"క్రీస్తు జయంతి సందేశం"డిసెంబర్ 25
ఈనాడు యావత్ ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు జయంతి యొక్క పుట్టినరోజు పండుగను కొన్నియాడుచున్నది. ఈ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా జరుపుకుంటారు ఏదో ఒక విధముగా వారి ఇంటిలో క్రిస్మస్ నక్షత్రమో, చెట్టునో ఉంచుకుంటూ వారి ఈ పండుగను జరుపుకుంటారు.
1. క్రిస్మస్ పండుగ అందరికీ ఆనందంనిచ్ఛే ఒక పండుగ ఎందుకనగా
-ఎన్నో వందల సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నటువంటి మెస్సయ్య జన్మించబోతున్నారు, - ప్రవక్తల యొక్క ప్రవచనములు నెరవేరబోతున్నాయి.
- దేవుని యొక్క రాకడ భూమి మీద మన జన్మంలా జరుగుచున్నది. దేవుడు ఈ భూమి మీదకు మనలాగా వచ్చి మన అందరిని కూడా పరలోకము చేర్చాలి అన్నదే ప్రభువు యొక్క కోరిక. ఇంగ్లీషులో ఒక గొప్ప మాట ఈ విధంగా రాయబడినది Jesus became so that we might become what He is. దేవుడు మానవుడు అయినది, మానవుని తనలాగా మార్చుట కొరకే. క్రీస్తు యొక్క జననము ద్వారా మనము మొట్టమొదటిసారిగా చరిత్రలో దేవుణ్ణి కనులారా చూడగలుగుతున్నాము, చెవులారా వినగలుగుతున్నాము. చేతితో తాకగలుగుతున్నాము. ఆయన యొక్క ఉనికిని మనము మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుడు మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన మాత్రమే చేసినటువంటి గొప్పదైనటువంటి పని.
ఎందుకు దేవుడు మానవుడు అయ్యారు అని మనం ఇంకా ధ్యానించినట్లయితే ప్రభువు పతనమైనటువంటి మానవలోకమును రక్షించుట కొరకు, తప్పిపోయిన గొర్రెలను వెదకుట కొరకు, మనందరికీ పరలోక మార్గము చూపుట కొరకు ఆయన మనలాగా మారి మన మధ్యన నివసించారు. ఒక చిన్న సంఘటన మనకు ఇంకా క్లుప్తంగా ఈ అంశం గురించి వివరిస్తుంది. ఒక మంచు కురిసే(మంచు గడ్డ కట్టే స్థలం) ప్రాంతంలో ఒక రోజున కొన్ని పక్షులు ఒక భక్తుడు యొక్క ఇంటి దగ్గర చెట్టు మీద వాలి ఉన్నాయి అయితే బయట చాలా చలిగా, మంచు గడ్డలు కట్టడం వల్ల అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా ఎటు వెళ్లాలో తెలియక దీనస్థితిలో ఉన్నాయి వాటి పరిస్థితిని చూసినటువంటి ఆ భక్తుడు ఎలాగైనా సరే వాటిని రక్షించాలనుకున్నాడు కానీ అది ఎలా అని ఆయనకు తోచలేదు అప్పుడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక షెడ్డులో కొంచెం మేత పెట్టి వాటిని లోపలికి పిలవటానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న పక్షులు ఆయన మాట విని లోపలికి రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వరాన్ని అవి గుర్తించలేకపోయాయి అప్పుడు ఆయన తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు నేను కూడా ఒక పక్షినైతే ఈ పక్షులన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లి బ్రతికించి ఉండే వాడినని భావించాడు. ఈ యొక్క విషయము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఎవరైతే ఇతరుల యొక్క స్వభావంలోకి వెళుతుంటారో, ఇతరులు లాగా మారతారు అప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేసి వారిని రక్షించవచ్చు. దేవుడు కూడా చేసినటువంటి గొప్ప పని ఇదే మనలాగా వచ్చి మనందరినీ పరలోకం చేర్చాలనుకున్నారు, మనకు అనేక విషయాలు మన స్వభావంలో అర్థమయ్యే విధంగా తెలిపి మనలను మార్చాలనుకున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటిది మానవాళి ఆనందమునుంచే వార్త.
.2. క్రిస్మస్ పండుగ మార్చే పండుగ అనగా భూలోకాన్ని పరలోకముగా మార్చినటువంటి గొప్ప పండుగ. దేవుడు ఉన్న స్థలము పరలోకం అదే దేవుడు భూలోకమునకు వచ్చి పరలోకంగా మార్చారు. మనకు పరలోక అనుభూతిని కలుగ చేశారు. ఏసుప్రభు తన యొక్క రాకతో ఎందరినో మార్చారు మరి ఆయన రాకడ మనల్ని మార్చగలుగుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసుప్రభు తన మాటల ద్వారా క్రియల ద్వారా సాన్నిధ్యం ద్వారా అనేక మందిని మార్చారు.
3. క్రిస్మస్ అనగా దేవుడు మానవులకు దగ్గరైన వేళ. దేవుడు మానవులకు ప్రేమను పంచుటకు దగ్గరగ వచ్చారు మరి మనము దేవుని కొరకు రాగలుగుతున్నామా? ప్రభువే తన చిత్తము ప్రకారముగా మన కొరకు తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థలమును విడిచి మన కొరకు వచ్చారు. మనము దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నామా?
రక్షకుని యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా కలిసి ఆనందంగా ఈ పండుగ కొనియాడుతూ, ప్రేమను పంచుతూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ ఈ యొక్క పుట్టినరోజు పండుగను కొనియాడాలి.
Fr. Bala Yesu OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి