19 వ సామాన్య ఆదివారం
1రాజులు19:9, 11-13
రోమియులు
9:1-5
మత్తయి
14:22-23
ఈనాటి దివ్య పఠణాలు
దేవుని యొక్క రక్షణము అనగా తన ప్రజలను రక్షించు విధానమును గురించి బోధిస్తున్నాయి.
అదేవిధంగా ఆయన యందు మనం ఎల్లప్పుడూ విశ్వాసముంచాలి అనే అంశం గురించి తెలియచేస్తున్నాయి.దేవుడు
మన యొక్క అన్ని సమయాలలో మనతోనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో నిరాశకు గురి అవ్వొచ్చు,కష్టాలు అనుభవించవచ్చు.
అనేక సందర్భాలలో మనలని చాలామంది తిరస్కరించి ఉండవచ్చు, కొన్ని కొన్ని సందర్భాలలో
దేవుడు మనకు జరిగే అన్యాయంలో న్యాయం చేయరా అనే ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ మన యొక్క
పడిపోయే సమయాలలో, కృంగిపోయే సమయాలలో
అనారోగ్య సమయాలలో, ఆస్తిపాస్తులు కోల్పోయిన
సందర్భాలలో మనం దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క స్నేహమును గుర్తించుకోవాలి. దేవుడు
మనతోనే ఉంటారు.
ఈనాటి మొదటి పఠణంలో
ఏలియా ప్రవక్త ఏ విధముగా దేవుని యొక్క సాన్నిద్యమును రక్షణమును తన జీవితంలో అనుభవించిన
విధానము చదువుకుంటున్నాం. ఏలియా ప్రవక్త ఆహాబు కాలంలో దేవుని యొక్క సందేశమును అందజేశారు.
ఏలియా కార్మెల్ కొండమీద 450 మంది బాలు ప్రవక్తలను
సవాలు చేశారు నిజమైన దేవుని యొక్క ఉనికిని నిరూపించమని ఆయన వారందరికీ కూడా ఒక సవాలు
విసిరి ఉన్నారు. యావేదేవుని యందు ఉన్న నమ్మకమును బట్టి ఆయన ఈ యొక్క పని చేసి ఉన్నారు.
యావే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని తాను సమర్పించిన బలి ద్వారా నిరూపించబడినది.
దాని తర్వాత ఏలియా ఈ 450 మంది బాలు ప్రవక్తలను
చంపి వేశారు.
ఆ ప్రవక్తల యొక్క
మరణం వార్తను విన్న ఎసబేలు రాణి ఏ విధముగానైనా సరే ఏలియాను హతమార్చాలి అని అనుకున్నది
అందుకనే ఆమె సేవకులను పంపించి ఏలియా కొరకై వెదకుచున్నది,
అలాంటి ఒక వార్తను విన్న సందర్భంలో ఏలియా ప్రవక్త ప్రాణమును
తగ్గించుకొనుటకై భయముతో హోరేబు కొండ చెంతకు పరిగెడుతున్నారు. అప్పటివరకు కూడా ధైర్యముగా
ఉన్న ఏలియా ఒక్కసారిగా మానవ స్వభావముతో భయపడిపోతున్నారు. నిరాశతో, భయముతో కృంగిపోయిన
సమయంలో యావే దేవుడు ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమవుతున్నారు. ఏలియాతో ప్రభువు ఈ విధంగా
అన్నారు నీవు వెళ్లి పర్వతం మీద నా సముఖమందు
నిలిచి ఉండుము అని యావే ప్రభువు ప్రవక్తను ఆదేశించారు. అంతట యావే ఆ వైపున సంచరింపగా
పెనుగాలి వచ్చింది, ఈ యావే దేవుని భయానికి
పర్వతాలు బద్దలయ్యాయి శిలలు చిన్నాభిన్నమయ్యాయి కానీ యావే దేవుడు మాత్రము ఆ గాలిలో
ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగినది కానీ అందులో కూడా దేవుడు ప్రత్యక్షం
కాలేదు తరువాత మెరుపు పుట్టినది కానీ ఆ మెరుపులో కూడా యావే దేవుడు ప్రత్యక్షం కాలేదు
మెరుపు ఆగిపోయిన తరువాత నిమ్మలంగా మాట్లాడే స్వరం ఒకటి వినిపించినది అది చల్లని స్వరం.
ఆ స్వరము వినగానే ఏలియా తన ముఖాన్ని దుప్పటితో కప్పుకొని బయలుదేరి గృహ వాకిట్లో నిలిచి
ఉన్నాడు. యావే దేవుడు పెను గాలిలో గాని, భూకంపం లో గాని, మెరుపులో గాని , నిప్పులో గాని ప్రత్యక్షం
కాలేదు కేవలము ప్రశాంతతలోనే ప్రత్యక్షమయ్యారు. దేవుడు అలజడలలో ప్రత్యక్షమవరు ప్రశాంతతలో
మాత్రమే దేవుని మనము గుర్తించగలుగుతాం.
ఏలియా ప్రవక్త దేవుని యొక్క స్వరమును ఆలకించిన తర్వాత ఆయన ప్రభువుని యొక్క రక్షణమును తన జీవితంలో చవిచూస్తున్నారు. దేవుడు తనకు తోడుగా ఉండారు అనే నమ్మకమును పెంచుకుంటున్నారు కాబట్టి ఈ అంశము ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవలసిన అంశం ఏమిటంటే దేవుడు మనలను విడిచిపెట్టరు. (ద్వితీయో 31:6) కీర్తన 23:4 మనము నశించిపోతే సంతోషించారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏలియా ప్రవక్త వలే మనం కూడా పారిపోతూ ఉంటూ ఉంటాం. కుటుంబ బాధ్యతలు నెరవేర్చకుండా, ఉద్యోగం చేయకుండా, చదవకుండా, అలాగే మనం గమ్యం యొక్క ఉద్దేశం తెలియకుండా మనం పారిపోతూ ఉంటాం కానీ పారిపోయిన సందర్భంలో దేవుడు మరొకసారి మనకు ఏమి చేయాలి అన్నది తెలియచేస్తుంటారు.
దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఏలియాని కూడా ప్రోత్సహించారు. కాబట్టి
తప్పక దేవుని స్వరమును ఆలకించాలి అదేవిధంగా ఆలకించినటువంటి స్వరము ప్రకారంగా దేవుడికి
విధేయత చూపాలి ఏలియా ప్రవక్తతో దేవుడు అంటున్నారు ఇక్కడ ఏమి చేస్తున్నావని వెంటనే వెళ్ళమని
ప్రభువు చెప్పగానే ఏలియా వెళుతూ తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నారు కాబట్టి మనం
కూడా దేవునికి విధేయత చూపుతో ఆయన స్వరమును ఆలకిస్తూ జీవించాలి. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మన యొక్క క్లిష్ట
పరిస్థితిలో దేవుని స్వరాన్ని గుర్తిస్తున్నామా దేవుడు మనతో ఉన్నారు అని నమ్మకమును
మనము కలిగి ఉంటున్నామా అన్నది అర్థం చేసుకోవాలి దేవుడు యెషయతో అంటున్నారు భయపడకము నేను
నీకు తోడై ఉన్నాను (41:
10).
అలాగే ఏసుప్రభు కూడా
శిష్యులతో అంటున్నారు నేను మీతో యుగాంతం వరకు తోడుగా ఉంటానని (మత్తయి 28:20) కాబట్టి మన జీవితంలో దేవుని స్వరమును ఆలకించి మనందరం
కూడా ధైర్యముగా, విశ్వాసముతో జీవించాలి.
ఈనాటి రెండవ పఠణంలో
పునీత పౌలు గారు ఏసుక్రీస్తు నందు సత్యమును మాత్రమే బోధిస్తున్నాను అని తెలియచేస్తున్నారు.
పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును చూసి బాధపడుతున్నారు ఎందుకంటే దేవుని చేత
మిక్కులుగా ప్రేమించబడిన వ్యక్తులే ఆయనను మెస్సేయగా గుర్తించలేదు ఆయనను తిరస్కరించి
ఉన్నారు తమ్ము తాము దేవుడి నుండి దూరం చేసుకున్నారు కాబట్టి పౌలు గారు వారి గురించి
బాధపడుచున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు దయచేసినప్పటికీ
వారిని ఉన్నతమైన స్థితికి ఎన్నుకున్నప్పటికీ వారు అన్ని మరచిపోయారు ఎందుకంటే దేవుడిని
వారు విశ్వాసముతో వెదకలేదు అందుకే వారు దేవునికి దూరమయ్యారు. మెస్సయ్యాను విశ్వసించలేదు
కాబట్టి పౌలు గారు వారి జీవితంలో చూసి బాధపడుతున్నారు మనం కూడా దేవుడిని విశ్వాసము
ద్వారానే వెదకాలి. ఆయన యొక్క గొప్ప కార్యములు మన జీవితంలో గుర్తించాలి ఆయన యందు విశ్వాసము
ఉంచాలి.
ఈనాటి సువిశేష పఠణంలో ఏసుప్రభు నీటి మీద నడిచి వచ్చుటను ధ్యానించుకుంటున్నాం. ఏసుప్రభు తన యొక్క పరిచర్య ముగించిన తర్వాత తన శిష్యులు పడవనికి గలలియ సరస్సు ఆవలి తీరం చేరాలని ప్రయత్నించారు కానీ ఆ సందర్భంలో గలలియ సరస్సులోని అలలు చెలరేగి పడవ అతలాకుతులమైపోయినది. శిష్యులు ఆ అలలు చూసి భయపడిపోయారు. వేకువ జామునే ఏసుప్రభు నీటి మీద నడుస్తూ వారి వద్దకు వచ్చారు. అది చూసి శిష్యులందరూ కూడా భయపడి పెనుభూతము అని కేకలు పెట్టారు వెంటనే ఏసు ప్రభు భయపడకుడు. ధైర్యం వహింపుడు నేనే కదా అని పలికి ఉన్నారు. ఇక్కడ ఆ సరస్సు ఈ లోకమును సూచిస్తూ ఉన్నది పడవ శ్రీ సభను సూచిస్తూ ఉంది శిష్యులు విశ్వాసులను సూచిస్తూ ఉన్నది.
పెనుగాలికి పడవ
అలలకు తాళలేక అతలాకుతలమైనట్లే శ్రీ సభ కూడా ఈ లోకంలో అనేక ఇబ్బందులకు, అవమానములకు, హింసలకు గురి అగుచున్నది.
ఆపదలో ఉన్న శిష్యులకు దేవుడు తోడైయున్న విధంగానే శ్రీ సభకు కూడా ఎప్పుడూ దేవుడు తోడుగానే
ఉంటూ ఉంటారు. మనందరం కూడా విశ్వాసముతో ఉండాలి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో
నడిచి వాగ్దాత్వ భూమికి చేరే సందర్భంలో ఏ విధముగా తోడుగా ఉండి వారితో నడిచి ఉన్నారో
అదేవిధంగా శిష్యులను గమ్యం చేర్చుటకు వారి చెంతకు చేరుతున్నారు. నిర్గమకాండములో ప్రజలు
నీటి మీద నడిచిన విధంగా పేతురు గారు కూడా నీటి మీద నడుస్తూ ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ
తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఏసుక్రీస్తునకు సమస్తము మీద అధికారం ఇవ్వబడినది ప్రకృతి
సైతము ఆయనకు లోబడుచున్నది.
ఒక అంశం ఏమిటంటే పేతురులో
ఉన్నటువంటి కోరికను కూడా ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. ఏసుప్రభువును తనలాగే నీటి మీద
నడిచి వచ్చుటకు అనుమతి దయచేయమంటున్నారు. పేతురు గారిని చాలా సందర్భాలలో మనం చూస్తూ
ఉంటాం ఆయన దేవుని విషయాలలో ఎప్పుడూ కూడా సమాధానము
చెప్పటానికి,ఆయనతో ప్రయాణం చేయటానికి
మొదటి స్థానంలో ఉంటారు. నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని చెప్పినప్పుడు కేవలం పేతురు
మాత్రమే నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అని అంటున్నారు.
ఏసుప్రభు మరణం గురించి
తెలియచేసినప్పుడు మీకు ఇది సంభవింపకుండును గాక అని పేతురు మాత్రమే పలుకుతున్నాడు. ఏసుప్రభు
పడవ మీద నడిచేటప్పుడు నేను కూడా నడుస్తాను అని పేతురు మాత్రమే అడుగుతున్నారు. ఏసుప్రభు
శిష్యుల పాదాలు కడిగినప్పుడు నా పాదాలు మీరు కడగ వద్దని పేతురు మాత్రమే అంటున్నారు.
నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని ఏసుప్రభు పలికిన సందర్భంలో పేతురు మాత్రమే నేనా ప్రభువు అని అంటున్నారు ఇలా చాలా సందర్భాలలో పేతురు ఏసుప్రభు విషయంలో చొరవ చేసుకొని అడుగుచున్నారు. ఇది ఆయనకు దేవుడి మీద ఉన్న ప్రేమ వలన దేవునికి దగ్గరగా ఉండాలి అనేటటువంటి ఆలోచన వలన కాబట్టి మనలో కూడా దేవుని విషయాలలో ముందుగా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. పేతురు గారు ఆయన నీటి మీద నడిచే సందర్భంలో పెనుగాలిని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనలో విశ్వాసము సన్నగిల్లిపోయింది దేవుడిని చూస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగితే ఎటువంటి కష్టమైనా, సమస్య అయినా, ఆయన మనము పరిష్కరించగలము.
మన యొక్క ఇక్కట్లు సమయంలో విశ్వాసము బలహీనమైపోకూడదు. మన యొక్క కష్టకాలములో ప్రభువా నన్ను ఆదుకొనుము అని ప్రార్ధన చేయాలి. దేవుడి మీదే భారము వేయాలి. ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోకూడదు విశ్వాసము కోల్పోకూడదు కాబట్టి దేవుడు మనతో ప్రయాణం చేస్తారు అనే సత్యమును తెలుసుకొని మనందరం కూడా విశ్వాసముతో ప్రభువుకి ప్రార్థన చేయాలి.
దేవుని యొక్క స్వరమును
గుర్తించాలి ఆయన ఎవరి ద్వారా ఎప్పుడు ఏ విధముగా మాట్లాడుతారో మనకు తెలియదు కాబట్టి
ప్రతి మంచి మాట కూడా మాట కూడా దేవుని స్వరమని గుర్తించి మనము ధైర్యంగా జీవించాలి. మన
దేవుడు ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో అన్ని సమయాలలో ఉండే దేవుడు కాబట్టి ఆయనకు విధేయులై
జీవించుదాం ఆయన యొక్క రక్షణమును మనందరం మన జీవితంలో చవిచూద్దాం. విశ్వాసము కోల్పోకుండా
జీవించుదాం.
Fr. Bala Yesu OCD