18, ఫిబ్రవరి 2023, శనివారం


7వ సామాన్య ఆదివారం

లేవి 19: 1-2, 17-18

1 కొరింతి 3: 16-23

మత్తయి 5: 38-48 

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు క్రైస్తవులము, దేవుని యొక్క అనుచరులమైన మనందరం పవిత్రులుగా జీవించాలని తెలుపుచున్నవి.

దేవుని వలె మనందరం కూడా పవిత్రమైన జీవితం జీవించాలి. అప్పుడే మన యొక్క జీవితం పూరి పరిపూర్ణమైంది. ఎవరైతే దేవున్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ, అనుసరిస్తారో వారి యొక్క భూలోక జీవితం మిగతా అన్యుల జీవితం కన్నా, మిగతా వ్యక్తుల జీవితం కన్నా భిన్నంగా వుండాలి.

తిరుసభలో, ఈ ప్రపంచంలో క్రైస్తవుల యొక్క జీవితం ఒక సుమాతృకగా వుండాలి. మహాత్మా గాంధీ అంటారు ‘యేసు క్రీస్తు అంటే నాకిష్టం’. కానీ క్రైస్తవులంటే అంత ఇష్టం కాదని ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఒక గొపు సుమాత్మక నిచ్చారు.  ఆయన జీవితం, ఆయన బోధన చాలా భిన్నమైనవి. క్రైస్తవులు మాత్రము వాటిని అనుసరించుట చాలా అరుదు కాబట్టి క్రైస్తవులంటే తక్కువ ఇష్టం అని పలికారు.

ఈ రోజు ఈ దివ్య పఠనాలు మనందరి జీవితాలు ఈ లోకానికి బిన్నంగా, దేవునికి అనుగుణంగా వుండేలా జీవించమని తెలుపుతున్నాయి. పవిత్రంగా జీవించాలంటే దేవుని యెడల మనకు గొపు ప్రేమ వుండాలి అప్పుడే మనం పవిత్రంగా జీవిస్తాం.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా వుండాలని రచయిత తెలుపుచున్నారు. రచయిత పవిత్రతకు సంబందించిన ఒక సూత్రంను తెలియచేస్తున్నారు. సృష్టి ప్రారంభంలోనే మనందరం దేవుని యొక్క పోలికలో  సృష్టించబడ్డాము, దేవుని యొక్క శ్వాసను, సుగుణాలను, పవిత్రమ పొందుకున్నాం కాని పాపం చేయటం ద్వారా మనలో పవిత్రత తగ్గిపోయినది. 

దేవుడు మానవుని యొక్క ఆలోచనలకు అందని వారు (Transcendent God) మానవుని యొక్క జ్ఞానంతో అర్ధం చేసుకోవటం కష్టం కానీ దేవుడు మాత్రము తనమ తాను మానవాళికి బయలు పరుచుకున్నారు.  మానవుల మధ్య దేవుడు సంచరించారు. వారితో కలిసి ప్రయాణం చేస్తూ దేవుడు తన యొక్క పవిత్రతను, ప్రేమను, దయను... వ్యక్త పరిచారు.

 

మానవులు దేవుడిని స్తుతించి, ఆరాధించి, ప్రేమించి జీవించుటయే కాదు చేయవలసినది దేవుని యొక్క పవిత్రతలో పాలు పంచుకొని జీవించాలి. పవిత్రత అంటే కేవలం ప్రార్ధించుట, నియమాలను తు చ తప్పకుండా పాటించుట కాదు అలాగే ఎక్కువ సేపు దేవాలయంలో గడుపుట కాదు. పవిత్రత అంటే స్వార్ధం లేకుండా జీవించుట, నిస్వార్ధ ప్రేమను వ్యక్తపరచటం, ఇతరులను క్షమించుట, దేవునితో మానవునితో సంబందం కలిగి జీవించుట. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క జీవితంను ఈ లోకంలో జీవించుటయే.

దేవుని యొక్క స్వభావం పవిత్రత కాబట్టి జాతిగా నం ప్రభువులుగా జీవించాలి. ఆయన పవిత్రత అనగా అనంత ప్రేమను చూపించుటయే, అందరి యెడల ఆదరణను, దయను, మంచితనమును ప్రదరించుటయే.

దేవుడు యిస్రాయేలును పవిత్రంగా వుండుటకు పిలిచారు. ఒక పవిత్ర జాతిగా జీవించాలని పిలుస్తున్నారు. ( నిర్గమ 19:6)

రెండవదిగా పొరుగు వాని మీద ద్వేషము పెట్టుకోవద్దు అని తెలుపుచున్నారు. ఎవరైనా మనకు హాని చేసినా మనం ద్వేషంను కలిగి వుంటాం అలాంటి సందర్భాలలో మనం వారిని మందలించాలి  అని తెలుపుచున్నారు. 

అంటే వారితో సఖ్యపడమని అర్ధం. సాధారణంగా ఎదుటివారు  మన యెడల తప్పిదాలు చేసిన యెడల వారిని మనం మన్నించాలి. మనలో ఉన్న ద్వేషం మనం పాపం చేసేలా దోహదపడుతుంది. 

మూడవది పొరుగువాని మీద పగతీర్చుకొనకుడు అని ప్రభువు తెలుపుచున్నారు.  అప్పటి కాలంలో ఇతర జాతుల మధ్య ప్రతీకారం చాలా క్రూరంగా ఉండేది. ఒక జాతికి చెందినవారు వేరొక జాతికి చెందినవానికి ఎటువంటిదైనా ముప్పు కానీ హాని కానీ అన్యాయం కానీ తలపెట్టినట్లైతే అప్పుడు వెంటనే రెండవ జాతి వారంతా మొదటి జాతి మీద పగతీర్చుకునే వారు. వారిని దారుణంగా చంపివేసేవారు. చేసిన హాని కన్నా ప్రతీకారం ఎక్కువగా జరుగుతుండేది. 

ఒకరు చేసిన తప్పిదం వాళ్ళ అక్కడి ప్రజలందరూ శిక్షను అనుభవించేవారు. అందుకే మోషే చట్టం ప్రతీకారంను చాలా వరకు పరిమితం చేసింది. మోషే చట్టప్రకారం కీడు చేసిన వానికి మాత్రమే ప్రతిక్రియ చేయవచ్చును గాక వేరే వారికి కాదు. చేసిన కీడుకంటే ప్రతిక్రియ ఎక్కువ ఉండకూడదు. యిస్రాయేలు ప్రజలు మిగతా వారికన్నా పవిత్రులుగా ఉండాలని అనుకున్నారు. అందుకే ఇవి భోదించారు. ఈనాటి మొదటి పఠన సారాంశం మనం దైవప్రేమను కలిగి పవిత్రంగా జీవించాలని అదేవిధంగా సోదర ప్రేమ కలిగి అందరితో స్నేహ భావంతో మెలగాలని తెలుపుచున్నాయి. 

ఈ మొదటి పఠనం ప్రతీకారాన్ని రద్దు చేస్తుంది. అందుకే శత్రువులకు సహాయం చేయుమని తెలుపుచున్నది (సామె 24 : 29 , 25 : 21) . కాబట్టి ప్రేమతో, దయతో జీవిస్తూ పవిత్రంగా ఉండాలి.   

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు మనందరం దేవుని యొక్క ఆలయమని తెలుపుచున్నారు. మనందరి యొక్క శరీరములు దేవునికి నివాస స్థలమని భోదించారు. దేవుడు నీవిసించే స్థలం పవిత్రంగా ఉండాలి కాబట్టి మన హృదయాలను, శరీరములను పవిత్రంగా వుంచమని పౌలు గారు తెలుపుచున్నారు. 

పౌలు గారు కొరింతులో ప్రసంగించే సందర్భములో అక్కడ అనేక విభజనలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఐక్యంగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక అని తెలిపారు.

మీరు దేవుని ఆలయం అని ఏక వచనంతో ఆయన తెలపలేదు అందరిని కూడా కలిపి చెప్పారు. దేవుని యొక్క ఆలయం ఒకరితో నిర్మితమైనది కాదు, అది ఒక సంఘ నిర్మాణం. అందరు కూడా కలసి ఉండాలి, అందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ నివసించాలి అని తెలుపుచున్నారు. దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి అన్నదియే పౌలుగారి యొక్క కోరిక. 

మనలో వసించే దేవుని యొక్క ఆత్మ మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం పవిత్రంగా జీవించుటకు పవిత్రాత్మ మనకు వరములను దయచేస్తారు. అదేవిధంగా మన యొక్క శరీరములను పవిత్రంగా ఉంచుకోవాలి శారీరక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు మనం పాపంలో పడిపోకుండా నైతిక విలువలను కలిగి మనం జీవించాలి. 

మన యొక్క శరీరంను మాత్రమే పవిత్రంగా ఉంచుటకు మాత్రమే కాదు మిగతా వారి యొక్క శరీరములను కూడా గౌరవించాలి. ఎందుకంటే వారి యొక్క శరీరములు కూడా పవిత్రమైనవియే.  ప్రతి ఒక్కరు కూడా దేహమును దేవుని నివాస స్థలమని గుర్తించి శరీరమును పవిత్రంగా ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.

ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు కొండమీద చెప్పిన విలువైన ప్రసంగం గురించి చదువుకున్నాం. ఈ యొక్క సువిశేష భాగం చాలా విలువైనది మానవ ఆలోచనలకు భిన్నమైనది. ఒక విధంగా చెప్పాలంటే యేసుప్రభువు అహింసను గురించి తెలుపుచున్నారు. పవిత్రంగా జీవించుటకు కొన్ని సూత్రాలు యేసుప్రభువు తెలియజేస్తున్నారు. 

యేసుప్రభువు ప్రకారం క్రైస్తవ జీవితంలో పగ తీర్చుకొనుట ఉండకూడదు. యేసుప్రభువు తనను వెంబడించే ప్రజల జీవితాలు ఈ లోక ఆలోచనలకు బిన్నంగా వుండాలని తెలిపారు. 

కీడును మేలును జయించాలని తెలిపారు (ఆది 44:4, సామెత 17:13,  1 పేతురు 3:9). మనకు కీడు తలపెట్టిన వారికి  సైతము యేసుప్రభువు మేలు చేయమని కోరుచున్నారు. మానవ స్వాభావంతో ఆలోచిస్తే ఇది కష్టం ఎందుకంటే మనకి అపాయం తలపెట్టిన వారిమీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలి అని మనం ఎదురు చూస్తాం.ఈనాటి సువిశేషం ద్వారా దేవుడు తెలిపే అంశం ఏమిటంటే మన జీవితం ప్రేమించే జీవితంలా, క్షమించే జీవితంలా బిన్నంగా వుండాలని ప్రభువు తెలిపారు. 

మానవ ప్రయత్నంతో ఇది అసాధ్యం కానీ దైవ సహాయంతో ఇది సాధ్యపడును (లూకా – 1:37). కంటికి కన్ను పంటికి పన్ను అనే అంశం అర్ధం చేసుకోవాలంటే పాత నిబంధన గ్రంథ బోధనను శాసనమును మనం పరిశీలించాలి ( నిర్గమ 21:23-25,  లేవి 24:20,  ద్వితియో 19:21).

ఈ వచనాలు ప్రతీకారం తీర్చుకోమని చెబుతున్నాయి కానీ కేవలం హాని తలపెట్టిన వ్యక్తికి మాత్రమే హాని చేయవచ్చు అని, అయితే అందరికి హాని తలపెట్టాలన్నది ఈ శాసనం యొక్క ఉద్దేశం కాదు.

పవిత్ర గ్రంధంలో యెసబేలు రాణి, హేరోదియా ఇంకా కొంతమంది పొరుగువారి మీద పగతీర్చుకున్నారు కానీ వారు  సంతోషంగా లేరు. కంటికి కన్ను పంటికి పన్ను అంటే పగతీర్చుకోవటం, ప్రతీకారం తీర్చుకోవటమే. దాని వలన మానవ సంబంధాలు, రక్త సంబంధాలు  కోల్పోతారు. ఇది ప్రభువు యొక్క ఉద్దేశం కాదు అందుకనే కీడును సైతం మేలుతో జయించామన్నారు. అలాగే దేవుని శాసనం ఏమిటానంటే మానవులు తమ పొరుగువారి యెడల దయను కలిగి జీవించుట. 

సాధారణంగా కుటుంబంలో వున్నా ఒక బిడ్డకు ఎవరైనా హాని చేస్తే లేక ఎవరైనా ఆ బిడ్డను కొడితే ఆ కుటుంబం మొత్తం వెళ్లి గొడవపడతారు. ఇలాంటి సందర్భాలను ప్రభువు ప్రక్కన పెట్టమంటున్నారు. 

దేవుడు శాసనం ఇచ్చినది ఎందుకంటేకేవలం నష్టపోయిన వానికి కొద్దిపాటి న్యాయం జరుగుట కోసమే కానీ అన్న్యాయానికి అన్యాయం చేయమని కాదు. ప్రతీకారం తీర్చుకొనుటకు బదులుగా పొరుగువారిని మనం మన్నించాలి. ప్రభువు అంటున్నారు నీ కుడి చెంప మీద కొట్టినవారికి ఎడమ చెంప చూపించమని ప్రభువు తెలిపారు. సాధారణంగా ఇది అతి కష్టం. ఎవరికి ఇది సాధ్యం. మాములుగా ఒక చెంపమీద కొడితే రెండవ చెంప చూపించటం ఇంకా కష్టం కానీ ప్రభువు అదియే చేయమని తెలిపారు. 

 ఒకని కుడి చెంప మీద కొట్టాలంటే సాధారణంగా మనం చేతి వెనుక బాగంతోనే కొట్టగలంగాని అరచేతితో కొట్టలేం. యూదుల యొక్క చట్టం ప్రకారం చేతి వెనుక భాగంతో ఒకనిని కొట్టడం చాలా అవమానకరం. అరచేతితో కొట్టిన దానికంటే రెట్టింపుగా అవమానకరం దీనిని బట్టి మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే మనకు ఎంతటి అవమానాలు జరిగినా వాటిని సహనంతో భరించాలి. యేసు ప్రభువు మీద ఉమ్ము వేశారు ప్రభువు అన్నింటిని భరించారు. నిజంగా ఈ యొక్క భోధన మనందరికీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ యేసుప్రభువు తన జీవితంలో అనుసరించి మనకు చూపించారు. 

రెండవదిగా యేసుప్రభువు నీ అంగీకొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము అని పలికారు. యూదుల ఆచారం ప్రకారం పై వస్త్రం విలువైనది. ఈ వస్త్రాన్ని రాత్రి పూట కప్పుకోవటానికి కూడా వాడుకుంటారు. విలియం బార్కే గారు అంటారు యూదులు తమ పై వస్త్రమును ఎవరైనా అవసరంలో వున్నా వారికి అప్పుగా ఇవ్వవచ్చు అని. అయితే దానిని మరలా సాయకాయలం వరకల్లా తిరిగి ఇవ్వాలి.  నిర్గమ 22 : 26 -27 .

ఈ యొక్క అంశం యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే మానవుని యొక్క ఆలోచనలు కేవలం తమ యొక్క సంపదలు, ఆస్తిపాస్తులు, వస్త్రాల మీద కాకుండా అడిగిన ప్రతివానికి ఇచ్చే ఉదార స్వభావం కలిగి జీవించమని ప్రభవు తెలిపారు. 

వ్యాజ్యమాడిన వానికి ఇవ్వమని ప్రభువు తెలిపారు. ఇచ్చేవాడు ఎటువంటి తగువులాడకుండా, క్షమిస్తూ, అర్ధం చేసుకొని పొరుగువానికి తన పై వస్త్రము ఇవ్వమని యేసుప్రభువు అన్నారు.

అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకే ఇవ్వమని ప్రభువు తెలిపారు. క్రైస్తవ జీవితమంటేనే ఇవ్వటం. అవసరమైన సందర్భాలలో మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. క్రైస్తవులు అనేవారు అవసరంలో వున్నప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎవరైతే అడిగిన ప్రతి ఒక్కరికి ఉదారంగా ఇస్తారో వారికి మేలు కలుగుతుందని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. కీర్తన 112 : 5 . ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇవ్వాలి. 

మనయొక్క నిత్య నివాసం పరలోకమని గ్రహించి మనం పరలోకంలోకి ప్రవేశించుటకు ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలి. మనం ఇచ్చేది అలాగే చేసే మంచి వ్యక్తిగతంగా ఉండాలి. చాలా సందర్భాలలో మనం అనేక చోట్ల చూస్తాం ఫ్యాన్ మీద ఇచ్చిన వారు పేరు, ద్రాక్షారసపు పాత్ర ఇచ్చిన వారి పేరు అలాగే వివిధ రకాలైన వస్తువులు ఇచ్చేటప్పుడు, సహాయం చేసేటప్పుడు తమ పేర్లు బహిరంగంగా కనపడేలా కొంతమంది కోరుకుంటారు కానీ యేసు ప్రభువు దీనిని ఇష్టపడుటలేదు. అందుకే ప్రభువు అంటారు నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియనివ్వవద్దని  (మత్తయి 6 : 3 ). కాబట్టి మనం చేసే సహాయం వ్యక్తిగతంగా ఉండాలి. 

మన ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి యొక్క గౌరవమును కూడా కాపాడాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో తీసుకునే వారు అవమానాలు భరించవలసి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా సహాయం చేస్తే ఎదుటి వారి యొక్క గౌరవమును కాపాడాలి మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు తప్పనిసరిగా దయచేస్తారు కాబట్టి స్వార్ధంతో కాక నిస్వార్ధంతో ఉదార స్వభావంతో జీవించాలి (లూకా 6:38, 3:10-11, 12:33,  రోమి 12:13,  అపో 20:35).

చివరిగా యేసుప్రభువు శత్రువులను ప్రేమిచామని పలుకుచున్నారు. మనల్ని ప్రేమిచిన వారినే మనం ప్రేమిస్తే మన జీవితంకు ప్రత్యేకత ఏమి లేదని ప్రభువు తెలుపుచున్నారు. నీ పొరుగు వానిని ప్రేమించు అని పలుకుచున్నారు. యూదుల యొక్క ఆలోచన ప్రకారం పొరుగువారు అంటే తోటి యూదుడే, వారి సంఘంకు చెందినవాడు, వారి యొక్క మతమును అనుసరిచేవాడు మాత్రమే. మిగతా వారందరు బయట వారే. నీ పొరుగువారిని ప్రేమించమని అన్నప్పుడు వారు తమ శత్రువులను ద్వేషించవచ్చని భావించారు కానీ యేసు ప్రభువు శత్రువులను ప్రేమించమని కోరారు. ఇది చాలా చాలా కష్టం.

నీ శత్రువులను ప్రేమిచామని అన్నారు దాని అర్ధం ఏమిటంటే అందరిని కూడా ప్రేమించమని కేవలం తోటి యూదులనే కాకుండా అందరి యెడల ప్రేమ కలిగి జీవించమని ప్రభువు తెలిపారు ( 1 పేతురు 2 : 17 ). శత్రువులను ప్రేమించుట అనేది మానవుని యొక్క స్వభావమును వ్యతిరేకం ఎందుకంటే మానవ స్వభావం ఏమిటంటే React అవ్వడం. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనం ఇంకొకటి నేస్తం కాబట్టి మన శత్రువులను ప్రేమించడం అంటే అతి కష్టం. సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉంటాం కానీ యేసుప్రభువు మన శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు. 

ఒక నిజమైన క్రైస్తవుడు తన శత్రువు యెడల సానుభూతి చూపించకపోతే ఆయన ఈ లోకంలో ఏది సాధించినట్లే (లూకా 6 : 36 ).

శత్రువులను ప్రేమించమని ప్రభువు పలుకుచున్నారు కాబట్టి మనస్సులో ఎటువంటి ద్వేషం, అసూయలు, మనస్పర్థలు ఉంచుకోకుండా మన ఎదుటివారిని ప్రేమించాలి. అదేవిధంగా మనల్ని హింసించే వారికోసం ప్రార్ధించమని ప్రభువు పలుకుచున్నారు. మనం మూడింటి కోడం ప్రార్ధించాలి.

1 . హింసించే వారిని దేవుడు మన్నించాలని ప్రార్ధించాలి ( లూకా 23: 34,  అపో 7:60).

2 . హింసించే వాని మధ్య, హింసించబడుతున్న వాని మధ్య సమాధానం ఉండుటకు ప్రార్ధించాలి. 

3 . హింసించే వారు రక్షణ పొందేలాగా వానికొరకు ప్రార్ధించాలి.  

మనం శత్రువుల కొరకు ప్రార్ధిస్తే ఆ ప్రార్ధన మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని ప్రేమిచే ఏ వ్యక్తి అయినా సరే తమ పోరోగువానిని అసహ్యించుకొనడు ( 1 యోహాను 3: 23, 4: 19-21). 

ప్రేమించుట ద్వారా మనం దేవుని బిడ్డలగుచున్నాము. ఎందుకంటే ప్రభువే మీరు పరస్పర ప్రేమ కలిగి జీవించమని కోరుచున్నారు. మనం చూపించే ప్రేమ మనల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఎవ్వరు చూపించని ప్రేమ మనం చూపిస్తే శత్రువులు సైతం మారిపోతారు. యేసయ్య చూపిన ప్రేమ చూసి అనేక మంది మారిపోయారు. క్రైస్తవులను మిగతా వారికన్నా ప్రత్యేకంగా చూపించే అంశమే శత్రువులను ప్రేమించుట. అతి కష్టమైనా కానీ క్రీస్తు ప్రభువు మనల్ని ఇవి పాటించమని కోరారు. ఆయన తన జీవితంలో అక్షరాలా అన్నింటిని పాటించి జీవించారు. మన జీవితంలో యేసు ప్రభువు చెప్పించా మాటలు పాటించి జీవిస్తే మనం పవిత్రులుగా, పరిపూర్ణులుగా చేయబడతాం. 

దేవుడు మనందరం కూడా ఐక్యమత్యంతో  కలిసి వుండాలని కోరుకుంటున్నారు. పగ తీర్చుకోవటం ద్వారా, ద్వేషించుట ద్వారా మనం బంధాలు కోల్పోయి జీవిస్తాము కాబట్టి కీడుకు మేలుకు చేస్తూ, ప్రేమ కలిగి జీవిస్తూ యేసు ప్రభువు వలే మనందరం దేవునికి సాక్షులుగా ఉండాలి. 

మన జీవితం మిగతా వారి యొక్క జీవితాలకన్నా భిన్నంగా ఉండాలంటే ప్రభువు ఈనాడు సువిశేషంలో చెప్పిన విషయాలు పాటించాలి.


FR. BALAYESU OCD

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

 7 వ సామాన్య ఆదివారము

లేవి 19 :1 -2 , 17 -18, 

1 కొరింతి 3 : 16 - 23,  

మత్తయి 5 : 38 - 48

పవిత్ర జీవితానికి ప్రేమ మార్గం


క్రీస్తు నాధుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ నాడు మనమందరము కూడా సామాన్య కాలపు 7 వ ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈ నాటి మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ కూడా దేవునివలె, క్రీస్తు వలే పవిత్రముగా జీవించమని, ప్రేమ మార్గాన్ని అవలంబించమని ఆహ్వానిస్తుంది. 

ఏ విధంగా మనం క్రీస్తు వలే పవిత్రముగా జీవించగలం? ప్రేమ మార్గాన్ని ఈ ప్రస్తుత సమాజంలో మనము అవలంబించగలమన్న సందేహం మనలో కలుగవచ్చు. ఆ సందేహానికి సమాధానంగా ఈ నాటి మూడు పఠనాలు ఉంటున్నాయి. 

ఉపదేశకుడు గ్రంధము 12 : 13 వ వచనంలో చూసినట్లయితే “దేవుని ఆజ్ఞలకు భయపడి అతని ఆజ్ఞలను పాటింపుము. నరుని ప్రధాన ధర్మము ఇదియే”. 

రోమీయులు 13 : 8 - 10  చూసినట్లయితే “ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడి. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోటివారిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము. తోడివారిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 

సిరా 28 : 1 - 7  వచనాలలో చూసినట్లయితే “ప్రభువు నరుని పాపమునెల్ల గమనించును. పగ తీర్చుకొను నరుని మీద అతడు పగ తీర్చుకొనును. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో దేవుడు నీ అపరాధములను మన్నించును”. నీవు తోడి నరుని మీద కూపముగా ఉన్నచో నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లు అడుగగలవు? 

ప్రియ సహోదరులారా, ఈ నాటి మూడు పఠనాలు కూడా మనకు  ఇచ్చే ముఖ్యమైన లేదా ప్రధానమైన సందేశం “పొరుగువారిని ప్రేమింపుము”.

మొదటి పఠనము: “మీ దేవుడును ప్రభుడనైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై యుండుడు”. అని మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇస్రాయిలు ప్రజలు, దేవుడు వారికి ఇచ్చిన పవిత్రతను కోల్పోయారు. దేవుని ప్రేమ నుండి దూరమవుతున్నారు. పరిశుద్ధ గ్రంధములో హోషేయ ప్రవక్త దేవుని ప్రేమను చాలా చక్కగా వర్ణిస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భార్య స్థానంలో ఉంటె, దేవుడు భర్త స్థానంలో ఉంటున్నాడు. దేవుడు మాత్రం తాను చేసిన ఒడంబడికలకు, వాగ్ధానాలకు విశ్వాస పాత్రుడుగా ప్రతి నిత్యము  కాపాడుతూ వస్తున్నారు, అనేక అద్భుతాలు చేస్తున్నారు. కానీ భార్య అయిన ఇశ్రాయేలు ప్రజలు బాలు దేవతలను లేదా అన్య దేవతల వెనుక వెలుతూ విగ్రహములను ఆరాధిస్తున్నారు. అన్య దేవతలను భర్తగా దేవుడి స్థానంలో ఉంచుతున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రులయ్యారు.

అందుకే హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను “వ్యభిచారిణిగా” పరిగణిస్తారు.

అందుకే మొదటి పఠనంలో చూస్తున్నాం “నేను పవిత్రుడను” ఇశ్రాయేలు ప్రజలను కూడా పవిత్రులుగా ఉండమని చెప్పమని ప్రభువు మోషే ప్రవక్త తో పలుకుతున్నారు.

మరి పవిత్రులుగా కావాలంటే ఏమి చేయాలి ? పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిమీద పగ తీర్చుకోకూడదు, వైరము పెట్టుకోకూడదు, ద్వేషము పెట్టుకోకూడదు. 

మనము పొరుగు వారిని ప్రేమిస్తే, దేవుడిని ప్రేమించినవారమవుతాము. 

దేవుని ఆజ్ఞలను పాటించినవారమవుతాం.

ఎందుకంటే ప్రతి మానవుని దేవుడు తన పోలికలో, తన రూపురేఖలలో సృజించెను.  కనుక, మనలోను, పొరుగు వారిలోను దేవుడు ఉన్నాడు.

అందుకే పునీత మథర్ తెరెసా గారు చెబుతారు, అవసరంలో ఉన్నవారిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిలో ప్రభువును చూసేవారు అని చెబుతారు.

మరి మనం కూడా మన సోదరులను, అవసరంలో ఉన్నవారిలోను, ప్రభువుని చూస్తున్నామా, ప్రేమిస్తున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

రెండవ పఠనము 

“మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా?”.

దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము. అని పౌలుగారు అంటున్నారు.

ఆదిఖాండములో మానవ సృష్టి వృత్తాంతమును మనకు తెలుసు, దేవుడు మానవుని తన పోలికలో సృజించెను,దేవుని ఊపిరిని మానవుడిలో ఊదాడు . మానవుడు image of God, likeness of God. 

ఈ image అనే పదమునకు దైవ శాస్త్రంలో చాల ప్రాముఖ్యమైన అర్థము ఉంది. 

image అంటే పోలిక మాత్రమే కాదు. image అంటే holy అని likeness of God అంటే holiness of God “పవిత్రత అని అర్థం”. అని చాలామంది వేదపండితులు చెబుతున్నారు.

అంటే మనలో, లేదా ప్రతి మానవునిలో దైవత్వం ఉంది, దైవత్వం ఉంది అంటే దేవుడే కొలువు దీరి ఉన్నాడు.

అందువలననే మనము పవిత్రులము అయ్యాము. ఎప్పుడైతే మనము పవిత్రముగా జీవిస్తుంటామో, మనలో ఉన్నదా దైవత్వాన్ని ఇతరులకు మన జీవిత విధానంద్వారా వ్యక్త పరుస్తామో, సాక్షాత్తు దేవుడే మన రూపంలో మనద్వారా జీవిస్తున్నారు, మనలో జీవిస్తున్నారు అని అర్థంచేసుకోవాలి.

ఉదాహరణకి : పునీత ఆవిలాపురి తెరేసమ్మగారు చెబుతారు, " దేవాది దేవుడు స్వయానా, మనలో, మన హృదయాంతరంగం అనే కోటలో నివసిస్తున్నారు". అని తన రచనలలో తెలియ పరుస్తారు. కానీ  చాలాసార్లు మనము ఈ పరమార్థాన్ని, మనకున్న బలహీనతల ద్వారా గ్రహించలేకున్నాము. 

ఇంకొక ఉదాహరణకు  దైవశాస్త్ర పండితులందరూ కూడా మరియ తల్లి గర్భాన్ని పవిత్రమైన దేవాలయముగా సంభోదిస్తారు. ఎందుకంటే ఆమే సాక్షాత్తు దేవుని కుమారుని, పవిత్ర మూర్తి అయినా యేసు ప్రభుని తన గర్భములో మోసింది. ఇది మన క్రైస్తవ విశ్వాసముకూడాను.

సోలోమోను మహా రాజు కూడా దేవాది దేవుడికి ఒక పవిత్రమైన దేవాలయాన్ని ఎన్నో నియమ నిభంధనలతో, పవిత్రమైన వస్తువులతో, అందమైన వస్తువులతో, దేవాలయాన్ని నిర్మిస్తారు.

దేవాది దేవుడు పరమ పవిత్రుడు. మరి ప్రతి నిత్యమూ కూడా మన హృదయమనెడు దేవాలయములో నివసిస్తున్నారు. 

మరి మన హృదయమనెడి ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

కొన్ని సార్లు మన చెడు జీవితం ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, మన హృదయమనెడు ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాం.

ఈ ఆలయములో దేవుడికాక, లోకపు ఆలోచనలకూ, ఆస్తి అంతస్తులకు, పేరు ప్రఖ్యాతలు, కోపం ద్వేషం, క్రోధం, మోహం, వ్యభిచారం, అసూయా, పగ, స్వార్థం అనే సాతాను పనులకు, ఆలోచనలకూ స్థానమిచ్చి, మన హృదయాన్ని వాటితో నింపివేసాము. దేవుడిని, అంటే దేవుడి ఆలోచనలను, ప్రేమ, దయ, కరుణ, క్షమా, మర్యాద, సోదర ప్రేమ, అనేది దైవ కార్యాలను, దైవ వ్యక్తుత్వాన్ని మనం గమనించకుండా, దేవునికి దూరంగా ఉంటున్నాం. మన హృదయమనే ఆలయాన్ని నాశనం చేస్తున్నాం, మోసపోతున్నాం. అందుకే ఈ నాడు రెండవ పఠనం ద్వారా పునీత పౌలుగారు మనందరినీ మోసపోవద్దు అని హెచ్చరిస్తున్నారు.

దేవుని ఆలయము ఎప్పుడుకూడా  పవిత్రంగా ఉంటుంది. పవిత్రముగా ఉంటె ప్రేమ ఉంటుంది. కాబట్టి దేవుని ఆలయము చెడు ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో ఉండకూడదు.

అందుకే క్రీస్తు ప్రభువుకూడా, దేవాలయములో అన్యాయపు వ్యాపారం చేస్తున్నప్పుడు, ఇతర చెడు కార్యాలను చేస్తున్నప్పుడు , అందరినికూడా దేవాలయమునుండి బయటికి తరిమికొట్టారు.

అలాగే మనంకూడా మన హృదయములో ఉన్నటువంటి మలినాన్ని, చెడును అంతటిని కూడా తరిమికొట్టాలి, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి.

సువిశేష పఠనము 

ఈ నాడు క్రీస్తు ప్రభువు, మానవుడు ఏర్పరిచిన నియమ నిభందనలకన్నా, మానవత్వపు విలువలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

సువిశేష పఠనంలో చుస్తే క్రీస్తు ప్రభువు ఒక నూతన సిద్దాంతాన్ని తన శిష్యులకు తెలియచేస్తున్నారు.

43. వ వచనం చూస్తున్నాం “నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము”. అను ఈ సిద్దాంతం ముగించింది. ఇప్పుడు నూతన సిద్దాంతాన్ని పాటించండి అని కోరుతున్నారు. అదియే,  “మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారికొరకు ప్రార్థింపుడు”.

46, 47 వచనాలు చూస్తే మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? అని పలుకుతున్నారు.

ఉపకారికి, ఉపకారం చేయడం కన్నా, అపకారికి ఉపకారం చేయడంలోనే గొప్పతనం ఉందని మనకు అర్థమవుతుంది.

అంతేకాక దేవుడు తన ప్రేమను అందరికీ సమానంగా పంచుతారు, అందరిని  ఒకే విధంగా దీవిస్తారు. 

కానీ మనం మాత్రం, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మనకు మేలుచేసినవారికి మాత్రమే, మేలుచేస్తాము, లేదంటే మనకు పడనివారితో భందం ఉండదు.వారిని ద్వేషిస్తాము. మనము ఎప్పుడు కూడా పగలతో, ద్వేషాలతో, కులభేదాలు, మతాల పేరుమీద చాల వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు చూపిస్తుంటాము. 

క్రీస్తు ప్రభువు తన జీవితంలో, తానూ శ్రమలను అనుభవించినాకూడా, తనని దూషించినాకూడా, మొఖము మీద ఉమ్మివేసినాకూడా , వారందరిని క్షమించారు.

సమాజంలో అంటరానివారిని, సమాజంనుండి వెలివేయబడిన వారిని, యూదులు తిరస్కరించినవారిని , పాపాత్ములను, సుంకరులను, ద్రోహులను, కుష్ఠిరోగులను అందరినికూడా  ప్రేమించారు, క్షమిచ్చారు, సేవలందించారు, అద్భుతాలు, స్వస్థతలు చేసారు.

ఆయన నడిచిన ప్రేమ మార్గాన్ని మనకు భోదించారు.

సోదరుని లేదా పొరుగు వారిని నిరాకరించిన వారిని దేవుడు కూడా నిరాకరిస్తారు.

ఉదాహరణకి పైన చెప్పిన వచనాలలో మనకి అర్థమవుతుంది. ఉపదేశకుడు గ్రంధము 12 : 13, రోమీయులు 13 : 8 - 10, సిరా 28 : 1 - 7.

ఉదాహరణకి 

ధనికుడు లాజరుని నిరాకరించారు, ప్రేమిచలేదు, గమనించలేదు. అందువలననే దేవుని రాజ్యాన్ని కోల్పోయారు.

కైను తన సోదరుడు ఆబేలుని  అసూయతో నిరాకరించాడు, కావున దేవుడు కైనును తాను అర్పించిన అర్పణలనుకూడా నిరాకరించారు.

యోసేపును తన అన్నలు నిరాకరించారు, అందుకు గాను దేవుడి ప్రణాళిక ప్రకారం వారిని బానిసలూ చేసారు. 

క్రీస్తుప్రభువు భోదనలలో కూడా చూస్తున్నాం, ఎవరేని ఈ అత్యల్పులలో ఈ ఒక్కరిని మేలుచేసిన యెడల అది నాకు చేసినట్లే, చేయని యెడల అది నాకును చేయనట్లే అని పలికారు. 

మనము ఏ కొలతతో ఇతరులను కొలుస్తామొ అదే కొలతతో కొలవబడుతాము అని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియ చేస్తోంది.

కావున మనంకూడా మన ముందున్నటువంటి సోదరులను, పొరుగు వారిని , గ్రహించలేకపోతే, ప్రేమించలేకపోతే, క్షమించలేక పొతే, దేవుడు కూడా మనలను నిరాకరిస్తారు, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము.

కాబట్టి మనందరమూ కూడా మానసోదరులను, పొరుగు వారిని ప్రేమించి, క్షమించి,  దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు  పొందడానికి ప్రయాస పడుదాం.


Bro. సుభాష్ OCD


11, ఫిబ్రవరి 2023, శనివారం

 

సామాన్య ఆరవ ఆదివారం

సిరాకు 15:15-20

1  కొరింతి 2:6-10

మత్తయి 5:17-37


ఈనాటి దివ్య పఠనాలు మానవులు తమ యొక్క జీవితంలో స్వేచ్ఛ వలన ఎంపిక చేసుకునే విషయాల గురించి బోధిస్తున్నాయి.

మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చారు, తన యొక్క స్వేచ్ఛలో ఏది మంచిదో, ఏది చెడో  తెలుసుకొని సరియైనది ఎంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ప్రధానమైన అంశం ''ఎంపిక చేసుకోవటం'' ఏది ఎన్నుకోవాలో అనే అంశాల గురించి చెప్పుతూ ఉన్నవి.

చాలా సందర్భాలలో స్వేచ్ఛనిచ్చినప్పుడు, దానిని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు, దాని ప్రతిఫలంగా బాధను అనుభవించవలసి వస్తుంది.

ఈనాటి మొదటి పఠనం లో  రచయిత 'మనిషి స్వేచ్ఛ జీవి' అనే తెలియజేస్తున్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో తాము అనుదినం తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రధానమైనవి.

మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛలో ఎటువంటి సరియైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే అంశం గురించి ఈనాడు సిరాకు గ్రంథ రచయిత మనకు తెలియజేస్తున్నారు.

ఈ మొదటి పఠన ప్రారంభ వచనంలో ఈ విధంగా అంటున్నారు, నీవు కోరుకుందు వేని ప్రభువు ఆజ్ఞలు పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెనో  లేదో నిర్ణయించునది నీవే సిరాకు 15:15 అని అంటున్నారు.

దేవుడు మనిషికే తన స్వేచ్ఛలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు, ఎంపిక చేసుకునే అనుమతి ఇచ్చారు. దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛలో రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నో విషయాలను ఎంచుకుంటా 

- ఎక్కడ చదవాలో ఎన్నుకుంటాం.

- ఎవరిని వివాహం చేసుకోవాలో దానిని ఎంచుకుంటాం.

ఎలాంటి వ్యాపారం చేయాలో 

- ఎలాంటి ఉద్యోగం చేయాలో,

ఎవరిని అనుసరించాలో

ఎలాంటి జీవితం జీవించాలో

- ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలో, ఎలాంటి దుస్తులు, ఎలాంటి మొబైల్స్, వస్తువులు కావాలో అనేవి మనం ఎంపిక చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంది.

మనకు ఇవ్వబడిన స్వేచ్ఛలో, మనం తీసుకునే నిర్ణయాలు సరి అయినవి అయితే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు చెడ్డవి తప్పిడివి అయితే అవి మనకు కీడు కలుగుతుంది.

మనం ఇవ్వబడిన స్వేచ్ఛలో తీసుకునే నిర్ణయం మనం ఎంచుకునే విషయాలు మన జీవితాలను మన యొక్క భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తాయి.

పవిత్ర గ్రంథంలో ఉన్న ఆదాము, అవ్వ తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో సరియైన నిర్ణయం ఎంపిక తీసుకోలేకపోయారు.

దేవుడివారికి ఏదెను  తోటలో స్వేచ్ఛనిచ్చారు కానీ వారు తమకు ఇవ్వబడిన స్వేచ్ఛలో వక్ర  మార్గమును, దేవునికి ఇష్టం లేని మార్గం ఎంచుకున్నారు, దాని ప్రతిఫలంగా వారి జీవితంలో దేవుడితో ఉన్న స్నేహ సంబంధం కోల్పోయారు, వారు ఎంచుకున్న విధానం బట్టి వారు శిక్షను అనుభవించారు, పాపం చేశారు అప్పటివరకు దేవునితో నడిచిన వారు దేవునికి మొఖం కూడా చూపించలేక దాక్కున్నారు, వారి జీవితం కష్టాల పాలయింది.

ఒకవేళ సైతాను వారిని ప్రేరేపించినప్పుడు సరియైన మార్గం ఎంచుకుంటే ఈరోజు మన యొక్క జీవిత విధానం ఇంకొక విధంగా ఉండేది,  అందుకనే రచయిత తెలిపే విషయం ఏమిటంటే దేవుడే మనకు స్వేచ్చనిస్తున్నారు, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలో లేక పాటించవద్దు అని, కాబట్టి మనం ఎలాంటి ఎంపికను చేసుకుంటున్నాం.

స్వేచ్ఛ జీవులమైన మనం దేవుని యొక్క మార్గమును ఎంచుకోవాలి, దేవుని యొక్క మార్గమును ఎంచుకొని ఆయన యొక్క ధర్మ శాస్త్రాను సారం జీవించాలి.

కీర్తన 119:1-2 దేవుని యొక్క ఆజ్ఞలు పాటించువారు ధన్యులు అని తెలుపుచున్నారు, ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ప్రతిఫలం గురించి తెలుపుచున్నాయి. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించి జీవిస్తే మనందరం కూడా ఒక పుణ్య జీవితం జీవించవచ్చు ఈ భూలోకం పరలోకం గా మారుతుంది.

16వ వచనంలో రచయిత అంటున్నారు, ప్రభువు నిప్పును నేలను కూడా మీ ముందు ఉంచెను అని.

నిప్పు దేవుని యొక్క సాన్నిధ్యమునకు గుర్తు, అలాగే నిప్పు కూడా దేవుని యొక్క శిక్షకు గుర్తు, ఈ సందర్భంలో నిప్పు దేవిని యొక్క శిక్షను సూచిస్తుంది. నీరు దేవుని యొక్క బహుమానం ఆశీర్వాదానికి గుర్తు కాబట్టి ప్రభువు యొక్క ఆజ్ఞలు పాటించేవారు దేవుని యొక్క మంచి బహుమానం పొందుతారు.

దేవుని యొక్క విజ్ఞానము అనంతమైనది, ఆయన అన్నింటినీ పరిశీలించెను. మానవులు చేసే ప్రతి కార్యము దేవుడు పరిశీలిస్తారు, ఆనాటి ప్రజల్లో వివిధ రకాలైన భిన్న ఆలోచనలు ఉండేవి ఎందుకంటే అప్పటి గ్రీసు దేశపు సంప్రదాయం ప్రభావం (helenistic culture) ఎక్కువగా ఉండేది, వారు నమ్మిన అంశం ఏమిటంటే దేవుడి కేవలం బయట కార్యాలే చూస్తారు, అంతరంగికంగా చూడరు అని నమ్మేవారు, అలాగే దేవుడు మానవుల్ని పాపం చేయడానికి ఆజ్ఞాపిస్తారు, అనే తప్పుడు ఆలోచనలు ఉండేవి అవి అన్నింటినీ కూడా రచయిత సరి చేస్తున్నారు.

దేవుడు మానవుల యొక్క బాహ్య అంతరంగీకా కార్యాలు ఆలోచనలు అనే పరిశీలిస్తారు. అదేవిధంగా దేవుడు ఎవరిని కూడా పాపం చేయమని ఆజ్ఞాపించడు అని తెలిపారు, దేవుని పట్ల భయభక్తులు చూపే వారిని ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాం ఎలాంటి నిర్ణయాలు ఎంపికలు చేసుకుంటున్నాం అని ధ్యానం చేసుకోవాలి.

మనం మంచిని ఎంచుకుంటే దేవుని బహుమానం వస్తుంది, చెడును ఎన్నుకుంటే శిక్ష వస్తుంది, కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. మనం బహుమానం పొందాలన్నదే దేవుని యొక్క కోరిక ద్వితీయో 11:26-28 కాబట్టి సరియైన మార్గం ను ఎంచుకొని దేవుని దీవెనలు పొందుదాం.

దేవుడు ఎవరిని ఒత్తిడి చేయరు, ఆయన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు, అందుకే తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాలి అన్నప్పుడు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి మనం ఎలాంటి మార్గం, నిర్ణయాలు, ఎంపికలు చేసుకుంటున్నాం అనే అంశం ధ్యానించాలి.

మనం చేసుకొనే ఎంపిక మనల్ని దేవునికి దగ్గరగా చేర్చుతుందా లేక దూరం చేస్తుందా? మంచినీ ఎంచుకుంటే సంతోషం ను పొందుతాం. 

ఈనాటి రెండవ పట్టణంలో పౌలు గారు ఈ లోక సంబంధమైన జ్ఞానం కు, అదే విధంగా దైవ జ్ఞానం కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలుపుచున్నారు.

పౌలు గారు మనందరం కూడా దైవ జ్ఞానంను అలవర్చుకొని జీవించాలి అని తెలుపుచున్నారు, మనం దేవుని యొక్క ఆత్మను పొందిన తరువాత దైవ జ్ఞానం మనల్ని దేవుని వైపుకు నడిపిస్తుంది దేవుని స్తుతించేలా చేస్తుంది.

ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన లోక పాలకులు చాలా సందర్భాలలో హాని చేస్తారు, అందుకే దేవుని యొక్క జ్ఞానం కలిగి జీవించాలి, అప్పుడు మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అని పౌలు గారు తెలిపారు.

దైవ జ్ఞానం పొందాలంటే దేవుని యొక్క ఆత్మ యొక్క సహకారం కావాలి.

ఈనాటి సువిశేష పట్టణంలో ఏసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం గురించి చదువుకున్నాం.

ఏసుప్రభు అష్ట భాగ్యాలను బోధించిన ప్రతి కాలంలో చట్టపరమైన ఆరువ దేశాల గురించి తెలియజేశారు యూదులకు దేవుడిచ్చిన చట్టం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి.

యూదుల ధర్మ శాస్త్రం కు నాలుగు రకాలైన అర్థాలు ఉన్నాయి:

1. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క పది ఆజ్ఞలు.

2. పవిత్ర గ్రంథంలో ఉన్న మొదటి ఐదు గ్రంథాలు.

3. పాత నిబంధన గ్రంథం దీనినే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని పిలిచేవారు.

4. ధర్మశాస్త్ర బోధకుల చట్టం వీటన్నిటికీ కూడా ధర్మశాస్త్రము అనే నామం వర్తిస్తుంది.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పరిచర్య జీవితంలో మూడవ దానిని సంపూర్ణంగా నెరవేర్చారు. నాలుగవ దానిని ప్రభువు రద్దు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకుల చట్టం అనేక నియమాలతో కట్టడాలతో కూడుకొని ఉన్నది.

అనేక రకాలైన కట్టడాలను నిబంధనలను పాటించాలని ప్రజలపై భారం మోపారు, లెక్కకు మిక్కుటం లేని కట్టడాలతో జీవితాన్ని దుర్భారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే తోటి సోదరుడి కంటే ధర్మశాస్త్ర బోధకులు నియమ నిబంధనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవించారు.

ధర్మశాస్త్రము తూ;చా తప్పకుండా పాటిస్తే పరిపూర్ణత సాధించినట్లే అని, అపోహ కలిగి జీవించేవారు అందుకే ధర్మశాస్త్రముకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, ఏసుప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చుట కొరకే, ధర్మశాస్త్రము యొక్క పరమార్థం ను యేసు ప్రభువు సంపూర్ణంగా వివరిస్తున్నారు, ఒక దేవుని యొక్క ఏకైక కుమారునిగా యేసు ప్రభువు తండ్రిని గురించి తండ్రి ప్రేమ గురించి పవిత్రాత్మ సహాయం గురించి దైవ ప్రణాళికల గురించి తెలియజేశారు.

ఏసుప్రభువు రాకముందు ఈ యొక్క ధర్మ శాస్త్ర కేవలం ఒక నియమంక మాటగా మాత్రమే ఉండేది కానీ తరువాత ఏసుప్రభువు యొక్క రాకతో ధర్మశాస్త్రంకు జీవం పరిపూర్ణత వచ్చినది ఏసు ప్రభువు దైవ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చారు.

ఏసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం నేర్పిన విషయం ఏమిటంటే కేవలం నియమం పాటిస్తే చాలు జీవితం ధన్యమవుతుంది అని, కానీ క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం కేవలం నామకార్థం కు పాటించడం కు బదులుగా ఒక మంచి నిజాయితీ కలిగిన జీవితం ధర్మశాస్త్రం పాటించుట ద్వారా రావాలి అని తెలిపారు.

అప్పటి యూదుల మాటలు క్రియలు భిన్నంగా ఉండేవి అందుకే ఏసుప్రభు ధర్మశాస్త్రం పాటించే వారికి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలని తెలిపారు.

ధర్మ శాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని ఏసుప్రభువు ప్రేమతో తన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా నెరవేర్చారు.

ప్రభువు మన నుండి కోరుకునేది ఒక మంచి జీవితం, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతి వంతమైన జీవితం జీవించాలి, చాలా సందర్భాలలో మన నియమా నిబంధనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, కానీ మనుషులను మరిచిపోతాం, ధర్మశాస్త్రం పాటించేవారు తప్పనిసరిగా సోదర ప్రేమ దైవ మనస్తత్వం కలిగి జీవించాలి.

ధర్మ శాస్త్రం ఇవ్వబడినది మనిషి దేవుని ప్రణాళికలు తెలుసుకొంటూ పవిత్ర జీవితం జీవిస్తూ దేవుని యొక్క మార్గమును పుణ్యక్రియలను అనుసరించాలన్న ఉద్దేశం కొరకే మనం మంచిగా జీవిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం.

ఏసుప్రభు నరహత్య చేయరాదు అదే  విధంగా సోదరుడిని వ్యర్థుడా అనేవాడు నరకాగ్నిలోనికి పంపబడతాడు అని తెలుపుచున్నారు, అలాగే మన సోదరుల మీద కోపబడితే తీర్పుకు గురి అవుతాం అని తెలిపారు.

మానవ జీవితంలో కోపపడటం సహజం, కానీ ఆ కోపం మనిషిని పాపంలోనికి నడిపించకూడదు అనే ఏసుప్రభువు తెలుపుచున్నారు.

మన పొరుగు వారిని చంపకున్నంత మాత్రాన సరిపోదు, అతనిని ద్వేషించకూడదు, చులకనగా చూడకూడదు, తగువులాడకూడదు, వారికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. సోదర ప్రేమ ఉంటే సమస్తము సాధ్యమవుతుంది, యేసుప్రభు కోప పడ్డారు, ఆయన యొక్క కోపం మంచి కొరకే మనం కూడా కోపబడే సందర్భంలో మంచి ఆశించే కోప పడాలి.

ప్రస్తుత కాలంలో మనం చాలామందిని శరీరకంగా చంపకపోయినా, మన యొక్క మాటలు, క్రియల  ద్వారా మానసికంగా చంపుతూనే ఉంటాం అలాంటివి మానుకోవాలి.

సోదరులతో మనస్పార్ధాలు ఉన్నప్పుడు మనం వెళ్లి సంఖ్య పడాలి. సంఖ్య  పడుటయే దేవుడు కోరుకునేది, అదే విధంగా ఏసు ప్రభువు వ్యభిచారించవద్దు అని పలికారు, ఒట్టు పెట్టుకోకూడదు అని తెలిపారు. మన యొక్క జీవితంలో శరీరకంగా అనేకసార్లు శోధించబడతాం. ఆ శోధనలో కొంతమంది పడిపోతుంటారు, మన యొక్క కార్యాలే కాకుండా మన యొక్క తలంపులు కూడా చాలా ముఖ్యం కాబట్టి మన ముఖ్యంగా మన యొక్క చూపులను, తలంపులను, హృదయం  పవిత్రంగా ఉంచుకోవాలి.

ఈనాటి సువిశేశం  లో  యేసు ప్రభువు చెప్పిన ప్రతి అంశంలో మనిషి యొక్క స్వేచ్ఛ గురించి చెప్పబడింది, తన స్వేచ్ఛలో దేవుడు మార్గాలను ప్రణాళికలను ఎంచుకుంటున్నారా? లేక వేరొక మార్గమును ఎంచుకుంటున్నారా అన్నది అందరూ ధ్యానించుకొని జీవించాలి.

దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛ మంచిని ఎంపిక చేసుకుని దేవుని సంతోషపరిచే జీవితం జీవించుదాం . ఈ నాటి దివ్య పఠనాలు మనకు ఒక సవాలు లాంటివి, ఎందుకంటే మన స్వేచ్ఛలో మనం ఎంత మాత్రం మంచినీ ఎంచుకుంటున్నాం ఎంత మాత్రం దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నాం మన యొక్క సరియైన ఎంపికలు ద్వారా దేవునికి దగ్గరవుతున్నామా అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి.


FR. BALAYESU OCD

4, ఫిబ్రవరి 2023, శనివారం

 

ఐదోవ సామాన్య ఆదివారం

యెషయా 58:7-10

1 కొరింతి 2:1-5

మత్తయి 5:13-16

ఈనాటి దివ్య పఠనాలు  క్రైస్తవ జీవితం అనేది ఇతరులకు సహాయం చేసే జీవితం లాగా ఉండాలి అని బోధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉండేవారు సహాయం చేస్తూ జీవించాలి. సృష్టి ప్రారంభం నుండి ఒకరికొకరు సహాయం చేసుకొని జీవించాలన్నది దైవ ప్రణాళిక. ఆదాముకు సహాయం చేయుటకు దేవుడు ఏవమ్మను సృష్టించి తనకు తోడుగా చేశారు.

ప్రభువును విశ్వసించే విశ్వాసులు తమ యొక్క అనుదిన జీవితంలో స్వార్థంతో జీవించకుండా తమకు ఉన్నదానితో నలుగురికి సహాయం చేస్తూ సోదర ప్రేమను వ్యక్తపరుస్తూ జీవించాలి.

మన యొక్క బోధన విశ్వాస జీవితం, కేవలం మాటల్లోనే కాకుండా చేతుల్లో చూపించాలి. అనగా విశ్వాసం మన యొక్క క్రియల ద్వారా నిరూపించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినది, ఉన్నతులను చేసినది, ఆ యొక్క సిరి సంపదలతో ఇతరులకు సహాయం చేయుట కోసమే.

ఈనాటి మొదటి పఠనంలో  యెషయా ప్రవక్త ఉపవాసం యొక్క ప్రతిఫలం ఏవిధంగా ఉండాలి అని తెలియజేశారు, దేవుడు కోరుకునే ఉపవాసం ఏవిధంగా ఉండాలో యెషయా  ప్రవక్త తెలిపారు.

ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాసం ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు యేరుషలేము నగరాన్ని పునర్నిర్మించుకున్నారు, అయితే వారి యొక్క నిర్మాణం చాలా ఆలస్యంగా జరిగింది అదేవిధంగా ఎందుకు దాదాపు 50 సంవత్సరాల ప్రవాసం జీవితంలోకి దేవుడు వారిని పంపించారు అని ఇశ్రాయేలీయులు ఆలోచించుకునే సందర్భంలో యెషయా ప్రవక్త ఈ విధంగా తెలుపుతున్నారు. దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఇతరులతో పంచుకోకపోవటమే మీయొక్క దృష్టితికి కారణం అని తెలిపారు. అదే విధంగా తమను తన సొంత బిడ్డలుగా ఎన్నుకొని, దేవుని యెడల విశ్వాసనీయతను చూపనందుకు తమ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవటమే ఎంతటి కఠినమైన స్థితికి కారణం అని తెలిపారు.

ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త దేవుడు కోరే ఉపవాసం గురించి తెలుపుచున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం చేశారన్నది కాకుండా ఏ విధంగా, ఎలాంటి హృదయంతో ఉపవాసం చేసాము అన్నది ముఖ్యము.

వాస్తవానికి ఈనాటి మొదటి పఠనం మనందరికీ ఒక సవాలు లాంటిది, ఎందుకంటే మనకు ఉన్నది ఇతరులతో పంచుకోవటం చాలామందికి కష్టం, ఉపవాసం చేసే సందర్భంలో మొట్టమొదటిగా దేవుడు చేయమని కోరిన పని ఏమిటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో  వారికి ఆహారం సగమని ప్రభువు తెలిపారు. మనం ఏదైతే మిగిల్చామో, త్యాగం చేసామో అది ఇతరులకు మేలు చేసేలా ఉండాలి అని దేవుడు తెలియజేశారు.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం ఒక పెద్ద వరం వారు దీవించబడతారు, సారెఫేతులో ఉన్న వితంతువు ఆకలితో ఉన్న ఏలియా ప్రవక్తకు ఆహారం ఒసగి ఉన్నారు. ఆమెను, ఆమె బిడ్డ దీవించబడ్డారు.

యావే దేవుడు కూడా ఆకలితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను, పూరేడు పిట్టలు, సగి ఆకలి తీర్చారు. మన విశ్వాస జీవితంలో కూడా ఉపవాసం చేసేటప్పుడు పొరుగువారికి ఆహారం ఒసగాలి.

రెండవదిగా ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమివండి  అని ప్రభువు తెలుపుచున్నారు. అనాధలు, అభాగ్యులు, పేదవారికి ఆశ్రయం ఇవ్వమని తెలుపుచున్నారు. ప్రస్తుత కాలంలో మనం ఆశ్రయం ఇవ్వల్సింది వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులకు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను విడిచి పెడుతున్నారు కాబట్టి మొదటిగా వారికి ఆశ్రయం ఇవ్వాలి.

మూడవదిగా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వమని తెలుపుచున్నారు. వస్త్రాలు మన యొక్క గౌరవానికి గుర్తు కాబట్టి మన యొక్క జీవితం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు గౌరవం ఇచ్చి జీవించాలి.

నాల్గవదిగా అవసరాలలో ఉన్న బంధువులు సహాయం అడిగినప్పుడు నిరాకరించవద్దని పలుకుచున్నారు. దేవుడు మనకు అనేక రకాలైన దీవెనలు సగినది ఇతరులతో పంచుకోవడానికి క్రైస్తవ జీవితంలో ఒకరికొకరు సహాయం చేసుకుని జీవించాలి. ఈ విధంగా మనం ఉపవాసం చేసి ఇతరులకు సహాయం చేసి జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం.

యెషయా ప్రవక్త తెలియజేసే విషయం ఏమిటంటే మన మిత్రులకు సహాయం చేసి జీవిస్తే అవి ఆశీర్వాదాలుగా మారతాయి, సహాయం చేసినప్పుడు దేవుని కృప ప్రాతక్కాలమున సూర్యుని వలే మనపై ప్రకాశించును, మన యొక్క గాయాలు మార్పబడతాయి, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి, మన యొక్క ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇస్తారు, కాబట్టి ఇతరులకు సహాయం చేస్తూ మంచి క్రైస్తవ జీవితం జీవించుదాం.

ఈనాటి రెండవ పఠనం లో పునీత  పౌలు గారు దైవ శక్తితో చేసిన సువార్త ప్రకటన గురించి తెలుపుచున్నారు. మానవ శక్తుల మీద, జ్ఞానం మీద కాకుండా దైవ శక్తి మీద ఆధారపడి దైవ పరిచర్య చేశారు.

పునీత  పౌలు గారు ఏథెన్స్  లో సువార్త పరిచర్య  చేసేటప్పుడు ఆయనకు మానవ జ్ఞానం తెలివితేటలు అంతగా సహకరించలేదని అందుకే మానవ సహాయం మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడ్డాను అని  తెలియజేశారు. ఏథెన్స్ లో ఉన్న మేధావులందరికీ గొప్పగా ఉపన్యసించాడు అయినప్పటికీ అవి వృధా అయ్యాయి అని. క్రీస్తు ప్రభువే లోకా రక్షకుడని నిజమైన దేవుడని మేధావులకు తెలియజేయడంలో తన యొక్క మానవ ప్రయత్నం విఫలం అయిందని తెలిపాడు.

పౌలు గారు అక్కడ ఉన్న వారు  దేవుని శక్తి మీద ఆధారపడుతూ క్రీస్తు ప్రభువు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల గురించి తెలియజేసినప్పుడు ఏ విధంగా క్రీస్తు ప్రభువు తన యొక్క జీవితంను అనేక మంది యొక్క రక్షణార్థం త్యాగం చేశారు తెలుసుకొని అప్పటి మేధావులు ఏసుప్రభువును విశ్వసించారు.

పౌలు గారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలు బోధించారో  క్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఎవరు ఊహించని సంఘటన (ఆయన సిలువ మరణం) జరిగిందని తెలిపారో అక్కడ ఉన్న అన్యులు యూదా  మతం నుండి మారిన క్రైస్తవులు ప్రభువును విశ్వసిస్తూ, తమ జీవితాలను మార్చుకున్నారు. క్రీస్తు ప్రభువు ఇతరుల యొక్క రక్షణార్థమై అనేక శ్రమలు అనుభవించారు, తన జీవితం త్యాగం చేశారు, తన ప్రేమను పంచారు, తాను  ఇతరులకు సహాయం చేశారు, మనం కూడా ప్రభువు వారి ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలని పౌలు గారు తెలిపారు.

ఈనాటి సువిశేష  పఠనం లో యేసు ప్రభువు క్రైస్తవ జీవితంలో ఉప్పుతోను, వెలుగుతోను పోల్చి చెబుతున్నారు.

ఉప్పు, వెలుగు రెండు ప్రతి ఒక్కరి జీవితంలో విలువైనవి అవసరమైనవి.

ఉప్పును, వెలుగును రెండు కూడా తమ కోసం జీవించేవి కావు అవి ఇతరుల కోసం మాత్రమే జీవిస్తాయి.

పవిత్ర గ్రంథంలో ఉప్పు గురించి వివిధ రకాలుగా చెప్పబడింది.

1. ఉప్పును ఒప్పందం కు గుర్తుగా వాడారు - లేవి 3:13

2. స్వస్థత పరచటానికి పరిశుభ్రపరచటానికి ఉప్పును వాడారు - 2 రాజు 2:20-21.

3. రుచిని ఒసగటానికి ఉప్పును వినియోగిస్తారు - యోబు 6:6.

4. నశించి పోకుండా ఉప్పు కాపాడుతుంది - లూకా 14:34-35.

5. ఉప్పు సమాధానంకు గుర్తు - మార్కు 9:50.

6. ఉప్పు దీవెనలకు సాక్ష్యం - కొలోస్సి 4:6.

దేవుడు క్రైస్తవుల జీవితం ఉప్పు వలె వెలుగు వలె ఉంటాయి అని తెలుపుచున్నారు. మనం పరస్పరం ఒకరికొకరు సహాయం చేస్తూ జీవించాలి.

మనందరిని ఉప్పు వలే జీవించమని కోరుచున్నారు ఉప్పులో ఉన్న మంచి లక్షణాలు మనం అలవర్చుకోవాలి.

1. ఉప్పు సంరక్షిస్తుంది:

పాతకాలంలో మనకి ఫ్రిజ్లు ఏమీ లేవు అయితే పండ్లు, వస్తువులు, మాంసం కుళ్ళిపోకుండా వాటిని  చాలా కాలం వరకు కాపాడుతుంది.

క్రైస్తవులైన మనందరం కూడా మన పొరుగువారు పాడవకుండా కాపాడాలి, వారిని అవినీతి నుండి అక్రమముల నుండి చెడు మార్గాల నుండి వ్యసనాల నుండి కాపాడాలి.

2. ఉప్పును శుభ్రపరచడానికి వాడతారు:

చాలా సందర్భాలలో మనం ఉప్పును పరిశుభ్రపరచటానికి వినియోగిస్తాం. మరీ ముఖ్యంగా చేపలను ఉప్పుతో కడిగి పరిశుభ్రపరుస్తాం అదేవిధంగా క్రైస్తవులందరూ ఈ సమాజంలో ఉన్న చెడును అక్రమాలను శుభ్రపరచాలి, పాప మాలిన్యమును శుభ్రపరచాలి. చెడును శుభ్రపరచాలి. ఎలీషా ప్రవక్త ఉప్పుతో నీటిని శుభ్రం చేశారు - 2 రాజు 2:19:22.

3. ఉప్పు రుచిని అందజేస్తుంది :

అన్నీ తినే పదార్థాలలో ఉప్పు రుచిని అందజేస్తుంది అన్ని సమపాలల్లో ఉన్న లేకపోయినా అన్ని వేసినా వేయకపోయినా కానీ ఉప్పును మాత్రం కూరల్లో  వెయ్యాలి అందుకే ఉప్పు అంటుంది 'అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని'.

మనం కూడా ఇతరులకు రుచిని అందజేయాలి. రుచి అనే ప్రేమ, సంతోషం, సమాధానం అందజేయాలి.

4. ప్పుకు కలిసిపోయే గుణం ఉంది - 

అన్నిటిలో కూడా కరిగిపోయి కలిసిపోతుంది అదే విధంగా మనం కూడా అందరితో కలిసి పోవాలి అవసరంలో ఉన్న వారిని చూసి కరిగిపోవాలి వారికి సహాయం చేయాలి.

5. ఉప్పు త్యాగం చేస్తుంది: 

తనను తాను కరిగించుకుంటూ ఉప్పు ఇతరులకు రుచిని అందజేస్తుంది, సహాయపడుతుంది ఏసుప్రభు తన జీవితంలో త్యాగం చేస్తూ మనకు రక్షణను ప్రసాదించారు. మనం కూడా మన జీవితాలను త్యాగం చేసుకుంటూ ఇతరులకు సంతోషం ఇవ్వాలి.

6. ఉప్పు స్నేహ ఒప్పందానికి గుర్తు: 

పూర్వం రెండు జాతుల మధ్య స్నేహ ఒప్పందం ఏర్పరచుకున్న సమయంలో వారు ఉప్పుతినే వారు రొట్టెను తినేవారు - సంఖ్య 18:19, 2 రాజు దిన 13:5.

క్రైస్తవ జీవితం కూడా ఇతరులతో స్నేహ సంబంధం కలిగి ఉండమని కోరుతుంది.

7. ఉప్పు విశ్వాసానికి గుర్తు:

అప్పుడప్పుడు అంటాం నేను నీ ఉప్పు తిన్నాను కాబట్టి నిన్ను మోసం చేయను అని.  కాబట్టి మనం కూడా విశ్వాసంను కలిగి జీవించాలి దేవునికి విశ్వాస పాత్రులై జీవించాలి.

దేవుడి మనకు ఇచ్చిన ఏ వరం కూడా కోల్పోకూడదు. ప్రభువు అన్నారు ఉప్పు గొప్పదనం కోల్పోతే అది భారవేయబడి త్రొక్క పడుతుందని దేవుడిచ్చిన వరాలు సరిగా వినియోగించుకోకపోతే మన నుండి ఒప్పందంను దేవుడు తీసి వేసుకుంటారు. 

ఉదా: సౌలు రాజు -ఆయనను అభిషేకించారు కానీ ఆయన దానిని సరిగా వినియోగించుకోలేదు. దేవుడు మన జీవితంలో ఇతరుల కొరకు సహాయం చేయుటకు ఇచ్చారు కాబట్టి సహాయం చేస్తూ జీవించుదాం.

అదేవిధంగా ప్రభువు మనల్ని వెలుగుతో పోల్చుతున్నారు. వెలుగు అంతటా ప్రకాశిస్తుంది, నిర్మలమైనది - ఎఫేసి 5:8-9 వెలుగు కూడా ఇతరుల కొరకు జీవిస్తుంది.

ఉప్పు వెలుగు నిర్మలంగా ఉన్నట్లు మన జీవితం కూడా పవిత్రంగా ఉండాలి. ఈ వెలుగులో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలి.

1. వెలుగు దారి చూపుతుంది - 

మనం కూడా ఇతరులకు దారి చూపాలి విశాఖపట్నంలో ఉన్న లైట్ హౌస్ మిగతా షిప్స్ అన్నింటికీ దారి చూపి, గమ్యం చేర్చిన విధంగా మనం కూడా దారి చూపుతూ గమ్యం చేర్చాలి.

2. వెలుగు అంధకారంను తొలగిస్తుంది - యోహాను 3:13-20 మనం కూడా ఈ సమాజంలో ఉన్న పాపం అనే అంధకారం తొలగించాలి.

3. వెలుగు హెచ్చరిస్తుంది - మన సిగ్నల్ లైట్స్ మనల్ని హెచ్చరిస్తాయి అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు దారి తప్పిపోతున్న విశ్వాసులను హెచ్చరించి సన్మార్గంలో నడిపించాలి.

4. వెలుగు కాపాడుతుంది - రోమి 13:12 మనం కూడా కాపాడాలి.

5. వెలుగు ప్రకాశింప చేస్తుంది - యోహాను 12:35 వెలుగు వలె మనం కూడా ఇతరుల జీవితంలో ప్రకాశింప చేయాలి క్రైస్తవ జీవితం అనేది ఉప్పు వెలుగు వలె ఇతరులకు సహాయం చేస్తూ జీవించమని ప్రభువు కోరుచున్నారు.


FR. BALAYESU OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...