14, ఆగస్టు 2024, బుధవారం

మరియమాత మోక్షరోపణ పండుగ

 మరియమాత మోక్షరోపణ పండుగ

దర్శన గ్రంథం 11:19,12:1-6,10 1కొరింతి 15:20-27 లూకా 1:39-56

ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవ  వేడుకను జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ ప్రతి భారతియునికి చాలా ముఖ్యమైన రోజు. ఎందరో త్యాగాల ఫలితముగా భారత దేశానికి స్వతంత్రం వచ్చింది. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన  దేశ ఉన్నతికి మన వంతు కృషి మనము చేయాలి. మన దేశ నాయకుల కొరకు  మనం ప్రార్ధన చేయాలి. మన దేశ నాయకులు అలాగే మన దేశ ప్రజలు ఎవరికీ బానిసలు కాకుండా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించేలాగా ఉండాలని ప్రార్ధన చేద్దాం. 

ఈనాటి మొదటి పఠనంలో మరియ తల్లి గురించిన  గొప్ప దర్శనం మనము వింటున్నాము. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండుచులాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని వద్దకును, ఆయన సింహాసనము వద్దకును తీసుకొనిపోబడెను. అప్పుడు ఒక స్వరము ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి యున్నది. ఆయన మెస్సియా. ప్రియ విశ్వాసులారా దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత  ఎంతో గొప్ప పాత్ర వహించింది. మానవాళి రక్షణలో మరియమాత చూపిన విశ్వాసం, త్యాగం, ప్రేమ ఎంతో  ఘనమైనది. దేవుని యొక్క పిలుపును విశ్వాసంతో స్వీకరించి నేను ప్రభుని దాసురాలను అంటూ తనను తాను ప్రభుని చిత్తానికి సమర్పించుకున్నది. తద్వారా దేవుని తల్లిగా మారి దైవ కుమారుడైన యేసుకు జన్మనిచ్చి, తన ప్రేమను త్యాగాన్ని ప్రదర్శించింది. కనుకనే దేవుడు ఆమెను గొప్ప సర్పము నుండి రక్షించాడు. ఆమెను మరణము నుండి రక్షించాడు. ఈలోక మరణము తర్వాత మరియతల్లిని  ఆత్మశరీరములతో పరలోక నిత్యా నివాసంలోనికి తీసుకొని వెళ్ళాడు. 

రెండవ పఠనం: మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని, ధ్రువ పరుచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రధముడనుట సత్యము, నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు అని వింటున్నాం. మితృలారా మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని క్రీస్తు ప్రభువు నిరూపిస్తున్నాడు. తనకు జన్మ నిచ్చిన పవిత్ర మూర్తియైన మరియమాతను దేవుడు ఆత్మ శరీరములతో మోక్షమునకు లేవనెత్తాడు అనుటలో ఏ సందేహం లేదు. మృత్యువునే నాశనము చేయగలిగిన శక్తి గల వాడు మన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది.

క్రీస్తు ప్రభువు మోక్షరోహణం తర్వాత యేసు క్రీస్తు ప్రభువు తన తల్లియైన మరియమ్మను ఆయన మహిమతో  భాగస్తులుగా ఉండుటకు మరియమ్మను మోక్షరోపణం, మోక్షమునకు తీసుకొని పోతున్నాడు. 

సువిశేష పఠనములో మరియా తల్లి ఎలిజబెతమ్మను దర్శించుట మరియు మరియమ్మ స్తోత్రగీతము గురించి వింటున్నాం. మరియతల్లి ఉన్నచోట ప్రతి వ్యక్తి కూడా  పవిత్రాత్మతో నింపబడుతారు. మరియ తల్లి వందన వచనము ఎలిజబెతమ్మ చెవిలో పడగానే, ఆమె పవిత్రాత్మతో పరిపూర్ణురాలాయెను. అదేవిధంగా ఆమె అంటుంది. మరియమ్మ "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీవు నా ప్రభుని తల్లివి, నీవు ధన్యురాలవు. అప్పుడు మరియతల్లి దేవునికి స్తుతిగీతము  పాడుతుంది. దేవుడు తనకు చేసిన గొప్ప కార్యములకు ఆమె ఎంతో సంతోష పడుతు, సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరములు వరకు ఉండును. మరియు ఆయన దీనులను  లేవనెత్తును అంటు దేవుణ్ణి స్తుతించింది. 

ప్రియ విశ్వాసులారా  మనం  దేవుని యొక్క సందేశాన్ని విన్నప్పుడు పవిత్రాత్మతో నింపబడుతున్నామా? ఎలిజబెతమ్మ వలె మనము కూడా మరియతల్లి, దేవుని తల్లి అని చెప్పగలుగుతున్నామా? మరియతల్లి మోక్షరోపణ పండుగ మనకు తెలియజేసేది ఏమిటంటే ఒక రోజు నువ్వు, నేను మనమందరం కూడా మరియతల్లి వలే పరలోకానికి ఆత్మ శరీరంతో ఎత్త బడతాము అని  కాబట్టి మరియతల్లి వలె జీవించడానికి ప్రయత్నించుదాం. 

ప్రార్ధన : సర్వశక్తివంతుడైన దేవా నీవు మమ్ము స్వాతంత్రులుగా చెయ్యడానికి ఈలోకానికి వచ్చావు. మేము ఈ రోజు  మా దేశ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. కానీ ఇంకా చాలా చోట్ల ప్రజలు పేదరికం అన్యాయం హింసలకు  బానిసలుగా ఉన్నారు. నీవు సర్వశక్తివంతుడవు , దయ కనికరం గలవాడవు కాబట్టి అలా బానిసలుగా ఉన్న ప్రజలకు విముక్తి  విడుదలను దయచేయ్యండి. ఈ లోక రాజకీయ నాయకుల్ని మీ శక్తితో నడిపించండి. ఈరోజు మరియతల్లి మోక్షరోపణ పండుగ జరుపుకొనుచుండగా మా అందరికి కూడా విడుదలను దయచేయండి. ఈ లోకానికి, లోకవస్తువులకు,  శరీరానికి, పాపానికి  బానిసలైన మమ్ము మీ నిత్యా రక్షంలోనికి ఎత్తబడే భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్ 

ఫా. సురేష్ కొలకలూరి OCD


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...