14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...