మత్తయి 13: 47-53 (1.ఆగస్టు 2024)
"ఇంకను పరలోకరాజ్యము సముద్రములో వేయబడి, అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినపుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి, పనికి రాని వానిని పారవేయుదురు. అటులనే అంత్యకాలమందును జరుగును; దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతులనుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు, పండ్లు కోరుకుకొందురు." వీనినన్నింటిని మీరు గ్రహించితిరా?" అని యేసు అడిగెను. "అవును" అని వారు సమాధానమిచ్చిరి. అయన "పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన, పురాతనవస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు" అనెను.
ఈరోజు దేవుని వాక్యం మొదటి పఠనమును మనము చూస్తే, దేవుడు యిర్మీయా ప్రవక్తను ఓక కుమ్మరి వాని ఇంటికి తన యొక్క సందేశాన్ని వినిపించమని పంపిస్తున్నాడు, అయితే ఆ ప్రవక్త వెళ్లి ఆ కుమ్మని సారెమీద పని చెయ్యడం చూసాడు. దేవుడు ఎన్నో సార్లు తన ప్రవక్తలను, శిష్యులను కూడా మన దగ్గరకు పంపిస్తునాడు. మన గ్రామాలకు, కుటుంబాలకు, సంఘాలకు పంపించుచున్నాడు. ఎందుకు అనగా మనయొక్క జీవిత విధానాలను చూచి, మన వ్యాధి బాధలను చూచి మనలకు సువార్తను అంటే, దేవుని సందేశాన్ని అందించమని తన ప్రవక్తలను పంపుచున్నాడు.
ఆనాడు యిర్మీయా ప్రవక్త కుమ్మరివాని ఇంటి దగ్గర కుమ్మరి చేసే పనిని చూచి ఉన్నాడు. మనము ఈనాడు ఏ పనులు చేస్తున్నాము. దానిని బట్టి దేవుడు తన సందెశాన్ని మనకు అందిస్తాడు. కుమ్మరి, సరిగా తయారుకాని కుండను ఏ విధంగానైతే వేరొక పాత్రగా చేసాడో అదే విధంగా దేవుడు కూడా మన జీవిత విధానం బట్టి, మన జీవితాన్ని రూపుదిద్దుతాడు. పాడైపోయిన కుండా మరల ఏ విధంగా అందమైన పాత్రగా మార్చుబడుతుందో, దేవుడు పాడైపోయినా మన జీవితాలను కూడా అందమైన పాత్రగా మార్చగలడు. మన జీవితం ఏ విధంగా ఉన్న, మన బలహీనతలు ఏమైనా దేవుడు వాటిని తొలగించి మనలను మరల సుందరంగా అందంగా మార్చుతాడు, మార్చగలడు. ఓ! యిస్రాయేలు ప్రజలారా మీరు ఎలాంటి వారంటే కుమ్మరి చేతిలో మట్టివలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు అంటున్నారు. కాబట్టి మనము అర్ధం చేసుకోవలసినది మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, మన జివితాలు దేవుని చేతిలో ఉంచితే మన జీవితాలను, కుటుంబాలను సంఘాలను దేవుడు ఎంతో అందంగా మార్చివేస్తారు.
మన జీవితాలు ఎవరి చేతులో ఉన్నాయి? మనము ఏ విధంగా ఉన్నాము? ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో మనము మన జీవితాలను వేరే వారి చేతులలో పెడుతున్నాము. మన జీవితాలను నాశనము చేసుకుంటున్నాము. పదే పదే పాపములో పడిపోయి, పాపపు పనులు చేస్తున్నాము. కాబట్టి దేవుడు మనతో ఈ కుమ్మరి మట్టిని ఎట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? అంటున్నాడు. మరి మన సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు ? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవునికి మనలను మార్చడానికి అవకాశం ఇస్తున్నామా? పునీత అగస్టిను వారు నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించాడు అని అంటున్నాడు. మరి మనము దేవుని చిత్తమునకు అనుమతిస్తున్నామా?
సువిశేష పఠనంలో పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి అన్నివిధములైన చేపలను పట్టు వలను పోలియున్నది అని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. అపుడు మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే దూతలు అంత్యకాలంలో మంచి చేపలు అంటే మంచి పనులు చేస్తూ, పరిశుద్ధంగా జీవించేవారు, బుట్ట అంటే పరలోకరాజ్యము. పనికిరాని చేపలు అంటే దుష్టులు చెడు పనులు చేయువారు. వీరు నరకంలో పారవేయబడి శిక్ష అనుభవిస్తారు. కాబట్టి పరలోకంలో చేరాలి అంటే మనము మన పాప క్రియలను విడిచి పశ్చాతాపంతో ప్రభువును ఆశ్రయించాలి, ప్రార్ధించాలి. అపుడు దేవుని రాజ్యంలో చేర్చబడుతాం.
ప్రార్ధన: ప్రభువైన దేవా మేము మమ్ము తగ్గించుకొని ప్రతినిత్యం మా జీవితం విధానాలను మార్చుకుంటూ మీ సందేశాన్ని, ప్రణాలికను అర్ధంచేసుకుంటూ మా జీవితాలను అందంగా, పరిశుద్ధంగా మార్చుకొని మంచి వారిగా ఉంటూ మంచి పనులను చేస్తూ పరలోక రాజ్యం పొందేబాగ్యం మాకు దయ చేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి