7, ఆగస్టు 2024, బుధవారం

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23

యిర్మీయా 31:31-34 మత్తయి 16:13-23 (8 ఆగస్టు  2024)

తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్యకుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన  శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. "మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు?" అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, "నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిచ్చెను. "యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును." ఇట్లు చెప్పి, తాను  క్రీస్తునని ఎవ్వరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటినుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలవలన , ప్రధానార్చకులవలన , ధర్మ శాస్త్ర బోధకులవలన పెక్కుబాధలను అనుభవించి, మరణించి మూడవదినమున పునరుత్తానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, "ప్రభూ ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక !" అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో "ఓ సైతాను! నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధిచినవే, కాని  దేవునికి సంబంధిచినవికావు" అనెను

క్రిస్తునాధుని ప్రియ మిత్రులారా, ఈనాటి మొదటి పఠనంలో దేవుడు తన ప్రజలతో  ఒక నూతన నిబంధము చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని అదే విధంగా ఆ నిబంధన  తాను మన పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు  చేసుకొనిన నిబంధన వంటిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే 'నేను మీ దేవుడనైన ప్రభువును-మీరు నా ప్రజలు' నేను మీ కాపరిని మీరు నా మంద అని ప్రభువు మన పితరులతో నిబంధన చేసుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మరల ఒక నూతన నిబంధనము మనతో చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, మన పితరులు, పూర్వికులు  ప్రభువును ఆయన చేసిన గొప్ప అద్భుతకార్యాలను  తమ కన్నులార చూచి అనుభవించి కూడా ప్రభుని యొక్క నిబంధనను మీరారు. అన్యదైవములను కొలిచి తమ జీవితాలలో అనేక తప్పులు చేసుకుంటూ దేవుణ్ణి విడనాడి పాపము చేస్తూ పాప మార్గములలో ప్రయాణించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమును విడనాడారు. తమ నాశనమును తామే కొనితెచ్చుకున్నారు. 

మరి నూతన నిబంధన ఏమిటి అంటే మనము కూడా మన పూర్వికులలాగా, మన పితరుల వలె దేవుణ్ణి దైవ శాస్త్రాన్ని ఆయన చేసిన నిబంధనను మర్చిపోయి జీవిస్తున్నామా?  దేవుడు చెప్పినట్లుగా దైవ ప్రజలలాగా మంచి పనులు చేయలేకపోతున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వలేక పోతున్నాం. అందుకే దేవుడు మనందరితో నూతన నిబంధన చేస్తున్నాడు. అది ఏమిటంటే "నేను నా ధర్మ శాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచుదును. వారి హృదయాలపై లిఖింతును. అల్పులు అధికులెల్లరు నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును దానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను అని దేవుడు అంటున్నాడు. మరి మనము దేవుని ధర్మ శాస్త్రాన్ని మన హృదయాలలో పదిల పరుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ, దైవ ప్రజలుగా జీవించాలి. జీవించడానికి ప్రయత్నించాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అప్పుడు పేతురు యేసు ప్రభువుతో " నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని సమాధానమిస్తున్నాడు. ఈ విషయమును పేతురుకు  బయలు పరిచినది, పరలోకమందున్న తండ్రి దేవుడు. ప్రియ మిత్రులారా అదే ప్రశ్న దేవుడు ఈనాడు మనలను అడుగుతున్నాడు. మన సమాధానము ఏమిటి ? యేసు క్రీస్తుని గురించి నీ అనుభవం ఏమిటి? మనం క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము ? చాలా మంది పునీతులు క్రీస్తును, ఆయన కార్యములను చూసి కొంతమంది నా తండ్రి అని, కొందరు నా రక్షకుడు అని , కొందరు నా కాపరి అని  ఎన్నో భావాలు చెబుతుంటారు. క్రీస్తుని యెడల నీ భావం ఏమిటి? నీ అనుభవం ఏమిటి? నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నేను నిజంగా క్రీస్తుని అనుభవిస్తున్నానా ? లేదా? ఆత్మా పరిశీలన చేసుకుందాం. దేవున్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : ప్రభువైన దేవా! మేము మిమ్ము మా ప్రభుడవని గుర్తించుకొని మీ  ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ-మీతో మేము చేసుకొనిన నిబంధమును ఎల్లవేళలా గుర్తించుకొని మీ  ప్రజలలాగా జీవించడానికి, మిమ్ము  తెలుసుకోవడానికి అదేవిధంగా మీ  ధర్మ శాస్త్రాన్ని మా హృదయాలలో పదిల పరుచుకోవడానికి మాకు మీ కృప వరములను దయచేయండి. తద్వారా మేము మిమ్ము తెలుసుకొని, ప్రేమించి సేవించుదుము. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

6, ఆగస్టు 2024, మంగళవారం

యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18

 యిర్మీయా 31:1-7 మత్తయి 15:21-18  (7ఆగస్టు 2024)

యేసు అటనుండి  తూరు , సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్లెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతె ఆయన వద్దకు వచ్చి, "ప్రభూ! దావీదుకుమారా! నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపచుచున్నది" అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్కమాటైనను మాట్లాడలేదు. అపుడు ఆయన శిష్యులు సమీపించి "ఈమె మన  వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు"  అనిరి. "నేను యిస్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెలకొరకు మాత్రమే పంపబడితిని" అని ఆయన సమాధానము ఇచ్చెను. అపుడు ఆమె వచ్చి, ఆయన పాదములపై పడి "ప్రభూ! నాకు సాయపడుము"అని ప్రార్ధించెను. "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు" అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ! కాని తమ యజమానుని భోజనపుబల్ల నుని క్రింద పడిన రొట్టెముక్కలను కుక్క పిల్లలును తినునుగదా!" అని బదులు పలికెను. యేసు ఇది విని "అమ్మా!నీ విశ్వాసము మెచ్చదగినది. ఈ కోరిక నెరవేరునుగాక!" అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. 

ప్రియమైన దైవ ప్రజలారా ఈనాటి పఠనాలలో ప్రభువైన దేవుడు నేను మీ అందరికి దేవుడును, నేను మిమ్ము కరుణింతును. నేను మీకు దర్శనమిచ్చితిని. నేను మిమ్ము శాశ్వతమైన, నిత్యప్రేమతో  ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. మిత్రులారా దేవుడు చెప్పే ఈ మాటలకు మనము ఏమి చేయాలి అంటే మనము మన దేవుడైన ప్రభుని చెంతకు రావాలి. ప్రభువు చెంతకు వచ్చి ఏమి చెయ్యాలి? అంటే దేవుని గొప్ప కార్యములను  ఆయన చేసిన మేలులను గుర్తించి మనలను రక్షించినందుకు ధన్యవాదములు చెల్లించి, స్తుతిగానము చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియవిశ్వాసులారా నీవు నేను మన దేవుణ్ణి మన దేవునిగా అంగీకరిస్తున్నామా? లేదా లోకంలోని వ్యక్తులను , పదవులను డబ్బును సంపదను లేదా మన కోరికలను అనుసరించి దేవుని మర్చి పోతున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము  ప్రార్ధిస్తామో ప్రభువు కరుణామయుడు కనుక మనలను ఖచ్చితముగా కరుణిస్తాడు. మనము పవిత్ర గ్రంధంలో చూస్తే, మమ్ము కరుణించు అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కరుణించాడు. ఆయన కరుణకు హద్దులు లేవు. ఓక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లుగా దేవుడు మనలను తన శాశ్వతమైన నిత్యా ప్రేమతో ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి మనము దేవుని శాశ్వత ప్రేమను అర్ధం చేసుకుంటున్నామా! దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోక సంపదలను ఈ లోక వస్తువులను, ఈ లోక పదవులను ఈ లోక ఆకర్షణలు ప్రేమిస్తున్నామా ఆలోచించండి. 

ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును  ఒక తల్లి తన బిడ్డను రక్షించండి అని వచ్చినప్పుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించారు. తల్లి తన బిడ్డకై పడిన వేదనను కష్టాన్ని విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యం చేసున్నాడు. కననీయ స్త్రీలో ఉన్నా విశ్వాసం మనము కూడా కలిగి ఉండాలి. ఆమె వలే మనము దేవుణ్ణి పిలవాలి. ఆమె దావీదు కుమారా యేసయ్య నన్ను కరుణింపుము అని ప్రార్ధించింది. మరి  మనము ఆ తల్లి వలె మన మన తల్లి దండ్రుల కోసం, బిడ్డల కోసం మన కుటుంబం కోసం మన  సంఘం కోసం ప్రార్ధన చేస్తున్నామా లేదా? కొన్ని సార్లు దేవుడు కుడా  మన వేడుకోలు పట్టించుకోవడం లేదు అని చాలా మంది ప్రార్ధన చేయడం, దేవాలయానికి వెళ్లడం మానివేస్తారు, ఈనాటి సువిశేషం ద్వారా మానమ్  గ్రహించవలసినది ఏమిటంటే మనం విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, దేవా మమ్ము కరుణించును అని మనం    ప్రార్ధన చేస్తే  దేవుడు  ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యలు మన జీవితంలో తప్పకుండ చేస్తాడు. మరి మనము ఏమి చేయాలంటే  దేవుడ్ని చెంతకు రావాలి, ప్రార్ధించాలి. అలాగే ఆయన చేసిన మేలులకు స్తుతిగానం చెయ్యాలి. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీ ప్రేమ శాశ్వతమైనది. నీ కరుణ ఎల్లలు లేనిది. మేము నీ శాశ్వతమైన ప్రేమను తెలుసుకూన్ నీ ప్రేమను అనుభవించి నీ కరుణను పొంది నీ ప్రేమలో జీఇవస్తు నీ దయను పొందుతు, నిన్ను స్తుతిస్తూ ఆరాధించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ . 

ఫా . సురేష్ కొలకలూరి OCD

క్రీస్తు -నిత్యజీవ ప్రధాత మన కాపరి

 యోహాను 10:22-30  యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతకాలము. యేసు దేవాలయమున సోలోమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చు...