21, ఆగస్టు 2024, బుధవారం

యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

 యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16

"పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక  యజమానుడు తన ద్రాక్షతోటలో పని  చేయుటకు పని వారలకై ప్రాతః కాలమున  బయలు దేరెను. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి  ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి,'మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్లిరి. తిరిగి పండ్రెండు గంటలకు మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరి కొందరు పని వారిని పంపెను. రమారమి  సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్లి, సంత వీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి , మీరు  ఏల రోజంతయు పని పాటులు లేక ఇచట నిలిచియున్నారు? అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి  పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ  యజమానుడు  అటులైన మీరు కూడ నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్లుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని, యజమానునితో 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా!  నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసికొనిపొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా యిచ్ఛవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక  నా ఉదారత నీ కంటగింపుగానున్నదా?'అని పలికెను. ఇట్లే  మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురురు" అని యేసు పలికెను. 

క్రీస్తు నాధుని యందు  ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదట పఠనంలో దేవుడు తన ప్రవక్తను పంపుతూ యిస్రాయేలు కాపరులను ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులను ఖండించు అని తన ప్రవక్తను పంపిస్తున్నాడు. మీకు అనర్ధము తప్పదు అని  వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు వారిని అంటే కాపరులను, రాజులను ఖండిస్తున్నాడు అంటే  కాపరులు మందను వెదకటం లేదు. అంతే కాకుండా వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని  మందను మేపటం లేదు.  గొర్రెలను పట్టించుకొనుట లేదు. అందుకు దేవుడు అంటున్నాడు నేను మీ నుండి గొఱ్ఱెలను కాపాడుదును. నేనే నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని  తన ప్రవక్తల ద్వారా  తెలియజేస్తున్నాడు. 

ప్రియ విశ్వాసులారా ఇక్కడ కాపరులు అంటే దైవ సేవ చేస్తున్న గురువులు, దైవాంకితులు దేవుని చేత ఎన్నుకోనబడి దైవసేవ చేసేవారు అదే విధంగా గొర్రెలు అంటే ప్రజలు దేవుడు గురువులను కాపరులుగా తన మందయినా ప్రజలను మంచి మార్గములో నడిపించమని ఎన్నుకొంటే వారు మాత్రం వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అదే దేవుని ఆవేదన. దైవ ప్రజలను మేపుట లేదు . దేవుని ప్రజలు పాపపు మార్గంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వారిని చూసి కూడా పట్టించుకోవడం లేదు. వారు అనేక సమస్యలతో , ఇబ్బందులతో, కష్టాలతో కన్నీళ్లతో గాయపడి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కుతో కట్టు కట్టడం లేదు. ప్రక్కకు తప్పుకొనిన వారు అంటే చేదు అలవాటుల వలన, చేడు క్రియలను, చేడు ఆలోచనల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా మారి ప్రక్కకు తప్పుకొని పోతున్నారు. అది చూసి కూడా కాపరులు వారిని తిరిగి మందలోనికి నడిపించలేక పోతున్నారు.  అంతేకాకుండా వారి పట్ల కఠినముగా ప్రవర్తించుచున్నారు. 

ఇదే ఈనాటి సమాజంలోకూడా  జరుగుతుంది. కాపరులు తమ కడుపునింపుకుంటున్నారు. తమకు అప్పగించబడిన విశ్వాసులను అస్సలు పట్టించుకోవండ లేదు.    వారిని కని పెట్టుకొని ఉండటం లేదు. వారు తాము మంచి మార్గంలో నడువకుండా మంచి మార్గంలో నడిచే విశ్వాసులను తమ మాటల ద్వారా అసత్యపు బోధల ద్వారా చెల్లా చెదురు చేస్తున్నారు. ఎవరైన చేడు మార్గంలో పోతుంటే వారిని సన్మార్గంలో నడిపించలేకపోతున్నారు. వారి గాయాలను మాన్పకుండా వారు తమ విశ్వాసులను  అనేక విధములుగా గాయ పరుస్తున్నారు. విశ్వాసుల పట్ల మృదువుగా ప్రవర్తించడం లేదు. ఇది  నిజమా ? కాదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ఈనాటి సువిశేష పఠనములో మనం దేవుని యొక్క ఉదారతను తెలుసుకుంటున్నాం. దేవుడు పరలోక రాజ్యంను ద్రాక్షతోట, కూలీల పోలికలతో వివరించాడు. అనేక సమయాలలో అనేక మందిని  దేవుడు తన తోటకు పని నిమిత్తము పంపుతున్నారు. దేవుడు మనందరిని తన రాజ్య విస్తరణకు  పనివారిగా ఎన్నుకుంటున్నారు.   అందరి పట్ల ఉదారత, సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నారు. దేవునికి అందరు అర్హులే. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అంటే  అర్ధం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను దీవించి యోగ్యులును  చేస్తాడు, మనం చివరి వారిగా ఉన్న మనలను మొదటి వారీగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని   రాజ్యాల విస్తారణకై  శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దయను పొందుటకు  సిద్ధంగా  ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. 

ప్రార్ధన: దేవా మమ్ము అందరిని ఒక  కాపరులుగా  ఎన్నుకున్నావు. తండ్రిగా, తల్లిగా , బిడ్డగా విశ్వాసిగా మేము కూడా కాపరులుగా జీవించడానికి శక్తిని దయ చేయండి. మాకు అప్పగించిన , మా బిడ్డలను మా కుటుంబాలను , సంఘస్తులను మంచి మార్గంలో నడిపించడానికి శక్తిని దయ చేయండి.  మమ్ము మంచి కాపరులుగా మార్చండి. నీవలె ఉదారత కలిగి అందరిని ప్రేమించి జీవించే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

19, ఆగస్టు 2024, సోమవారం

యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30

అంతట యేసు తన శిష్యులతో, "ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే , ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరం అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను" అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, "అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు ?" అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, "మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము సాధ్యమే" అని పలికెను. అపుడు పేతురు యేసుతో, "మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు ఏమి లభించును?" అనెను. అందుకు యేసు వారితో "పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు, నన్ను అనుసరించిన మీరును పండ్రెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని , సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లిని గాని తండ్రినిగాని, పిల్లలనుగాని భూములనుగాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్య జీవమునకు వారసుడగుడను, అయినను మొదటివారు అనేకులు  కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. 

ఈనాటి మొదటి పఠనంలో ప్రభువైన దేవుడు తన ప్రవక్తను పంపుతు నా ప్రజలకు నా సందేశాన్ని వినిపించు అంటున్నాడు.  అది ఏమిటంటే తూరు రాజు గర్వముతో, నేను దేవుడును అని పొంగిపోతున్నాడు. దేవుని స్థానంలో కూర్చోవాలనుకొనుచున్నాడు. దేవునితో సరి సమానుడనని అనుకుంటున్నాడు. నేనే దేవుడను అని జీవిస్తున్నాడు. నేను అందరికంటే తెలివైన వాడనని అనుకుంటూ జీవిస్తున్నాడు. పొగరెక్కి జీవిస్తున్నాడు. కాబట్టి ఈనాడు దేవుడు తన ప్రవక్తను ఆ తూరు రాజు దగ్గరకు పంపిస్తున్నాడు. సోదరులారా ఈనాడు మనలో చాలా మంది గర్వముతో పొంగిపోయేవారిని మనము చూస్తూనే ఉన్నాం. ఆస్తి చూసుకొని గర్వ పడేవారు ,డబ్బుచూసుకొని గర్వ పడేవారు, అందాన్ని చూసి , సంపదలు చూసి చాలా మంది గర్వముతో జీవించేవారు మన సమాజంలో ఉన్నారు. నాకు అన్ని తెలుసు అని అహంకారంతో, అజ్ఞానములో పడిపోతున్నాం. దేవుడు మనందరికీ ఒక గప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు.  అది ఏమిటంటే మనం ఎంత కష్ట పడి, ఎంత  సంపాదించినా ఏమి కూడా మన వెంట రాదు. అపుడు మనకు అర్ధం అవుతుంది మనం మానవులమేనని.  చాల మంది తాము   దేవుడిలాంటి వారిమి  అని అజ్ఞానములో అనుకున్నవి అబద్దాలు అని తెలుసుకుంటాము. ఎప్పుడైతె మనం గర్వంతో, స్వార్ధంతో  ఉంటామో మనలను మనము తెలుసుకోలేము. మనలను రక్షించడానికి దేవుడు తన ప్రవక్తలను మన వద్దకు పంపిస్తుంటాడు. ఎంత ఎదిగిన, ఎన్ని సంపాదించిన ఎన్ని ఉన్న మనం దేవుని వంటి వారము కాము. దేవుడిలా కాలేము ఎందుకంటే మనకున్నదంత దేవుడు మనకు ఇచ్చినదే.  ఆయన అన్ని తీసుకోగలడు. కాబట్టి ఎంత ఎదిగిన  ఒదిగి ఉండాలి. గర్వముతో కాకుండా విధేయతతో తగ్గింపు మనస్సుతో జీవించడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. 

సువిశేష పఠనంలో దేవుడు అంటున్నాడు. ధనవంతుడు  పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ మాటలను పలికి ఉన్నాడు? అంటే ధనవంతుడైన ఒక యువకుడు నేను పరలోక రాజ్యము పొందాలంటే ఏమి చేయాలి అని క్రీస్తు ప్రభువుని   అడిగినప్పుడు, నీకు ఉన్న దానిని అమ్మి, పేదలకు ధానము చేయుము అనగానే, ఆ యువకుడు అధిక సంపదలు కలవాడు కాబట్టి డబ్బు, సంపదల మీద ఉన్న ప్రేమ వలన , ఆశ వలన దైవరాజ్యానికి దూరమైపోతున్నాడు. మనలో కూడా ప్రియ  విశ్వాసులారా డబ్బు సంపాదనలో పడి, ఈ లోక సంపదలలో పడి దేవుడిని, పరలోక సంపదలను కోల్పోతున్నాము. 

అదే విధంగా దేవునికి  సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. ఆయన తనను విశ్వసించి వెంబడించువారికి సమస్తమును సమృద్ధిగా ఇస్తాను అని     వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవుని అనుసరిస్తే మనకు ఏమి  లభిస్తుంది అంటే 1. పునరుత్తాణ భాగ్యం. 2. పరలోక ఆసనం లభిస్తుంది. 3. నిత్యజీవమునకు వారసులగుతారు, 4. ఈ లోకంలో కడపటి వారు పరలోకంలో మొదటివారుగా ఉంటారు. 5. నూరంతలగ ఆత్మ బంధువులను పొందుదురు. కాబట్టి ప్రియా విశ్వాసులారా మనము ఎప్పుడైతే మన సంపదలను, మనకున్న సమస్తాన్ని పరిత్యజించి క్రీస్తును అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి త్యాగ పూరిత జీవితం జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన: దయామయుడైన దేవా! నీవు  తనను తాను తగ్గించుకొని, వినయంతో జీవించే ప్రతి వ్యక్తిని కరుణించి దీవించేవాడవు. కనుక తండ్రి మేము గర్వాత్ములము కాకుండా వినయ విధేయతలతో జీవించి ఈ లోక ఆశలు, ఈలోక సంపదలు, ఈ లోక వస్తువులో ఈ లోక వ్యక్తులను పరిత్యజించి నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...