17, ఆగస్టు 2024, శనివారం

యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

 యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15

ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్ధింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి. "చిన్న బిడ్డలను నాయొద్దకు  రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే పరలోక రాజ్యము" అని పలికిరి, వారి మీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను. 

ప్రియమైన మిత్రులారా ఈనాటి మొదటి పఠనం యెహెఙ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు. ఎవ్వరు చేసిన పాపములకు వారే శిక్షను అనుభవిస్తారు అని దేవుడు చెప్పిన సందేశాన్ని వారికి వినిపిస్తున్నాడు . అదే విధంగా సత్పురుషుడు  చిత్తశుద్ధితో దేవుని చట్టాలను విధులను పాటించును కనుక అతడు కాలకాలము  బ్రతుకును అని దేవుడు పలుకుచున్నాడు. ఎవరైతే న్యాయపరులుగాను, ధర్మ పరులుగాను, జీవిస్తారో వారు దేవుని కృపను పొందుతారని వింటున్నాం. అదే విధంగా ఎవరైతే దుష్ట కార్యాలను పాల్పడుతారో వారు ఖచ్చితముగా చచ్చును. వారి చావునకు వారే బాధ్యులు, అని దేవుడు వారితో చెబుతూ ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు అని అంటున్నాడు. మన నుండి మన దేవుడు కోరుకొనినది హృదయ పరివర్తన చెంది, పాపముల నుండి వైదొలగి  బ్రతుకుడు అంటున్నాడు. 

ప్రియ విశ్వాసులారా దేవుడు మనలను మన పాపపు క్రియల నుండి పాపపు ఆలోచనలనుండి మారు మనస్సు పొంది, మన పాపముల నుండి వైదొలగాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మనం పాపంలోనే, పాపం చేస్తూ మరణించడం దేవునికి అసలు ఇష్టం లేదు అదేవిధంగా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మీ మీ క్రియలను బట్టి, మీరు శిక్షను పొందుతారు అని చెబుతున్నాడు. మరి మనము ఎలాంటి క్రియలు చేస్తున్నాము. ఎలాంటి పనులు చేస్తున్నాము ఆలోచించండి. మనం చిత్త శుద్దితో న్యాయంగా, ధర్మంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాని  మన మనలో చాలా మంది దుష్ట బుద్దితో, దుష్ట కార్యములకు పాల్పడుతున్నాం. దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. మరి ఈరోజు మన నుండి దేవుడు ఏమి అడుగుతున్నాడు అంటే మీ పాత పాపపు జీవితమును విడిచి పెట్టి నూత్న మనసును, నూత్న హృదయమును పొందుకోండి అంటున్నాడు. మనం మన పాపపు , చీకటి , చేడు, దుష్ట కార్యాలను వదలి నూత్న జీవితము పొందడానికి సిద్ధముగా ఉన్నామా? లేదా? ఇంకా పాపములోనే ఉండి  జీవిస్తూ, పాపములో మరణిస్తామో ఆలోచించండి. ఇంకా పాపములోనే ఉండి మనము చనిపోయినట్లయితే మనం దేవుని సంతోష పెట్టినవారము కాదు. మనము దేవుని దుఃఖ పరిచినవారము  అవుతాం. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుసారాం జీవించడానికి మంచిగా జీవించడానికి ప్రయత్నించుదాం. 

ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. ఎప్పుడైతె శిష్యులు యేసు వద్దకు వచ్చి త్మమ బిడ్డలను దీవింపమని అడిగిన వారిని ఆటంకపరచడం చూశాడో  అప్పుడు శిష్యులతో చిన్న బిడ్డలను నాయొద్దకు రానివ్వండి. వారిని ఆటంకపరచకండి అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దీవించాడు. ప్రియ విశ్వాసులారా మనం మన మనస్సు నందు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డలలో గర్వం, స్వార్ధం, అహంకారం, కోపం, క్రోధం, మొహం, దుష్టత్వం ఇలాంటివి ఏవి వారికి ఉండవు. వారు నిర్మలంగా, పరిశుద్ధంగా, ప్రేమ, మంచి మనస్సుతో ఇతరులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా మరి మనం నిర్మలమైన , పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సులతో ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యాన్ని పొందగలం.  కాబట్టి దేవునికి ప్రార్థిస్తే చిన్నపిల్లల మనస్తత్వం పొందుటకు ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : పరిశుద్దుడైన దేవా మేము మా పాపపు ఆలోచనలతో పాపము క్రియలు చేస్తూ మా పాపాలలోజీవిస్తున్నాం. దయగల దేవా నీవు అంటున్నాము. పాపాత్ములు మరణించుటలో నీకు సంతోషం లేదని, ప్రభువా నాకు పాప మన్నింపును దయ చేయండి. నా దుష్ట క్రియల నుండి వైదొలగడానికి, శక్తిని బలాన్ని నాకు దయచేయండి. మంచిగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటించే నూత్న హృదయాన్ని నాకు దయచేయండి. నిన్ను సంతోష పెట్టె బిడ్డగా నేను జీవించేలాగా నన్ను మార్చుము తండ్రి. ఆమెన్. 

ఫా . సురేష్ కొలకలూరి OCD

15, ఆగస్టు 2024, గురువారం

యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12

 యెహెఙ్కేలు 16:1-15, 60,63 మత్తయి 19:3-12 (ఆగస్టు 16,2024)

యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి "ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా?" అని ప్రశ్నించిరి. "ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదువలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏక శరీరులై యుందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాతృడు వేరుపరుపరాదు" అని యేసు పలికెను. "అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏలఆజ్ఞాపించెను?" అని పరిసయ్యులు తిరిగి పశ్నించిరి. "మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహమాడువాడు వ్యభిచారియగును" అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు శిష్యులు, "భార్య, భర్తల  సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మెలుతరము" అనిరి. అందుకు యేసు "దైవానుగ్రహము కలవారికేగాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నంపుసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన  వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక!" అని పలికెను.  

ప్రియ విశ్వాసులారా ఈనాటి మొదటి పఠనంలో  యావే ప్రభువు  యెరూషలేముతో ఇట్లు చెప్పుచున్నాను. మీరు నాకు ద్రోహము చేసిరి. నాకు ఇష్టము లేని హేయమైన కార్యములు మీరు  చేస్తున్నారు. అని యెరూషలేము వాసులకు యెహెఙ్కేలు ప్రవక్తతో ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక గొప్ప వివాహ బంధం ద్వారా దేవుడు తనకు తన ప్రజలకు ఉన్న బంధాన్ని గురించి  తెలియచేస్తున్నాడు. అది ఏమిటంటే దేవుడు  ఎన్నోత్యాగాలు చేస్తు, ఎన్నో దీవెనలు ఇస్తు, ఎంతో కష్టపడుతు మనపై దయచూపుతున్నారు.  మనకు అనురాగంతో పరిచర్యలు చేస్తున్నాడు. ప్రభువు చెబుతున్నాడు.   నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చితిని, నేను నీతో వివాహ బంధము చేసుకొనగా నీవు నా దానవైతివి. నేను నా కీర్తినినీకు ప్రసాదించితిని. కాని నీ సౌదర్యము వలన కీర్తి వలన నీకు తలతీరిగినది. నీవు నీచెంతకు వచ్చిన వారందరితో వ్యభిచరించితివి.  

ప్రియ మిత్రులారా ఒక భర్త  భార్యకోసం  ఎన్నోత్యాగాలు, కష్టాలు, ఇబ్బందులు ప్రేమతో భరిస్తూ కష్టపడుతూ ఉంటె, ఎంతో అనురాగంతో  ఆప్యాయంగా పరిచర్యలు  చేస్తూ ఉంటె, భార్య మాత్రం  భర్తకు అన్యాయం చేస్తుంది. ఇక్కడ భర్త అంటే  (దేవుడు) యావే ప్రభువు. అదేవిధంగా భార్య అంటే యెరూషలేము వాసులందరు.  మనమందరికి  ఈ ఉపమానం ద్వారా దేవుడు తన బాధను ప్రేమను మనందరికీ అర్ధం అయ్యేలాగా చెబుతున్నాడు. మరి ఇక్కడ వ్యభిచారం అంటే అన్య దేవుళ్లను ఆరాధించడం. దేవుణ్ణి మర్చిపోయి అన్యదేవతలను మ్రొక్కుతున్నా వారు అని అర్ధం. 

ప్రియ మిత్రులారా ఏ బంధంలోనైన విశ్వాసనీయత ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఎంతో విశ్వాసంతో,  ప్రేమతో ఉండాలి. దేవుడు ఈ విషయమును వివాహబంధము ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు నేను నీ అపరాధమును, నీ తప్పులెల్ల  క్షమిస్తున్నాను అని, అంటే దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే ఆయన మన పాపములను తప్పిదములను అన్నింటిని క్షమించే దేవుడు. మరి మనము మన బంధాలలో ఒకరి పట్ల ఒకరము ఈవిధమైన ప్రేమ, క్షమ, విశ్వసనీయత కలిగివుండాలి. కలిగి ఉండటానికి మనందరం ప్రయత్నించాలి. 

అదేవిధంగా ఈనాటి సువిశేష పఠనంలో చూస్తే పరిసయ్యులు యేసును  శోధించడానికి, ఆయనను పరీక్షించడానికి వచ్చి ఏకారణము చేతనైన భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారు. ప్రభువు వారికి  భార్య భర్తలు  ఇరువురు వివాహం ద్వారా ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరులైరి అని చెబుతూ ఒక సత్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు జత పరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరుపరాదు అని అంటున్నాడు. అప్పుడు వారు మోషే ఎలా విడాకుల పత్రం ఇచ్చి భార్యను వదిలి వేయవచ్చునని ఆజ్ఞాపించాడు అని అంటున్నారు. అందుకు యేసు ప్రభువు,మీ హృదయ కాఠిన్యమును  బట్టి మీ మీ భార్యలను  మీరు విడనాడుటకు అనుమతించేనే కాని ఆరంభము నుండి అలా లేదు. భార్యను వ్యభిచార కారణమున తప్ప ఇంక దేనివలనైనను విడనాడి మరియొకతెను వివాహమాడు వాడు వ్యభిచారియగును అని చెప్పాడు. 

ప్రియ మిత్రులారా వివాహ బంధం  అన్ని బంధాల కంటే ఎంతో గొప్ప బంధం. మనం మొదటి పఠనములో వింటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చిన , ఎన్ని బాధలు వచ్చిన ఎన్నో తప్పులు చేసిన దేవుడు అవి అన్ని క్షమించి మనలను స్వీకరిస్తున్నారు. అదే విధంగా మనం కూడా ఆయన ప్రేమను మర్చిపోకూడదు. మనం ఎవ్వరు కూడా ఏ కుటుంబాన్ని విడదియ్యకూడదు. ఏ బంధంలో  లేని గొప్ప తనం ఈ వివాహ బంధంలో ఉంది. ఒకరికొకరు  ఏ విధంగా బ్రతుకుతారో మనకు తెలుసు. అదే విధముగా మనము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. రెండవది వివాహం లేకుండా ఉండాలంటే,  జీవించాలంటే ఎలా సాధ్యము అంటే  క్రీస్తు  ప్రభువు చెబుతున్నాడు "దైవానుగ్రహము కలవారికె గాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు. అదే విధంగా కొందరు పుటుక్కుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుతున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు  కొందరున్నారు. వారెవ్వరు అంటే గురువులు , కన్యస్త్రీలు  బ్రహ్మచారులుగా దేవుని కొరకు  జీవించేవారు. ప్రియ విశ్వాసులారా ఏది చెయ్యాలన్న దైవానుగ్రహం ఉండాలి. మరి మన కుటుంబ  లేక సన్యాసం జీవితాలలో ప్రభుని అనుగ్రహం ఉందా? లేకపోతే దైవానుగ్రహాల కోసం ప్రార్ధించుదాం. 

ప్రార్ధన: ప్రేమామయుడా! నీవు ప్రతినిత్యం మమ్ము నీ ప్రేమతో నింపుతూ నిన్ను వెంబడించాలి అని పిలుస్తున్నావు. మా కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. కానీ మేము మా అజ్ఞానము  వలన అవి మరచి  లోక వస్తువుల కోసం పొరుగువారి పట్ల ప్రేమ దయ క్షమ విశ్వసనీయత చూపలేక పోతున్నాం. మమ్ము మన్నించి నీ దైవానుగ్రహములు మాపై,  మా కుటుంబాలపై కుమ్మరించండి. ఆమెన్ 

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...