27 వ సామాన్య ఆదివారం
యెషయ 5:1-7
ఫిలిప్పీ 4:6-9
మత్తయి 21:33-43
ఈనాటి దివ్య పఠణాలు క్రైస్తవ యొక్క జీవితము ఫలించాలి అనే అంశము గురించి బోధిస్తున్నాయి, అనగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రతిరూపమును, మంచితనమును, ప్రేమను ఈ ప్రపంచమునకు చూపించి జీవించుటయే. మానవుల యొక్క జీవితం మోడు బారిన జీవితం లాగా ఉండకూడదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఫలము నివ్వకుండా మనం జీవిస్తే మనకు దేవుని యొక్క శిక్ష వస్తుంది అని ప్రభువు వాక్కు ద్వారా మనకు తన హెచ్చరికలను కూడా తెలియజేస్తున్నారు.
ఈనాటి మొదటి పఠణంలో యెషయా ప్రవక్త ద్రాక్ష తోట గురించి పాడినటువంటి ఒక గీతము గురించి తెలియజేస్తున్నారు అంటే దేవుడు తన యొక్క ప్రజలకు ఉన్నటువంటి బంధమును ద్రాక్ష తోట యజమానుడు అని పోలుస్తూ చెబుతున్నారు. వారి యొక్క బంధము విడదీయ రానటువంటి బంధం. వారు అనునిత్యం ఒకరికి ఒకరు తోడుగా ఉండేటటువంటి బంధం ఎందుకంటే యజమానుడు ప్రతిసారి ద్రాక్ష తోట చూడటానికి, పనిచేయటానికి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటారు అందుకనే వారి బంధం కలిసి ఉండేటటువంటి బంధం. ఈ యొక్క పఠణంలో యజమానుడు సారవంతమైన కొండమీద ఒక ద్రాక్ష తోట నాటించారు. ద్రాక్ష చెట్లు ఎదుగుదలకు కావలసినది ప్రతిదీ కూడా యజమానుడు సమకూర్చారు.
ఈ యొక్క ద్రాక్ష చెట్టు ఎదుగుదలకు ఆయన ప్రత్యేక శ్రద్ధను కనబరిచి తానే స్వయంగా ఎరువులు వేసి అంతయు సిద్ధం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అతనికి నిరాశ ఎదురైనది మంచి పండ్లకు బదులుగా పుల్లని కాయలు కాసెను అందుకుగాను యజమానుడు నిరాశ చెందుతున్నారు. యజమానుడు నేను చేయవలసినది అంతయు చేసింది అయినప్పటికీ కూడా ఎందుకని మంచి ప్రతిఫలము రాలేదు అని చింతిస్తున్నాడు అందుకు గారు ఆయనే తాను మంచి ఫలములు ఇవ్వని చెట్లను తీసి వేస్తాను అని తెలుపుచున్నారు. మన యొక్క జీవితంలో అనేక సందర్భాలలో మనం కూడా నిరాశకు గురవుతుంటాం ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఎంత మేలు చేసినప్పటికీ ఆ వ్యక్తి గుర్తించకపోతే మనము చాలా బాధపడుతాం.
మేలు చేసిన వారిని గుర్తించుకోకుండా చాలా సందర్భాలలో మర్చిపోతారు. ప్రేమించిన వ్యక్తినే ద్వేషిస్తా, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల యొక్క మేలులను మరచిపోతారు. ఈ మొదటి పఠణంలో దేవుడు ద్రాక్ష తోట ద్వారా తెలియచేసే సందేశం ఏమిటంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధి కొరకై వారికి ఇవ్వవలసినది మొత్తము కూడా ఇచ్చారు. అబ్రహామును ఎన్నుకున్నటువంటి నాటినుండి చివరి వరకు కూడా తన యొక్క సేవకులను ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నారు ఫలించాలని.
- యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛనిచ్చారు
- తన సొంత బిడ్డ లాగా అంగీకరించారు
-తానే స్వయముగా రాత్రి
అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వారిని వాగ్దాత్న భూమికి నడిపించారు
-ఎడారిలో వారికి పరలోక దూతల భుజించే మన్నాను దయచేసారు
-వారి యొక్క అభివృద్ధి కొరకై ప్రవక్తలను పంపించారు
-ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడారు.
దేవుడు వారికి అన్ని విధములుగా సహకరిస్తూ మంచిని చేస్తున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మేలులను మరచి ఆయనకే వ్యతిరేకంగా జీవించారు. ప్రభు కూడా అనేక సందర్భాలలో మన యొక్క పవిత్రత కొరకై, శ్రేయస్సు కొరకై అనేక విధాలుగా మేలు చేస్తున్నారు. ప్రభువు బైబిల్ గ్రంధము ద్వారా మరియు యాజకుల బోధన ద్వారా దివ్య సంస్కారములు ద్వారా మనందరం కూడా ఫలమును ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండుటకు కృషి చేస్తున్నారు మరి ఆయన యొక్క వాక్యము ప్రకారంగా దివ్య సంస్కారములు ప్రకారంగా మనము మంచి జీవితాన్ని జీవిస్తున్నామా? లేదా అని మనము ప్రశ్నించుకోవాలి. ప్రభు మనందరం కూడా మంచి వారిగా ఉండాలని ప్రతినిత్యం కూడా కోరుకుంటున్నారు.
ఈనాటి రెండవ పఠణంలో కూడా పౌలు గారు ఫలమునిచ్చేటటువంటి వ్యక్తులుగా జీవించమని కోరుతున్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఎడల కృతజ్ఞతా భావం కలిగి నీతిని, న్యాయమును ప్రకటిస్తూ ఒక మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఫలము ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండమని పౌలు గారు ఫిలిప్పు ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిషేశ పఠణంలో కూడా ఏసుప్రభు భూస్వామి కవులు దార్లు అనే ఉపమానము ద్వారా దేవుడు ఏవిధముగా తన యొక్క ప్రతిఫలం కోసం ఎదురుచూస్తున్నారు అనేటటువంటి అంశం గురించి తెలుపుతున్నారు. ఈ యొక్క ఉపమానములో భూస్వామి స్వయముగా యావే దేవుడు కౌలుదారులు ఆనాటి ఇశ్రాయేలు మత పెద్దలు,అధికారులు. ప్రభువు తన యొక్క ద్రాక్ష తోట అయినటువంటి ఇశ్రాయేలు జన సమూహమును, నాటి అధికారులకు అప్పగించారు అప్పుడు వారు దానిని దుర్వినియోగం చేసుకున్నారు.
ప్రజలకు మంచిని బోధించుటకు బదులుగా వారి యొక్క సొంత ఉద్దేశంలు బోధించి ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా తమ యొక్క చిత్తానుసారంగా బోధించి వారిని దేవుని నుండి దూరం చేశారు. ప్రభువు తన యొక్క ప్రజల నుండి విధేయత, విశ్వాసం కోరారు కానీ అది ఏమి కూడా దొరకలేదు అందుకనే వారి గురించి బాధపడుతున్నారు. ఈ యొక్క సువిశేషం ద్వారా ప్రభువు మన రక్షణ సందేశం కూడా తెలియచేస్తున్నారు ఎందుకంటే ఏ విధంగానైతే యజమానుడు తన యొక్క కూలి వాళ్లను తన వేతనం వసూలు చేసుకోవడానికి పంపించి ఉన్నారో అదేవిధంగా దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ప్రజలను తన తన బాటలో నడిపించుటకు కృషి చేశారు.
కానీ ఆ మత పెద్దలు అధికారులు ఈ యొక్క ప్రవక్తలను హింసించి, శిక్షించి మరణమునకు గురి చేశారు తర్వాత చివరికి తన యొక్క ఏకైక కుమారుడిని ఈ లోకమునకు మన అందరి యొక్క రక్షణ నిమిత్తమై మనందరం ఫలించుటకు ఆయనను పంపించారు కానీ చివరికి ఆయనను కూడా సిలువ వేసి మరణమునకు కారణమయ్యారు ప్రభువు మన యొక్క జీవితంలో కోరేది ఏమిటంటే మనందరం కూడా ఫలించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం గా మనము జీవించే వ్యక్తిగా ఉండాలి. ఫలించుట అనగ హృదయ పరివర్తనం చెందుట, క్షమాగుణం కలిగి ఉండుట ,వినయముగా ఉండుట కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ఫలించే వ్యక్తులుగానే ఉండాలి. ఈరోజు ప్రభు ఈ దివ్య గ్రంథ పఠనములు ద్వారా మనందరికీ కూడా నేర్పించే అంశమేమిటంటే ఆయన వాక్కు మన జీవితంలో ప్రేరణ కలిగించి మనందరినీ కూడా మార్చాలి.
Fr. Bala Yesu
OCD