21, మే 2022, శనివారం
పాస్క 6 వ ఆదివారం (2)
అపో 15:1-2, 22-29, దర్శన 21:10-14, యోహను 14:23-29
ఈనాటి దివ్య పఠనాలు మరి ముఖ్యంగా మొదటి పఠనం సువిశేష పఠనం శాంతి గురించి బోధిస్తుంది. మనందరం ఐక్యంగా ఒకే ఆలోచనలో, అభిప్రాయంలో వుంటే అక్కడ ఎటువంటి కలహాలు వుండకుండా, శాంతి వుంటుంది, అని ఈ దివ్య పఠనాలు తెలియజేస్తున్నాయి.
మానవ జీవితంలో అనేక సందర్భాలలో కష్టతరమైన, క్లిష్ట సమస్యలకు పరిష్కారం, సమాధానం వెదికేటప్పుడు అభిప్రాయ భేధాలు రావచ్చు, సంఘర్షణలు రావచ్చు, వివాదాలు, విభేధాలు, మనస్పర్ధలు రావచ్చు. అలాంటి సందర్భాలలో మనం శాంతిని నెలకొల్పేందుకు ఒక మంచి మార్గాన్ని, అందరు మెచ్చే మార్గాన్ని ఎన్నుకోవాలి.
ఈనాటి మొదటి పఠనంలో తొలి క్రైస్తవులకు ఎదురైన ఒక సమస్యను గురించి వింటున్నాం.
అప్పుడే విశ్వాసం స్వీకరించిన ఆదిమ క్రైస్తవులకు రక్షణకు సంబంధించిన విభేదాలు వచ్చాయి. రక్షణ పొందాలంటే వాస్తవానికి ఒక వ్యక్తి ఏమి చేయాలి, అనే విషయం గురించి కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సున్నతికి సంభందించినది.
శ్రీ సభ ప్రారంభమైన తొలి 20 సంవత్సరములు, క్రైస్తవులంటే ఎక్కువగా యూద మతం నుండి క్రైస్తవులుగా మారిన వారే. ఆ సమయంలో ఏ అన్యుడైన, క్రైస్తవునిగా మారాలంటే వారు మొదటిగా యూదులుగా మారాలి. యూదుల అన్నీ ఆచారాలు అనుసరించాలి. అందుకే రక్షణ పొందాలంటే సున్నతి అవసరం అని యూదయ నుండి వచ్చిన అన్యులు అన్నారు. క్రైస్తవులుగా మారాలని ఇష్టపడుచున్న అన్యులు కూడా అన్నీ ఆచార విధులను పాటించాలని పట్టుబట్టారు.
అంతియోకు సంఘంలో ఉన్న విశ్వాసులు, క్రీస్తు సంఘంలో సున్నతి లేకుండానే చేరారు. వారు విశ్వసించేదెమిటంటే జ్ఞాన స్నానం , విశ్వాసం ఉంటే చాలు ఎవరైన రక్షణ పొందవచ్చని.
అప్పటి భేధాభిప్రాయం ఏమిటంటే అన్యులను క్రీస్తు సంఘంలో చేర్చుకునేందుకు వారు మొదటిగా యూదులుగా మారటం అవసరమా? లేదా? అనే భేదాభిప్రాయాలు వచ్చాయి.
ఈ భేదాభిప్రాయం ఏలా వుందంటే రెండు జాతులు మధ్య భేదాభిప్రాయం, రెండు సంస్కృతులు మధ్య, రెండు రకాల ఆలోచనల మధ్య భేదాభిప్రాయం మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పౌలు, బర్నబా గార్లు ఎవరైన రక్షణ పొందాలంటే క్రీస్తు నందు విశ్వాసం కలిగి ఆయన్ను అంగీకరిస్తే చాలు, రక్షణ పొందవచ్చు అని తెలిపారు.
ఈలాంటి పెద్ద సమస్యను వారు ఏకాభిప్రాయం ద్వారా విశ్వాసుల మధ్య శాంతిని నెలకొల్పారు. పౌలు , బర్నబాలు ఈ సమస్యను అపోస్తులతో చర్చించి దీనిని సరి చేశారు.
మన కుటుంబాలలో కూడా సమస్యలు భేధాభిప్రాయలు ఉంటే వాటిని కూర్చొని మాట్లాడితే, ఏక ఆలోచన , నిర్ణయం కలిగి ఉంటే సమాధానంతో ఉండవచ్చు.
తొలి క్రైస్తవ సంఘం కూడా యెరుషలేములో మొదటిగా సమావేశాన్ని ఏర్పరిచారు, పవిత్రాత్మ తో నడిపింపబడి సరియైన నిర్ణయం తీసుకున్నారు.
అపోస్తులు తాము తీసుకున్న నిర్ణయం తమ ఒక్కరిదే కాదని స్పష్టం చేశారు. మా చేత నిర్ణయించబడినది అని తెలిపారు.
ఈ నిర్ణయం రెండు కారణాల వల్ల మహిమాన్విత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
1. మొదటిగా క్రైస్తవ విశ్వాసాన్ని యూదామతం నుండి విస్పష్టంగా వేరు చేసింది.
2. రక్షణ అనేది మానవుని విశ్వాస జీవితానికి మరియు దేవుని ప్రేమకు చెందినది.
దేవుడు మనల్ని రక్షించేది ఆయన ప్రేమ వలనే ఆయన ప్రేమే మనలను కాపాడుతుంది.
మన విశ్వాస జీవితంలో కూడా మనం ప్రార్ధించాలి, మంచిగా జీవించాలి, సోదర ప్రేమ , దైవ ప్రేమ కలిగి ఉంటే దేవుని ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనం రక్షణ పొందవచ్చు.
మన విశ్వాస జీవితంలో ప్రశాంతంగా వుండాలంటే ఒకే అభిప్రాయం ఉంటే అంతా శాంతి యుతంగా , ఆనందంగా వుంటుంది.
మన జీవితంలో దేవుని యొక్క తోడు ఎప్పుడు కూడా ఉండాలి.
ఈనాటి రెండవ పఠనంలో యోహను గారు నూతన యెరుషలేమును దర్శనంలో చూసారు. అది ఎంతో అందంగా, ప్రకాశవంతంగా ఉంది .
ఈ నూతన యెరుషలేము చుట్టూ గోడ కలదు, దానికి 12 ద్వారాలు ఉన్నాయి. ఈ పన్నెండు ద్వారాలు 12 మంది దేవ దూతల ఆధ్వర్యంలో ఉన్నాయి అని తెలిపారు
యోహను గారు చూసిన ఈ దర్శనం శ్రీ సభ గురించియే. ఈ నూతన యెరుషలేము అయిన శ్రీ సభ 12 మంది అపోస్తుల మీద నిర్మించబడింది. ఈ యొక్క శ్రీ సభ బాధ్యతలను మొదటిగా దేవుడు వీరికే అప్పజెప్పారు.
వారు దేవుని యొక్క నామమును వేదజల్లారు. యేసు క్రీస్తువే వారికి ఆదరువు , ఆయనయే వారికి వెలుగుగా, రక్షకునిగా మార్గ చూపరిగా ఉన్నారు.
దేవుని వెలుగును స్వీకరించిన వారు ఎల్లప్పుడు శ్రీ సభను ప్రకాశవంతంగా చేస్తారు.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులను ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు.
మొదటిగా ప్రభువు అంటున్నారు. నన్ను ప్రేమించువారు, నా ఆజ్ఞలు పాటిస్తారు అని, వాస్తవానికి మనం ఎవరినైన ప్రేమిస్తే వారు చెప్పిందల్లా పాటిస్తాం, అనుసరిస్తాం. ఉదాహరణకు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి పట్ల సోదర ప్రేమ కలిగి ఉంటే అతని కోసం ఏదైనా చేస్తాడు.
అదే విధంగా ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ వలన ఒకరి మాట ఒకరు పాటించుకొని జీవిస్తారు.
మనం కూడా దేవున్ని ప్రేమిస్తే ఆయన్ను బాధ పెట్టము, ఆయన ఆజ్ఞలు పాటిస్తాము. ఆయన యొక్క చిత్తమునే ఈ లోకంలో నెరవేర్చుతాము.
దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞలను పాటించుట ద్వారా మనం దేవుని ప్రేమకు సాక్షులవుతున్నాము. దేవుడు మనతో ఉంటారు. తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవున పేరిట ఏమి అడిగినను దయ చేస్తారు, దేవుడు మనతో నివసిస్తారు.
దేవున్ని ప్రేమించని వారు ఆయన అజ్ఞలను పాటించరు, ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు అందుకే ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు.
ఆయన్ను నిజంగా ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావహిస్తాడు, ఆయన చిత్తానికి తనను తాను లోబరుచుకుంటాడు. ఆయన మాటను పాటిస్తాడు.
దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఆయన్ను ప్రేమించుట అసాధ్యం. మనలో చాలా మంది దేవుని సహకారాన్ని అర్ధిస్తున్నమే కానీ ఆయన ఆజ్ఞలను పాటించుట లేదు.
ప్రభువా , ప్రభువా అని పిలిచేవారు పరలోకంలో చేరరు కాని దేవున్ని ప్రేమించి, ఆయన చిత్తాను సారంగా జీవించేవారే ప్రవేశిస్తారు. మత్తయి 7:21.
యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు తోడుగా వుండుటకు ఓదార్పు వాడును పంపిస్తానంటున్నారు. పవిత్రాత్మ దేవుడు అందరికి అన్నీ విషయాలు తెలియ పరుస్తానంటున్నారు.
యేసు క్రీస్తు ప్రభువు వారు శిష్యులకు శాంతిని ఒసగుతున్నారు 27 వ వచనం. ప్రభువు యొక్క శాంతి నీతితోను, సత్యము తోను కూడిన శాంతి. ఈ లోకంలో అందరు శాంతి కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు శాంతి ఇస్తానంటున్నారు. ఆయన శాంతి అంటే మనం ఆయన జీవితంను ఆదర్శం చేసుకొని ఎటువంటి ఆశలకు గురికాకుండా అధికారం కోసం ఆశించ కుండా డబ్బు మీద ప్రీతి ఉండకుండా కేవలం దేవుని చిత్తం నెరవేర్చుటయే.
యేసు క్రీస్తు తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చారు. ఆయన శాంతి యుతంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అయన జీవితంను ఆదర్శం చేసుకొని శాంతి సమాధానాలతో ఉండాలి.
ఏ విషయంలో కూడా భయ పడకుండా దేవుడే అన్నీ సమకూర్చుతాడు అనే విశ్వాసం కలిగి జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD
20, మే 2022, శుక్రవారం
పాస్క కాల 6 వ ఆదివారం
పాస్క కాల 6 వ ఆదివారం
అపో. కా 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 యోహను 14:23-29
క్రీస్తు
నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాడు తల్లి తీరుసభ ఈస్టర్ 6 వ ఆదివారం లోనికి అడుగిడుతుంది.
ఈనాటి మొదటి పఠనం అపోస్తుల కార్యముల నుండి
తీసుకొనబడింది. ఈ పఠనంలో ఒక ముఖ్యమైన
సంఘటనను వివరించడం చూస్తున్నాము. అది ఏమన “రక్షణ”మరియు సున్నతి .
ఈ సున్నతి వలన
యూదులకు మరియు పౌలు , బర్నబాలకు మధ్య ఒక గొప్ప వివాదం చోటుచేసుకుంది. అది ఏమి అంటే
యూదులకు సున్నతి పొందిననే తప్ప రక్షణ లేదు అని పౌలు, బర్నబాలు రక్షణ పొందడానికి
సున్నతితో సంభందం లేదు అని వాదించారు. యూదులు ధర్మ శాస్త్రానికి మరియు మోషే చట్టానికి ఎంతో
ప్రాముఖ్యతను ఇస్తారు. వారు పాటించడాని కంటే ఎదుటివారు పాటించడం మీద ఎక్కువ శ్రద్ధ
చూపిస్తారు, ఉదాహరణకు ఈనాటి వాక్యము మరియు క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన
సంఘటనలు.
చట్ట ప్రకారము
సున్నతి పొందితేనే రక్షణ మరియు దేవాలయము
లోనికి అనుమతి. యూదులకు అన్యులు దేవాలయమునికి రావడం ఇష్టమే కాని వారు సున్నతి
పొందిన వారై ఉండాలి. సున్నతి పొందటం అంటే యూదుడుగా మారుటయే అని యూదులు
భావించేవారు. పౌలు , బర్నబాలు యూదుల మాటలన్నీ త్రోసివేసి దేవుడు ఒక్కడే, అన్యులకు ,
యూదులకు , గ్రీకులకు అందరకు ఆయనే దేవుడు, ఆయన యందే రక్షణ అని ధృడంగా వాదించారు.
రోమి 3:29... దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడే, దేవుడు
ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ధర్మ శాస్త్రమనే సంకెళ్లతో యూదులు ఎప్పుడు
బంధించడానికి ప్రయత్నించేవారు. కాని పౌలుగారు చెప్పినట్లు మరణించిన వారి మీద ధర్మ శాస్త్రము వర్తించదు.
మనము క్రీస్తు శరీరము ద్వారా మరణించితిమి, ఆయన లేవనెత్త బడినట్లు మనము ఆయనలో
సజీవులమయ్యాము, అంటే ధర్మ శాస్త్రముల నుండి విముక్తులమై, వ్రాతపూర్వకమైన ధర్మ
శాస్త్రమును అనుసరించిన పాత పద్ధతిలోకాక,
ఆత్మానుసరమైన క్రొత్త పద్దతిలో
దేవుని సేవించు చున్నాము. రోమి 7:1-6.
విశ్వాసమునకు
తండ్రి అయిన అబ్రహముకూడ ఎటువంటి ధర్మ శాస్త్రమును పొందలేదు, ఎటువంటి సున్నతి
పొందక ముందే దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింప బడ్డాడు. రోమి 4 :10 అబ్రహాము సున్నతి పొందక పూర్వమే విశ్వాసము వలన
దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. దేవుని బిడ్డలు కావాలంటే, దేవుని రక్షణ
పొందాలంటే విశ్వాసము అవసరము కాని బాహ్యకరమైన సున్నతి కాదు.
రోమి 3:30
విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని , సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను
చేయును. అంతియోకులో ఈ వివాదము చోటు చేసుకోవడానికి కారణం కొంత మంది యూదులు,
ఎవ్వరైతే అన్యులంటె గిట్టని వారో , వారు ఎప్పుడు, యూదులు దేవునిచే ప్రత్యేకంగా
ఎన్నుకొనబడిన వారు అని, గర్వంతో వుంటూ ఇతరులను అన్యులుగా పరిగణించేవారు.
ఎప్పుడైతే ఈ
కొంత మంది యూదులు, విశ్వాసులుగా మారిన యూదులు, అన్యులు మధ్యకు వచ్చి ఈ యొక్క
మాటలను అన్నారో అప్పుడు యూదులకు మరియు పౌలు, బర్నబాలకు మధ్య వివాదం మొదలైంది.
ఇటువంటి ప్రవర్తనే మన క్రైస్తవత్వం లోనికి వస్తే మనము కూడా యూదా మతం లాగా
వర్గాలుగా మారాల్సి వచ్చేది.
క్రైస్తవత్వం అంటేనే కలయిక , కలసిఉండటం. ఈ కలయిక వలనే
క్రైస్తవత్వం అంటారు. మనమందరం కూడా క్రీస్తులో ఐక్యమవటం, ఆయనలో కలసి ఉండటం. ఎక్కడ
ఇద్దరు ముగ్గురు కలసి ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఉంటాను అని అన్నాడు.
దివ్య బలి
పూజ, దివ్య సత్ప్రసాదం ఇవన్నీ ఒక్కరి కోసం కాదు, ఒక తెగ కోసం కాదు, ఒక జాతి కోసం
కాదు. జాతి , కుల , ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా అందరు కలసి పాల్గొనే దానినే దివ్య బలిపూజ, అందరు కలసి భుజించే దానినే దివ్య సత్ప్రసాదం, అందుకే క్రైస్తవం, కలసి చేసేది, కలసి ఉండేది, క్రైస్తవత్వం. అందుకే
పౌలు , బర్నబాలు ఈ సమస్యను
అపోస్తులులు, పెద్దలు మరియు క్రీస్తు సంఘంలోని వారి యొద్దకు తీసుకొని
వెళ్ళినప్పుడు వారు ఎంతో చాక చక్యంగా మెలిగిరి.
వారికి వారుగా, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారు పవిత్రాత్మ సహాయాన్ని కోరారు. వారు
పవిత్రాత్మ సహాయము ద్వారా ఎంతో చాక
చక్యముగా ఈ సమస్యను చక్క దిద్దారు. యేసు ప్రభువు చెప్పినట్లు మిమ్ము నడిపించడానికి
మీకు తోడుగా ఒక సహాయకుడిని పంపిస్తాను, ఆయన మీకు అన్నీ విషయాలలో అన్నీ
వేళలా తోడ్పడతాడు అని, ఆ పవిత్రాత్మ వారికి తోడ్పడింది ఈ సమస్యను తీర్చడానికి . యోహను 16:13-14. వారు సమస్యను చక్క దిద్దటమే కాదు, సమస్యను
చక్క దిద్దటములో ఎంతో తెలివిగా మెలిగారు.
వారు రాసిన
లేఖను తిరిగి పౌలు , బర్నబాలకు ఇచ్చి పంపించ కుండా, వారిలో ఇద్దరును ఎన్నుకొని, ఇద్దరికి పౌలు , బర్నబాలతో లేఖను ఇచ్చి పంపిచ్చారు. పౌలు, బర్నబాలు లేఖను
తీసుకొని వెళ్లినట్లయితే ప్రజలు
నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వీరు
మార్గ మధ్యములో, కూడబలుకుకొని ఒక లేఖను తీసుకొని వచ్చి మనలను నమ్మిస్తున్నారు, అని అపోహ
పడే వారు. కానీ పవిత్రాత్మ ఇద్దరినీ పౌలు
, బర్నబాలతో పంపించి లేఖను చదివించి అంతియోకులో , సిరియాలో, సీలీషియాలో ప్రజల
విశ్వాసాన్ని దృడం చేసింది.
ఈనాటి రెండవ
పఠనంలో యోహను గారికి కలిగిన దర్శనం గురించి వివరిస్తున్నాడు. ఈ యొక్క దర్శనం నూతన యెరుషలేము గురించి మరియు దాని
వైభవము గురించి వివరిస్తుంది. యెరుషలేము
నగరం దాని యొక్క కాంతి, ప్రాకారము, ద్వారములు, గోడలు మరియుదేవుని సన్నిధి
గురించి తెలియజేస్తుంది. ఇటువంటి
దర్శనమును మనము యెహేజ్కెలు గ్రంధంలో కూడా
చూస్తాము. ప్రభువు యొక్క సన్నిధి దర్శనములో యెహెజ్కెల్ ప్రవక్తను యిస్రాయేలు
దేశమునకు తీసుకొనిపోయి ఒక ఉన్నత పర్వతం పై నిలిపి ఆ నగరపు కట్టడములను చూపిస్తాడు ( యెహెజ్కెలు 40:2 )
ఈ యొక్క నగరపు గోడలు మీద యిస్రాయేలు ప్రజలు యోషయా గ్రంధంలో పాటలు పాడటం చూస్తాము. యోషయా 26:1 మాకోక బలమైన పట్టణము కలదు. ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును. యోషయా 54:11-12 విలువ గల మణులతో నిన్ను పుననిర్మింతును , నీల మణులతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతిలీను మణులతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.
నగరమునకు 12 ద్వారములు క్రైస్తవ సంఘాన్ని సూచిస్తున్నాయి. ఆ 12 ద్వారములకు 12 గోత్రముల పేర్లు లిఖించ బడినవి, ఇవి క్రైస్తవ సంఘం నడచుకునే , కొనసాగే విధానాన్ని సూచిస్తున్నాయి. ఈ యొక్క నూతన యెరుషలేము ద్వారములు గురించి యెహేజ్కెలు ప్రవక్త తన గ్రంధంలో వివరించాడు. (యెహేజ్కెలు 48:30-35.) తూర్పున ఉన్న ద్వారములు సూర్యుడు ఉదయించే వైపుని తలపిస్తాయి, ఇది ప్రతిరోజు ఉదయము ప్రభుని పవిత్ర నగరం లో వేదకటాన్ని సూచిస్తుంది. ఉత్తరమున ఉన్న ద్వారము చల్లని ప్రదేశమును తలపిస్తాయి, క్రైస్తవత్వంలో క్రైస్తవులు హృదయంలో విశ్వాసాన్ని ధృడపరచుకునే మార్గంగా సూచిస్తున్నాయి. దక్షిణమున ఉన్న ద్వారములు వేడి ప్రదేశములకు తలపిస్తాయి, ఈ ప్రాంతములో గాలులు ప్రశాంతముగా వీచుతాయి. వాతావరణం సున్నితముగా వుంటుంది, ఇది ఎవ్వరైన బావోద్వేగాలతో సిలువ మీద ప్రేమతో వచ్చేవారికి మార్గముగా సూచిస్తుంది.పడమర ఉన్న ద్వారములు సూర్యుడు, అస్తమించే వైపు ఇవి పవిత్ర నగరములోని సాయం కాల సమయమున క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చే వారికి మార్గమును సూచిస్తుంది.
ఈ యొక్క క్రొత్త యెరుషలేము నగరములో ఎన్నో ఉన్నాయి, కానీ యోహను గారికి దేవాలయం మాత్రం కనిపించలేదు. యూదులకు దేవాలయం ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యం , ఎంతో పవిత్రత కాని అ క్రొత్త నగరమున దేవాలయం మాత్రం కనిపించలేదు. కాని ఒక గొర్రెపిల్ల మాత్రం కనిపించి దానినే దేవాలయముగా యోహనుగారు భావించారు, యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్లు ప్రభువే ఆ నగరమునకు దేవాలయం (యెహేజ్కేలు 48:35) నగరమునకు ప్రభువు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టవలెను.
రాతితో
కట్టబడిన దేవాలయం కాదు మన విశ్వాసాన్ని తెలియజేసేది. మన అంతరంగంలో కట్టబడే
విశ్వాసం అనే దేవాలయం తెలియ జేస్తుంది, క్రైస్తవులు అంటే ఎవరు అని. రాతితో
కట్టబడిన దేవాలయంలో కాదు ప్రభువు వసించేది, నీ హృదయంలో. ప్రభువు సమరియా స్త్రీ తో చెప్పినట్లు పర్వతము మీదనో లేక దేవాలయంలో
కాదు దేవుని ఆరాధించేది, నీ హృదయంలో దేవుని ఆరాధించే దినములు వస్తాయి అని.
పౌలు గారు చెప్పినట్లు మన శరీరం దేవుని ఆలయం, మనముకాదు జీవించేది మనలో క్రీస్తే జీవిస్తున్నాడు అని . బాహ్యంగా కనపడేది కాదు ప్రభువునకు కావలసినది. కానీ నీ యొక్క అంతరంగంలో ఏమున్నది అని ప్రభువు లెక్కిస్తాడు, మొదటి పఠనములో యూదులు బాహ్యమైన సున్నతికి మరియు ధర్మ శాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చారు కాని వారి అంతరంగమునకు కాదు.
సువిశేష పఠనములో యోహను సువార్తికుడు తండ్రి కుమారుల
బంధాన్ని, కలయికను వర్ణిస్తున్నాడు. తండ్రి కుమారున్నీ ఎంతగా ప్రేమిస్తాడో,
కుమారుడు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈనాటి సువిశేషంలో చూడవచ్చు. అధె విధంగా
తండ్రి, కుమారులను ప్రేమించే వారిని దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడో కూడా చూడవచ్చు.
యోహను
సువిశేషమంత గమనిస్తే, సువార్తికుడు అయిన యోహను గారు ప్రభువునకు ప్రియమైన శిష్యుడు,
ఆయన ప్రేమను ఎంతగా పొందాడో , ఈయన ప్రభువుని ఎంతగా ప్రేమించాడో, ఈయన రాసిన సువిశేషం
ద్వారా మనకు అర్ధం అవుతుంది.
యోహను గారికి
అంతా కూడా దేవుని ప్రేమ, ప్రేమ అనేది
అన్నిటికీ మూలాధారం. దేవుడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభువు, దేవుని
ప్రేమిస్తున్నాడు, దేవుడు మానవున్ని ప్రేమిస్తున్నాడు, మానవుడు, దేవున్ని ప్రేమిస్తున్నాడు, మానవుడు, మానవుడిని ప్రేమిస్తున్నాడు, సృష్టి అంతయు కూడా ప్రేమ
అనే బంధంతో ముడి పడియుంది. విధేయతకు ములాధారం ప్రేమ, అందుకే దేవుడు ఉత్థానమైన
తరువాత ఆయనను ప్రేమించిన వారికి కనిపించారు, కాని పరిసయ్యులు , ధర్మ శాస్త్ర
భోదకులకు మరియు యూదులకు కాదు. తండ్రి మీద ప్రేమ వలన క్రీస్తు ప్రభువు, సిలువ
మరణాన్ని విధేయతతో స్వీకరించాడు.
ఇది అర్ధం కాని వారు, సిలువ మరణాన్ని అసభ్యకరమైన మరణంగానే చూస్తారు. కాని దానిలోని ప్రేమను కాని త్యాగాన్ని కాని విధేయతను కాని అర్ధం చేసుకోరు. ప్రభువు ఒసగిన రెండు ప్రధాన ఆజ్ఞలను ఈనాటి సువిశేషంలో చూస్తాము. తండ్రి దేవుని ప్రేమించడం , తన పొరుగువారిని ప్రేమించడం. ప్రభువు తండ్రి దేవుని ప్రేమించాడు కాబట్టి విధేయతతో ప్రభువు ఒసగిన కార్యాన్ని నెరవేర్చాడు.తన స్నేహితులు , పొరుగువారు అయిన శిష్యులను ప్రేమించాడు అందుకే వారిని ఒంటరిగా వదలి వేయకుండా వారికి తోడుగా పవిత్రాత్మను ఇస్తున్నాడు.
ఈ పవిత్రాత్మ
మనకు అన్నీ విషయాలను బోధిస్తుంది, ప్రభుని మాటలను తెలియచేస్తుంది. ఆయన మార్గంలో
నడుచుటకు సహాయకునిగా ఉంటుంది. ఎవరైతే ఆయన యందు ప్రేమ కలిగి ఉంటారో, వారికి తన
సమాధానం ఓసగుతాను అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రభుని సమాధానం అంటే కొద్ది కాలం
ఉండేది కాదు, చివరివరకు మనతో ఉండేది. ఒక్క కష్టములలో మాత్రము కాదు, అన్నీ విషయాలలో
మనతో ఉండేది. రోమి 5: 6-11 నీతిమంతుని కొరకై, సత్పురుషుని కొరకై , పాపాత్ములమైన మన
కొరకై ఆయన మరణించేను. మన దేవుడు, మనపై తనకు ఉన్న ప్రేమను చూపాడు. అంతే కాదు ఆయన
ద్వార మనం సమాధానం పొందాము.
Br. Lukas OCD
14, మే 2022, శనివారం
పాస్క కాలపు 5 వ ఆదివారం (2)
అపో 14:21-27, దర్శన 21:1-5, యోహను 13:31-35
ఈనాటి దివ్య పఠనాలు నూతనమైన విషయములను గురించి భోధిస్తున్నాయి. క్రొత్త దివి, క్రొత్త భువి , క్రొత్త ఆజ్ఞ అనే విషయాలు గురించి తెలియజేస్తున్నాయి.
క్రొత్త దనం మనందరిలో ఉండాలి, మన యొక్క పాత జీవితమను విడిచి పెట్టి దేవునిలో క్రొత్త జీవితం ప్రారంభించాలి.
ఈనాటి మొదటి పఠనంలో పౌలు, బర్నబాలు, దెర్బా అను ప్రాంతంలో సువార్త ప్రకటన చేసిన తరువాత అనేక మందిని నూతనంగా దేవుని శిష్యులుగా చేశారు. సువార్త ప్రకటన కోసం క్రొత్త వారిని ఎన్నుకోంటున్నారు.
పౌలు గారు అక్కడ ప్రజల విశ్వాస జీవితములను బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఎదురయ్యే కష్టములకు, శారీరక శ్రమలకు, భయపడకుండా దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సహించారు.
జ్ఞాన స్నానం పొందిన వారు, క్రీస్తు ప్రభువును అంగీకరించినవారు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని తెలిపారు, అధేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనుభవించాలని తెలిపారు.
ఎందుకు వారి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నారంటే, వారు నూతనంగా ప్రభువును వెంబడిస్తున్నారు, కాబట్టి ఆదిలోనే కష్టాలు వస్తే, విశ్వాసాన్ని విడిచిపెడతారని పౌలుగారు వారిని ప్రోత్సాహిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు.
శ్రమల ద్వారా క్రీస్తు ప్రభువు తండ్రిని మహిమ పరిచారు. అలాగే ప్రతి ఒక్కరు తమ యొక్క శ్రమల ద్వారా దేవున్ని మహిమ పరచాలని తెలిపారు. మనం పొందే శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 1 పేతురు4:1.
జీవమునకు పోయే మార్గం ఇరుకైనది. మత్తయి 7:14. శ్రమలు అనుభవించుటకు భయపడకూడదు. 1 పేతురు 3:14, 2 కోరింతి 4:17.
దేవుని వలె జీవించాలనుకునే వారు కష్టాలకు గురి అగుతారు. 2 తిమోతి 3:12.
విశ్వాసులు నూతనంగా క్రీస్తును నమ్ముకోంటున్నారు. కాబట్టి ముందుగానే పౌలుగారు వారికి అన్నీ విషయాలు తెలుపుచున్నారు.
క్రీస్తు విశ్వసించిన వారిని ఒక సంఘంగా చేసి పెద్దలను నియమించి నూతన సేవకులను, విశ్వాసులను తయారుచేశారు.
ఈ మొదటి పఠనం ద్వారా పౌలుగారు మరియు బర్నబాగారు ,చేసిన సువార్త ప్రకటన గురించి ధ్యానించాలి. ఎంతో కష్టపడి ఒక నూతన దైవ సంఘంను ఏర్పరిచారు.
వారు నిస్వార్ధంతో, త్యాగంతో ప్రేమతో సువార్త వ్యాప్తికరణ చేశారు. అధే విధంగా మనం కూడా నూతనంగా సువార్తికరణ చేయాలి.
ఈనాటి రెండవ పఠనంలో రాబోయే క్రొత్త దివి, భువి,స్వర్ణ యుగం గురించి యోహను గారు ఒక దర్శనం చూసారు.
ఈ దర్శన గ్రంధం వ్రాయబడినది, ప్రత్యేకంగా హింసలకు గురియైన విశ్వాసుల కోసం, వారికి ఒక క్రొత్త భువిని, దివిని దేవుడు ఏర్పరుస్తున్నారు అని వారి విశ్వాసాన్ని ప్రోత్సహించుటకు యోహను గారు ఈ విషయాలు వ్రాస్తున్నారు.
దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన కంటికి అంతయు బాగుగా ఉండెను. ఆది 1:31.
దేవుడు సృష్టిని చేసినప్పుడు అంతయు శాంతియుతముగా ఉన్నది, ఎటువంటి చీకుచింతలకు చోటు లేదు, దుఃఖానికి తావులేదు. అలాగా అంతా బాగుగా ఉన్న సృష్టిలో మానవుని యొక్క పాపం వలన మచ్చ ఏర్పడింది, అనర్ధాలు ఆరంభమైనాయి.
పాపం చేయడం వలన క్రమ క్రమేణా మానవ జీవితం క్షీణించిపోయినది. మరణం వచ్చింది. సృష్టిలో ఉన్న జంతువులు, ఒక దానిని ఒకటి చంపుకొనుట ప్రారంభమైనది, మానవుల మధ్య గొడవలు ప్రారంభమైయాయి. అధే విధంగా ఈ లోకంలో అన్యాయం, అక్రమం , వ్యాధులు, హింసలు, బానిసత్వం, బాధలు ఉన్న సమయంలో ప్రజలు ఒక క్రొత్త భువికై , దివికై ఎదురు చూసారు.
దేవుడు మరలా ఒక నూతన సృష్టిని చేస్తాడని కాలగన్నారు. యిస్రాయేలు ప్రజలు ఈ విషయంను ధృడంగా నమ్మారు , భావించారు.
ప్రవక్తలు కూడా ఒక క్రొత్త యుగం గురించి ప్రకటించారు. యోషయా 65:17, ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును, భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు అని ప్రభువు తెలియచేసారు.
క్రీస్తు ప్రభువు యొక్క రాకతో పాపం తొలగించబడి, ఒక క్రొత్త భువి, దివి ఏర్పడినది. ఆయన యొక్క మరణ, పునరుత్థానం ద్వారా సైతాను శక్తులు నశించాయి, యేసు ప్రభువు మానవాళికి నూతన జీవంను ప్రసాదించారు.
యేసు క్రీస్తును విశ్వసించి ఆయనతో ఏకమై మరణించువాడు ఆయనతో శాశ్వత జీవితానికి లేస్తాడు, పునరుత్థానుడైన యేసు క్రీస్తు జీవాన్ని పొందిన మనం, ఈ క్రొత్త దివికి భువికి నూతన యెరుషలేము పట్టణ నిర్మాణానికి కృషి చేయాలి. 2 పేతురు 3:3-22.
ప్రతి వ్యక్తి కూడా నూతనత్వంను కలిగి జీవించాలి.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు క్రీస్తు ప్రభువు నూతన ఆజ్ఞ గురించి భోధిస్తున్నారు.
యేసు ప్రభువు కడసారిగా తన యొక్క శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రభువు కడరాత్రి భోజనం భుజించిన తరువాత శిష్యులతో విలువైన మాటలు పలికారు.
ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు.
నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును.
ప్రేమ అనే నూతన ఆజ్ఞను పాటించి జీవించుడు, అనే మూడు మాటలు చాలా విలువైనవి.
మనుష్య కుమారుడు మహిమ పరుపబడ్డాడు. ఎందుకంటె తండ్రిని సంపూర్ణంగా విధేయించాడు. ఆయన యొక్క చిత్తంను నెరవేర్చారు.
అనేకుల రక్షణ కొరకు సిలువ శ్రమలు అనుభవించబోతున్నాడు.
మరణించిన తరువాత సిలువ నుండి లేవ నెత్త బడుతారు. అది నిజమైన మహిమ పరపబడటం. ప్రభువు మానవ- దైవ స్వభావంతో తండ్రిని నిత్యం మహిమ పరిచారు. అలాగే కుమారుడిని తండ్రి ఆయన చేసిన ప్రతి పనిని అంగీకరిస్తూ మహిమ పరిచారు.
ప్రభువు జీవితం మానవునిగా కొంత కాలం మాత్రమే, అందుకే ఇక మీరు నన్ను చూడజాలరు అని పలికారు. ఆయన శ్రమలు అనుభవించుటకు, రక్షణ కార్యము ముగించుటకును, తండ్రి చెంతకు వెళ్ళుటకు సమయం ఆసన్న మగుచున్నది. కాబట్టి ఇక మీరు నన్ను చూడ జాలరు అని ప్రభువు అంటున్నారు.
ప్రభువు శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. అది అందరు తమ జీవితంలో అనుసరించాలి. ఇది ఒక ఆజ్ఞ, శాసనం అందరు కూడా తప్పని సరిగా పాటించాలి.
ఈ ప్రేమ ఆజ్ఞ వాస్తవానికి పాత ఆజ్ఞయే, ఎందుకంటే లెవీ 19:18 లో మీరు పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని చెప్పబడింది.
ఎందుకు ఇది నూతన ఆజ్ఞ అయిందంటే, క్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు.
మన పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ చూపించారు అన్నది మనం ధ్యానించుకోవాలి.
దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మన పట్ల ఆయన చూపే ప్రేమ - సంపూర్ణ మైనది, స్నేహ పూర్వకమైనది, కనికరం కలిగినది, పవిత్రమైనది, నిజమైనది, నిస్వార్ధమైనది.
మనలో దేవుడు చూపించిన ప్రేమ రావాలంటే పాతది పోవాలి.
క్రొత్తది రావాలి. ఆయన ప్రేమ కేవలం మాటల్లో పలికిన ప్రేమ మాత్రమే కాదు, అది చేతుల్లో చూపించే అంత ప్రేమ.
ఎవరు చూపించలేనంత ప్రేమ, క్రీస్తు ప్రభువు మనకు చూపించారు. అందులో నూతనత్వం ఉంది. ప్రవక్తలు చూపించలేనటువంటి దైవ ప్రేమ, రాజులు వ్యక్త పరచలేనటువంటి ప్రభుని ప్రేమ, కేవలం క్రీస్తు ప్రభువే చూపించారు.
పౌలు గారు క్రీస్తు ప్రభువుని ప్రేమ తెలుసుకొన్న వ్యక్తి అందుకే 1 కోరింథీ 13 లో ఆయన ప్రేమకు ఉన్న గొప్ప తనం వివరించారు.
క్రీస్తు ప్రభుని ప్రేమ విశాలము, ఉన్నతము . ఎఫెసీ 3:18.
యేసు ప్రభువు ప్రేమలో ఉన్న నూతనత్వం. 1. ఆయన ప్రేమ సేవతో కూడిన ప్రేమ- ప్రభువు ఈ లోకంలో చేసిన సేవ, ప్రేమతో కుడినసేవ . మత్తయి 20:28. శిష్యుల యొక్క పాదాలు కడిగి తన యొక్క అత్యున్నత ప్రేమ చూపించారు.
2. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ : ఎన్ని పాపాలు చేసినా సరే ఎంత బాధ పెట్టినా సరే , ఎంతగా హేళన చేసిన, నిందించినా కానీ ప్రభు అందరిని క్షమించారు. లూకా 23:34.
దేవుని ప్రేమ ఎంతో క్షమను కలిగి ఉంది.
స్నేహితులనుకునే అపోస్తులులే మోసం చేసిన సరే, వారిని క్షమించారు. ప్రభువును అర్ధం చేసుకోకపోయిన వారిని క్షమించారు.
3. ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - యోహను 21:15. ప్రభువు అందరి యొక్క వ్యక్తిత్వములు అర్ధం చేసుకున్నారు. వివిధ రకాల మనస్తత్వాలు, ఆలోచనలు , ఉన్న శిష్యులను వ్యక్తిగతంగా వారిలో ఉన్న ప్రతికోణం అర్ధం చేసుకొని ప్రేమించారు.
మనం కొంత మందితో జీవిస్తే తెలుస్తుంది వారి గురించి. యేసు ప్రభువు అనేక రోజులు అనేక నెలలు శిష్యులతో, ప్రజలతో , శత్రువులతో కలసి తిరిగినప్పుడు వారిని వారిలాగా అర్ధం చేసుకొని ప్రేమించారు.
ప్రతి ఒక్కరి బలహీనతలను , పాపములను ప్రభువు అర్ధం చేసుకొని ప్రేమించారు.
4. ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ -యోహను 15:13. తన యొక్క స్నేహితుల కొరకు ప్రాణాలు సమర్పించారు. ఇతరుల కొరకు జీవితంను త్యాగం చేసిన ప్రేమ స్వరూపి.
సీలువను మోసారు, ప్రాణమిచ్చారు. తన చెంత ఉన్న ప్రతిదీ మన కోసం త్యాగం చేశారు.
5. ఆయన ప్రేమ నిస్వార్ధ ప్రేమ - ఎటువంటి ఫలితం కూడా ఇతరుల నుండి ఆశించకుండా ప్రభువు ప్రేమించారు. యోహను 3:16. తన సొంత లాభం పొందటం కోసం , మెప్పు పొందటం కోసం ఎవ్వరిని ప్రేమించలేదు.
6. ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు లేవు. ఆయన మన యొక్క అందం, ఎత్తు , డబ్బు, మొదలగునవి చూసి ప్రేమించరు, మనల్ని ఎటువంటి తరతమ్యం లేకుండా ప్రేమించారు.
ప్రేమకు ఉన్న శక్తి ఈ లోకంలో దేనికి లేదు. అందుకే పౌలుగారు ప్రేమ సమస్తమును , భరించును, జయించును అని పలికారు. 1 కోరింథీ 13:7. ప్రేమ బలహీనులను బలవంతులను చేస్తుంది. సామాన్యులను గొప్ప వారిగా, చెడ్డ వారిని మంచి వారిగా చేస్తుంది.
మనందరం కూడా ప్రేమించుట ద్వారానే యేసు ప్రభువుని శిష్యులం అవుతున్నాం. కాబట్టి దేవుడు చూపించిన నూతన ప్రేమ మనందరం కలిగి జీవిద్దాం.
Rev. Fr. Bala Yesu OCD
7, మే 2022, శనివారం
పాస్క నాలుగవ ఆదివారం
మంచి కాపరి
ఈనాటి ఆదివారం మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. యేసు ప్రభువు తాను ఒక మంచి కాపరి అని ఎరుక పరుస్తూ ఒక కాపరిలాగా తన మంద కోసం ఎలాగా శ్రామిస్తారో తెలుపుచున్నారు.
యేసు ప్రభువు మంచి కాపరిగా సంభోదించుకుంటూ తనకు మరియు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుచున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభువుని ఒక మంచి కాపరిగా మనం గ్రహిస్తూ, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ధ్యానించుకోవాలి.
పవిత్ర గ్రంధంలో మనం చాలా మంది కాపరులను చూస్తున్నాం. ఆబేలు గొర్రెల కాపరియే-ఆది 4:2. అబ్రహాము గొర్రెల కాపరియే , ఇస్సాకు, యాకోబులు కూడా గొర్రెల కాపారులే. వీరితో పాటు మోషే ప్రవక్త , దావీదు రాజు సైతం గొర్రెలను కాసినవారే. 1 సమూ 17:36. ఆమోసు ప్రవక్త కూడా గొర్రెల కాపరియే. ఆమోసు 7:14.
వీరితో పాటు పాత నిబంధన గ్రంధం లో దేవుడు తనను తాను కాపరిగా , మంచి కాపరిగా సంబోదించుకుంటున్నారు. యెహే34:11-31.
కాపరులలో మంచి వారున్నారు అధే విధంగా చెడ్డ వారున్నారు. యిర్మియా ప్రవక్త చెడ్డ కాపరులను గురించి తెలుపుచున్నారు. యిర్మియా 23:1-2.
మనందరం కూడా కుటుంబ కాపరులం, సంఘ కాపరులం, దేశ కాపరులం మనకు దేవుడు నిజమైన కాపరి. ఆయన్ను మనం అనుసరించాలి.
ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పౌలుగారికి , బర్నబాసు గారికి అప్పజెప్పిన కాపరి బాధ్యతలను గురించి చదువుకున్నాం.
వీరిని యేసు ప్రభువు అన్యులకు సువార్తను ప్రకటించుటకు ఎన్నుకొన్నారు. పౌలు యూదులతో సంభాషించిన వేళలో వారు ఆయన్ను అంగీకరించలేదు. అందుకే పౌలు గారు వారితో దేవుని వాక్కు మొదటిగా మీకు చెప్పవలసి ఉండెను,కాని మీరు దానిని తిరస్కరించిరి, మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అయోగ్యులను చేసుకున్నారు అని పలికెను.46 వ వచనం.
మొదటి ప్రాముఖ్యతను దేవుడు యూదులకే ఇచ్చారు కాని వారు దానిని తృణీకరించారు. పౌలుగారు మాత్రము ఎవ్వరు తృణీకరించినా సరే, దేవుని యొక్క వాక్కును వెలుగెత్తి చాటారు. అది కాపరి యొక్క లక్షణం. తనను నియమించిన పని కోసం ప్రాణములు సైతం ఇవ్వటం కాపరి యొక్క పని.
పౌలు గారిని అన్యులకు అపోస్తులుడు అని పిలుస్తారు. apostle of gentiles. ఆయన అనేక సంవత్సరములుగా అన్యులకు దాచబడిన , తెలియని క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించిన వ్యక్తి.
సువార్త వ్యాప్తి కోసం ఆయన అనేక హింసలకు గురి అయ్యాడు. శ్రమలు అనుభవించారు. అపో 21: 27,30,23:3, 27:41,22:22, 27,42,26:24.
ఎన్నెన్నో ఆయన తన యొక్క పరిచర్యలో ఎదుర్కొని ముందుకు సాగి తన యొక్క కాపరి యొక్క బాధ్యతలను నెరవేర్చారు.
పౌలు గారు మరియు బర్నబాసు గారు దేవుని యొక్క స్వరమును ఆలకించారు. 47 వ వచనం. దేవుడు వారిని అన్యులకు వెలుగై ఉండుడు అని చెప్పిన మాటను ఆలకించి ఆయన ప్రకారం నడుచుకున్నారు.
యేసు ప్రభువు మొదటిగా పౌలును సువార్త పరిచర్యకు ఎన్నుకొన్న సందర్భంలో కూడా దేవుని యొక్క స్వరంను ఆలకించి హృదయ పరివర్తనం చెందుతున్నారు. అపో 9: 4.
సువార్తను అంగీకరించిన చోట వారు ఆనందంగా వాక్యంను ప్రకటించారు. అంగీకరించని చోట కాలి దూలిని వారికి నిరసనగా దులిపి వేశారు. తమ యొక్క సేవలో వారు ఎల్లప్పుడు దేవుని యొక్క పవిత్రాత్మతో నిండి ఉన్నారు.
ఒక కాపరిగా పౌలుగారు తన యొక్క బాధ్యతలను అన్నీ సక్రమంగా నెరవేర్చారు. తన మందకోసం క్రీస్తు ప్రభువు వలె ప్రాణాలు సమర్పించారు.
రెండవ పఠనంలో యోహను గారు గొర్రె పిల్లను గురించి చూసిన దర్శనంలో క్రీస్తును మంచి కాపరిగా గుర్తించి ఆయన తన యొక్క ప్రజల కోసం ప్రాణాలు సమర్పించిన గొర్రెపిల్ల అని తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠన ప్రారంభ వచనాలలో క్రీస్తు సేవ కొరకు శ్రమలు అనుభవించే వారి గురించి తెలుపుచున్నారు. యోహను గారు హింసలకు గురి అయిన క్రైస్తవులను ప్రోత్సహించుటకు ఈ యొక్క సత్యమును వివరించారు.
దేవుని కొరకు ప్రాణాలు అర్పించినవారు ఆయన సన్నీదిలో సేవ చేస్తారు. వారు రక్షణను పొందుకుంటారు.
గొర్రె పిల్లయె కాపరి యగును, వారి కష్టాలను, బాధలను తొలగించును. ఈ కాపరి తన యొక్క మందను జీవ జలము వద్దకు తీసుకొనిపోవును. కీర్తన 23. యోషయా 40:11, యెహే 34:23, యిర్మీయా 2:13.
సువార్త పఠనంలో యేసు ప్రభువు తన గొర్రెలు తన స్వరమును వినును అని చెప్పెను. యోహను సువార్త 10 వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెల కాపరి గురించి మరియు గొర్రెల గురించియే.
కేవలం దేవుడిని మాత్రమే మంచి కాపరి అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపుతారు, సంరక్షిస్తారు, నేర్పిస్తారు, కాపాడుతారు, వాటికి అవసరమైనవి అన్నీ సమకూర్చుతారు. పాత నిబందన గ్రంధం లో యావే దేవున్ని మంచి కాపరి అని సంభోదించారు. యెహే 34 వ అధ్యాయం.
నూతన నిబందన గ్రంధంలో క్రీస్తు ప్రభువును యోహనుగారు మంచి కాపరి అని సంభోదిస్తున్నారు. యోహను 10.
యేసు ప్రభువు నా గొర్రెలు నా స్వరమున వినును అని తెలుపుచున్నారు. ఇంతకీ ఎవరు ఆయన గొర్రెలు ? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క గొర్రె.
గొర్రె తన యొక్క స్వరమును వినును అని అన్నారు. జ్ఞాన స్నానం పొందిన అందరు ఆయన స్వరమును ఆలకించారు, కేవలం కొందరు మాత్రమే ఆయన స్వరమును ఆలకించుతారు.
సృష్టి ప్రారంభం నుండి మంచి కాపరి అయిన దేవుడు తన ప్రజలను పిలుస్తూనే ఉన్నారు, భోదిస్తూనే ఉన్నారు. అలాగే వారికి నేర్పిస్తూనే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రమే కాపరి స్వరంను ఆలకించారు.
ఆదాము అవ్వ దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితంగా శ్రమలు అనుభవించారు, ఏదేను తోట నుండి బయటకు పంపివేయబడ్డారు.
సౌలు దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితముగా తన యొక్క రాజ్య బాధ్యతలను కోల్పోయాడు. 1 సమూ 13:12-13.
లోతు భార్య దేవుని స్వరమును ఆలకించకుండా వెనుకకు చూసింది ఆది 19 :26 . ఆమె ఉప్పు కంబంగా మారిపోయాను.
నెబుకద్నెసరు దేవుని స్వరం ఆలకించలేదు. దాని ఫలితంగా శిక్షను అనుభవించాడు. దానియేలు 4: 17-37.
పవిత్ర గ్రంధంలో చాలా మంది ఆయన స్వరమును వినలేదు. దాని ఫలితముగా వరాలు అనేక కోల్పోయారు. శిక్షను పొందుకున్నారు.
ప్రభువు యొక్క స్వరము విన్నవారు అధికంగా దీవించబడ్డారు.
అబ్రహామును దేవుడు దీవించారు ఎందుకంటే విన్నాడు కాబట్టి . మోషేను దీవించారు ఎందుకంటే ఆయన స్వరంను ఆలకించారు. ఏలియాను దీవించారు అలాగే మరియమ్మ గారిని ఎన్నుకొన్నారు తన తల్లిగా ఎందుకంటే ప్రభుని స్వరంను విన్నారు కాబట్టి.
కాపరి పిలిచినప్పుడు కేవలం తన మందే పలుకుతుంది. జవాబిస్తుంది. అందరి స్వరాన్ని అవి ఆలకించావు , అనుసరించవు ఎవరు పిలిస్తే వారి వెంట పోవు.
గొర్రెలు తమ కాపరి స్వరం విని, అతనితో ఉండి ప్రమాదాల బారి నుండి సంరక్షణ పొందునట్లు మనం కూడా కాపరియైన దేవుని స్వరం విని నడుచుకుంటే మన జీవితాలు సంతోష దాయకంగా ఉంటాయి.
కాని మనం దేవుని యొక్క స్వరంను అలకించకుండా పెడ చెవిన పెడతాం. యిస్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు దేవుని యొక్క ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టి శిక్షింప బడ్డారు.
దేవుని స్వరం అంటే కేవలం మానవునిగా ఆయన నోటినుండి వెలువడిన మాటల శబ్దం మాత్రమే కాదు. ఆయన గురించి తెలిపే స్వరం అనగా ఆయన జీవిత మార్గం , జీవితం, భోధనం, సందేశం , మరణం, పునరుత్థానం తెలిపేది.
నిజంగా మనం జీవితంలో దేవుని స్వరం కాని ,పెద్దలు స్వరం కాని విని అనుసరిస్తే అందరం బాగుంటాం .
రెండవదిగా ప్రభువుకు తన యొక్క మందలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మనకు ఆయన తెలిసిఉండకపోవచ్చు. కాని ఆయనకు మాత్రం మనం బాగా తెలుసు. మన యొక్క పేరును దేవుడు తన యొక్క అరచేతిలో చెక్కుకున్నారు. యోషయా 49: 16. మనందరం ఆయనకు బాగా గుర్తున్నవారమే.
మంచి కాపరి ఈ గొర్రెలను అన్నింటిని సక్రమంగా చూసుకుంటారు.
1. గొర్రెలకు కాపరి నిత్యజీవితం ప్రసాదిస్తారు. యోహను 10:10
2. గొర్రెలు నాశనం కాకుండా వాటిని భద్రంగా చూసుకుంటారు. వాటి యొక్క ఎదుగుదలకై అనునిత్యం కృషి చేస్తాడు కాపరి. యోహను 3:16.
3. కాపరి కనుసన్నలలోనే గొర్రెలు ఉంటాయి. ఎవరు వాటిని ఆయన చేతి నుండి తీసుకొనలేరు. యోహను 6: 37-39.
4. ఈ గొర్రెలకు రెండు రకాలైన భద్రత కలుగుతుంది ఒకటి కాపరి దగ్గర నుండి రెండవది యాజమానుడి దగ్గర నుండి. ఇద్దరు దేవుడే కాబట్టి మనకి రెండు రకాలైన రక్షణ దొరుకుతుంది. మన జీవితానికి యజమానుడు దేవుడే, ఆయనే మనల్ని సృష్టించారు, నడిపిస్తున్నారు.
5. గొర్రెలు ఎప్పుడు కూడా కలసి జీవిస్తాయి. ఒక దాని వెనుక ఒకటి వెళతాయి అవన్నీ ఎప్పుడు ఒక మందలాగే ఉంటాయి.
మన దేవుడు మంచి కాపరి మనం ఆయన స్వరం విని నడుచుకుంటె మనకు అంతా మేలే కలుగుతుంది.
ఈరోజు ప్రతి కాపరి కోసం ప్రార్ధించాలి, మనందరికి ఇచ్చిన కాపరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుదాం.
Rev. Fr. Bala Yesu OCD
3, మే 2022, మంగళవారం
పాస్కా కాలపు నాల్గవ ఆదివారం
పాస్కా కాలపు నాల్గవ ఆదివారం
అపోస్తుల 13: 14, 43-52, దర్శన 7: 9, 14-17 , యోహాను 10: 27-30.
క్రీస్తు నాదునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ నాడు తల్లి తిరుసభ మనలందరిని పాస్కా కాలపు నాల్గవ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది.
ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలద్వారా, మనలందరికీ కూడా క్రీస్తు భగవానుడే మనకు నిత్య జీవితమును ప్రసాదించువాడు, ఆయనే మనకు మార్గచుపరి, వెలుగు మరియు సత్యమును అయియున్నాడు, క్రీస్తు ప్రభువే మంచి కాపరి, అని మనకు భోదిస్తుంది.
మనకు నిత్యజీవితం కావాలంటే, దేవుని సన్నిధి చేరుకోవాలంటే, క్రీస్తు ప్రభువు ఒక ద్వారమై ఉన్నారు, ఆయన జీవిత అనుసరణ ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందుకుంటాం అని తిరుసభ మనకు తెలియపరుస్తుంది.
ఏ విధంగా అంటే ?
మొదటి పఠనం: పునీత పౌలు, బర్నబాసుల వేదప్రచారం. పునరుత్తానా క్రీస్తు గురించి , ప్రజలకొరకై ప్రాణాన్ని దారపోసినటువంటి క్రీస్తు గురించి, ఆ మంచి కాపరి గురించి, బోధిస్తున్నారు.
వీరిద్దరూ పిసిదియా లోని అంతియోకు నగరంలో క్రీస్తు ప్రభువు పేరిట " దేవుని కృపలో జీవించమని" వేద ప్రచారం చేస్తున్నారు. వారి బోధనకు యూదులు మరియు యూదా మతాన్ని స్వీకరించిన వారందరు కూడా విశ్వసిస్తున్నారు. ఇది చేసినటువంటి అన్యులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. అందువలన యూదా ప్రజలు అసూయా చెంది. పౌలు, బర్నబాసులను తిరస్కరిస్తున్నారు, వారి ప్రదేశములనుండి తరిమివేస్తున్నారు.
వారుదేవుని కుమారుని విశ్వసించలేదు, అందువలననే వారు నిత్య జీవితానికి అభాగ్యులయ్యారు, దేవుని నుండి దూరమయ్యారు.
ఇలాంటి సన్నివేశాన్ని మనం సువిశేష పఠనంలో కూడా చూస్తున్నాం.
ఈ నాటి సువిశేషంలో క్రీస్తుప్రభుని యూదా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే, ముందుగా మనము ఈ అధ్యాయానికి ముందు అధ్యాయాలలో చూస్తున్నాం, క్రీస్తు ప్రభువు తన్ను తాను దేవుని కుమారుడని, తానే పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమని, తానే సత్యమును, మార్గమును, లోకమత్యము వరకు వెలుగై వున్నాను అని బోధించటం మనం చూస్తున్నాం.
క్రీస్తు ప్రభువు తాను దేవుని కుమారుడని బోధించుట :
“నేను మాత్రమే తండ్రి చెంతనుండి వచ్చినది, నన్ను పంపినవాడు నాతండ్రియే, నన్ను ప్రేమించువాడిని, నా తండ్రి ప్రేమించును. నన్ను నిరాకరించువాడు నా తండ్రిని నిరాకరిస్తున్నారు. నా ద్వారా తప్ప మరెవ్వరును తండ్రిని చేరుకోలేరు”. (యోహాను 8 : 39 - 59 ). అని బోధిస్తున్నారు.
“నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించు వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందును”. యోహాను 11 : 25 - 27 మరియు 9 : 5 వచనం.
“జీవాహారమును నేనే నన్ను స్వీకరించువాడు నిత్య జీవమును పొందును”. యోహాను 6 : 25 - 71 మనము చూస్తే, క్రీస్తు ప్రభువే సత్యం, జీవం, మార్గం, వెలుగు, అనే సారాంశమే మనకు అర్థమవుతుంది.
యూదులు యేసుప్రభువుని, నీవు మా తండ్రియగు అబ్రహముకంటె గొప్పవాడివా? అని యేసుని ప్రశ్నించినప్పుడు. యేసు ప్రభు సమాధానము....నేను అబ్రాహాము కంటే ముందు నుండి వున్నాను...ఈ, మాటలు విన్నటువంటి యూదులు యేసుప్రభుని, ఇతనికి దెయ్యము పట్టినది, అని నిందిస్తున్నారు తిరస్కరిస్తున్నారు. ఈ విధంగా బోధించడం ఒక దైవ దూషణగా భావించి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు.
(యోహాను 10: 32 - 33). క్రీస్తు ప్రభువు నిజముగా దేవుని కుమారుడు అయితే దేవుని నుండి ఒక గుర్తును చూపించమని అడుగుతారు.
కానీ క్రీస్తుప్రభువు మాత్రం ఎలాంటి గర్వానికి పోలేదు, తాను నిజముగా దేవుని కుమారుడైన కూడా, తాను నిరూపించు కోనవసరంలేదు. అందుకు ఆయన నేను చేస్తున్నటువంటి క్రియలే, దానికి సూచనలు అని సమాధానమిచ్చారు. యోహాను 10 : 24 - 25 .
క్రీస్తు చేసిన క్రియలగురించి మనందరికీ తెలుసు. గ్రుడ్డివారికి చూపునిచ్చాడు “నేనే వెలుగును , లోకాత్యము వరకు నేనే వెలుగు” అని బోధించాడు. యోహాను 9:5. ఆకలికొన్న వారికి ఆకలి తీర్చారు. ఇలా చాల అద్భుతాలు క్రీస్తు ప్రభువు చేసారు.
ఈవిధంగా యూదులు యేసు క్రీస్తుని అసూయ చేత తిరస్కరించారు. మొదటి పఠనంలో యూదులు ప్రభువు సేవకులైనటువంటి పౌలుగారిని , బర్నబాసు గారిని కూడా అసూయా చేత తిరస్కరించారు.
ఎందుకంటే ప్రజలందరూ క్రీస్తుని అనుసరిస్తున్నారు, క్రీస్తు గొప్పవారు అవుతున్నారన్న దురుద్దేశం, అసూయ.
ఈ యూదా ప్రజలు దేవుడు వారికే సొంతం, దేవాది దేవుడు వారికి మాత్రమే దేవుడు, అనుకున్నారు, గర్వంతో పొంగిపోయారు. వారి జీవితాలు లోక సంబంధమైనవి, కపట ఆచారాలు, కపట జీవితాలు, దేవాలయాలలో, మరియు వీధులలో నమస్కారాలకోసం, ప్రజల మెప్పు పొందడం కోసం, మేము యూదులము అని చెప్పుకుంటున్నారు తప్ప. నిజమైన దేవుని బిడ్డలాగా, దేవుని ప్రజలవలె జీవించలేదు. దేవుని ప్రేమిస్తున్నాము, మా దేవుడు , మాదేవుడు అని ఎప్పుడు చెప్పే వాళ్లే, కానీ తోటి మానవుని మాత్రం, ద్వేషించేవాళ్ళు, దూరం చేసేవాళ్ళు. అందువలననే క్రీస్తుప్రభువు వారిని అంటుంటారు,.. మీరు “మేము దేవుడి ప్రేమిస్తున్నాము, అని చెప్తారే తప్ప, ఆయన ఆజ్ఞలను ఎప్పుడు పాటించలేదు”, అందువలననే మీకు దక్కవలసినవి అన్యులకు దక్కినవి, అని అంటుంటారు.
మీరు దేవుని కుమారుని విశ్వసించలేదు, స్వీకరించలేదు, అందువలననే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేక పోయారు. కానీ అన్యులు విశ్వసించారు, క్రీస్తుని స్వీకరించారు, ఆయనను అనుసరించారు, అలాంటి వారే దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు, దేవుని సాన్నిధ్యాన్ని సంపాదించుకున్నారు.
ఈనాడు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. క్రీస్తు ప్రభువుని, విశ్వసిస్తున్నామా ? క్రీస్తు వాక్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని భోదిస్తున్నటువంటి దేవ సేవకులను నిందిస్తూ తిరస్కరిస్తున్నామా?.
రెండవ పఠనం మనం ధ్యానించినట్లయితే. పునీత యోహాను గారు తనకు వచ్చినటువంటి దర్శనంలో, పరలోక రాజ్యం లేదా దేవుని సాన్నిధ్యం యొక్క గొప్ప తనాన్ని ఈ యొక్క రెండవ పఠనంలో వివరిస్తున్నారు.
గొప్ప జన సమూహము తెల్లని దుస్తులు ధరించి, దేవాది దేవుని, పాటలద్వారా, కీర్తనలద్వారా స్తుతిస్తూ, సంతోషంగా వున్నారు అని తెలియ చేస్తున్నారు. ఎవరు వారంతా ? అంటే వారు ఈ భూలోకంలో వున్నంతకాలం పరలోక భాగ్యం కోసం జీవించినవారు, సత్యం కోసం హింసలు పొంది, మరిణించినవారు, క్రీస్తు కోసమై జీవించినవారు, వారికి, ఇక ఎలాంటి భాదలు , భయమును, మరణమును, ఉండవు. వారిని దేవుని సాన్నిధ్యము నుండి , దేవుని రక్షణము నుండి ఎవరును వేరుచేయలేరు. అని తెలియ చేస్తున్నారు.
కావున క్రీస్తునాదునియందు ప్రియులగు సహోదరి సహోదరులారా మనమందరము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఏవిధంగా కొనసాగుతున్నాయి ? క్రీస్తుని విశ్వసించి అనుసరించి, క్రీస్తు ప్రభువుకు సంభందించిన వారివలె, ఆయన స్వరమును ఆలకించే వారిగా ఉన్నాయా? లేదా, కపట యూదులవలె గర్వంతో, అసూయతో, దేవునికి, లేదా ఆ పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, దూరంగా జీవిస్తున్నామా?
ఎందుకంటే ఈనాటి సువిశేషంలో యోహాను 10 :27 -30 వచనాలలో చూస్తున్నాం. క్రీసు మంచికాపరి, ఆయనను ప్రేమించువారు, ఆయన స్వరమును వినును, ఆయన వాక్కును పాటించును, ఆయన వారిని ప్రేమించును, వారియందు జీవించును అని.
కాబట్టి క్రీస్తు ప్రభువు మనయందు జీవించాలన్న మనం క్రీస్తు చెంతకు చేరాలన్న, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకోవాలన్న క్రీస్తు ప్రజలవలె జీవించాలి.
కాబట్టి మనందరం క్రీస్తు ప్రజలవలె , దేవుడిని, మరియు మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, పరలోక భాగ్యాన్ని ఆ నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్..
- బ్రదర్. సుభాష్ ఓ.సి.డి
30, ఏప్రిల్ 2022, శనివారం
పాస్క మూడవ ఆదివారం
పాస్క మూడవ ఆదివారం
అపో 5:27-32 ,40-41, దర్శన 5:11-14, యోహను 21:1-19
ఈనాటి దివ్య పఠనాలు దేవునికి సాక్షిగా జీవించే వారి గురించి బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంను విశ్వసించి పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం పొందిన వారందరు దేవునికి సాక్షులై జీవించాలని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి.
ఈనాటి మొదటి పఠనం, అపోస్తులులు యేసు ప్రభువుకు ఎలాగా సాక్షులై జీవించారో తెలుపుతుంది. యేసు ప్రభువుతో పాటు మూడు సంవత్సరాలు జీవించి, ఆయనను తెలుసుకొని ఆయన అప్ప జెప్పిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ, ఆయనకు సాక్షులై జీవించారు అపోస్తులులు.
లూకా గారు, యేసు ప్రభువు యొక్క శిష్యులను అపోస్తులులు అని పిలుస్తున్నారు. అంటే పంపబడినవారు అని అర్ధం. దేవునికి సాక్షులుగా ఉండుటకు పంపబడిన వారు అని అర్ధం . ఏసుతో జీవించి ఆయన భోదను చెవులారా ఆలకించి, ఆయన మరణాన్ని కన్నులారా గాంచి, మృతులలో నుండి సజీవునిగా లేచిన, క్రీస్తుని గురించి ప్రకటించకుండా వుండలేక పోయారు.
దేవునితో కలిసి జీవించినప్పుడు పొందిన అనుభవాన్ని ఇతరులకు తెలియజేయుటకు సిద్దంగా ఉన్నారు. క్రీస్తు పేరిట ప్రసంగించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అపోస్తులు అనేక హింసలకు గురయ్యారు.
దేవుని యొక్క సేవ చేసేటప్పుడు అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి. పూర్వ నిబందన గ్రంధం లో కూడా చూస్తుంటాం, ఏ విధంగా యిస్రాయేలు ప్రజలు ప్రవక్తలను హింసించారో.
యిర్మియా ప్రవక్తను కొట్టి బావిలో పడవేశారు. యిర్మియా 20:2, దానియేలును సింహాపు బోనులో పడవేశారు, దానియేలు 6 వ అధ్యాయం. బాప్తిస్మ యోహనును కూడా శిరచ్ఛేదనం చేశారు. మత్తయి 14:1-12. చాలా మంది ప్రవక్తలు దేవునికి సాక్షులై జీవించేటప్పుడు అనేక రకాలైన హింసలకు గురయ్యారు. శిష్యులుకూడా దేవుని యొక్క పవిత్ర ఆత్మను స్వీకరించిన తరువాత ఆయన గురించి గొప్పగా ప్రకటన చేస్తున్నారు. ఇక ఎదియు వారిని ఆపలేదు.
అపోస్తులను చెరసాలలో వేయడానికి కారణం కేవలం అసూయాయే. అపో 5:17. క్రీస్తు ప్రభువుకు అనుచరులు పెరిగిపోతున్నారని సద్దుకయ్యులు భావించారు. అందుకే వారు ఆ విషయమును జీర్ణించుకోలేక పోయారు.
క్రైస్తవ మతమును , క్రీస్తు అనుచరులను తుద ముట్టించాలను కున్నారు. కానీ వారికి అది సాధ్య పడలేదు. క్రైస్తవత్వం ప్రారంభమైనప్పటి నుండి క్రీస్తు అనుచరులు అనేక కష్టలు అనుభవించారు, అయిన కానీ క్రైస్తవ మతం అణగిపోలేదు. క్రీస్తు విశ్వాసులు దిన దిన అభివృద్ధి చెందుతున్నారు.
అధికారులు అపోస్తులులను చెరసాలలో వేసి బందించినప్పటికి దేవుడు వారిని విడిపించారు. ఎందుకంటే వారు దేవునికి సాక్షులై జీవించారు. దేవునికి విధేయత చూపించారు.
దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నికొలిమిలో వేసిన సంధర్భంలో, దేవుడు వారిని కూడా కాపాడారు. దానియేలు 3:92. ఈ ముగ్గురు వ్యక్తులుకూడ దేవునికి సాక్షులై , విధేయులై జీవిస్తున్నారు. రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించుటకు వారు ఒప్పుకోలేదు. కేవలం దేవున్ని మాత్రమే ఆరాధిస్తాం అని గట్టిగా విశ్వాసానికి సాక్షులై జీవించారు.
ప్రభువు యొక్క సేవ ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంతగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అపోస్తులులు ఎన్నో ఇబ్బంధులను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారు. వారు కష్టాలకు, శిక్షలకు వెనుదీయలేదు,ఎంతో ధైర్యంగా ఉన్నారు.
వారు సురక్షితంగా పిల్ల పాపలతో ఉండాలని కోరుకోలేదు. దేవుని జీవితం ప్రకటించాలని దేశ దేశాలు తిరిగి సువార్త ప్రకటించారు.
క్రీస్తు పునరుత్తానం తరువాత అపోస్తులులు దేవుని చిత్తమును మాత్రమే వేదికారు. ఆయన చిత్తం నెరవేర్చుటకు , ప్రాణ త్యాగం చేయుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. ప్రభువు సేవలోనే నిజమైన ఆనందం వుందని భావించి ఆయన సేవ చేశారు అపోస్తులులు.
ఈనాటి రెండవ పఠనంలో యోహాను గారు చూసిన దర్శనం గురించి తెలియచేస్తున్నారు. కోట్ల కోలదిగా దేవ దూతలు చంపబడిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల యైన యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి స్తుతులు పాడుచున్నారు. దేవుడు మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని ఆయనను ఆరాధించారు.
చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది, ఎందుకంటే ఈ గొర్రె పిల్లయైన యేసు క్రీస్తు ప్రభువు బాధమయ సేవకుని వలె తన యొక్క జీవితంను త్యాగం చేశారు. తన రక్తమునుచిందించి ఇతరులను రక్షించెను. తన ప్రేమను మనకు పంచి ఇచ్చారు. మనలను క్షమించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. కాబట్టి ఆయనను ఎక్కువగా తండ్రి దీవించారు. పిలిప్పి 2: 9.
ఈనాటి సువార్త పఠనంలో దేవుడు పేతురు గారికి కాపరి యొక్క బాధ్యతలను అప్పజెప్పుతున్నారు. పేతురు గారు కూడా యేసు ప్రభువుకు సాక్షియై జీవిస్తూ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు.
ఈ సువిశేషంలో చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. 1. మొట్టమొదటగా దేవుడు తప్పిపోయిన వారిని వెదుకుచున్నారు. క్రీస్తు ప్రభువు మరణం తరువాత శిష్యులందరు ఎవరి దారిన వారు పోయారు, భయంతో జీవించారు. వారందరిని దేవుడు వెదకు చున్నారు. తప్పిపోయిన గొర్రెను వెదికారు, నాణెమును వెదికారు. అలాగే తప్పి పోయిన కుమారుడి కోసం ఎదురు చూశారు. ప్రభువు ఈలోక ప్రాణ భయం వలన బాధ్యతలను నిర్వహించుట మరిచిపోయిన శిష్యులను వెదకుచున్నారు. వారికి బాధ్యతలను అప్పజెప్తున్నారు.
2. యేసు ప్రభువు మనలను పాత జీవితం జీవించుటకు అంగీకరించరు. పేతురు గారిని దేవుడు తన యొక్క సువార్త పని కోసమై పిలిచారు. మూడు సంవత్సరములు సువార్త పరిచర్య బాగానే చేశారు. కానీ క్రీస్తు ప్రభువు యొక్క మరణం తరువాత పరిచర్య విడిచిపెట్టి మళ్ళీ వారి యొక్క పాత పని, చేపలు పట్టుటకు వెల్లుచున్నారు. ప్రభువు దానికి అంగీకరించుటలేదు.
మనం ఎప్పుడుకూడా క్రొత్త జీవితం జీవించాలి. తపస్సు కాల 40 రోజుల మంచి జీవితమే ఇక మీదట కూడా మనం కొనసాగించాలి. తపస్సుకాలంలో మంచిగా, పవిత్రులుగా జీవించిన విధంగా ఇక మీదట అదే క్రొత్త జీవితం కొనసాగాలి.
3. యోహను గారు,క్రీస్తు ప్రభువు 3 వ సారి దర్శనం ఇచ్చారని సువిశేషంలో అన్నారు. వాస్తవానికి ఇది నాలుగవ సారి. 1. మొదట మగ్దల మారియమ్మకు దర్శనం ఇచ్చారు. యోహను 20:11-17.
2. శిష్యులకు దర్శనం ఇచ్చారు, అప్పుడు తోమస్సు గారు వారితో లేరు. 20:19-23.
3. తోమస్సు శిష్యులతో ఉన్నప్పుడు 20: 26-29.
4. ఈనాటి సువిశేషంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం , ఇవన్నీ చేయుట ద్వారా ప్రభువు తాను సజీవుడని తెలుపుచున్నారు. శిష్యుల విశ్వాసం బలపరుస్తున్నారు. యేసు ప్రభువు తాను సజీవుడని శిష్యులకు తెలియచేస్తున్నారు.
4. చేపలు పట్టే అనుభవం ద్వారా దేవుడు మరొకసారి శిష్యులను సువార్త పరిచర్యకు పిలుస్తున్నారు. లూకా 5: 1-11 లో మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చేపలు పట్టే అనుభవం ద్వారా శిష్యులను తన యొక్క సేవకు పిలిచారు.
ఈ అనుభవం ద్వారా ప్రభువు తాను దేవుడని తెలియపరిచారు. శిష్యులు ఆయనను ప్రభువు అని గుర్తించారు. ప్రభువు వారిని మనుష్యులను పట్టువానిగా చేశారు. ఈ అనుభవం వలన శిష్యులు సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించారు, ఆయన సేవ చేశారు.
శిష్యుల యొక్క విశ్వాసమును దేవుడు అధికం చేయుటకు ఈ అద్భుతం చేస్తున్నారు.
5. చేపలు పట్టే సమయంలో ఆ వలలో 153 రకాల చేపలు పడ్డాయి. దీనియొక్క అర్ధం ఏమిటంటే ప్రభువు జీవించే సమయంలో కేవలం 153 రకాల చేపలే ఉండేవి. అని అన్నియు ఆయన వలలోకి వచ్చాయి. ఆయన పునరుత్థానం తరువాత అందరిని కూడా దీవిస్తారు, రక్షిస్తారు.
ఈ 153 రకాల చేపలు వలలో వున్నప్పటికి వల చినగలేదు. ఎందుకంటే అవి కలసి ఉంటున్నాయి, ఐక్యంగా ఉన్నాయి. మనం కూడా అందరం కలిసి మెలిసి ఉండాలి. తిరుసభలో అనేక ప్రాంతాల వారు జాతుల వారు ఉన్నారు, అయినా అందరు ఐక్యంగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. మనం కూడా కలిసి జీవించుటకే దేవుడు మనల్ని పిలిచారు ఆయన బిడ్డలమైన మనం కలసి ఉండాలి.
6. యేసు ప్రభువు పేతురు గారిని నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అని మూడు సార్లు అడుగుచున్నారు. మూడు సార్లు ఎందుకని మనం ఆలోచించాలి. పేతురు ప్రభువును మూడు సార్లు నిరాకరించారు. అందుకే మూడు సార్లు అడిగారు. ఇది ఒక వివరణ.
రెండవది ఏమిటంటే గ్రీకు భాషలో ప్రేమకు మూడు అర్ధాలు ఉన్నాయి. 1. philia - స్నేహితుల మద్య ఉన్న ప్రేమ 2. eros - ప్రేమికుల మధ్య , భార్యభర్తల మధ్య ఉండే ప్రేమ, 3. agape - త్యాగ పూరితమైన ప్రేమ ,ప్రాణాలిచ్చే ప్రేమ. ప్రభువు పేతురు నుండి కోరినది మూడవ ప్రేమ , ఆయన సేవ కోసం ప్రాణాలిచ్చే ప్రేమ పేతరు నుండి ప్రభువు కోరారు.
మూడవదిగా పేతురును మూడు సార్లు ఎందుకు అడుగుచున్నారంటే, పేతురు నీవు నన్ను -పూర్ణ హృదయం , పూర్ణ మనస్సుతో , పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా అని అర్ధం. హృదయం, మనస్సు , ఆత్మతో ప్రేమిస్తే అది సంపూర్ణంగా ఉంటుంది.
పేతురు పశ్చాత్తాప పడి ఈ మూడు విషయాలకు ఒప్పుకొనుట ద్వారా దేవుడు మళ్ళీ అతన్ని నాయకునిగా ఎన్నుకొంటున్నారు. దేవుని యొక్క గొర్రెలను మేపమంటున్నారు. ఆయన ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్నారు.
ఈనాటి సువిశేషంలో ప్రభువు రెండు ఉదాహరణలు వాడుచున్నారు. 1. చేపలు పట్టటం 2. గొర్రెలు చూచుకొనుట.
ప్రతి ఒక్క సువార్త సేవకులు మొదటిగా దేవుని యొక్క వాక్కుచే ప్రజలను పట్టుకోవాలి. తరువాత దేవుని మందను పరలోక మార్గం వైపు నడిపించాలి.
పేతురు గారు ప్రాణ భయంతో క్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పాడు. అయినా ప్రభువు యొక్క పునరుత్థాన అనుభవం ద్వారా తన జీవితం మార్చుకున్నాడు. ఆయనకు సాక్షిగా జీవించాడు. తాను వేద సాక్షిగా మరణం పొందాడు. క్రీస్తు ప్రభువు యొక్క సేవ చేశాడు.
దేవుని సేవలో నిజమైన ఆనందం కనుగొన్నారు. ప్రభువుకు విధేయులై జీవించారు. మనం దేవునికి సాక్షులై జీవించాలి.
Rev. Fr. Bala Yesu OCD
22, ఏప్రిల్ 2022, శుక్రవారం
పాస్క కాలపు రెండవ ఆదివారం
పాస్క కాలపు రెండవ ఆదివారం
క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ! ఈనాడు మనందరం కూడా పాస్కకాలపు రెండవ ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష పఠనం ద్వారా దేవుడు మనకు 5 విషయములను తెలియజేస్తున్నాడు.
1. పునరుత్థాన యేసు ప్రభువు శాంతి నొసగుచున్నాడు
2. పునరుత్థాన యేసు ప్రభువు తనను తాను తెలియ పరుచుకుంటున్నాడు.
3. తన చిత్తాన్ని శిష్యులకు తెలియ పరుస్తున్నాడు.
4. పవిత్రత్మశక్తిని వారికి ఇస్తున్నాడు.
5. దేవునికి సాక్షులుగా జీవించడానికి వారిని ఆహ్వానిస్తున్నాడు.
1. శాంతినొసగుట
యేసు ప్రభువు పునరుత్థానుడైన తరువాత తన శిష్యులు ప్రాణ భయంతో , యూదులు వారిని చంపి వేస్తారేమో అని తలంచి వారు ఒక ఇంటిలో ప్రవేశించి తలుపులు మూసుకొని జీవించారు. ప్రాణ భయంతో జీవించారు. ప్రాణ భయంతో తలుపులు మూసుకొని జీవించిన శిష్యుల జీవితాలలోకు పునరుత్థానుడైన యేసు క్రీస్తు వస్తున్నాడు. వారివద్దకు రావడమే కాదు. వారికి శాంతి నొసగుచున్నాడు. పునరుత్థానుడైన యేసు క్రీస్తు మనతో ఉన్నడని మనం నిజంగా విశ్వసిస్తే , నీవు ఈలోకంలో జరుగు ఏ విపత్తుకు, నీ జీవితంలో ఏ విషయానికి దిగులు చెందక భయపడక ధైర్యం గా వుంటావు. యోహాను 20:20. లో చూస్తే ప్రభువుని చూచిన వారు ఆనందించిరి, అని వ్రాయబడినది. కానీ 19 వ వచనంలో చూస్తే యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. ఇక్కడ యూదులను చూసి భయ పడితే, అక్కడ యేసుని చూసి ఆనందించారు. మత్తయి 10:28 "శరీరమును మాత్రము నాశనము చేయ గలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. శరీరమును, ఆత్మను కూడా నాశనము చేయ గల వానికి భయపడుము." అని చాటుతున్నది.
మనం జీవితంలో కూడా ఇది పాటించినట్లయితే ఈలోకంలో ఎవరికి భయపడకుండా దేవుని శాంతిలో మనం జీవించగలుగుతాము.
2. తనను తాను తెలియపరుచుకొనుట
ఇక్కడ యేసు క్రీస్తు యొక్క కర్తవ్యం గూర్చి తెలుపబడుతుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన స్వార్ధం కోసం కాదు. మరి ఎందుకు పంపబడ్డాడు అంటే అందరిని ప్రేమించి, వారికి రక్షణ ఇవ్వడానకి. యోహను 3:17. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు రక్షించడానికి పంపేనె కానీ దానిని ఖండించడానికి పంపలేదు. మరి ఈనాడు యేసు ప్రభువు కూడా తన శిష్యులను కూడా అదే చేయమనుచున్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20:21. ఎందుకు దేవుడు తన శిష్యులను తన పనిని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పంపుచున్నడంటే, యోహను 14:34 లో మనం చూస్తాము, ప్రభువు చెప్పేది ఏమిటంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. యోహను 6:57 . జీవము గల తండ్రి నన్ను పంపేను.
3. తన చిత్తాన్ని వారికి తెలియ పరుస్తున్నాడు. యోహను 20:21
యేసు చిత్తము ఏమిటంటే 1. ఒకరి నొకరు ప్రేమించుకోవాలి. యోహను 14:34
2. ఒకరినొకరు క్షమించుకోవాలి యోహను 8:10
3. ఒకరినొకరు రక్షించుకోవాలి లూకా 19:10
4. ఒకరికొకరు ప్రార్ధన చేసుకోవాలి. లూకా 6:12 . నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20: 2
4. పవిత్రత్మ శక్తిని వారికంధిచుట
యోహను 14:18 నేను మిమ్ము అనాధులుగా విడిచి పెట్టను. నేను మీ ముద్దు వత్తును. ఈనాటి సువిశేషంలో దేవుడు తన వాగ్ధానాన్ని తెలియపరుస్తున్నాడు.
రెండవ పఠనంలో కూడా చూస్తే పవిత్రత్మ పొందిన శిష్యులు గొప్ప గొప్ప ప్రార్ధనలు చేస్తున్నారు. పేతురు నడుచుచున్నప్పుడు అతని అంగీని నీడన పడిన చాలు అని విశ్వసించిన ప్రజలు ఎప్పుడైతే శిష్యులు ఈలోక relationship ను తృణీకరిస్తున్నారో వారు పవిత్రత్మ శక్తి ద్వార ఎన్ని అద్భుతాలు చేశారు.
ఈ శక్తి ద్వార ఎంతో మంది విశ్వాసులు స్వస్థతను పొందుతున్నారు. నూతన విశ్వాసులుగా మారుచున్నారు. యోహను 20: 24.
5. దేవునికి సాక్షులుగా వుండటానికి వారందరికీ ఆహ్వానిస్తున్నాడు.
ఎలా మనం సాక్షులుగా మారుతం అంటే , మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొనుటచే దేవునికి సాక్షులలుగా జీవించడానికి అలా చేశారు. ఎవరి పాపములైన మీరు క్షమిస్తే వారి పాపములు క్షమించబడతాయి. మనం ఎప్పుడైతే ఇతరుల పాపములను క్షమిస్తామో అప్పుడు మనం దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తాం.
కాబట్టి ఈనాడు నీవు నేను ఈ లోకంలో ఉన్న వస్తువులకు , వ్యక్తులకు ,ఇబ్బందులకు బయపడకుండా దేవునికి భయ పడాలి. ఆయన పిలుపుని పొందిన మనం ఆయనను అనుసరించు వారీగా జీవించాలి. ఆ దేవాతి దేవుడినికి ఒక గొప్ప సాక్షిగా మారి దేవుని ప్రేమను నీవు నేను అందరికి అందేలా చేయాలి.
Br. Joseph mario
16, ఏప్రిల్ 2022, శనివారం
క్రీస్తు పునరుత్థాన మహోత్సవం
క్రీస్తు పునరుత్థాన మహోత్సవం
యేసు ప్రభువు తన ఉత్థానం ద్వారా మన చీకటి అంతటినీ వెలుగుగా మలచారు. ఈ రోజు యేసు ప్రభువు ఉత్తనమైన రోజు. ఒక సమాధి పై పెద్ద బరువైన రాయి దొర్లించబడి, ఆ సమాదిలోని దేహం లేచి రాకుండా కావలికాయడానికి సైనికులు కాపలా ఉంచబడిన సమాధి. ప్రపంచ చరిత్రలో ఒకే ఒకటి. అదియే యేసు ప్రభువు సమాధి. యేసు ప్రభువు మరణానికి కారకులైన ప్రధానర్చకులు, పరిసయ్యులు కలసి యూదయ రాష్ట్ర పరిపాలకుడైన పిలాతు దగ్గరిని పోయి ఇలా విన్నవించారు.
అయ్యా! ఆ మోసగాడు యేసు జీవించి ఉన్నప్పుడు , నేను మూడు దినాలు తరువాత జీవంతో లెతును అని చెప్పినట్టు మాకు జ్ఞాపకమున్నాడు. అతని శిష్యులు అతనిని సమాధి నుండి దొంగిలించుకొని పోయి మృతుల నుండి జీవంతో లేచెను అని ప్రజలకు చెప్పుదురేమో, అప్పుడు మొదటి మోసం కంటే ఇది మరి ఘోరముగా వుండును కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రపరప అజ్ఞాపింపమని చెప్పిరి. అందుకు పిలాతు మీకు కావలివారు వున్నారు గదా! పోయి మీ చేతనైనంత వరకు సమాధిని కాపలా చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతి పై ముద్ర వేసి కావలివారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. మత్తయి 27:63-66 లో ఇది అంత చూస్తున్నాము.
ఆదివారం ప్రాతః కాల సమాయమన పెద్దగా భూమి కంపించేను . ఎలయన పరలోకం నుండి దేవ దూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను. కాపలాదారులు భయపడి చని పోయిన వారి వలె పడి పోయెను. అంతలో అక్కడికి వచ్చిన స్త్రీతో ఆ దేవదూత భయ పడకుడు మీరు శిలువ వేయబడిన యేసును వెదకుచున్నారా ? ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచెను అని చెప్పెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కాపలా కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ఆ ప్రధానార్చకులకు పరిసయ్యులకు చెప్పిరి.
ప్రభువు దర్శనం - ఖాళీ సమాధి
మీరు భయపడకుడు. శిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన పునరుత్థానుడైనాడు, ఇక్కడ లేడు, వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు మార్కు 16:6. క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా దేవుని బిడ్డలారా ప్రభుని ఉత్థాన మహోత్సవం , మనం జరుపుకునే పండుగలన్నింటిలో క్రీస్తు ఉత్థాన పండుగ ఒక అత్యంత గొప్ప పండుగ. ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు విశ్వాసులందరు కలసి, క్రీస్తు ప్రభువు యొక్క ఉత్థానాన్ని , ఉత్థాన సందేశమును ప్రపంచానికి , సర్వ మానవాళికి ప్రకటించుచున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు తన వెలుగును,శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యం పొందుకొని మొదటగా ఖాళీ సమాధిని దర్శించిన ముగ్గురు వ్యక్తులు మగ్ధలా మరియమ్మ , పేతురు, యోహను. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకే నిరీక్షణ , ఒకే ఎదురు చూపును చూస్తున్నాము.
యెరుషలేములో జరిగిన ఈ సంఘటనల తరువాత శిష్యులందరు భయాందోళనలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పేతురు నేను ఆయనను ఎరుగాను అని మూడు సార్లు బోంకారు. యోహను 18:27.
యోహను శిలువ వరకు క్రీస్తు ప్రభుని వెంబడించినను ఎంతో భయపడ్డాడు. మగ్ధలా మరియమ్మ యేసు ప్రభువును అనుసరించడం నేర్చుకొన్న స్త్రీ. ఈమె ప్రభువును అధికంగా ప్రేమించినది. కలువరి కొండవరకు ఆయనను అనుసరించినది. ఆయన శిలువ పై వ్రేలాడే సమయంలో ఆయన ప్రక్కనే ఉన్నది. ఆయన చనిపోవడం చూసినది. ఆయనను సమాధిలో ఉంచడం చూసినది. ఒంటరిగా , దుఃఖంతో నిండిన హృదయముతో ఆదివారం పెందలకాడనే సమాధి దగ్గరకు వెళ్ళి యేసు భౌతిక దేహాన్ని చూసి విలపించాలి అనుకున్నది. ఆయన భౌతిక దేహానికి సుగంధం పూసి అలంకరించాలి అనుకున్నది, ఆయన భౌతిక దేహాన్ని దర్శించుకోవాలి అనుకున్నది. చివరికి సమాధి దగ్గరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఈ ముగ్గురు కూడా క్రీస్తును వెదకడం మనం ఈనాటి సువిశేషంలో వింటున్నాము. వారు కూడా సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ అంత చీకటిగా ఉంది. సమాధి రాయి తొలగించబడి వుంది. వారు లోనికి వెళ్ళి ఖాళీ సమాధిని గుర్తించారు.
క్రీస్తు దేహము అక్కడ వారికి కనిపించలేదు. వారికి ఆ పరిస్థితి అర్ధం కాలేదు. రకరకాల అనుమానాలు వారి మదిలో మెదిలాయి. ఖాళీ సమాధికి ఒక అర్ధం లేదు అనిపించింది. వారు ఖాళీ సమాధిని చూసి ప్రభువును విశ్వసించలేదు, నమ్మలేదు కానీ ఆ సమాధిని చూసి వారు నిరాశ చెందలెదు. వారిలో ఎక్కడో ఆశలు చిగురించాయి. వారు ఆయనను వెదకటం ప్రారంభించారు. దేవ దూత అడుగుతుంది !అమ్మ నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? యోహను 20:15. అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపు వెళ్ళిరి. అయిద్దరును పరుగెత్తుచుండిరి.కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. యోహను 20:3-4. ఈ విధముగా ప్రభువును వెదకడం లో వారు ఆయనను కనుగొన్నారు. ఆయన దర్శన భాగ్యమునకు అర్హులైనారు. ఖాళీ సమాధి వారిని ఒక నూతన జీవితం వైపు నడిపించినది. వారి జీవితాలలో ఒక క్రొత్త ఆశను రేపినది. వారికి మార్గాన్ని చూపినది. ప్రియమైన మిత్రులారా వారిలోని తాపత్రయం, ఆశ, వారి ఆత్మ విశ్వాసం ఉత్థాన ప్రభువు దర్శనానికి తోడ్పడినది.
వారంత ప్రభు దర్శనానికి అనేక సార్లు నోచుకోని, వారు చూసిన ఖాళీ సమాధి నిజమని, ఒక వైపు ఖాళీ సమాధి, మరో వైపు ప్రభువు దర్శనం ,ఈ రెండు అంశాలు కూడా వారు విశ్వాసంతో వేదకడానికి తోడ్పడినవి.
ప్రియమైన స్నేహితులారా మన రోజు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు,ఆటంకాలు, ఊహించని సంఘటనలు మన జీవితాన్ని ఒక ఖాళీ సమాధిగా చేస్తాయి. మన స్నేహితులుగాని కుటుంబ సభ్యులు గాని చనిపోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మన ప్రేమ ఫలించనప్పుడు మన జీవితం చీకటిగా కనిపిస్తుంది. మన జీవితంలో ముందుకు పోవడానికి అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. మన సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మన పరిస్థితి ఖాళీ సమాధిలా అనిపిస్తుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతుంటాయి కానీ మనం నిరాశ చెందక ,మగ్డలా మరియమ్మలా , పేతురులా యోహనులా సమస్య పరిష్కారం కోసం వెదకాలి. వారు ఏ విధంగా ప్రభువు కోసం , ప్రభువు కొరకు వెదకి ఆయనను కనుగొన్నారో,అధే విధంగా మనం కూడా మన జీవితంలో ఖాళీ సమాధిని చూసి భయ పడక క్రీస్తును వెదకాలి మత్తయి 7:7. లో వెదకుడు దొరుకును అని చూస్తున్నాము, వారికి కనబడినట్లే మనకు కూడా తప్ప కుండా కనబడుతారు.
అయితే ప్రభువు దర్శనం అందరికి ఒకేలా ఉండదు. ప్రభువు అనేక రూపాలలో , అనేక విధాలుగా మనకు ప్రత్యక్షం కావచ్చు. ప్రతి ఒక్కరి శక్తిని బట్టి , జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరి విశ్వాస అనుభూతి మారుతూ ఉంటుంది. ఒకరు పొందిన అనుభూతి , ఆనందం మరొకరు పొందకపోవచ్చు. కనుక క్రీస్తును మన జీవితంలో గుర్తించి కనుగొన్నప్పుడు మనం కూడా ఉత్థాన క్రీస్తు ఆనందాన్ని , ప్రేమను , శాంతిని పొందగలుగుతాము.
యేసు ప్రభువు ఉత్థానుడయ్యాడు ఇది మనందరికీ ఒక శుభవార్త కాని ఈ యేసు ప్రభువు ఉత్థానమే మనందరికీ ఒక సందేశం. అయితే ఈ క్రీస్తు ఉత్థానం ద్వార ఆశ, నమ్మకం ఎక్కడ నుండి వస్తుంది? ఈ సందేశాన్ని ఎక్కడ వెదకగలం? సువిశేషంలో విన్నట్లు , ఈ నమ్మకం ఆశ, యేసుని భూస్థాపితం చేసిన సమాధి నుండి వస్తుంది. కారణం ఆ సమాధి అందరిని ఆకర్షించింది. ఈ సమాధి దగ్గరకే మగ్దల మరియమ్మ , పేతురు , యోహనులు వెళ్ళినది. ఈ సమాధి వారిలో ఉత్థాన క్రీస్తు ఆశలు రేపినది. వారిలో నమ్మకాన్ని పెంచినది ప్రభువు యొక్క ఉత్థానం . మనందరి జీవితాలలో నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన ఈనాటి ఉత్థానం అవుతూనే ఉన్నాడు.
ప్రతి సారి ప్రియమైన స్నేహితులారా మనలో ఉన్న చెదుకు మనం మరణించినప్పుడు క్రీస్తు ఉత్థానం అవుతున్నాడు. మన స్వార్ధాన్ని వీడి ఇతరులను ప్రేమించినప్పుడు దయ,కరుణ, జాలి అను గుణాలు మనలను ముందుకు నడిపించినప్పుడు క్రీస్తు మనలో ఉత్థానమవుతున్నాడు. మనం చేసే ప్రతి మంచి పని, ఆలోచన ద్వారా క్రీస్తు ఈ లోకంలో ఇంకా ఉత్థానమవుతున్నాడు. కనుక ప్రతి సంఘటన ద్వార ప్రతి రోజు మనకు ఉత్థాన మహిమను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి రోజు కూడా ఒక ఉత్థాన రోజుగా జీవించినప్పుడు , ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానం ,ప్రేమ , ఐక్యత మనలను ముందుకు నడిపిస్తాయి. పునరుత్థానం ఒక నూతన జీవితం, ప్రభువుతో ఉన్న అనుభందముతో ఒక నూతనత్వంతో ,సాటివారితో ఉన్న అనుబంధంలో నూతనత్వం కలిగి వుందాం. క్రీస్తు ప్రభువు విధానములో , ఆయన జీవించినట్లు అటు దేవునితో ఇటు పొరుగు వారితో జీవించడం ఒక ఉత్థానం జీవితమే.
ఉత్థాన ప్రభువుని విశ్వసించడం అంటే ఖాళీ సమాధి దగ్గర జీవిత కష్టాలలో జీవించడం కాదు, ఆ ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానాలును , సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం. ఇలా ఒక నూతన ప్రపంచానికి నాంది పలకాలి. క్రీస్తు మరణం ఉత్థానం మన అనుదిన జీవితంలో భాగం కావాలి . ఆయన జననం , మరణం , ఉత్థానం ,నిత్యం మన జీవిత విధానం కావాలి. ప్రతి రోజు ఒక ఉత్థాన పండుగ కావాలి, ప్రతి రోజు ఒక నూతన జీవితం కావాలి. ఆమెన్
Br. Manoj
సామాన్యకాలపు 5 వ ఆదివారం
సామాన్యకాలపు 5 వ ఆదివారం యెషయా 6:1-6 1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...