యెషయా 50:4-7
ఫిలిప్పీ 2:6-11
లూకా 22:14-23:56
ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఈ ఆదివారంతో పాటు మనమందరము పవిత్ర వారంలోనికి ప్రవేశించబోతున్నాము. అదేవిదంగా ఈ యొక్క వారమును మ్రానికొమ్మల ఆదివారంగా కొనియాడుతున్నాము. ఈ నాటి మూడు పఠనలు మనకు సేవకుని యొక్క జీవితం గురించి తెలియజేస్తున్నాయి. మొదటి పఠనములో సేవకునికి ఎన్ని బాధలు వచ్చిన కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు అని తెలియజేస్తున్నది. రెండొవ పఠనములో ఎన్ని బాధలు వచ్చిన కూడా మనలను మనం తగ్గించుకొని జీవించాలని తెలియజేస్తుంది. చివరిగా సువిశేషములో బాధలను అనుభవించుటకు మనలను మనం సిద్ధం చేసుకోవాలని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే లూకా 22:42 లో మనం చూస్తున్నాము బాధలను అనుభవించుట లేక తొలగించుట దేవుని చిత్తానికి వదిలివేయాలని నేర్పిస్తుంది.
అసలు బాధలు అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే. బైబిల్‌లో బాధలకు సంబంధించిన అనేక వచనాలు ఉన్నాయి, ఇవి మనకు ఓదార్పును, ఆశను, ప్రోత్సాహాన్ని అందిస్తాయి. బాధలు మానవుని జీవితంలో ఒక భాగమని, దేవుడు మనతో ఉంటాడని ఈ వచనాలు మనకు గుర్తుచేస్తాయి.
బాధలకు అర్థం ఏంటి అని మనం గ్రహించినట్లయితే బైబిల్ ప్రకారం, బాధలు అనేక కారణాల వల్ల వస్తాయి. అవి మన పాపాల ఫలితంగా, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదా దేవుని మహిమ కోసం రావచ్చు. బాధలు మనలను దేవునికి దగ్గర చేయడానికి, మన పాత్రను అభివృద్ధి చేయడానికి, ఇతరులను ఓదార్చడానికి ఉపయోగపడతాయి.
మరి ముఖ్యముగా కార్మెలైట్ సభ పునీతులు బాధల గురించి అనేక విషయాలు చెబుతున్నారు, ముఖ్యంగా బాధలు దేవునితో ఐక్యమయ్యేందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, ఇతరులకు సహాయపడేందుకు ఒక మార్గమని వారు భావించారు. పునీత అవిలాపురి తెరెసమ్మ గారు బాధలు దేవుని ప్రేమను అనుభవించడానికి ఒక మార్గమని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశమని బోధించింది. పునీత సిలువ యెహాను గారు బాధలు ఆధ్యాత్మిక శుద్ధికి ఒక మార్గమని, దేవునితో ఐక్యమయ్యేందుకు సహాయపడతాయని బోధించాడు. అంతే కాకుండా బాధలు స్వర్గంలో శాశ్వత ఆనందానికి దారితీస్తాయని బోధిస్తున్నారు. పునీత ఎలిజబెత్ ఆఫ్ ది ట్రినిటీ బాధలలో దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయన ప్రేమపై నమ్మకం ఉంచాలని బోధించింది. పునీత చిన్న తెరెసమ్మ గారు అంటున్నారు చిన్న చిన్న బాధలను కూడా దేవునికి అర్పించాలని, వాటి ద్వారా ఆయన ప్రేమను చాటాలని ప్రోత్సహించిచరు. కార్మెలైట్ పునీతులు బాధలను సహనంతో, విశ్వాసంతో ఎదుర్కోవాలని బోధించారు. పునీత ఎడిత్ స్టెయిన్ గారు బాధలలో క్రీస్తును అనుసరించాలని, ఆయన బాధలలో పాల్గొనాలని బోధించింది.
ముందుగా మొదటి పఠనములో యెషయా 50:4-7 బాధపడుతున్న సేవకుని గురించి మాట్లాడుతుంది. అతను దేవుని మాటలను వింటాడు, ప్రజలను ఓదార్చడానికి నేర్చుకుంటాడు, బాధలను సహిస్తాడు. బాధలు ఎదురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచడానికి, ఆయన వాక్యానికి విధేయత చూపడానికి మనలను ప్రోత్సహిస్తాయి.
రెండొవ పఠనములో ఫిలిప్పీయులు 2:6-11 క్రీస్తు యొక్క వినయం, త్యాగం గురించి మాట్లాడుతుంది. దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన మనలాంటి మానవునిగా అవతరించాడు. ఆయన తనను తాను తగ్గించుకొని, సిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. అందుకు దేవుడు ఆయనను అత్యంత ఉన్నత స్థితికి హెచ్చించాడు, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు మనలో వినయం, త్యాగం, దేవునికి విధేయత కలిగి ఉండాలని బోధిస్తాయి.
లూకా 22:14-23:56 యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం, పట్టుబడటం, విచారణ, సిలువ మరణం గురించి చెబుతుంది. యేసు తన శిష్యులతో చివరి భోజనం చేస్తూ, తన త్యాగం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఆయనను పట్టుకొని, విచారించి, సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు బాధలు, మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం అని తెలియజేస్తున్నాయి.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు బాధలు అనేవి జీవితంలో ఒక భాగమని, కానీ దేవుడు మనతో ఉంటాడని చూపిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు బాధలు మనకు ఆశను కలిగిస్తాయి, ఎందుకంటే ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు, మనలను ఓదార్చగలడు. బాధలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించగలవు, కానీ అవి మనలను దేవునికి దగ్గర చేస్తాయి. బాధల సమయంలో, మనం దేవునిపై నమ్మకం ఉంచాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి, క్రీస్తు యొక్క ఉదాహరణను అనుసరించాలి.
Fr. Johannes OCD
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి