16, నవంబర్ 2024, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం 
దానియేలు 12:1-3, హెబ్రీ10:11-14,18 మార్కు 13:24-32
ఈనాటి పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకై మనందరం కూడా సంసిద్ధులై జీవించాలి. అదేవిధంగా దేవుడు తనను విశ్వసించే వారితో ఎల్లప్పుడూ ఉంటారని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు మన యొక్క కష్ట కాలములో, అంత్య దినములలో మనతోనే ఉంటారు ఎందుకనగా ఆయన ఇమ్మానుయేలు ప్రభువు, మనతో ఉండే దేవుడు. 
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాలుగవ దర్శనము గురించి వింటున్నాము. మానవులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మట్టిలో నిద్రించే చాలా మంది సజీవులవుతారని చెబుతున్నారు. 
ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న యూదులను నాల్గవ అంతెయోకు(Antioch. IV)  రాజు అన్యాయంగా వారిని యూదులను శిక్షకు గురిచేసి చంపారు. ఈ యొక్క రాజు ఆయన యూదా ప్రజల మీద అనేక రకములైన ఆంక్షలు విధించి వారు గ్రీకు మతస్తుల ఆచారాలను, పద్ధతులను అనుసరించాలని ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంథం "తోరా" యొక్క ముఖ్య భాగాలను కాల్చివేశాడు. ఇలాంటి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రవక్త దేవుని యొక్క అభయంను /రక్షణ వినిపించారు. దేవుని యెడల విశ్వాసము కలిగిన యూదులు కూడా మరణించిన తర్వాత శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలిపారు. దేవుని యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా ప్రవక్త వారిని ప్రోత్సహించారు. దానియేలు ప్రవక్త ప్రజలు అనుభవించే బాధలను చూసి వారికి ఊరటనిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు చేరువలోనే ఉంటారని తెలియజేశారు. దానియేలు గ్రంధం 11: 21-39 వచనములు చదివినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినా నాలుగవ అంతియోక్ యొక్క దురాలోచనలు, ఆయన అహం, స్వార్థం ఆయన చేసే హింసలు అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే ప్రజలలో ఒక విధమైన ఆశను నమ్మకాన్ని ప్రవక్త కలుగ చేశారు. వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. క్రైస్తవ విశ్వాసము మరియు యూదుల యొక్క విశ్వాసము ఏమిటనగా అంతిమ దినమున అందరు కూడా సజీవులుగా లేపబడతారని. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు దేవుని వాక్యము ప్రవచించగానే అవి శరీరమును పొందుకొని జీవము కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు 37:13. చనిపోయిన వారు దేవుని కృప వలన సజీవులవుతారని ఈ యొక్క వాక్యము తెలుపుతుంది. మక్కబీయులు గ్రంథంలో ఏడుగురు సోదరులు ప్రాణత్యాగము చేశారని వింటున్నాం ఎందుకంటే వారికి పునరుత్థానమునందు విశ్వాసము ఉన్నది అందుకని వారు తమ ప్రాణాలను దేవుని కొరకు త్యాగం చేశారు.(2 మక్కబీయులు 7:9) ఈ యొక్క మొదటి పఠణం ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము జీవించాలి. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా జీవించాలి.
ఈనాటి రెండవ పఠణం యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ఈ యొక్క భాగములో ప్రత్యేక విధముగా ఏసుప్రభువు సమర్పించిన బలికి మిగతా యాజకులు సమర్పించిన బలికి ఉన్నటువంటి వ్యత్యాసమును తెలియజేస్తున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమైన బలులు అర్పించినప్పటికీ ప్రజల పాపాలు తొలగించలేకపోయారు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క బలిద్వారా అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు. ఆయన సమర్పించిన బలిలో రక్షణ సామర్థ్యం ఉంది. ప్రభువు సమర్పించిన బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది శుద్ధికరిస్తుంది అదేవిధంగా అందరూ రక్షణ పొందుటకు సహాయపడుతుంది.  పాత నిబంధన గ్రంథంలో వారు సమర్పించిన బలులన్నీ కేవలము క్రీస్తు ప్రభువు యొక్క బలితో పరిపూర్ణమయ్యాయి. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు శకం 69 వ సంవత్సరంలో రోమీయులు క్రైస్తవులను మరియు క్రైస్తవ మతం స్వీకరించిన యూదులను అనేక రకాల హింసలకు గురి చేశారు అలాంటి సమయంలో తన యొక్క ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మరలా వస్తాడని నమ్మకమును కలిగిస్తూ మార్కు సువార్తికుడు ఈ యొక్క మాటలను రాస్తున్నారు. తనకు కలిగినటువంటి దర్శనం వలన మనుష్య కుమారుని రాకడ ద్వారా ప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని మార్కు గారు తెలియజేశారు. వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం గా జీవించిన వారికి ఎల్లప్పుడూ మేలు కలుగును ప్రభు వారందరినీ రక్షించును. ఏసుప్రభు అత్తి చెట్లనుండి ఒక గుణపాఠం ను నేర్పిస్తున్నారు. ఈ యొక్క అత్తి చెట్ల ఆకులు వసంత రుతువు చివరిలోనే చిగురిస్తాయి అవి అలా కనిపించినప్పుడు ఒక కొత్త కాలం సంభవించునదని మనకు తెలుస్తుంది ఆ కాలంకు తగిన విధంగా మనం కూడా తయారవ్వాలి. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు చనిపోయినది అని కాదు అర్థం, కొత్త ఆకులు వస్తాయని అర్థం. అదే విధముగా దేవుని యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్తకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దానికి తగిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న పాపము, స్వార్థము, అహం అన్నింటిని చంపేయాలి అప్పుడే దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించగలం.
 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఎలాగా వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం కూడా మనము మనల్ని తయారు చేసుకుంటూ జీవించాలి. చివరిగా ఈ యొక్క పఠణముల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
1. నిరీక్షణ కలిగి ఉండుట 
2. విశ్వాసము కలిగి జీవించుట 
3. దేవుని యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించుట 
4. ప్రభువుకు సాక్షులై ఉండుట. 
5. దేవునికి అనుగుణంగా జీవించుట.

Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...