30 వ సామాన్య ఆదివారం
సిరాకు 35 : 12-14, 16-18
2 తిమోతి 4: 6-8, 16-18
లూకా 18: 9-14
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం దీనతతో చేసే
ప్రార్ధనలు దేవుడు ఆలకిస్తారు అనే విషయమును బోధిస్తున్నాయి.
గత రెండు వారాలుగా
ప్రభువు ప్రార్ధన అనే అంశం గురించి
బోధిస్తున్నారు. 28వ ఆదివారం సువిశేష
గ్రంధంలో పది మంది కుష్ఠరోగులు
క్రీస్తు ప్రభువునకు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. 29వ ఆదివారం సువిశేష
పఠనంలో ఒక వితంతువు చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం.
ఈనాటి దివ్య పఠనాలు మరొకసారి ప్రార్ధన గురించియే తెలుపుచున్నాయి. మన యొక్క విశ్వాస
జీవితంలో దేవునికి ప్రార్ధించే సమయంలో వినయం ఉండాలి అని తెలుపుచున్నారు. దేవుడికి
సమస్తము తెలుసు కాబట్టి ఆయన ముందు గొప్పలు
చెప్పుకోకుండా వినయంతో ప్రార్ధించమని కోరారు.
ఈనాటి మొదటి పఠనంలో రచయిత దేవుడు దీనుని యొక్క ప్రార్ధన ఎలా ఆలకిస్తారో తెలుపుచున్నారు.
దేవుడు పక్షపాతము లేనివాడు ఆయన యొక్క దృష్టిలో
అందరూ సరిసమానులే. దేవుడు అందరిని ప్రేమతో తన చెంతకు చేర్చుకుంటారు.
దేవుని యొక్క మాట అనుసారంగా జీవించే
వారందరి యెడల దేవుడు పక్షపాతం
చూపించరు.
దేవుడు అందరి యొక్క మొరలను ఆలకిస్తారు అయన కొందరు మొరలు
ఆలకించి, కొందరి మొరలను ఆలకించకుండా వుండరు. ఎవరైతే ఆయనకు నిజాయితీగా ప్రార్ధిస్తారో వారి ప్రార్ధన దేవుడు
ఆలకిస్తారు.
దేవుడిని ఎవ్వరు డబ్బుతో కొనలేరు. మనం అన్యాయంగా సంపాదిచిన
డబ్బుతో దేవుణ్ణి సంతృప్తి పరచలేము. అన్యాయంగా సంపాదించిన ప్రతిదానిని దేవునికి అర్పించవలదు అని అంటున్నారు.
దేవుడ్ని మన యొక్క మంచితనం,
వినయం ద్వారానే మెప్పించగలము. అన్యాయంగా అర్ధించినది అంటే మన యొక్క
హృదయం పాపం చేసి దానిని
దేవునికి సమర్పిస్తే అది సరిగా ఉండదు.
పేద విధవరాలు నిజాయితీగా
సంపాదించిన రెండు కాసుల వలన దేవుణ్ణి సంతృప్తి
పరచగలిగారు. ధనికులు అన్యాయంగా సంపాదించినది ఆ కానుకల పెట్టెలో
వేసినపుడు అది ప్రభువునకు సంతృప్తి
పరచలేక పోయినది. - మార్కు 12: 41 - 44
ప్రభువు పేదలకు అన్యాయం చేయరు అని వింటున్నాం. దేవుడు
ఎంతో కరుణ, జాలి కలిగిన వారు.
దేవుడు పేదవారి యొక్క ఆక్రందనలు వింటారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో వున్న సమయంలో వారందరు పేదవారే, దేవుడు వారికి న్యాయం చేస్తున్నారు మరియు వారి యొక్క బాధలనుండి
బయటకు తీసుకొని వస్తున్నారు.
పేదవారు అంటే తన యొక్క అవసరంలో
వున్న వారు. దేవుని అవసరం వుండి విశ్వాసంతో ఎవరైతే మొరపెడతారో వారికి దేవుడు న్యాయం చేస్తారు. - కీర్తన 6 : 33 . దేవుడు బాధితులను అశ్రద్ధ చేయరు, అనాధల ప్రార్ధన విడిచిపెట్టారు అని ప్రభువు తెలుపుచున్నారు.
వితంతువు వేడుకోలు ఆలకిస్తారు అని అంటున్నారు.
మనం హృదయ పూర్వకంగా
వినయం కలిగి ప్రార్ధిస్తే దేవుడు మన ప్రార్ధనలు ఆలకిస్తారు
అనే సత్యంను వెల్లడిస్తున్నారు.
ఈ మొదటి పఠనం
ద్వారా మనం తెలుసుకోవలసిన ఇంకొక
విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు
కూడా ప్రేమతో చూసుకుంటారు, వారి ప్రార్ధనలు ఆలకిస్తారు,
ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు.
దేవుడు నీతిపరుడని, పక్షపాతం లేని వారని, జాలి
ప్రేమ కలిగినవారిని, సమాజంలో గుర్తింపు లేని వారి యెడల
ఆయన వారితో, వారి కోసం నిలబడతారని
తెలుపుచున్నారు.
విశ్వాసులుగా మనందరం మంచి జీవితం జీవించాలి,
పవిత్రంగా ఉండాలి, వినయంతో జీవించాలి.
ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు తన యొక్క పరిచర్య
చివరిభాగం గురించి తెలుపుచున్నారు. పౌలుగారు తాను పొందబోయే మరణం
ఎలాగ ఉంటుందో ముందుగానే తిమోతికి తెలుపుచున్నారు.
క్రీస్తుప్రభువు యొక్క పనికోసం మంచి పోరాటంనే పోరాడితిని
అని పౌలుగారు పలుకుచున్నారు. తనయొక్క పరిచర్య జీవితంలో దేవుడు ఏ విధంగా తన
కొరకు నిలిచారో తన యొక్క వినయంతో
కూడిన ప్రార్ధన ఆలకించారో పౌలుగారు తెలిపారు.
తాను దేవుని పక్షమున
పోరాడిన సందర్భంలో దేవుడు తనకు తోడు నిలిచి
తనకు శక్తిని ఒసగినారు అని తెలిపారు. మనం
క్రీస్తు కొరకు పోరాడాలి. పౌలు గారు ఒకప్పుడు
చాలా గర్వంగా వున్న వ్యక్తియే, కానీ తాను మారిపోయి
వినయంతో జీవించారు.
ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యుడు-సుంకరి చేసిన ప్రార్ధన గురించి వింటున్నాం. ఈ ఉపమానం చెప్పటానికి
కారణం ఏమిటంటే చాలా మంది ఎన్నుకొనబడిన
యూదులు మనస్తత్వం ఏమిటంటే వారు మాత్రమే పవిత్రులని,
నీతిమంతులని, పరలోకం పొందుటకు అర్హులని, దీవించబడిన వారని, దేవుని వారసులని, వారి ప్రార్ధననే దేవుడు
ఆలకిస్తారని మిగతా వారి ప్రార్ధన ప్రభువు
తృణీకరిస్తారనే ఆలోచనలో వున్న పరిసయ్యుల మనస్తత్వంను మార్చుటకు ప్రభువే ఈ ఉపమానం చెబుతున్నారు.
లూకా సువార్తికుడు తన
యొక్క గ్రంధంలో పేదవారికి ప్రాముఖ్యతను ఇచ్చారు. పరిసయ్యుడు - సుంకరి జీవితం ద్వారా మనం కూడా కొన్ని
విషయాలు నేర్చుకోవాలి.
పరిసయ్యుడు - సుంకరి ఇద్దరు కూడా ఒకే దేవాలయంకు
ప్రార్ధన చేయటానికి వెళ్లారు. దేవాలయంలో చేసిన
ప్రార్థనకు శక్తి చాలా ఉంటుంది. ఇద్దరు కూడా
దేవునికి ప్రార్ధించారు. దేవుడు వారి ప్రార్ధన ఆలకించాలి
అన్నదియే వారి యొక్క ఉద్దేశం.
ఇద్దరు ఒకే దేవునికి ప్రార్ధించారు.
ఇద్దరు ఒకే దేవుని ఆలయంలో
ఉన్నారు. కానీ దేవుడు ఒకరి
ప్రార్ధనయే ఆలకించారు ఎందుకంటే ఆయన దీనతతో ప్రార్ధించారు.
దేవునికి ప్రార్ధించే సందర్భంలో వీరిద్దరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉన్నదో
మనం ధ్యానించాలి. ఎవరిలాగా మనం జీవిస్తే దేవుని
యొక్క అంగీకారం పొందుతాం అనే విషయాన్ని కూడా
గ్రహించాలి.
పరిసయ్యుడు దేవునికి ప్రార్ధించలేదు, తనతో తాను మాట్లాడుకున్నారు.
ఆయన దేవాలయంకు వెళ్ళినది తన యొక్క గొప్పలు
చెప్పుకోవటానికియే. ఒక నిజమైన ప్రార్ధన
మనం దేవునికి మాత్రమే సమర్పించాలి.
పరిసయ్యుడు నేను లోభిని కాను, అన్యాయము
చేయువాడను కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరివంటి వాడను
కాను అని తన గురించి
తాను గర్వ పడుతూ ఇతరులను
కించపరుస్తూ తనకు తానే ప్రార్ధించుకున్నాడు.
ఆయన హృదయంలో మనస్సులో గర్వం మాత్రమే ఉంది.
పరిసయ్యుడు ప్రార్ధించటానికి వెళ్ళలేదు దేవునికి తాను చేసే పుణ్య
కార్యాల గురించి తెలపడానికి వెళ్ళాడు. నిజానికి దేవునికి అంతయు తెలుసు - కీర్తన 139:2. 139వ కీర్తన మొత్తం
కూడా దేవునికి అంతయు తెలుసు అనే విషయాన్ని తెలుపుతుంది.
దేవుని ఆలయంలో దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా పరిసయ్యుడు తన్ను తాను పొగుడుకుంటున్నాడు. ఆయన దేవుని
ముంగిట తనను తాను హెచ్చించుకుంటున్నాడు.
తన యొక్క ప్రార్ధనలో ధీనతలేదు, అందుకే దేవుడు ఆయన్ను అంగీకరించలేదు. పరిసయ్యుడు గర్వంతో ఉన్నారు. గర్వం నాశనానికి కారణం. గర్వం దేవదూతలు సైతం సాతానులుగా చేస్తుంది.
వినయం మనుషులను సైతం దేవుదుతలుగా మార్చుతుంది.
ఎవరైనా ప్రార్థిచేటప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు ప్రభువు దానిని అంగీకరించరు. పరిసయ్యుడు ఎదుటివారిని హేళన చేసి, తక్కువ
చూపు చూసి ప్రార్ధిచాడు అందుకే
దేవుడు అంతని ప్రార్ధన ఆలకించలేదు. మన జీవితాలను కేవలం
దేవునితోనే పోల్చుకోవాలి.
సుంకరి ప్రార్ధన కన్నీటి ప్రార్ధన. ఆయన ప్రార్ధనలో నిజాయితీ
వుంది, హృదయవేదన వుంది, ధీనతావుంది, పశ్చాత్తాపం ఉంది. సుంకరి దేవుడు కరుణామయుడని విశ్వశించాడు. దేవుడే తనను మన్నించి శుద్ధీకరిస్తాడని
నమ్మాడు.
సుంకరి ప్రార్ధించేటప్పుడు దేవాలయంలో దూరంగా వున్నారు. ఆయన చేసిన పాపాలకు
పశ్చాత్తాపపడ్డారు, పవిత్రమైన దేవుని సన్నిధిలో నిలుచుటకు యోగ్యత లేదు అని తెలుసుకున్నాడు.
తాను చేసిన పాపం
వలన దేవునికి దూరమయ్యానని పశ్చాత్తాపపడ్డాడు. తన యొక్క పాపమే
తనని ఒంటరిని చేసిందని గ్రహించాడు. తన పాపం చేయుటవలన
పొరుగువారిని కూడా బాధపెట్టానని గ్రహించాడు.
అందుకే అందరికి దూరంగా నిలుచుండి ప్రార్ధన చేసాడు. ఎంత దూరంగా ఉన్నప్పటికీ
ఆయన హృదయపూర్వకంగా ప్రార్ధించాడు.
సుంకరి
కన్నులెత్తి చూడటానికి సైతము ఇష్టపడలేదు. ఆయన యొక్క పశ్చాత్తాప
హృదయం దేవుని వైపు తిప్పారు కానీ
తన యొక్క కన్నులు పైకెత్తలేదు. తన పాపభారం అంత
గట్టిది అని గ్రహించారు.
తన రొమ్మును బాదుకుంటున్నాడు
అంటే తాను చేసిన పాపాలకు
అంతగా పశ్చాత్తాప పడుతున్నాడని అర్ధం. దేవుని పవిత్రతను గుర్తించాడు, తన పాపభారంను గ్రహించాడు
అందుకే పశ్చాత్తాప పడుతూ ప్రార్ధించాడు.
దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు,
దేవుని ముంగిట తాను పాపి అని
ఒప్పుకున్నాడు అదేవిధంగా దేవుని కరుణ కొరకు ప్రార్ధించాడు.
దేవుని యొక్క మంచితనమును, దయను తెలుసుకున్న వ్యక్తి
దేవుడు మన్నిస్తాడని గ్రహించాడు. తన
పాపం దేవుడిని బాధపెట్టానని పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపంలో
దేవునికి ప్రార్ధిస్తే మన్నిస్తారని ఈ సుంకరి తెలుసుకున్నాడు.
లూకా 1 : 50, మీకా 7 : 18, తీతు
3: 5, 4: 7, ఎఫెసీ 2: 4 - 5
దేవునికి భయపడేవారికి ఎల్లప్పుడూ ఆయన కరుణ దొరుకుతుంది. రక్షణకై
సుంకరి దేవుని మీద ఆధారపడ్డాడు. పరిసయ్యుడు
తు.చ. తప్పకుండా అన్ని
చేసినా దేవుడు అతని ప్రార్ధన అంగీకరించలేదు
కానీ సుంకరి తనను తాను తగ్గించుకొని
హృదయపూర్వకంగా చేసిన ప్రార్ధన ఆలకించారు. మనం చేసే ప్రార్ధనలో
దీనత ఎప్పుడూ ఉండాలి.
BY. FR. BALAYESU OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి