8, ఫిబ్రవరి 2025, శనివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం 

యెషయా 6:1-6
 1కొరింథీయన్స్ 15:3-8,11
లూకా 5:1-11

క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా సామాన్య కాలపు ఐదవ  ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ నాటి మూడు దివ్యాగ్రంధ పఠనలను ధ్యానించినట్లయితే, ఈ మూడు పఠనలు కూడా మనకు విశ్వాసం, దైవ పిలుపు మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి.  దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు ప్రతిస్పందించాలి.  క్రీస్తు పునరుత్థానంపై మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.  యేసును విశ్వసించి, ఆయన పిలుపుకు విధేయత చూపాలి అని బోదిస్తున్నాయి.

ముందుగా మొదటి పఠనము యెషయా గ్రంధములో చుసినట్లయితే, దేవుని పరిశుద్ధత మరియు పిలుపు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక్కడ మనము వినె,  దర్శనం క్రీ.పూ. 740 ప్రాంతంలో, ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరంలో సంభవించింది. ఉజ్జియా మరణం యూదా రాజ్యానికి ఒక అస్థిరమైన సమయం.  ఈ సమయంలో యెషయాకు కలిగిన దివ్య దర్శనం ప్రజలకు దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధతను గుర్తుచేసి, వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని అందించింది.  రాజకీయ అస్థిరత, సామాజిక అన్యాయం ప్రబలంగా ఉన్న సమయంలో, దేవుని సర్వాధిపత్యం, పరిశుద్ధతను చాటి చెప్పడం ఎంతో ముఖ్యం. యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం మరియు దేవుని యొక్క పరిశుద్ధతను, మహిమను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది.  అది ఏవిధంగానంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే సెరాఫీయుల గానం దేవుని సర్వోన్నతత్వాన్ని చాటి చెబుతుంది.  

ఈ దర్శనం యెషయాను తన పాపపు స్థితిని గుర్తించేలా చేస్తుంది.  నేను అపవిత్రమైన పెదవులు గల వ్యక్తిని అని అతను  దేవుని ముందు విలపిస్తాడు.  ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందు మన పాపపు స్థితిని గుర్తించడం మనకు చాలా ముఖ్యం. మన పాపపు స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు క్షమాపణ మరియు శుద్ధీకరణను అందిస్తాడు.  కాల్చిన బొగ్గుతో యెషయా పెదవులను తాకడం ద్వారా అతని పాపం పరిహరించబడుతుంది.  ఆ తరువాత అతనికి దేవుని పిలుపు అనేది వస్తుంది: నేను ఎవరిని పంపాలి?  అని దేవుడు అన్నపుడు యెషయా వెంటనే నేను ఇక్కడ ఉన్నాను; నన్ను పంపండి అని సమాధానం ఇస్తాడు.  ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తాయి:  మొదటిది, దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి.  రెండవది, దేవుని పిలుపుకు వెంటనే స్పందించాలి. 

చివరిగా ఈ మొదటి పఠనములో దేవుని పరిశుద్ధతను, మన పాపపు స్థితిని, దేవుని పిలుపును మనకు గుర్తు చేస్తుంది. యెషయా వలె, మనము కూడా దేవుని పరిశుద్ధతను గుర్తించి, మన పాపాలను ఒప్పుకొని, ఆయన పిలుపుకు స్పందించాలి.  ఎందుకంటే దేవుని పిలుపుకు సిద్ధంగా ఉండాలంటే, మనల్ని మనం మొదటిగా శుద్ధి చేసుకోవాలి. దాని ద్వారా యెషయాను దేవుడు తన సేవకునిగా, ప్రతినిధిగా మార్చుతున్నారు. 

రెండొవ పఠనము యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే యేసు క్రీస్తు మన పాపముల కొరకు మృతిపొంది, సమాధి చేయబడి, మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందల సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. తరువాత  పౌలుకు కూడా కనబడెను. పౌలు, ఇతర అపొస్తలలు ప్రకటించేది ఒకటే అది క్రీస్తు జీవితం గురించి. కొరింథీయ ప్రజలు కూడా ఆవిధంగానే క్రీస్తును విశ్వసించాలని పౌలు అంటున్నాడు. క్షమాపణ మరియు రక్షణ ఒక భ్రమ అయితే, వారి విశ్వాసం వారిని రక్షించదు.క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది అని, అది లేకపోతే మన విశ్వాసం వ్యర్థమని పౌలు గారు కొరింథీయ ప్రజలకు నొక్కి చెబుతున్నాడు. క్రీస్తు పునరుత్థానం మన విశ్వాసానికి కేంద్ర బిందువు. మన పాపములు క్షమించబడ్డాయని, మనకు నిత్యజీవం ఉందని ఈ పునరుత్థానం ద్వారానే మనకు తెలుస్తుంది అని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

చివరిగా సువిశేష పఠనములో యేసు గెన్నెసరెతు సరస్సు దగ్గర నిలబడి ఉండగా, జనులు దేవుని వాక్యాన్ని వినడానికి ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఒడ్డున ఉన్న రెండు పడవలను చూశాడు; జాలరులు వాటినుండి వెళ్ళిపోయి తమ వలలు కడుగుతున్నారు. యేసు సీమోను యొక్క పడవ ఎక్కి, ఒడ్డు నుండి కొంచెం దూరంగా వెళ్లమని అతనిని అడిగాడు. అప్పుడు ఆయన పడవలో కూర్చుని ప్రజలకు బోధించాడు.

బోధించడం ముగించిన తరువాత, యేసు సీమోనుతో లోతుకు వెళ్లి చేపలు పట్టడానికి నీ వలలు వేయి అన్నాడు. సీమోను జవాబిస్తూ, గురువా, మేము రాత్రంతా కష్టపడి పనిచేసినా ఏమీ దొరకలేదు, కానీ మీరు చెప్పినందున నేను వలలు వేస్తాను అన్నాడు. వారు అలా చేసినప్పుడు, వారు చాలా చేపలు పట్టారు, వారి వలలు చిరిగిపోవడం ప్రారంభించాయి. వారు సహాయం కోసం ఇతర పడవలో ఉన్న తమ తోటి వారిని కూడా సహాయం చేయమనీ పిలిచారు. వారు వచ్చి రెండు పడవలు నిండేలా చేపలు పట్టారు.
       సీమోను పేతురు అది చూసి, యేసు పాదాల దగ్గర పడి ప్రభువా నన్ను విడిచి వెళ్లు, నేను పాపాత్ముడను అన్నాడు. యేసు సీమోనుతో, భయపడకు; ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టుకుంటారు అన్నాడు. వారు పడవలను ఒడ్డుకు చేర్చి, ప్రతిదీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. లూకా 5 లో, క్రీస్తు జనసమూహానికి బోధించాడు మరియు సీమోను పేతురు మరియు అతని తోటి జాలరికి చేపల అద్భుతాన్ని ఇచ్చాడు. క్రీస్తు తన వాక్యము మరియు పరిచర్య ద్వారా దేవుని కొరకు గెలిచిన విశ్వాసుల యొక్క గొప్ప సమూహమును  క్రీస్తు అనుచరులుగా చేయడం  ఈ గొప్ప చేపలు సూచనగా ఉన్నాయి. లూకాలో, ఈ మత్స్యకారులను శిష్యరికానికి   పిలుపు 1) యేసు బోధ నుండి నేర్చుకోవడం మరియు 2) దేవుని చర్యలను చూడటం మధ్యలో వస్తుంది.
        కాబ్బటి ప్రియా దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా మనకు దేవుని పట్ల విశ్వాసం, విధేయత, దేవుని పిలుపు గురించి ముఖ్యమైన పాఠాలను బోధిస్తాయి. వీటిని ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవచ్చు.

Fr. Johannes OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తపస్సుకాలపు రెండొవ ఆదివారము

తపస్సుకాలపు రెండొవ ఆదివారము ఆదికాండము 15:5-12, 17-18 ఫిలిప్పీయులు 3:17-4:1 లూకా 9:28-36           క్రీస్తునాధునియందు మిక్కిలి ప్రియ  దేవుని ...