యేసు తిరు హృదయ పండుగ
యెహెఙ్కేలు 34 : 11- 16, రోమియు 5: 5-11, లూకా 15: 3-7.
ఈ రోజు తల్లి తిరుసభ యేసు ప్రభునియొక్క తిరు హృదయ పండుగను కొనియాడుచున్నది యేసు ప్రభువు మనలను ఎంతగ ప్రేమించారో ఆ ప్రేమకు మనం తిరిగి ఎలాంటి సమాధానం ఇస్తున్నాం. అని ధ్యానించాలి. ఈ రోజు మనందరం ప్రత్యేకంగా దేవునియొక్క హృదయం ఎలాంటిది అని తెలుసుకోవాలి. చాల సందర్భాలలో మనం ఇతరులను చూసినప్పుడు ఆయన/ ఆమె హృదయం మంచిదికాదు కఠినమైనది అని చెబుతుంటారు. అలాగే కొంతమంది ఆమె / ఆయన హృదయం చాలా మంచిది అని తెలుపుతారు. ఈ నాటి మూడు దివ్య గ్రంథ పఠనాలు దేవుని హృదయం గురించి తెలుపుచున్నాయి. మన హృదయం ఎలాంటిది అని మన యొక్క క్రియలు తెలియచేస్తాయి. తత్వ వేత్త అయినా అరిస్టాటిల్ గారు హృదయ మనేది మానవ శరీరం కు కేంద్రం అని , అన్ని భావనలు పుట్టుటకు ప్రధాన స్థలం అని తెలిపారు. ( heart is the center of all our emotions)
గుండెను జీవితంతో కూడా పోల్చి చెప్పవచ్చు ఎందుకంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి బ్రతుకు ఆగిపోతుంది.
దేవుని యొక్క హృదయం ఎలాంటి అన్నది యేసు ప్రభువు తప్ప మిగతా ఏ వ్యక్తులు వివరించలేదు. క్రీస్తు ప్రభువే ఈ లోకంలో జనియించి తరువాత తన యొక్క సువార్త పరిచర్య ద్వారా తండ్రియొక్క హృదయం ఎలాంటిది అని వివరించారు.
ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే (ప్రేమికులరోజు) ప్రేమలో ఉన్న వారు వారి ప్రేమను వ్యక్త పరుచుటకు హృదయం బొమ్మగీసి దానికి మధ్యలో బాణం గుర్తు పెట్టి అటు ఇటు వారి పేర్లు వ్రాస్తుంటారు. ఎందుకంటే హృదయం ప్రేమకు గుర్తుగా ఉంది కాబట్టి తన ప్రేమ ఈ విధంగా వ్యక్త పరుచుట కోసం.
హృదయం ప్రేమకు గురుతు అదేవిధంగా వ్యక్తిత్వ కేంద్రానికి కూడా గురుతుగా ఉంటుంది.
-యేసు ప్రభువు యొక్క హృదయం ఆయన యొక్క గొప్ప ప్రేమకు మరియు ఆయన యొక్క మానవత్వంకు ఒక చిహ్నంగా ఉంటుంది.
యేసుప్రభువు యొక్క తీరు హృదయాన్ని సంఘానికి పరిచయం చేసినటువంటి భక్తులు పునీత యోహానుగారు : ఆయన ప్రభువు సిలువ మీద మరణించేటప్పుడు సిలువ క్రియందనే ఉన్నారు. క్రీస్తు ప్రక్కన ఈటెచే పొడవ బడడాన్ని కళ్లారా చూశాడు. (యోహాను 19 : 33-37) ఆయన హృదయం దగ్గర ఉన్న ప్రక్కటెముక దగ్గర సైనికులు గాయంచేసినప్పుడు రక్తం నీరు స్రవించాయి అని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. వాటి నుండియే శ్రీసభ ఏర్పడినది అని కొందరి విశ్వాసం.
-తెరువబడిన క్రీస్తు హృదయం మనకు రక్షణ నిది అని ధన్య క్రిసోస్టమ్ అన్నారు. అదేవిధంగా ప్రభువు హృదయం యొక్క విశిష్టతను తెలుసుకున్న పునీత బొనవెంచర్ “నీ హృదయంలోనికి రావడానికి మాకు మార్గం ఏర్పాటు చేయడానికే మీ ప్రక్కను తెరిపించావు అని అన్నారు . ఈలోక వ్యామోహాల నుండి వైదొలగి నీ హృదయంలో నివాసం ఉండుటకు ఒక వరమివ్వమని” ప్రార్థించారు. మనందరం కూడా క్రీస్తు ప్రభువు యొక్క హృదయంనుండి జనిమించిన వారమని పునీత జస్టిన్ గారు అన్నారు. క్రీస్తు సంఘం ప్రభుని హృదయం నుండి పుట్టింది . ఆయన యొక్క శరీర రక్తాలతో పోషించబడుతుంది.
క్రీస్తు ప్రభువు హృదయం తండ్రి దేవుని హృదయం లాంటిదే, ఎందుకంటే క్రీస్తు ప్రభువు కనిపించని తండ్రి దేవుని ప్రతిరూపమే కొలొస్సి 1: 15.
యేసు ప్రభువు కూడా అన్నారు నన్ను చుస్తే నాతండ్రిని చూసినట్లే అని యోహాను 14: 9. అంటే నా ప్రేమను వ్యక్తిత్వమును చుస్తే మీకు దేవుని (తండ్రి ) గురించి తెలుస్తోంది అని అర్థం.
క్రీస్తు హృదయం దేవునికి మనపైన ఉన్న ప్రేమకు నిదర్శనం. యావే దేవుని ప్రేమను పరిశుద్ధ గ్రంధం చక్కగా వివరించింది.
ఆయన ప్రేమ తల్లిని మించిన ప్రేమను మరివి చేయి విడువని ప్రేమ -యెషయా 49:15.
యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చి తండ్రి యొక్క అనంతమైన ప్రేమను చూపించారు.
ఈ నాటి మొదటి పఠనంలో కూడా మంచి కాపరి జీవితం ద్వారా తాను ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో తెలుపుచున్నారు? పాత నిభందన గ్రంధంలో అనేక సార్లు దేవుడు ఇశ్రాయేలును శిక్షించారని చదువుతాం కానీ నూతన నిభందన గ్రంధంలో అలాగే ప్రవక్తల గ్రంధంలో క్షుణ్ణంగా చదివితే దైవ ప్రేమ ఎలాంటిదో అర్థమగుచున్నది. దేవునియొక్క హృదయం గురించి యెహెఙ్కేలు ప్రవక్త దేవుని హృదయం ఎలాంటిదో తెలుసుకొని ఆయన్ను మంచి కాపరిగా సంభోదిస్తున్నారు. తండ్రిని, కుమారుణ్ణి మంచికాపరిగా పవిత్ర గ్రంధం పిలుస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన హృదయం ఎలాంటిదో ధ్యానించుదాం. తండ్రి, కుమారుల హృదయం ఒక్కటే.
1. యేసు ప్రభువు హృదయం పరితపించే హృదయం- ఈ లోకంలో పాపంలో తప్పి పోయిన వారందరిని రక్షించాలని - పరితపించే హృదయం కలిగినటువంటి వారు యేసు ప్రభువు -లూకా19:10. విశ్వాసంలో తప్పిపోయిన వారిని రక్షించాలని పరితపించే హృదయం. భాద్యతలు నెరవేర్చుటలో విఫలమైన వారిని బలపరిచే హృదయం కలిగిన వారు యేసు ప్రభువు.
- ప్రభువు యొక్క ఆలోచన, ద్యాస ఎల్లప్పుడూ మన గురించియే అందుకే ఆయన హృదయం మన కోసం పరితపిస్తుంది.
2. యేసు క్రీస్తు హృదయం జాలి కలిగిన హృదయం. ప్రభువు రోగులను, భాదపడు వారిని చూసినప్పుడు ఆయన యొక్క హృదయం కరిగి పోయింది. - కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూసి ఆయన హృదయము తరుగుకొని పోయింది. మత్తయి 9: 36.
-మూడు రోజులు తన చెంత ఉండి, తన బోధనలను ఆలకించిన ప్రజల యొక్క ముఖములను చుసిన దేవుడు జాలితో ఉన్నారు. మత్తయి : 15 : 32 .
-లాజరు సమాధి వద్ద మార్తమ్మను చూసి జాలితో ఉన్నారు. యోహాను 11 : 33 -36 .
-నాయీను వితంతువు యొక్క పరిస్థితి చూసి ప్రభువు జాలితో వున్నారు. లూకా 7 : 13 .
క్రీస్తు ప్రభువుని హృదయం జాలితో నిండినది ఆయన వారిపట్ల జాలి చూపడం మాత్రమే కాదు చేసింది, వారి యొక్క భాదలలో, ఆకలితో, అనారోగ్య స్థితిలో పాలు పంచుకొని వారికి తన యొక్క దీవెనలు ఇచ్చారు.
గాయ పడిన వారి గాయాలు మాన్పాలనే జాలి కలిగి తానే స్వయంగా ప్రజల శారీరక మానసిక, ఆధ్యాత్మిక గాయాలను జాలితో మాన్పారు.
3. యేసు హృదయం రక్షించే హృదయం - ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినది మనలను రక్షించుటకే గాని శిక్షించుటకు కాదు. యోహాను 3 : 17.
ఆయన చేసిన ప్రతియొక్క భోదన మనం పాపమును విడిచిపెట్టి మంచిని, సత్యమును తెలుసుకొని జీవితాలను సరిచేసుకొని మన యొక్క ఆత్మలను రక్షించుకోవాలన్నదే.
-మన రక్షణ కొరకే తాను ప్రాణ త్యాగం చేశారు. మన రక్షణ కొరకే పరలోక మహిమను వీడి భూలోకంలోకి ప్రవేశించి మన మధ్య ఒకరిగా జీవించారు.
4. యేసు హృదయం ప్రేమించే హృదయం - యేసు ప్రభువు మనందరిని ఎంతగానో ప్రేమించారు ఆయన ప్రేమవలనే ఈ లోకంలో మానవునిగా జనిమించారు. యోహాను 3 : 16. ఆయన ప్రేమ స్వరూపి, మొదట ఆయనయే మనల్ని ప్రేమించారు. 1 యోహాను 16, 19.
ఆయన మనందరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. యిర్మీయా 31 :3 . ఈలోకంలో ఎవ్వరుకూడా ఆయన వలె ప్రేమను చూపలేరు.
-ప్రేమ వలనే శిలువను మోశారు.
-ప్రేమ వలనే విధేయత చూపారు.
-ప్రేమ వలనే ప్రజలలో ఒకరిగా తగ్గించుకొని మెలిగారు.
-ప్రేమవలనే తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరేవేర్చరు.
యేసు ప్రభుని ప్రేమ అర్థం చేసుకున్న పౌలు ఆయన ప్రేమ విశాలమైనది, దీర్గమైనది, గాఢమైనది అని పలికారు- ఎఫెసీ 3 : 15 .
5. యేసు హృదయం ఏదైనా సరే ఇచ్చే హృదయం - ఉదార హృదయం.
- మనకు జీవమిచ్చారు- యోహాను- 10: 10.
-స్వస్థత నిచ్చారు- లూకా – 17: 12-19.
-క్షమను ఇచ్చారు -మార్కు -2: 1- 12.
-ఆశీర్వాదం ఇచ్చారు - మార్కు -10: 13-16.
-తన స్నేహం ఇచ్చారు - యోహాను -15: 12- 15.
తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభువు తన ప్రజలతో పంచుకున్నారు.
ఆయనది ఉదార హృదయం. తనకోసం ఏమి దాచుకోలేదు . సమస్తము ఇచ్చివేశారు. ప్రాణం సైతం.
6. యేసు ప్రభువు హృదయం దయ కలిగిన హృదయం - వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ యొక్క పరిస్థితి చుసిన ప్రభువు ఆమె పట్ల జాలి కలిగి ఆమె పాపాలను క్షమియించారు. యోహాను 8 : 1 - 11 .
తప్పి పోయిన కుమారుడి పట్ల కూడా దేవుడు దయను చూపిస్తున్నారు. యోహాను 15: 11-32.
యేసు ప్రభువు దయార్ద హృదయం కలిగినవారు అందుకే చివరికి మరణించే ముందుకూడా ప్రజల మీద దయను చూపమని తండ్రిని ప్రార్థించారు. లూకా 23: 34.
పవిత్ర గ్రంధం ముఖ్యంగా పాత నిభందన గ్రంధం దేవుని యొక్క దయార్ద హృదయం గురించి తెలుపుతుంది.
ద్వితియో -7: 9.
కీర్తన- 86: 15.
కీర్తన-145: 8-9.
మీకా -7: 18-19.
7. యేసుని హృదయం సేవా భావం కలిగిన హృదయం. ఈ లోకంలో యేసు ప్రభువు సేవకుని వలె సేవ చేశారు. లూకా 22: 24-27.
-ఆయన దేవుడైనప్పటికిని సేవకునివలె శిష్యుల యొక్క పాదాలు కడిగారు. యోహాను 13: 1-20.
ప్రభువు నిస్వార్థంతో, ప్రేమతో, కరుణతో ఈ లోకంలో సేవ చేశారు.
యేసు తిరుహృదయం దర్శనం పునీత మార్గరీత గారికి కలిగింది. ఆ దర్శనంలో ఆమె ప్రభువు యొక్క హృదయాన్ని మండే హృదయంగా చూశారు, హృదయం చుట్టూ ముండ్ల కిరీటం ఉన్నట్లుగా, కంటి కిరణాలు ఉన్నట్లుగా కనిపించాయి. హృదయం మీద సిలువ ఉన్నట్లు దర్శనం కలిగింది.
-మండుచున్న హృదయం ప్రేమకు చిహ్నం. యేసుని హృదయం మానవుల పట్ల వున్నా ప్రేమాగ్నిచే మండిపోతుంది అని అర్థం.
-ముండ్ల కిరీటం - మనయొక్క పాపపు జీవితానికి గుర్తు మనల్ని ప్రేమించిన దేవుణ్ణి మనయొక్క పాపపు జీవితం ద్వారా మనం రోజు భాదపెడుతున్నాం. ముళ్ళు మనకు నొప్పి కలిగించిన విధంగా మన యొక్క పాపపు జీవితం కూడా దేవుని భాదిస్తుంది.
మనయొక్క స్వార్థం, లోభం, దొంగతనం, చెడుతనము, అన్నీకూడా దేవుణ్ణి బాదిస్తునే వున్నాయి. ఈ చేదు గుణాలన్నీ ఆ ముళ్ల కిరీటంలో ఉన్న ముళ్ళు వంటివి.
-సిలువ - మన యొక్క రక్షణకు గుర్తు సిలువను మోసి మన కోసమే ప్రభువు మరణించారు. సిలువ ద్వారా తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు. సిలువలో విజయం ఉంది, ప్రేమ ఉంది, రక్షణ ఉంది.
- కాంతి కిరణాలూ- దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు గుర్తు తన యొక్క కాంతి కిరణాలచే మనలని దేవుడు పవిత్ర పరుస్తున్నారు.
మనందరం ప్రభువు యొక్క హృదయం గురించి ధ్యానించే సమయంలో మన హృదయము కూడా పవిత్రంగా ఉంచుకోవాలి.
ఎందుకంటే హృదయమునుండే అన్ని జనిమిస్తాయి. మంచి అయినా, చెడు అయినా. సామెతలు 4: 23, మత్తయి 15: 19, మార్కు 7: 21.
మనము కఠిన హృదయంలా కాకుండా ప్రేమించే వారిగా జీవించాలి. యెహెఙ్కేలు 36: 26.
ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు తన యొక్క హృదయం తో మనలను ఎంతగా ప్రేమించారో తెలుసుకొని తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించాలి. ఆయన్ను తగిన విధంగా ప్రేమించాలంటే ఆయన ప్రేమ తెలుసుకోవాలి.
-ఆయన ప్రేమను బైబులు చదవటం ద్వారా తెలుసుకోవచ్చు- 1తిమోతి 3: 16.
- ఆయన ప్రేమను ప్రార్తించుట ద్వారా తెలుసుకోవచ్చును. నిర్గమ 3: 14.
ఆయన ప్రేమను తెలుసుకోవాలనుంటే ఆయన సన్నిదికి రావాలి. యాకోబు 4: 8.
దేవుని యొక్క హృదయమును తెలుసుకొని ఆయన హృదయం వలే మనం కూడా మంచిని అలవరుచుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి.