31, ఆగస్టు 2024, శనివారం

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం 
ద్వితీయో 4:1-2,6-8, యాకోబు 1:17-18, 21-22, 27, మార్కు 7:1-8,14-15,21-23
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఒక నిజమైన మత ఆచరణ అనేది కేవలము నామమాత్రపు నియమ నిబంధనలను పాటించు మాత్రమే హృదయ శుద్ధితో, నీతితో, న్యాయంతో, ప్రేమతో దయతో కూడినదిగా ఉండాలని తెలుపుతున్నవి.
 మతమును పాటించుట అనేది కేవలం బాహ్య ఆచారాలు, సాంప్రదాయాలు పాటించుట మాత్రమే కాదు మతము అనగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట, దేవునితో సంబంధం కలిగి జీవించుట, దేవునికి విధేయత చూపుట, దేవుడిని సంపూర్ణ హృదయముతో ఆరాధించి సేవించుట వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడిని తెలుసుకుని ఆ దేవుని యొక్క ప్రేమను నలుగురికి పంచటమే నిజమైనటువంటి మతం యొక్క సారాంశం. మనందరం కూడా క్రైస్తవ మతము ఆచరిస్తూ ఉన్న కాబట్టి కేవలము ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు మాత్రమే కాకుండా వాటన్నిటికన్నా విలువైన దేవుడు చేయమని తెలిపిన క్రియలను చేయాలి.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త దేవుని యొక్క చట్టమును గురించి తెలుపుచూ దేవుని యొక్క గొప్పతనమును చాటి చెబుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, నవజీవనం కొరకు, వారి శ్రేయస్సు కొరకు దేవుడు చట్టమును మోషే ద్వారా ప్రజలకు అందజేశారు. ఈయొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే "మంచి జీవితమును దేవునితో తోటి ప్రజలతో జీవించుట". ప్రజల యొక్క జీవితము ఇష్టము వచ్చిన విధంగా కాకుండా వారి యొక్క జీవితం మంచి కొరకై ఉండులాగున ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ, దేవుడిని తెలుసుకుని సేవించాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశము. దేవుని చట్టము, విధులు మన జీవితంను సరి చేస్తుంటాయి. ఈ యొక్క చట్టము దేవుడే స్వయంగా, ఏదైతే మానవుల యొక్క ప్రయోజనమునకు ఉపయోగపడుతుందో దానిని మాత్రము మోషేతో రాయించారు. ఈ చట్టం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కలుగు మూడు ప్రయోజనాలు మనము గ్రహించాలి; 
1. ఇశ్రాయేలు ప్రజలు మిగతా ప్రజల కన్నా భిన్నముగా జీవించుట కొరకే ఈ యొక్క చట్టమును దేవుడు ఏర్పరిచారు. (Their life must be something different from others. They were called to live a special life)
2. దేవుని చట్టము ఇశ్రాయేలు ప్రజలు గర్వించే లాగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు వారితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు ఇలాంటి ఒడంబడిక ఇంతకుముందు ఏ దేవుడు ఎవరితో చేసుకోలేదు కానీ మొదటిసారిగా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక చేస్తున్నారు.
3. ఇతర ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆశ్చర్యవంతులుగా చేస్తుంది ఎందుకంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న దేవుడు మాత్రమే పిలిచిన వెంటనే స్పందిస్తారు వారికి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క చట్టం ఇవ్వటం ద్వారా దాన్ని అనుసరించటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తండ్రిగా మరియు ప్రజలు బిడ్డలుగా మారుచున్నారు.
 దేవుడు ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిన యెడల మీరు బ్రతికెదరు అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క చట్టం అనగా మోషే ఇచ్చిన పది ఆజ్ఞలు మరియు బైబిల్ గ్రంధంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు (ఆదికాండము నిర్గమకాండం లేవియాకాండం సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము) వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి జీవిస్తారు. ప్రభువు, ఏ ఆజ్ఞలనైతే ఇచ్చి ఉన్నారో వాటిని తప్పనిసరిగా ఆచరించమని తెలుపుతూ ఇక వాటితో వేటిని కూడా జత చేయవద్దు అని తెలుపుచున్నారు ఎందుకంటే దేవుడు కన్నా అన్ని తెలిసినవారు ఎవరూ లేరు. దేవుడే స్వయముగా మన యొక్క మంచి కొరకు  ఏది ఉపయోగపడునో దానిని లిఖించి ఉన్నారు. మానవ మాతృల యొక్క జ్ఞానం చాలా తక్కువ కాబట్టి మనం ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు జత చేయకూడదు. ప్రభువు ప్రసాదించిన ఆజ్ఞలను మన యొక్క జీవితంలో ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితం కన్నా భిన్నంగా చేస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్యమును కేవలము వినటం మాత్రమే కాక దానిని ఆచరింపమని తెలుపుచున్నారు. చెడు ప్రవర్తనను ఆలోచనలను విడిచి మంచిగా జీవించమని తెలుపుచున్నారు. మంచిగా జీవించుట కొరకు మన యొక్క హృదయము శుద్ధిగా ఉండాలి అప్పుడే మనం మంచిగా జీవించగలుగుతాం కాబట్టి విన్నటువంటి వాక్యం మనలను శుద్ధి చేయాలి. ఆ వాక్యము మన జీవితమును మంచి వైపు నడిపించాలి అప్పుడే మనందరం పవిత్రులుగా ఉండగలుగుతాం.
ఈనాటి సువిశేష భాగములో కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువు యొక్క శిష్యులు చేతులు కడుగకుండ భుజించుట చూసి, వారు ఏసుప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్వులు చేతులు కడగకుండా భుజించలేదు అని  అదేవిధంగా ఇంకా పూర్వపు ఆచారాలను ఎన్నో పాటించేవారు అని తెలుపుచున్నాను దానికి ప్రతిఫలంగా ఏసుప్రభు, ఆచారములకన్నా, హృదయ శుద్ధి ముఖ్యమని తెలిపారు ఎందుకనగా ఉదయం సరిగా లేకపోతే జీవితం సరిగా ఉండదు. మన హృదయం మన జీవితమునకు కేంద్రంగా ఉంటుంది కాబట్టి హృదయము మంచిదైతే మనసు కూడా మంచిదవుతుంది అందుకే ప్రభువు బయట నుండి లోపలికి వెళ్లే దాని కన్నా లోపల నుండే బయటకు వచ్చేది ముఖ్యమైనది దానిని గురించి జాగ్రత్త వహించమని తెలుపుచున్నారు.
ఏసుప్రభు యొక్క కాలం నాటికి యూదుల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు చాలా విపరీతంగా పెరిగాయి. సాధారణ ప్రజలు మోయలేనటువంటి మహా భారంగా ఈ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు తయారయ్యాయి. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధికే ప్రాముఖ్యతను ఇచ్చారు కానీ హృదయ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారు దేవుడిని ఆరాధించేది కేవలము వారి యొక్క పెదవుల ద్వారా మాత్రమే. (మార్కు 7: 1-8). దేవుడు ముఖ్యముగా కోరుకునేది మానవ హృదయం ఎందుకంటే విలువైనటువంటి అంశములన్నీ కూడా హృదయమునుండే పుట్టుకొని వస్తాయి మన హృదయము మంచిగా ఉండిన యెడల మన యొక్క జీవితం కూడా మంచిగానే ఉండును. బయటకు కంటికి బాగున్నదంతా లోపల బాగుండదు అలాగే బయట కంటికి బాగాలేనిది లోపలి కూడా బాగుండదు అని చెప్పలేము ఎందుకంటే మేడిపండు చూడటానికి బయట బాగానే ఉన్నా లోపల పురుగులు ఉంటాయి కాబట్టి బయట, లోపల ఒకే విధంగా మన స్వభావం ఉండాలి. 
మచ్చలు ఉన్న ఉల్లిపాయ బయటకు బాగుండదు కానీ పొరలు పొరలు తీయగా అది లోపల బాగుంటుంది. మన యొక్క జీవితంలో మనకి అందచందాలు ఉన్న, ఆచారాలు చట్టాలు పాటించినా హృదయం అనేది నిర్మలంగా లేకపోతే ఏమి చేసినా వ్యర్థమే కాబట్టి మనము బాహ్య శుద్ధి కాక అంతరంగిక శుద్ధిని అలవర్చుకోవాలి. 
మన యొక్క మతమును ఆచరించుటలో హృదయం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఆ హృదయమును ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉంచుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ జీవించటానికి ప్రయత్నించుదాం.

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...