30 వ సామాన్య ఆదివారం
యిర్మియా 31:7-9 , హెబ్రీ 5: 1-6, మార్కు 10:46-52
ఈనాటి దివ్య పఠనాలు దేవునికి తన ప్రజల పట్ల వున్న అమితమైన ప్రేమ, దయ, క్షమ అనే అంశములను గురించి బోధిస్తున్నాయి.
తండ్రికి తన బిడ్డల పట్ల ఉన్న మమకారం ఎప్పుడు కూడా మరువనిది అని కూడా ఈనాటి పఠనాల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఇస్రాయేలు ప్రజల మీద చూపిన గొప్ప ప్రేమ అర్థమగుచున్నది.
తండ్రి దేవుడు ప్రజల యొక్క ఆధ్యాత్మిక అంధకారంను తొలగించి వారి యొక్క జీవితములో సంతోషం అనే వెలుగు నింపుచున్నారు.
దేవుడు యిస్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో 31 వ అధ్యాయం 1-4 వచనాలలో అర్థమగుచున్నది.
దేవుడు ప్రతి సారి కూడా యిస్రాయేలు ప్రజలను నా ప్రజలు అని సంబోధిస్తున్నారు అలాగే నేను వారు దేవుడిని పలుకుచున్నారు.
ఈ బంధం తండ్రి , బిడ్డల ప్రేమ బంధం విడదీయలేని బంధం, ఎందుకంటే ఎన్నిసార్లు యిస్రాయేలు ప్రజలు తండ్రిని కాదని అన్య దైవములను పూజించినా ఆ తండ్రి తన బిడ్డలను మరలా ప్రేమిస్తూనే , క్షమిస్తూనే ఉన్నారు.
ఈనాడు మనం విన్న మొదటి పఠనంలో యిస్రాయేలు పునరుద్ధరణకు సంబంధించి దేవుడు చేసిన వాగ్ధానాలు వింటున్నాం.
బాబిలోనియా బానిసత్వంలో ఉన్న యిస్రాయేలు ప్రజలను దేవుడు విముక్తి చేస్తారు. ఉత్తర దేశమైన బాబిలోనియా నుండి యిస్రాయేలు ప్రజలను స్వదేశమైన యూదాకు తిరిగి రప్పిస్తారని తెలుపుచున్నారు. ఇక్కడ దేవుడు తన ప్రజలను ఇచ్చే ఆ స్వేచ్ఛ గురించి , ఆయన తన ప్రజలకు ఇచ్చే సంతోషం గురించి ధ్యానించాలి.
బానిసత్వంలో స్వేచ్ఛ లేదు, ఆనందం గా గడపడానికి సమయం లేదు, సమూహంగా దేవున్ని ఆరాధించడానికి స్థలం లేదు. ఎటు చూసినా ఇబ్బందియే, అంతగా బాధపడే ఒక స్థలం నుండి దేవుడు వారికి విముక్తి చేస్తున్నారు. వారికి జీవాన్నీ సమృద్దిగా దేవుడు ఇస్తున్నారు.
మళ్ళీ వారు సంతోషముగా యెరుషలేములో ఆరాధనాలు చేయవచ్చు , దేవుడు వారిని తన బిడ్డలుగానే గౌరవించారు. వారిలో ఆనందం నింపారు. మరలా ఒకసారి పూర్వ వైభవమును వారికి అందచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను తోడై వుంటా అన్నారు.
దేవుడు అంటున్నారు 8 వ వచనంలో నేల అంచుల నుండి వారిని కొనివత్తును అని, అంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా మరిచి పోవటం లేదు. అందరిని కూడా స్వేచ్చా వంతులను మరియు తన బిడ్డలుగా చేయాలన్నదే, దేవుని యొక్క ఆశ. ఇప్పటివరకు బాధలలో ఉన్న గ్రుడ్డి వారు, కుంటివారు ,గర్భవతులు, సంతోషంగా తిరిగి ఒక మహా సమూహంగా వస్తారని ప్రభువు తెలుపుచున్నారు. దేవుడే స్వయంగా వారిని నడిపించుకొని వస్తారు. వారికి చేరువలో ఉంటారు.
దేవుడు తన ప్రజలను నడిపించుకొని వస్తారు, వారిని చేయిపట్టి నడిపిస్తారు. ఆనాడు ఇదే యిస్రాయేలు ప్రజలను ఎలాగైతే వాగ్దత్త భూమికి, సంతోష స్థలాలకు నడిపించారో అదే విధంగా మరొక సారి ఈనాటి విశ్వాస యిస్రాయేలు ప్రజలను కూడా అదేవిధంగా ప్రేమతో నడిపిస్తారు అని యిర్మియా తెలుపుచున్నారు.
వారు ఏడుపులతోను ప్రార్ధనలతో తిరిగి వస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఆ దేవుని యొక్క గొప్పదైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు అవిశ్వాసులుగా జీవించిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు. అదేవిధంగా బానిసత్వంలో గడిపిన చీకటి సమయాలను గుర్తించుకుంటూ ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప స్వేచ్ఛను, ఆయన యొక్క అనంత ప్రేమను గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తారు.
ఇంకొక విధంగా చెప్పాలంటే వారి యొక్క ఆనందం వల్ల కూడా ఏడ్చి ఉండవచ్చు. ప్రభువు అంటున్నారు వారిని తిన్నని మార్గమున నడిపింతును, అంటే ఇక అన్య దైవముల వైపు ప్రయాణం చేయరని మంచి వైపు, దేవుని వైపు మాత్రమే ప్రయాణం చేస్తారని, వారి గమ్యం తప్పరని అర్ధం. దేవుడు నిర్ధేశించిన స్థానంకు వారు చేరుతారని అర్ధం.
వారు కాలు జారీ పడిపోరు అంటున్నారు అంటే వారి పట్ల అంత శ్రద్దగా ఉంటారని దీని యొక్క అర్ధం. యిస్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో దేవుడు మరొక సారి తన గొప్ప ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ప్రజలు కూడా దేవునికి సంతోషంతో కృతజ్ఞతగా పాటలు పాడుచున్నారు.
రెండవ పఠనంలో దేవుడు యాజకుల యొక్క ఎన్నికను గురించి వారి యొక్క జీవితం గురించి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు జీవించిన విధంగా ప్రతి యాజకుడు జీవించాలి. క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వం మిగతా లేవీయుల యాజకత్వం కన్నా భిన్నంగా ఉన్నది ఎందుకంటే స్వయంగా తండ్రి దేవుడే తన కుమారున్నీ ఈ పనికి నియమించారు.
తండ్రికి -ప్రజలకు మద్య ఒక నిచ్చెనలాగా ఉండుటకు, దేవుని యొక్క ప్రతినిధిగా నిత్య యాజకుడు క్రీస్తు ప్రభువు ఉన్నారు. ప్రతి గురువు కూడా దేవుని యొక్క ప్రతినిధే.
ప్రతి యాజకుడు కూడా ప్రజల మధ్య నుండే ఎన్ను కొనబడిన వాడే . హెబ్రీ 5:1 , ద్వితీ 18:15 ఆయన కూడా సామాన్యుడే బలహీనుడే అయినప్పటికీ దేవుడు తనను ఎన్నుకొని, అభిషేకించి బలవంతున్ని చేశారు.
వారిని ఎన్ను కొన్నది ప్రజలను దీవించుటకు. ద్వితీ 10:8, సంఖ్యా 6:24-26
వారిని ఎన్ను కొన్నది వాక్యమును ప్రకటించుటకు. ద్వితీ 31:11 , మార్కు 16:15
తన సేవ చేయుటకు, స్తుతించుటకు ఎన్నుకొనెను. 2 రాజుల దిన 29:11
ప్రజల కోసం బలులను సమర్పించుటకు ఎన్ను కొనబడిన వారు. 2 రాజుల దిన 29:24 ప్రజల పాపముల కొరకే కాదు యాజకుడు బలులు సమర్పించేది, తన పాపముల కొరకు కూడా. ఈ యొక్క యాజకత్వ పదవి దేవుడు ఇచ్చినదే, ఆయనకు విధేయులై జీవించాలి.
ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు, బర్తిమయి అను అంధుడికి చూపునిచ్చే విధానం చదువుకుంటున్నాం. యేసు ప్రభువు యెరుషమలేముకు ప్రణయమయి వెళ్ళే సమయములో యెరికో మీదుగా వెళ్లుచున్నారు.
జక్కయ్యది కూడా యెరికో పట్టణమే. యెరికో నుండి యెరుషలేము వెళ్లుచున్నా ప్రభువు గూర్చి విని, పదే పదే ప్రాధేయపడి అడుగుచున్నాడు.
ఈ బర్తిమయి జీవితములో దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసం మనం అర్ధం చేసుకోవాలి.( లూకా 18:35-43.) క్రీస్తు ప్రభుని గురించి ఆయన యందు విశ్వాసం ఉంచుకున్నాడు . వినుట వలన విశ్వాసం కలిగింది. వినుట వలన మేలు కలుగుతుంది అని భావించాడు. క్రీస్తుని గురించి వినుట వలన తన బాధలు పోతాయని నమ్మకం కలిగింది, క్రీస్తుని గురించి వినుట వలన, పేదవారి పట్ల నిలిచే దేవుడు తనకి మంచి చేస్తారన్న నమ్మకం ఆయనలో కలిగింది.
ఆయన ప్రేమ గురించి విని ఉండవచ్చు, దానితో ఆశ కలిగింది. బిక్ష గాడు సాధారణంగా చేసే పని ఏమిటంటే అడగటం, ప్రతి ఒక్కరినీ అడుగుతుంటారు.
కొందరు బిక్ష గాళ్లు ఇవ్వకపోతే వదిలివేస్తారు. బర్తిమయి తనను ఎంతమంది ఆపినా సరే వదిలి వేయటం లేదు, పట్టు వీడటం లేదు. ఆయనకు బహుశా మత్తయి 7:7 వచనపు దేవుని మాటలు గుర్తుండవచ్చు. అందుకే వెంటనే అడుగుచున్నాడు.
దేవుడు అనేక సార్లు మన జీవితం గుండా ప్రయాణం చేస్తారు. కాని చాలా సార్లు మనం అది గుర్తించము, బర్తిమయి దేవుడుండే స్థలంకు వెళ్లుచున్నారు. యోషయా 55:6 దేవుని కోసం అన్వేషించండి అని చెబుతుంది. బర్తిమయి మాత్రము యేసు ప్రభువును గుర్తించి, విని, పిలుస్తున్నాడు. వెంటనే ప్రభువు సమాధానము ఇస్తున్నారు. యిర్మీయా 33:3 వాక్యంలో ప్రభువు అంటారు. నీవు పిలుతువేని నేను జవాబిత్తును అని. కీర్తన 34:6. మోషే పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. ఏలియా దేవున్ని పిలిచారు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.(కార్మెల్ పర్వతంవద్ద).
బర్తిమయి దెవున్ని పిలిచారు, ఆయనకు స్పందించారు, సమాధానం ఇచ్చారు. సుసన్న దేవున్ని పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. యిస్రాయెలు, దేవున్ని ఐగుప్తులో పిలిచారు దేవుడు సమాధానం ఇచ్చారు. బర్తిమయి దేవుడిని కరుణించమని కోరుతున్నారు. తన యొక్క దీన స్థితియందు, దయ ఉంచామని అడుగుచున్నాడు. తన బలహీనత పట్ల, పాపముల పట్ల కనికరం కలిగి తనను ఆదుకోమని ప్రార్థిస్తున్నాడు.
మనం కూడా దేవుడిని అడుగవలసినది, కరుణయే. ఆనాడు యిస్రాయేలు ప్రజలు దేవుని కరుణ కొరకు ప్రార్థించారు. కాబట్టే వారికి దేవుడు మరల జీవితాన్ని ప్రసాదించారు.
బర్తిమయిలో చూసే గొప్ప విషయం ఏమిటంటే తనకు, దేవుని వరం పొందుటకు దేవుడిచ్చిన, అవకాశమను చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎవరు తనను ఆపినా సరే ఆగటం లేదు.
బర్తిమయి క్రీస్తును మెస్సయ్య గా గుర్తించారు. అందుకే దావీదు కుమారా, అని సంబోధిస్తున్నారు. మనం అడిగే ప్రతిదీ, దేవునికి నచ్చితే, దేవుడు మనకు సహాయం చేయడానికి, మన చెంతకు వస్తారు. ప్రభువు బర్తిమయి ఆక్రందన విని ఆగిపోయాడు. ప్రభువు పిలుపు వినగానే బర్తిమయి తనపై వస్త్రం విడిచిపెట్టి ప్రభువు వద్దకు పరుగు తీశారు. అప్పటి వరకు ఆ వస్త్రం తన పడక, దాని మీదే ఆధారపడి జీవించారు, అదియే తన ఆస్తి , ఎన్నో సంవత్సరాలుగా ఆ దౌర్భాగ్య స్థితిలో గడిపి ఉండవచ్చు, కానీ ఇప్పుడు క్రీస్తు చెంతకు రావటం వలన, ఆయన నూతన జీవితం, ప్రసాదిస్తారని గ్రహించి దుప్పటి వదలి వస్తున్నారు. క్రీస్తుతో జీవించాలి అంటే పాతది వదలి వేయాలి.
బర్తిమయి జీవితంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు
1. క్రీస్తు ప్రభువును మెస్సయ్య గా గుర్తించట
2. క్రీస్తు చెంతకు రావడం , విశ్వాసంతో పట్టు విడువకుండా అడుగటం
3. ప్రభుని యొక్క దయ , క్షమ కరుణ కోరుట
4. క్రీస్తుని వెంబడించుట.
ఈ రోజు బర్తిమయి చూపుని అడిగిన విధంగా మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక అంధకారం తొలగించి మంచిని చూచేలా, మంచి చేసేలా ,మంచి చెంతకు వెళ్ళేలా చేయమని ప్రార్ధించుదాం. బర్తిమయి ఎంతకాలం గ్రుడ్డివాడో ఎవరికి తెలియదు ,ఆయన గ్రుడ్డివాడు కాబట్టి పట్టించుకునే వారు లేరు. బర్తిమయి, యేసుప్రభుని చూడకుండానే నమ్మారు. ఆయన ప్రభువు ఏ మార్గము గుండా వస్తారో ముందే తెలుసుకొని, అక్కడ కాచుకొని ఆయన కొరకు, ఆయన వచ్చే స్థలం వద్దకు వచ్చి ఎదురు చూస్తున్నాడు.
చూడక నమ్మువారు ధన్యులు యోహను 20 : 29 . క్రీస్తు ప్రభుని, విని నమ్మే ధన్యులు ఎల్లప్పుడు దేవుడి యొక్క జీవమును , ఆశీర్వాదాలు పొందుతారు. యోహను 5:24 ,20:31,రోమి 10:9-10. బర్తిమయి క్రీస్తును తన రక్షకునిగా, తనకు విముక్తి కలుగచేసే వానిగా, తన నాయకునిగా గుర్తించి ఆయన్ను సంప్రదించారు. దేవున్ని భోజనం పెట్టమని ,సంపదలు ఇవ్వమని అడగలేదు కానీ అతి ప్రధానమైన దయ చూపమని అడుగుచున్నారు. ఆనాడు సుంకరి అడిగినది అదే లూకా 18:13-14 .
By Rev. Fr. Bala Yesu OCD