19, ఆగస్టు 2024, సోమవారం

మత్తయి 19: 16-22

 మత్తయి 19: 16-22

అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?"  అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము.  అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను. 

ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన  ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే   ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు  పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.    

యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు.  యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు  ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు.  యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే  దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి.  మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి. 

ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక  లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది.  ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో  నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు  దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు. 

దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే  నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే  ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక  సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను,  కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి.  నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...