సాతాను శోధనలు - క్రీస్తును విజయము
క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ఈనాడు తల్లి తీరుసభ మనలను అందరిని కూడా తపస్సు కాలపు మొదటి ఆదివారము లోనికి ఆహ్వానిస్తుంది. ఈనాటి పరిశుద్ద పఠనాల ద్వారా మనలను అందరిని కూడా సాతానుకు బానిసలు కాకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్చతో జీవించమని లేదా దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించమని కోరుతుంది.
ఎందుకంటే ఈ యొక్క పాపము లేదా సాతాను కీడులలో నుండే కదా క్రీస్తు ప్రభువు తన శ్రమలు, మరణ, పునరుత్థానల ద్వారా మనలను స్వేచ్ఛ పరులను చేసెను. క్రీస్తు తన మరణ పునరుత్థానాల ద్వారా సైతాను పై ఆధిపత్యం చూపించలేదా? తన మరణ పునరుత్థానాల ద్వార మనకు రక్షణ తెచ్చెను గదా? మనలకు పాప విమోచనగావించే కదా?
మరి మనము ఆ పాపపు జీవితాన్ని జీవించడం ఎంత మాత్రం సమంజసమో! మనం అందరం ఆత్మ పరిశీలన జేసుకోవాలి. ఈనాటి పరిశుద్ద గ్రంధ పఠనాలలో చూస్తే, శోదనల గురించి వింటున్నాము. మరి ముఖ్యంగా సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువును ఆ సైతాను ఏవిధంగా శోధించిందో చూస్తున్నాం.
యిస్రాయేలు ప్రజలు, ఎడారి ప్రాంతంలో వారికి తినడానికి ఏమి దొరకనటువంటి సంధర్భంలో వారు శారీరక ఆకలితో, దేవున్ని మరియు మోషే ప్రవక్తను నిందిస్తున్నారు.
ఏదైన మేలు జరగనప్పుడు మనం దేవుని నిందించాలనుకోవడం ఒక శోదనే. ఉదా: మనము యొబు జీవితం చూసుకున్నట్లయితే తన భార్య, తన చెంతకు వచ్చి, నీవు సర్వాన్ని కోల్పోయావు, నీవు జీవించడం వ్యర్ధము, కాబట్టి నీ దేవున్ని శపించి నీవు కూడా చచ్చిపో, అన్నప్పుడు యొబు ఆ శోదనకు వెళ్ళి , దేవునితో గొడవ పడతాడు, నీవు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని. నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని.
కానీ చివరికి తన తప్పు తెలుసుకుంటాడు, దేవుని క్షమాపణ కోరతాడు. మరి మనం జీవితంలో కూడా యిస్రాయెలు ప్రజల వలె యొబు వలె మనకు మేలు జరగని సందర్భాలలో మనం దేవుడిని నిందిస్తున్నామా? విశ్వాసాన్ని, లేదా నమ్మకాన్ని కోల్పోతున్నమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఎందుకంటే ఈ సాతాను అవకాశం కోసం పొంచి ఉంటుంది. మనకు ఏమైనా కొదవఅయినప్పుడు , దేవునకు మనం ప్రార్దన చేసిన విననప్పుడు, దేవుడు మనలను విడనాడినట్లు ఉన్నప్పుడు, మనం బాధలలో, కష్టాలలో ఉన్నప్పడు, సాతాను మనలను దేవుడిని నిందించమని శోధిస్తుంది.
సువిశేషం పఠనంలో చూస్తే :- క్రీస్తు ప్రభువుకి సాతాను శోదన మనం చూస్తున్నాం . క్రీస్తు ప్రభువుకి ఈ శోదనలు ఒక్కసారి మాత్రమే వచ్చినవి కావు, అవి అనునిత్యం క్రీస్తు జీవితంలో ఉన్నవే. తాను కన్ను మూసేంత వరకు, అంతా సమాప్తమైనది అనేంత వరకు కూడా శోధింపబడ్డారు.
ఎలా అంటే : - మనుష్య కుమారునిగా, ఒక సాదారణ వ్యక్తిగా మరణించే ముందు తండ్రి దేవుడు తనని వీడనాడాడు లేదా తనని వేరు చేశాడని భావించి ఉండవచ్చు కాబోలు. అందుకే నా దేవా నా దేవా , నన్నేల విడనాడితివి అని బిగ్గరగా ఏడ్చాడు.
కానీ :- క్రీస్తుకు తెలుసు, ఇది తండ్రి చిత్తమే అని , అందుకే తండ్రి ! నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను . అంతా సమాప్తమైనది అని అంటున్నాడు.
ఈరోజు సువిశేషంలో చూస్తే
సాతాను మొదటి ప్రయత్నం :- క్రీస్తు ప్రభువు నలువది దినాలు ఉపవాసమున్నాడు, ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచించి, ఆ సాతాను క్రీస్తుని శారీరక ఆకలి తీర్చడం కోసం శోధిస్తుంది.
ఇక్కడ సాతాను మూర్ఖత్వం కాకపోతే క్రీస్తు 4,000 మందికి 5,000 మందికి ఆకలి తీర్చిన దేవుడు తన ఆకలి తీర్చుకోలేడా ! సాతానును లెక్క చేయలేదు, సాతాను ఓడిపోయింది.
సాతాను రెండవ ప్రయత్నం :- రాజ్యాలన్నీ నీకిస్తాను, ఆధికారాన్ని నీకిస్తాను, నాకు మ్రొక్కు అంటుంది. ఇక్కడ కూడా సాతాను మూర్ఖత్వమే. ఎందుకంటే, సకల సృష్టిని సృజించిన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఈ లోకాధిపతి, సర్వ అధికారికి, ఆయన ముందు సాతాను కుప్పిగంతులు. క్రీస్తు ప్రభువు బహుశా నవ్వుకొని ఉండవచ్చు కాబోలు సాతాను యొక్క మూర్ఖత్వాన్ని చూసి అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు లొంగలేదు. పైగా సాతానుకి " నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుము, సేవించుము" అని వ్రాయబడి ఉన్నదని గుర్తు చేస్తాడు.
సాతాను మూడవ ప్రయత్నం :- నీవు ఈ శికరము పై నుండి క్రిందకు దూకు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు, అని శోధిస్తుంది. ఒక్క మాటతో లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్క మాటతో లాజరును జీవంతో ఇచ్చిన దేవుడు, ఒక్క మాటతో స్వస్థతలు చేసిన దేవుడు, ఒక్క మాటతో సముద్రాన్ని శాసించిన, అద్భుతాలు, చేసిన క్రీస్తుకు, ఇది ఒక శోధన.
అప్పుడు కూడా క్రీస్తు ప్రభువు సాతానుతో ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెబుతున్నారు. సాతాను మళ్ళీ ఓడిపోయింది. ఇలా క్రీస్తు ప్రభువు సీలువలో మరణించేంత వరకు కూడా శోధిస్తూనే వుంది.
అద్భుతాలు, మహిమలు చేయగల శక్తిగల దేవుడు క్రీస్తు ప్రభువు అయిన కూడా, తాను స్వార్ధంగా ఆలోచించలేదు. తన స్వంత ప్రయోజనాలకు, పేరుకు గాని ఎప్పుడు ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రజల సంతోషం కోసమే తన శక్తులను ఉపయోగించాడు. మరి మనం శక్తి సామర్ధ్యాలు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం?ఆత్మ పరిశీలన చేసుకోవాలి?
రెండవ పఠనం :- పునీత పౌలుగారు రోమియులకు తెలియ చేస్తున్నారు. మనకు "ప్రభువుఒక్కడే "ఆయనను మన హృదయంతో విశ్వసిస్తే, నీతిమంతులం అవుతాం. నోటితో ప్రభువే నా దేవుడు అని ఉచ్చరిస్తే రక్షింపబడతాం, అని తెలియ చేస్తున్నారు.
క్రీస్తు ప్రభువు చేసింది కూడా అదే. సాతాను వచ్చి నాకు మొక్కుము అన్నప్పుడు క్రీస్తు చెప్పిన మాటలు కూడా ఇవే మనకు దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే సేవిస్తాను అని.
ఈనాడు మనము క్రీస్తువలె జీవిస్తున్నామా ? మనకు దేవుడు ఎవరు ధనమా , పేరు ప్రఖ్యాతలు, అధికారమా, బందువులా, మిత్రులా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత సిలువ యోహను గారు కూడా ఇటువంటి మాటలనే తన యొక్క జాగ్రత్తలు తెలియ చేస్తారు. ప్రతి మనిషి కూడా మూడు విధాలుగా శోధింపబడుతాడు, వాటిని జాగ్రత్తగా ఎదుర్కోనమని తెలియచేస్తున్నారు.
మొదటిగా : వ్యక్తిగతంగా, ఎదురయ్యే శోధన , ఇది మానసికంగా కావచ్చు, శారీరక సుఖా:ల ద్వార కావచ్చు, లైంగిక శోధన , ఆహార శోధన , నిర్లక్ష్య కావచ్చు.
రెండవదిగా : ఈ లోక సంబందమైన శోధన
-బందువుల ద్వారా , స్నేహితుల ద్వారా కావచ్చు
-సంపదల ద్వారా, ధనము ద్వారా కావచ్చు .
మూడవదిగా : సాతాను శోధన
వక్రబుద్ది జీవతం
- ఆధికారం కోసం
-గొప్పవారు కావాలని, పేరు పొందాలని,
-ఎప్పుడు ఒకరి మీద పెత్తనం చేయాలని ఎంత నీచానికైనా మనిషి దిగజారుతాడు.
ఇలాంటి మూడు సందర్భాలలో మనం దేవున్ని మర్చిపోతాం, దేవునికి దూరంగా జీవిస్తాం, అవే సర్వస్వం అని నమ్మి మోసపోతాం. చివరికి జీవితం నాశనం చేసుకుంటాం. కాబట్టి వీటన్నింటికి జాగ్రత్త కలిగి దేవునియందు విశ్వాసముంచి జీవించమని తెలియచేస్తున్నారు.
కావున మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ శ్రమలు అనునిత్యం ఉంటాయి. ఈ నలువది రోజులు మాత్రమే నేను ఈ విధంగా జీవించాలి అని కాదు. ప్రతి నిత్యం కూడా మనం సాతానును గెలవాలి.
చివరిగా ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనలను బానిసత్వం నుండి స్వతంత్రులను చేయుటకు ఈ లోకానికి వచ్చారు, మనలను విముక్తులను చేశారు. కానీ ఇంకా మనం సాతాను బానిసత్వంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకొని, దేవుని స్వతంత్ర బిడ్డలుగా జీవించుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్ .
BR. SUBHASH