3, ఆగస్టు 2024, శనివారం

18 వ ఆదివారం

 18 వ ఆదివారం 

నిర్గమ ఖాండం 16:2-4,12-15 ఎఫెసి 4:17,20-24  యోహాను 6: 24-35

అక్కడ యేసుగాని , శిష్యులు గాని లేకుండుటచూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫ ర్నామునకు పోయిరి.  ప్రజలు సరస్సు  ఆవలివైపున యేసును కనుగొని  "బోధకుడా!  మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచి కాదు అని  మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత  భోజనమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన  తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు  ముద్రను వేసియున్నాడు"  అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును?" అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది"  అని చెప్పెను. అంతట "నిన్ను   విశ్వసించుటకు మాకు ఎట్టిగురుతు నిచ్చెదవు? ఏ క్రియలు చేసెదవు?" అని వారు మరల ప్రశ్నించిరి. "వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను. అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను" అని వారు ఆయనతో చెప్పిరి. "పరలోకమునుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషేకాదు. కాని, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను"  అని యేసు వారితో అనెను. "అయ్యా ! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము" అని వారు అడిగిరి. అందుకు యేసు "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు  ఎన్నడును దప్పికగొనడు" 

ఈనాడు దేవుడు మనకు ఇచ్చే సందేశం. 

మొదటి పఠనం : దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షిస్తున్నాడు. 

రెండవ పఠనంలో మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొని క్రీస్తునందు నూతన  జీవితాన్ని ప్రారంభించండి. 

సువిశేష పఠనం: దేవుడు తనను వెదుకుతూ వచ్చిన ప్రజలకు అశాశ్వతమైన  భోజనముకై శ్రమింపుడు అంటు నేనే జీవము గల ఆహారాన్ని అని  తెలియజేశాడు. 

ప్రియా విశ్వాసులారా మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు మోషే మరియు అహరోనులు మీద నేరము మోపుతున్నారు. ఎందుకు అంటే వారు మోషేతో మేము ఐగుప్తులో చచ్చిన బాగుండేది. అక్కడ మేము మాంసమును , రొట్టెను కడుపారా భుజించితిమి. ఇప్పుడు మేమందరం ఈ ఎడారిలో ఆకలితో మలమల మాడి చంపబడడానికి మీరిద్దరు మమ్ము ఇక్కడకు తీసుకొని వచ్చారా అని దూషించారు. యిస్రాయేలు ప్రజలు, శరీరానికి దాని అవసరాలకు లొంగిపోయి, వారు పొందిన స్వతంత్రాన్ని, బానిసత్వము నుండి  రక్షణను, విడుదలను మర్చిపోయిదైవసేవకులను  దూషించారు. కాని  దేవుడైన యావే నిర్గమ  16:4లో వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై వారిని  ఈ విధంగా పరీక్షింతును అని అంటున్నాడు. ప్రభువు ప్రేమతో వారికి ఆకాశము నుండి మన్నాను మరియు వారు కడుపునిండా భుజించడానికి పూరేడు పిట్టలను దయచేసి, యావేనైన నేను మీ దేవుడనని తెలియజేశాడు. 

దేవునికి అంత తెలుసు. మనకు ఏమికావలెనో,ఎప్పుడు కావలెనో ఏమి ఇవ్వాలో తెలుసు. కాబట్టి  దేవుడు మనలను  పరీక్షిస్తున్నాడని మనకు అనిపిస్తే మనము దేవుని ధర్మములను అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు. అంత దేవుడే ఇస్తాడు. కాబట్టి పరీక్షింపబడినప్పుడు గొణుకుతూ, సణుగుతూ , ఎదురు తిరుగుతూ నేరం మోపుతూ కాకుండా దేవుని చిత్తానుసారం,  ఆజ్ఞానుసారం నడుచుకుందాం. 

సువిశేషంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెదుకుతూ వచ్చినప్పుడు, ప్రజలు ఎందుకు వచ్చారో వారి మనస్సులోని ఆలోచనలను తెలుసుకోని, మీరు రొట్టెను తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు.  కాని నా సూచక క్రియలను చూసి కాదు అని ప్రజలకు చెప్పియున్నాడు. దీని ద్వారా మనము ఏమి తెలుసుకోవాలంటే, దేవునికి  మనము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, మన మనస్సులోని ఆలోచనలు, ఆశలు ఏంటో తెలుసు. దేవుడు   మన ఉద్దేశాలు  ఎలాంటివి, మంచివా?  కాదా? అని ఖచ్చితంగా చెప్పగలడు. 

ఈనాడు ఎంతో  మంది ప్రజలు తమ స్వలాభాల కోసం, స్వష్టతల కోసం  దేవుని  వెదుకుచు వస్తున్నారు, కాని  నిజంగా దేవుణ్ణి నమ్మి రావడంలేదు. దేవునికి తెలుసు .  దేవుని దగ్గర నుండి అది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. దేవా! నాకు నీవు కావాలి అని   ఎంత మంది అడుగుతున్నారు? వరాలు కావాలి, దీవెనలు కావాలి అని దేవుని దగ్గరకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.  కాని ఆ వారలను దీవెనలను ఇచ్చే వార ప్రధాతను నాకు నీవు కావాలి అని ఎంత మంది అడుగుతున్నాం. 

క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అశాశ్వతమైం దానికై శ్రమింపవలదు. మిత్రులారారా !  ఈనాటి సమాజంలో ఎంతో మంది అశాశ్వతమైన ఈలోక  వస్తువులు, ఈలోక,  వ్యామోహం ఈలోక  సంపదల కోసం శ్రమిస్తున్నారు. ఈ లోకం శాశ్వతంకాదు. మనము ఎల్లకాలం ఈలోకంలో ఉండము. ఈ అశాశ్వ తమైన వాటి కొరకు మనం పడే శ్రమ వృధా! కాని  క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత  భోజనముకై శ్రమింపుడు అని అంటున్నాడు. మనము ఏ రకమైన  పనులు చేయాలి ఈ నిత్య జీవమును పొందాలంటే యోహాను 6: 35 వచనములో చెబుతున్నాడు. "నేనే జీవాహారమును, నాయొద్దకు వచ్చువాడు ఎప్పటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. దీని అర్ధం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని విశ్వసించాలి. అపుడు మనకు జీవం లభిస్తుంది. 

రెండవ పఠనంలో: మనము వింటున్నాం మన పాత స్వభావమును విడిచి, మీ మనస్తత్వమును నుత్నికరించుకొనుడు. అన్యుల వలె  ఆలోచనలు గలవారిగా మీరు ప్రవర్తించకండి. మీరు సత్యమైన నీతిని మరియు పరిశుద్దతను కలిగి క్రొత్త స్వభావమును ధరింపుము. దేవుని పోలికలా  జీవించండి అని పౌలుగారు తెలుయజేస్తున్నారు. మొదటి పఠనములో యిస్రాయేలు ప్రజలు తమ పాత స్వభావమును మార్చుకోవాలి. వారు దేవుని విధులను పాటించాలని సువిశేషంలో జనులు శాశ్వతమైన వాటికొరకు శ్రమించాలని చెబుతూ మనము నీతితో పరిశుద్ధతతో క్రొత్త స్వభావమును ధరించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 

ప్రార్ధన: పరిశుద్దుడైన తండ్రి మా జీవితాలు  పరీక్షలకు గురైనప్పుడు మాకు ఓర్పును, శనమును దయచేయండి. మీ గొప్ప కార్యాలు మాయందు జరిగింపుము/ మేము మీ యొద్దకు వచ్చుటకు, మిమ్ము విశ్వసించుటకు జీవం పొందుటకు కావలసిన నీతిని పరిశుద్దతను మాకు దయచేయండి, మా పాట పాపపు  స్వభావమును మార్చుకొని నీ పోలిక  క్రొత్త స్వభావమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 

ఫా. సురేష్ కొలకలూరి OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...