3, ఆగస్టు 2024, శనివారం

18వ సామాన్య ఆదివారం

18వ సామాన్య ఆదివారం 
నిర్గమ 16:2-4,12-15, ఎఫేసీ 4:17,20-24, యోహాను 6:24-35

ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుడు మానవుల కొరకై ఏర్పరచినటువంటి పరలోక విందు గురించి తెలుపుచున్నవి.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నాను, పూరేడు పిట్టలను ఇచ్చిన విధానము చదువుకుంటున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణమైనప్పుడు ఎడారిలో ఆకలిగొనిన సందర్భంలో వారు మోషే ప్రవక్తకు విరుద్ధముగా దేవునికి విరుద్ధముగా నడుచుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఐగుప్తులో వారు భుజించిన మాంసాహార భోజనాన్ని మరియు రొట్టెలను తలచుకొని అచటనే ఉండి దేవుని చేతిలో చనిపోయిన బాగుండేది అని గొణగసాగిరి. అందుకుగాను దేవుడు వారికి స్వయముగా పరలోక దూతలు భుజించే భోజనము ఒసగి ఉన్నారు. ఈ యొక్క మొదటి పఠణంలో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. ఎడారిలో మన్నా అనేది ఒక విశ్వాస పరీక్ష ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కావలసినది మొత్తం కూడా ఒక్కసారి సమర్పించవచ్చు కానీ అలాగా చేయలేదు. ఏనాటికి మన్నా ఆనాటికే ప్రభువు ఇచ్చారు అనగా వారు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి యందు విశ్వాసము కలిగి జీవించాలి అనే ఉద్దేశ్యం కొరకు. అదేవిధంగా ఎవరికి ఎంత కావాలో అంతే దేవుడు ఉండేలాగా చేస్తున్నారు
2. దేవుని యొక్క ఉదార స్వభావము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పటికీ ప్రభువు వారి యొక్క మాటలను పట్టించుకోకుండా ఇంకా సమయం వేచి ఉండకుండా వెంటనే సహాయము చేస్తూ వారి యొక్క ఆకలిని సంతృప్తి పరుస్తున్నారు. ఎదుటివారు చేసిన తప్పిదమును గుర్తించకుండా వారి యొక్క ఆకలిని తీర్చుట చాలా గొప్పది.
3. ఫిర్యాదు చేయటం. ఇది సర్వసాధారణంగా చాలామంది యొక్క జీవితంలో చూస్తూ ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, మార్తమ్మ మరియమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నారు అలాగే యోహాను శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉపవాసము ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ విధంగా చాలామంది దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు కానీ అది మంచిదా లేక చెడా అని కొంతమంది మాత్రమే గ్రహిస్తారు. మన జీవితంలో ఏదైనా కొరతగా అనిపిస్తే వెంటనే మనము దేవునికి ఫిర్యాదు చేయటానికి ముందుంటాం కానీ ఆయనను అర్థం చేసుకునటానికి ప్రయత్నం చేయము.
4. ఇశ్రాయేలీయుల యొక్క అప నమ్మకం. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా కాపాడిన విషయం మరచితిరి, ఫరో సైన్యమును నాశనము చేసిన విధానం మరిచితిరి అలాగే దేవుడు వారిని ఆదుకుంటారు అనే విషయంలో కూడా మరచి జీవించారు అందుకే ప్రభువు వారి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆకాశము నుండి అద్భుత రీతిగా ఈ యొక్క పరలోక భోజనమును ప్రసాదిస్తున్నారు.
5. దేవుడు మనలను పోషిస్తాడు అనే నమ్మకం లేక ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు గొణుగుతూ అపనమ్మకంతో జీవిస్తుంటాం. ఈ యొక్క శారీరక సంబంధమైన ఆకలి దప్పులను గురించే ఆలోచిస్తుంటాము గాని దేవుని వైపు మన యొక్క దృష్టి మరల్చి ఆయనపై నమ్మకంతో మన కష్టాలను ఆయన చేతులలో ఉంచడానికి వెనుకంజ వేస్తాం. మన యొక్క భౌతిక భోజనమునకు ఆరాటపడతాం కానీ ఆధ్యాత్మిక భోజనం గురించి చింతించం మన గమ్యాన్ని మరచిపోయి భౌతిక చింతలకే ప్రాధాన్యతనిస్తాం.
  ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు పాత స్వభావమును విడిచి కొత్త స్వభావమును కలిగి జీవించమని తెలుపుచున్నారు. మన యొక్క పాత స్వభావమును విడిచి పెట్టకపోతే మనలో నూతనత్వము ఉండదు.  గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది అట్లే ఉండును కానీ నశించిన దానియందు ఒక కొత్త జీవము ఉద్భవించును అలాగే మనలో పాపము ఉన్నంత కాలము మనము క్రీస్తునకు జన్మించలేం మన యొక్క పాపమునకు మరణించిన సందర్భంలో క్రీస్తు ప్రభువు మనకు జన్మించిన వారముగా ఉంటాము. దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభువు మనలోనికి వేంచేసి మన యొక్క జీవితములను నూతన పరచున్నారు. పునీత పౌలు గారు తన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువును వెంబడించారు.
ఈనాటి సువిషేశ పఠణంలో ఏసుప్రభు 'నేనే జీవాహారము' అని పలుకుచున్నారు. ఏసుప్రభు 5000 మందికి ఆహారమును వసగిన తర్వాత ఆయన కఫర్నామునకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ప్రభువును వెంబడించారు ఆ సందర్భంలో అడిగినా ప్రశ్న" ప్రభువా, మీరు ఎప్పుడూ ఇక్కడికి వచ్చితిరి? " ఈ ప్రశ్న వారు ఏసుప్రభు యొక్క బోధనలు వినటానికి అడగలేదు కేవలము వారు పోషింపబడ్డారు కాబట్టి ఏసుప్రభు దగ్గరికి వస్తే మరల వారి యొక్క శారీరక ఆకలి తీరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రభువుని ప్రశ్న అడిగారు దానికి గాను ప్రభువు శాశ్వతమైన భోజనము కొరకు శ్రమింపుడు పలికారు. 
ప్రజలు తమ యొక్క పొట్టలను నింపిన రొట్టెలను గురించి  ఆలోచిస్తున్నారు కానీ ఆ పొట్టల నింపినటువంటి దేవుడిని మాత్రము తలంచలేదు. రొట్టెలను రొట్టెలగానే స్వీకరించారు కానీ అవి దేవుని యొక్క వరము అని విశ్వసించలేకపోయారు.
ఏసుప్రభు తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము అని తెలుపుచూ ఈ యొక్క ఆహారమును భుజించిన అతడు ఎన్నటికీ ఆకలిగొనడు అని ప్రభువు తెలుపుచున్నారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుడు మన కొరకై ప్రసాదించిన దివ్య సత్ప్రసాదం మనము ఎప్పుడు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క మన్నాను భుజించి వాగ్దాత భూమికి చేరుకున్నారు. మనము కూడా ఏసుప్రభు మన కొరకై వసగిన తన యొక్క దివ్య శరీర రక్తములను భుజించి మన జీవితములను మార్చుకొని పరలోక రాజ్యములో ప్రవేశించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యసప్రసాదము పట్ల ప్రేమను గౌరవమును అలవర్చుకొని జీవించాలి.
Fr. Bala Yesu OCD

2, ఆగస్టు 2024, శుక్రవారం

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12

యిర్మీయా 26:11-16,24 మత్తయి 14:1-12 (3 ఆగస్టు 2024)

ఆ కాలమున గలిలీయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, "ఇతడు స్నాపకుడగు యోహానే. అతడే మృతులనుండి లేచియున్నాడు. కావున, అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి" అని తన కోలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయన, "ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు" అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు ఒసగెదను అని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. అపుడు ఆమె తల్లి ప్రోత్సాహమువలన "స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము" అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని, తన ప్రమాణముల కారణముగ, అతిధుల కారణముగ ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్చేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతికదేహమును తీసుకొనిపోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్లి ఆ విషయమును తెలియజేసిరి. 

ప్రియమైన దైవ ప్రజలారా! ఈనాడు మొదటి పఠనంలో మనము యిర్మీయా ప్రవక్తను చూసి, ఆయన చెప్పిన దైవ సందేశాన్ని విని భయంతో, కోపంతో, అసూయతో, గర్వంతో యిర్మీయా ప్రవక్తను చంపివేయాలని యాజకులు ప్రవక్తలు, నాయకులను ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నాము. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చాలా కఠినమైన సందేశాన్ని వారికి వినిపించారు. ఆ సందేశం ఏమిటంటే వారు వారి మార్గములను, క్రియలను మార్చుకొని దేవునికి విధేయులు కాకపోతే నాశనము చేయబడుదురు. వారి దేవాలయం నాశనము చేయబడుతుంది. పదే  పదే ఆయన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త వారిని, మీరు మీ మార్గాలను, మీ పాపపు పనులను మీ గర్వాన్ని వదలిపెట్టి మారు మనసు పొంది దేవునికి విధేయతతో జీవిస్తే మిమ్మి అయన రక్షిస్తాడు, మీ శిక్షను తొలగిస్తాడు అని బోధిస్తున్నాడు. ఈ సంగతులెల్ల మీకు తెలియజేయుటకు ప్రభువు నన్ను పంపాడు అని చెబుతున్నాడు. ఇది విని నాయకులు, ప్రజలు తమ యొక్క నాయకులు ప్రవక్తలతో యిర్మీయాకు మరణ శిక్ష  విధించుట తగదు. ఎందుకు అనగా అతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడేను అంటున్నారు. 

సువిశేష పఠనంలో మనము స్నాపకుడగు యోహాను గారి శిరచ్చేదనము గురించి వింటున్నాం. యోహాను గారు దైవ సందేశాన్ని భయపడకుండా ధైర్యంతో భోదించినందుకు తన ప్రాణమును కోల్పోయాడు. హేరోదురాజు యేసు ప్రభువుని పేరు ప్రఖ్యాతులను విని ఖచ్చితముగా యోహానే మృతలనుండి లేచి, ఇన్ని అద్భుతశక్తులు కలిగిఉన్నాడు అని తన సేవకులతో చెబుతున్నాడు. యోహాను గారు రాజైన హేరోదుతో నీ సోదరుడగు ఫిలిప్పు భార్యను నీవు ఉంచుకొనుట ధర్మముకాదు అని అధర్మాన్ని ఖండించి, హెచ్చరించాడు. అందువలన హేరోదు యోహానును చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు, కాని  భయ పడ్డాడు ఎందుకంటే యోహాను నిజమైన దేవుని ప్రవక్త అని హేరోదు అర్ధం చేసుకున్నాడు. యోహానును చరసాలలో బంధించారు. హేరోదియ కూడా యోహాను పట్ల కోపం, ఈర్ష్య ద్వేషంతో యోహానును చంపాలని చూసింది. ఆమె కూతరు హేరోదు రాజును నాట్యంద్వారా మెప్పించి,సంతోష పెట్టినందుకు నీము ఏమి కావాలో కోరుకో అని ప్రమాణం చెయ్యగా తన తల్లి మాట మీదగా స్నాపకుడగు యోహాను తనను ఒక పళ్లెంలో ఇవ్వమని అడిగింది. 

హేరోదు తన ప్రమాణము కారణంగా, అతిధుల ముందు మాటను ఇచ్చి ఉండటంవలన ఆమె కోర్కెను తీర్చాడు. దేవుని సత్య సువార్తను ధైర్యంగా బోధించి సత్యంకోసం  తన రక్తాన్ని కార్చిన స్నాపకుడగు యోహాను వారి వలె, మనము అధర్మాన్ని ఎదిరించి తప్పును తప్పు అని చెప్పగలమా! ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం భయంతో ఉంటె సత్యానికి, సత్య సువార్తకు సాక్షులుగా ఉండలేం. కనుక యిర్మీయా ప్రవక్త వలె స్నాపకుడగు యోహాను వలె మనము కూడా దేవుని వాక్కుని విని, పాటించి ధైర్యంగా ఏ భయం , ఆందోళన లేకుండా నిజమైన సత్య సువార్తను బోధించుదాం. సత్యానికి సాక్షులుగా నిలబడదాం. సత్యం ధర్మం కొరకు మన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఉందాం. దేవుడు తన   సత్య సువార్తను మన హృదయాలలో నింపి మనలను నడిపించులాగున  ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: సత్య స్వరూపుడైన తండ్రి, మమ్ము మీ సత్య వాక్కుతో నింపుము.మేము అన్ని వేళలలో సత్యానికి సాక్షులుగా జీవిస్తూ సత్య సువార్త బోధిస్తూ, ప్రజలను మీ సత్యపు వెలుగు లోనికి నడిపించడానికి మాకు శక్తిని, బలమును, ధైర్యమును దయచేయుము. తద్వారా ఎన్నో ఆత్మలను రక్షించుటలో మా వంతు బాధ్యతను నెరవేర్చుటకు మీ అనుగ్రహం  దయ చేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...