క్రీస్తు పునరుత్థాన సందేశం
ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగను కొని ఆడుచున్నది. ఒక్కసారి ఊహించండి మీ యొక్క డబ్బు మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీరు లాభాల కోసం ఎదురు చూసినప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలి, నష్టం వచ్చిందనుకోండి మన పరిస్థితి ఏమిటి? మీరు ఎంతగానో ఊహించి ఉండవచ్చు లాభాలు వస్తాయని, అభివృద్ధి చెందుతారని, పేరు ప్రతిష్టలు పెరిగితాయని కానీ అవి ఏమీ జరగకుండా ఆశలు అడి ఆశలైనపుడు మనం ఏవిధంగా తట్టుకోగలం. నష్టాలు వచ్చినా లాభాలు తర్వాత వస్తాయని మనం అనుకుంటామా లేక కృంగిపోతామా అది ఒక ప్రశ్నార్ధకం. ఏసుప్రభు యొక్క శిష్యులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఒక్కసారిగా అవన్నీ కూలిపోయాయి. మ్రాని కొమ్మల ఆదివారం రోజున ఆయనను మెస్సయ్యగా, స్వేచ్ఛ నిచ్చే వానిగా, ప్రజలను రక్షించే వానిగా వారు గుర్తించి, ప్రభువును యెరుషలేము వీధుల్లో గొప్పగా గౌరవిస్తూ ఆహ్వానించుకుంటూ వచ్చారు కానీ పవిత్ర శుక్రవారం రోజున ఆయన వారి యొక్క ఆశలకు భిన్నంగా సిలువ మీద నిస్సహాయం స్థితిలో మరణించుట చూసి శిష్యుల యొక్క ఆశలు అంతా కూడా ఆవిరైపోయాయి.
వాస్తవానికి మరణంతో జీవితం అంతం అవటం లేదు అలాగే మరణంతో జీవితం నాశనంమగుట లేదు. మరణం తర్వాత జీవితం ఉందని క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం తెలియజేస్తుంది. అదే శాశ్వత జీవితం. ఆయన మరణంతో అంధకారంగా మారిన భూమి క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం ద్వారా ప్రకాశిస్తుంది. ఏసుప్రభు మరణమును జయిస్తున్నారు. ఏసుప్రభు యొక్క పునరుత్థానం మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఎందుకంటే ఆయన పునరుత్థానం అవ్వనిదే మన యొక్క విశ్వాసం వ్యర్థం అని అపోస్తులు పలుకుతున్నారు. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు.
1. ఖాళీ సమాధి.
ఈ భూలోకంలో చాలా మంది మరణించారు కానీ వారిలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. మతాలను స్థాపించిన వారు ఉన్నారు,సమాజంలో పేరు ఉన్నవారు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారున్నారు, కానీ వారి యొక్క సమాధి ఏది కూడా ఖాళీగా లేదు కేవలం క్రీస్తు ప్రభువు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.
ఈ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు మనము నేర్చుకోవలసిన అంశం ఏమిటి అంటే ఆ సమాధి ఖాళీగా ఉన్న విధంగా మన హృదయాలు దేవుని కొరకు ఖాళీగా ఉన్నాయా లేదా ఇంకా మన హృదయాలను పాపమును, ద్వేషమును, కోపములను, కక్షులను ఉంచుకొని మన యొక్క హృదయాలను నింపుకుంటున్నామా. ప్రభువు యొక్క పునరుత్థానం మనందరినీ తనతో నింపుకొనమని తెలియజేస్తూ ఉన్నది.
2. దేవుడిని వెదకే వారికి ప్రభువు చేరువులోనే ఉంటా రు.
మగ్ధల మరియమ్మ ఏసుప్రభువును వెతుకుతూ సమాధి దగ్గరకు చేరుకున్నది కాబట్టే ఆమెకు దేవుడు మొదటిగా దర్శనం ఇస్తున్నారు. ఆమె ఎంతగా దేవుడు ఎడల భక్తి, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటే అంతగా తెల్లగా తెల్లవారకముందే, తొలికోడి కోయకముందే పరిగెత్తుతూ ప్రభువు సమాధి వద్దకు వెళుతుంది ఆమె యొక్క నిస్వార్ధమైనటువంటి వెతుకుటలో ప్రభు ఆమెకు దర్శనం ఇస్తున్నారు. ఎవరైతే దేవుని వెతుకుతూ వస్తూ ఉంటారు వారికి దేవుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరి మనం దేవుని వెతుకుచున్నామా, దేవుని సమీపిస్తున్నా మా? శిష్యులు కూడా ఏసుప్రభు కొరకు వెతుకుచున్నారు కాబట్టి వారికి కూడా దర్శనము ఇవ్వబడింది.
3. నూతన జీవం
పునరుత్థానం శిష్యుల యొక్క జీవితమును మార్చినది, మరీ ముఖ్యంగా పేతురు యొక్క జీవితమును మార్చినది ఎందుకనగా అప్పటివరకు కూడా భయంగా ఉన్నటువంటి పేతురు ఒక్కసారిగా ఏసుప్రభువు పునరుత్థానమయ్యారు అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన్ను కలుసుకొనుటకై పరిగెత్తుతూ వెళ్ళాడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. క్రీస్తు ప్రభువును ఏ విధంగానైనా చూడాలనుకున్నాడు అందుకని తెల్లవారుజామున సమాధి వద్దకు పరిగెడుతూ వస్తున్నారు.
4. నీవు కోల్పోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళటం
శిష్యులు, మగ్ధల మరియమ్మ వారి కోల్పోయినటువంటి గురువు దగ్గరకు వెళుతున్నారు. ఈ యొక్క తపస్సు కాలం ముగిసిన తర్వాత పునరుత్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మనము కూడా మన యొక్క మాటల వలన చాలా మందిని కోల్పోయివుంటాం కాబట్టి వారి దగ్గరికి వెళ్లి మనము వారితో సఖ్యపడాలి, కలిసిపోవాలి వారితో ఉండాలి.
5. సాక్షిగా ఉండుట
శిష్యులు మరియు మరదలా మరియ ఏసుప్రభు చూసిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నారు జరిగిన విషయంలో మిగతా వ్యక్తులతో పంచుతున్నారు వారు ఏదైతే కనులారా చూశారో, తమ యొక్క జీవితంలో అనుభవించారు దానిని ఇతరులకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రేమను తెలియజేయాలి.
ప్రభువు పునరుత్థానం, మనలో శాంతి సమాధానము తీసుకురావాలి అలాగే కృంగిపోయిన తర్వాత నిరాశ పడకుండా ముందుకు ఒక ఆశతో నమ్మకంతో వెళ్లడం నేర్చుకోవాలి.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి