యుపాలన ప్రారంభమైనది  కానీ, యేసు క్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము  మరెంతో  గొప్పది! దేవుని విస్తారమైన  అనుగ్రహము, నీతియునూ, అయన కృపావరములను పొందువారు అందరునూ  క్రీస్తు ద్వారా  జీవితమునందు  పాలింతురు ( రోమా:5:17  ). క్రీస్తు తన మరణంతో  మరణాన్ని  శాశ్వతంగా ద్వంసం చేసి తన పునరుత్తానముతో మనకి జీవాన్ని ఇచ్చేరు .(  1కొరింతి:15: 54-57  ) జీవం శాశ్వతమైనది.. మరణంతో  మన జీవితం      అంతము కాదు కానీ,  మరణం శాశ్వత జీవితానికి ఒక ద్వారము. 

 

2.  దేవుడు జీవ ప్రధాత:

     ఈనాటి మొదటి  పఠనంలో   ( హెయిజ్కే :37:12-14 ) మరణం ద్వారా నిరాశ నిస్పృహలో మునిగిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా సమాధులను  తెరచి మరలా  జీవాన్ని ప్రసాదిస్తానని అభయమిస్తు, దేవుడు జీవ ప్రదాత అని గుర్తు  చేస్తున్నాడు.    ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు మరణించిన లాజరును తిరిగి ప్రాణంతో సమాధినుంచి లేపుతున్నాడు. ఇది కూడా దేవుడు జీవ ప్రదాత అని గుర్తు జేస్తుంది.

రెండవపఠనం ద్వారా పునీత పౌలు గారు  ఆత్మగతమైన జీవితమును  జీవించమని అంటే, శరీరాను సారముగా గాక, ఆత్మానుసారముగా జీవిస్తూ, , ఆత్మను మనలో ప్రతిష్ఠించుకొని ,నశించు మన శరీరమునకు జీవం ప్రసాదించబడుతుంది అని గుర్తుచేస్తున్నారు .

యోహాను గారు తన సువార్తలో నిత్యజీవము అను అంశానికి  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు..  అదేవిధముగా క్రీస్తు ప్రభువును జీవముగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినది జీవాన్ని ఇవ్వడానికి దానిని   సమృద్ధిగా ఇవ్వడానికి ( యోహా :10:10  ) క్రీస్తు ప్రభువు నాటి సువిశేష  పఠనంలో అంటున్నారు, “నేనే  పునరుత్తానమును  జీవమును(యోహా: 11:25  ). లాజారుకు మరొక జీవితాన్ని ప్రసాదించడం ద్వారా క్రీస్తు ప్రభువు తన శ్రమల పునరుతానముద్వారా మనకు కూడా నూతన జీవితాన్ని  ప్రసాదించగలరన్న  నిరీక్షణ మనలో నింపుతున్నారు.  ఇంతకుముందు  మరణించిన యాయీరు కుమార్తెను (మత్త:9:18-26  ) నాయినులో వితంతువు కుమారుడిని (లూకా:  7:11-17 )  జీవముతో లేపాడు. వీరందరూ విశ్వాసము ద్వారానే దేవుని మహిమను చూడగలిగారు. మార్త దేవుని పట్ల విశ్వాసముతో వచ్చి, “ప్రభూ ! మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాదు ( యోహా:11:21) యేసు ఆమెతో నీ సహోదరుడు మరలా లేచును" అని చెప్పెను (యోహా:11:23 ) కానీ ఆమె అంతిమ  దినమున లేస్తాడనుకుంది. మార్తా  ప్రభువు గతములో  పలికిన మాటలు మరచిపోయింది. గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలో వారు అయన స్వరమును విని ఉత్తానులగుదురు. మంచికార్యములు చేసే వారు జీవ పునరుతానములను, దుష్టకార్యములు చేసేవారు తీర్పు పునరుత్తానమున పొందెదరు. (యోహా:5:28,29 ). సమారియా స్త్రీ కి మెస్సయ్య వస్తాడని  తెలుసు కానీ  ఆమెతో  మాట్లాడేది స్వయముగా మెస్సయ్య అని గ్రహించలేక పోయింది. అదేవిధముగా మార్తకు పునరుత్తానమందు  విశ్వాసముంది కానీ, క్రీస్తు పునరుత్తానుడని,  పునరుత్తానము ఇచ్చునది యనేనని గ్రహించలేకపోయింది. అందుకే, క్రీస్తు "నేనే  పునరుత్తానమును జీవమును, నన్ను విశ్వసించిన వాడు మరణించిననూ జీవించును.( యోహా: 11:25 ) అని మార్తకు తెలియజేస్తున్నాడు.  ఈరోజు ఎవరయితే క్రీస్తు పునరుత్తానుడు అని గ్రహిస్తారో, వారు మాత్రమే జీవాన్ని పొందగలరు.

3. జీవం పొందుటకు మనలో వుండవల్సినది :

1.విశ్వాసం:

    మనం విశ్వసిస్తే దేవుని మహిమను చూడగల్గుతాం.. క్రైస్తవ జీవితానికి విశ్వాసం శ్వాసలాంటిది. శ్వాస తీసుకోకపోతే ఏవింధంగా నయితే మానవుడు మరణిస్తాడో,  విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. కేవలం విశ్వసించిన వారు మాత్రమే క్రీస్తు పునరుత్తానాన్ని చవిచూడగలరు. “క్రీస్తే, పునరుత్తానము,, జీవము. ఆయనను విశ్వసించిన వాడు మరణించిననూ జీవించును.( యోహా: 11:25 ) క్రీస్తుని విశ్వసించినవాడు  నిత్య జీవితాన్ని పొందుతాడు ( యోహా:6:40, 30:36,6:47).

2.మనకు  మనం  మరణించాలి:

     మన పాపాలకు, స్వార్ధానికి, గర్వానికి మనము మరణించినప్పుడు మాత్రమే మనము క్రీస్తునందు జీవాన్ని పొందగలం. గోధుమగింజ భూమిలోపడి నశించినంతవరకు అది  అట్లే ఉండును . కానీ, అది నశించిన యెడల విస్తారముగా  ఫలించును. ( యోహా: 12:24 ) గోధుమగింజ లాగే మనము కూడా మన పాత జీవితానికి మరణించి క్రొత్త జీవితానికి లేచి క్రీస్తుని జీవంతో ఫలించాలి, నలుగురికి జీవితాన్ని అందించగల్గాలి. .

3. క్రీస్తుని అనుసరణ:

      నన్ను నుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరించాలి ( మత్త: 16:24 ) అని ప్రభువు  నుడువుచున్నారు. మనం ఎప్పుడయితే మన సిలువ అనే మన జీవితభారంలో ప్రభువును అనుసరిస్తామో  అప్పుడు అనుసరణ నిత్య జీవితానికి బాటలు వేస్తుంది. మనం ప్రభువుని అనుసరించాల్సింది పాదాల కదలిక ద్వారా కాదు. కానీ, మన జీవిత మార్పు ద్వారా . మన జీవితములో ప్రభువు ఆత్మను వుంచగలిగితే ప్రభు జీవాన్ని కూడా పొందగలం.

    కాబట్టి విశ్వసిద్దాం. లాజారువలే  ప్రభువు ఒసగే  నిత్యజీవితాన్ని  పొందుదాం. మనకు మనము మరణిద్దాం . క్రీస్తు పునరుతానాన్ని అనుభవిద్దాం . క్రీస్తును అనుసరిద్దాం . నలుగురికి క్రీస్తు మరణ పునరుత్తనములను, మహిమను ప్రకటిద్దాం, ప్రభువు జీవాన్ని పొందుదాం......ఆమెన్ . 

 

బ్ర. సునీల్ ఇంటూరి సి డి .

 

 

తపస్సు కాల ఐదవ ఆదివారం

 తపస్సు కాల ఐదవ ఆదివారం

యెహెఙ్కేలు   37:12-14

రోమా 8:8-11

యోహాను 11:1-45

ఈనాటి దివ్య పఠనాలు మరణం తరువాత జీవముంటుంది అనే అంశం గురించి తెలియజేస్తున్నాయి. ఏసుప్రభు యొక్క శరీరం యొక్క పునరుద్ధానముకు దగ్గరవుతున్న సమయంలో తల్లి శ్రీ సభ మనం కూడా అంతిమ దినమున పునరుద్దానం అవుతాము అని సత్యంను తెలియజేస్తుంది.

మరణించిన వారు మరల బ్రతకటం చాలా కష్టం ఈ విషయం మనం నమ్మలేము కూడా, కానీ ఈనాటి మొదటి పఠనం మరియు సువిషేశ పట్టణం మరణించిన వారికి నిత్యజీవం ఉంటుంది అని తెలియజేస్తున్నాయి.

క్రైస్తవుల యొక్క మరణం తరువాత వచ్చే జీవితం పునర్జన్మ కాదు ఎందుకంటే క్రైస్తవుల యొక్క విశ్వాసం ప్రకారం మనకు పునర్జన్మ లేదు.

మన యొక్క మరణంతో ఈ భూలోక జీవితం అంతం అవుతుందేమో కానీ నాశనం అవటం లేదు.

ఈనాటి మొదటి పఠనం లో యెహెఙ్కేలు  ప్రవక్త ద్వారా దేవుడు ఎండిన ఎముకలకు ప్రవచనం ద్వారా నూతన జీవమును ప్రసాదించిన విధానంను చదువుకుంటున్నాము.

యెహెఙ్కేలు  ప్రవక్తను దేవుడు ఎండిన ఎముకలు ఉన్న లోయ వద్దకు తీసుకొని అక్కడ ఉన్న అస్థికలకు ప్రవచనం చెప్పమని ఆజ్ఞాపించారు.

బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఇది ఒక కష్టతరమైన సమయం, నిరాశలో ఉన్న సమయం, అదేవిధంగా జీవితం మీద ఆశలు వదిలేసుకున్న సమయం, దేవుడు మమ్ము విడిచిపెట్టారు అని భావించిన ఒక సమయం.

వారి యొక్క విశ్వాసమును కోల్పోయారు, అలాగే ఉన్నటువంటి ఏకైక దేవాలయంలో కోల్పోయారు, వారి యొక్క గుర్తింపు కూడా కోల్పోయారు వారిలో దేవుని యొక్క కొరత కనపడింది. దేవుడు మనతో లేరనే భావన వచ్చింది అలాంటి సందర్భంలో యెహెఙ్కేలు ప్రవక్త ఒక ఆశ కలిగిన సందేశం అందజేస్తున్నారు. అది ఏమిటంటే దేవుడు బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు బయటకు తీసుకొని వస్తారు. ప్రభు అంటున్నారు నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును మీరు మీ దేశమున వశించినట్లు చేయుదురు అని అన్నారు - యెహెఙ్కేలు 37:14.

దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచుతారు అనే వాక్యం మనకు దేవుడు మొదటి జీవం పోసిన విషయంలో గుర్తుకు వస్తుంది.

దేవుడు ఆదామును మట్టి నుండి చేసిన సందర్భంలో దేవుడు మానమని యొక్క ముక్కు రంధ్రంలో తన యొక్క శ్వాసనుదారు తన యొక్క ఆత్మను మానమునులో ఉంచి తొలి సృష్టి చేశారు - ఆది 2-7.

ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విరుద్ధంగా జీవించారు మరొకసారి తన యొక్క ఆత్మను ఇచ్చుట ద్వారా వారిలో క్రొత్త జీవం వస్తుంది.

ఈ మొదటి పఠనం లో  మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదని అలాగే దైవ భక్తులకు ఉన్నటువంటి శక్తి.

దేవుడు చనిపోయిన వారికి సైతం జీవం ప్రసాదించే గొప్పవారు.

దేవుని యొక్క వాక్కు ప్రవసించగానే ఎండిన ఎముకలలో సైతం జీవం వచ్చింది. ప్రభువు యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది.

1.ఆయన యొక్క వాక్కు సృష్టిని చేసింది - ఆది 1-2 అధ్యాయాలు 

2. దేవుని యొక్క వాక్కు పుట్టించే వాక్కు - లూక 8:11

- దేవుని యొక్క వాక్కు మనలో జీవం పుట్టిస్తుంది

- దేవుని యొక్క వాక్కు మనలో హృదయ పరివర్తనం కలిగిస్తుంది

- దేవుని యొక్క వాక్కు మనలో విశ్వాసంను పుట్టిస్తుంది

- దేవుని యొక్క వాక్కు మనలో ప్రేమను పుట్టిస్తుంది

3. దేవుని యొక్క వాక్కు మనల్ని నడిపిస్తుంది - కీర్తన 119-105

- దేవుని యొక్క వాక్కు మనల్ని జీవంకు నడిపిస్తుంది

- దేవుని యొక్క వాక్కు మనల్ని సత్యం వైపుకు నడిపిస్తుంది

- దేవుని యొక్క వాక్కు మనల్ని పుణ్యం చేయుటకు మంచిగా జీవించుటకు నడిపిస్తుంది

4. దేవుని యొక్క వాక్కు అయస్కాంత వాక్కు మనల్ని ఆయన వైపుకు మరలుచుకుంటుంది.

ప్రభువు యొక్క వాక్కు శక్తివంతమైనది కాబట్టి ప్రవశించగానే ఎండిన ఎముకలు సైతం జీవం పోసుకున్నాయి.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు మనందరం కూడా ఆత్మానుసారంగా జీవించమని కోరుతున్నారు.

ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో వారు దేవుని సంతోష పెట్టలేరు అని అంటారు.

సృష్టి ప్రారంభం నుండి శరీరానుసారంగా జీవించిన వారు దేవుని సంతృప్తి పరచలేదు ఎందుకంటే శరీరం కోరేది దేవుడు కొరరు.

అందుకే పౌలు గారు గలతీయులకు రాసిన లేఖలో 5:16-26 పలుకుతుంటారు శరీరం కోరునది ఆత్మ కోరదని.

ఆత్మానుసారంగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచగలం, ఏసుప్రభు యొక్క ఆత్మ మన యందు ఉన్నచో మనం శరీరానుసారంగా జీవించెము ఆత్మానుసారంగా జీవిస్తాం.

శరీరానుసారంగా జీవించేవారు ఈ లోకమే శాశ్వతం అని భావిస్తారు, అందుకనే ఈ చీకటి పనులు చేస్తారు. ప్రభు యొక్క పునరుద్దానంలో భాగస్తులుగా జీవించాలంటే మనం ఆత్మానుసారంగా జీవించాలి.

మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎక్కువసార్లు మనం శరీరానుసారంగా జీవించుటకు ఇష్టపడుతుంటాం. దేవుని యొక్క ఆత్మ మన యెడల ఉన్నచో దేవుని యొక్క ప్రణాళికల ప్రకారం మనం జీవిస్తుంటాం.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు మరణించిన లాజరుకు జీవమును ప్రసాదించిన అంశంను చదువుకుంటున్నాం, చనిపోయిన ఆయనను  బ్రతికించుట ద్వారా దేవుడు తన యొక్క పునరుద్ధాన అంశమును కూడా ముందుగానే తెలియజేస్తున్నారు.

యోహాను గారి యొక్క సువిశేషం లో ఉన్న మొదటి 12 అధ్యాయాలను book of signs అనగా దేవుని యొక్క సజ్జనాలు, గుర్తులు, చిహ్నాలు అని పిలుస్తారు. ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చిన ఏడు గుర్తులు ఆయన మెస్సయ్య అని తెలియజేస్తున్నాయి:

1. నీటిని ద్రాక్షారసంగా మార్చుట - యోహాను 2:1-12

2. ఉద్యోగి కుమారునికి స్వస్థత నిచ్చుట - యోహాను 4:46-54

3. కోనేటి వద్ద స్వస్థత నిచ్చుట - యోహాను 5:1-11

4. 5000 మందికి ఆహారం ఇచ్చుట - యోహాను 6:1-15

5. నీతి మీద నడుచుట - యోహాను 6:15-21

6. గుడ్డివానికి చూపునిచ్చుట - యోహాను 9:1-12

7. చనిపోయిన లాచరును బ్రతికించుట - యోహాను 11

ఇవన్నీ కూడా ఏసుప్రభు మెస్సయా అనే అంశమును తెలియజేస్తున్నాయి.

యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే చనిపోయిన మూడు రోజుల తర్వాత ఆత్మ శరీరంకు దగ్గరలోనే ఉంటుంది, తరువాత అదే శరీరం నుండి దూరం అవుతుందని అయితే లాజరు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది, మరి ఆ సమయానికి శరీరం నుండి ఆత్మ దూరం అవ్వాలి అయితే ఇక్కడ ప్రభువు మార్తమ్మ విశ్వాసమును బలపరుస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలుపుచున్నారు.

మార్తమ్మ యేసు ప్రభువును మెస్సయ అని అంగీకరించింది అందుకే ఇంకా ఆమె యొక్క విశ్వాసమును, నమ్మకమును లపరుచుటకు ప్రభువు ఆమెతో అంటున్నారు, "నేనే పునరుద్దానమును జీవమును అని".

ఆయన జీవమును ఇస్తారు అని మార్తముకు తెలిపారు. లాజరును మృత్యువు నుండి లేపుట  ద్వారా మనం మూడు విషయాలు గ్రహించాలి.

1. లాజరును సజీవంగా లేపటం ద్వారా మృత్యువును జయించగల శక్తి తనకున్నదని ఏసుప్రభు రుజువు చేశారు. అంటే సైతాను స్వాధీనంలో ఉన్న మృత్యువును జయిస్తే సైతానును కూడా చేయించినట్లే అవుతుంది. ఈ సందర్భంగా యేసు ప్రభువు సైతానును ఎదుర్కొని మృత్యు  సంఖ్యలను ఛేదించి లాజరుకు పునర్జీవం ప్రసాదించారు.

2. ఏసు తన మరణం కూడా జయిస్తారు త్వరలో అని ప్రభువు అక్కడి వారికి తెలిపారు.

3. లాజరుకు తిరిగి భౌతిక జీవితాన్ని ప్రసాదించడం ద్వారా మనకు నిత్య జీవితాన్ని ప్రసాదించగలడని రుజువు అవుతుంది. అందుకే ప్రభువు అంటున్నారు జీవం ఉండగా నన్ను విశ్వసించు వారు మరణించిన ను జీవిస్తారు అని పలికారు యేసుప్రభు తన యొక్క పరిచర్యలో మరణించిన;

- యాయీరు కుమార్తెకు జీవం ప్రసాదించారు

-నాయీను వితంతువు యొక్క కుమారుడ్ని కూడా జీవంతో లేపారు

-అదేవిధంగా ఈనాటి సువిశేషములో  ఏసుప్రభువు లాజరుకు పునర్జీవం  ప్రసాదించారు.

ఏసుప్రభుకు లాజరు అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన సమాధి వద్దకు వచ్చారు. వాస్తవానికి ఏసు ప్రభువు ఒక్క మాట పలికినా చాలు లాజరు జీవవంతుడై లేచేవాడు, కానీ ప్రభువు అలా చేయలేరు ఎందుకంటే ఆయన కూడా మానవుల యొక్క బాధలలో పాలుపంచుకుంటున్నారు.

ఏసుప్రభు కూడా లాజరు మరణం కు చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆయన లాజరును ప్రేమించారు - 11:5

ప్రభు యొక్క దృష్టిలో మరణం అనేది ఒక నిద్రయే, అందుకనే లాజరు మరణించినప్పటికీ ఆయన నిద్రిస్తున్నారు అని పలికారు 11:11 అంతిమ దినమున వారు జీవంతో లేపబడుతారు అని తెలిపారు.

మన యొక్క సమాధులలో ఉండే మృతదేహాలు కూడా నిద్రిస్తున్నాయని అర్థం అందుకని మన యొక్క విశ్వాస సంగ్రహంలో చెబుతున్నాం శరీరం యొక్క ఉత్సానమును విశ్వసిస్తున్నామని కాబట్టి ఈ మృతులు కూడా అంతిమ దినమున ప్రభు యొక్క పునరుద్దానంలో భాగస్తులు అవుతారు.

లాజరు యొక్క మరణం ప్రభువును మహిమ పరచుట కొరకే అందుకనే ఏసుప్రభు ఆయన మరణ వార్త విన్నప్పటికీ ఇంకా అక్కడే ఉన్నారు - యోహాను 11:6

ఏసుప్రభువు  వార్తను వినగానే ఆయన వెంటనే తన మిత్రుని వద్దకు వస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే మూడు రోజుల తర్వాత కూడా మృతులు జీవిస్తారు అని తెలుపుటకు ప్రభు వెంటనే రాలేదు.

- యాయీరు కుమార్తెను సమాధి చేయకముందే ప్రభువు జీవం ప్రసాదించారు

- నయీను వితంతువు కుమారుడిని కూడా సమాధి చేయకముందే జీవం ఇచ్చారు.

- కేవలం లాజరును మాత్రమే సమాధి చేసిన తరువాత జీవంతో లేపారు. అది ఆయన పునరుద్ధంకు ఒక సూచన. 

- మరణించిన వారికి ప్రభువు కేవలం జీవమును మాత్రమే ప్రసాదించారు మరల వారు కొన్ని సంవత్సరంలకు మరణిస్తారు కానీ ప్రభువు యొక్క శరీర పునరుద్దానం శాశ్వతం.

- పాత నిబంధన గ్రంథంలో కూడా ఏలియా, ఎలీషా ప్రవక్తలు చనిపోయిన బిడ్డలకు మరల జీవమును ప్రసాదించారు. ఏసుప్రభు యొక్క శరీరం యొక్క పునరుత్థానం మనం కూడా పునరుత్థానం అవుతాము అని తెలుపుతుంది.

క్రైస్తవులం గా మనం మరణం అంటే భయపడుతుంటాం కానీ మరణం తరువాత దేవునితో జీవితం ఉందనే సత్యమును మర్చిపోతున్నాము.

ఏసుప్రభు అన్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అట్లే ఉండును కానీ అది నశిస్తే జీవించును అని - యోహాను 12:24

- మనం కూడా పాపముకు మరణిస్తేనే కొత్త జీవితంకు జన్మనిస్తాం. మనలో ఉండే పాపం కోపం, అసూయ, పగ, స్వార్థం అన్ని  మరణిస్తేనే మంచిగా క్రొత్తదనం ఉంటుంది.

ఈనాటి సువిషేశ పఠనం లో తోమాసుగారి యొక్క దర్శనమును కూడా చూస్తున్నాం ఏసు ప్రభువు కొరకు మరణించాలి అనే తపన ఆయనలో కనబడుతుంది. అందుకే రండి  మనము కూడా వెళ్లి లాజరుతో మరణించడం అని అన్నారు.

బహుశా ప్రభువు తనకు కూడా మరలా జీవంను ప్రసాదిస్తాడని విశ్వసించి ఉండవచ్చు.

మార్తమ్మ యొక్క గొప్ప విశ్వాసమును కూడా ఈ సువిశేషంలో మనం గమనిస్తున్నాం ఆమె విశ్వసించినది కాబట్టి ఏసుప్రభువు అద్భుతం చేశారు.

ఆమె నమ్మకం భారం మొత్తం కూడా ఏసుప్రభు మీదనే ఉంచింది అందుకే దీవించబడినది తన యొక్క తమ్ముని జీవంతో పొందగలిగినది.

లాజరును జీవంతో లేపుట ద్వారా ప్రభువుకు మరణం మీద శక్తి ఉందని తెలుపుచున్నారు, అక్కడ ఉన్న వారి యొక్క విశ్వాసమును బలపరుస్తున్నారు.

- ఏసుప్రభు పిలవగానే ప్రకృతి ఆయన మాట విన్నది.

- ప్రభువు పిలవగానే చనిపోయిన వారు జీవంతో లేచారు.

- గాలి అలలు ఆయన మాటలు విన్నాయి

- దయ్యములు ఆయన మాట విన్నాయి

- అనారోగ్యములు ఆయన మాట విన్నాయి

ఎందుకంటే ఆయన మాట శక్తివంతమైనది కాబట్టి మరణం తరువాత జీవితం ఉందని గ్రహించి ఆత్మానుసారంగా దైవవాక్కును అనుసరిస్తూ మంచి జీవితం జీవిస్తూ పరలోకం పొందుదాం.


FR. BALAYESU OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...