యోహాను 3:1-8
పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి "బోధకుడా! నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్భుత సూచకక్రియలను ఎవడును చేయలేడు" అని పలికెను. యేసు అందుకు అతనితో, "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని పలికెను అందుకు నికోదేము, "వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా?" అని అడిగెను. అపుడు యేసు,"ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరములముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునైయున్నది. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును" అనెను.
వెలుగు దగ్గరకు వచ్చుట
యేసు ప్రభువు వద్దకు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే నికోదేము ఒక పరిసయ్యుడు, మరియు బోధకుడు. ఒక బోధకుడు మరియు పరిసయ్యుడు అయిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు అంటే బోధకులు మరియు పరిసయ్యులు అతనిని తక్కువ చేసి చూడవచ్చు, లేక ప్రభువుతో మాటలాడి ఆయనను అంగీకరిస్తే ఖచ్చితముగా నికోదేము ఇతర వారితో అవమానింప బడవచ్చు. అందుకే కాబోలు నికోదేము ఎవరి కంట పడకుండ రాత్రి వేళ వచ్చి ఆతనికి ప్రభువు చెప్పేదేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని వచ్చి ఉండవచ్చు. ఇక్కడ రాత్రి వేళ ప్రభువు దగ్గరకు రావడం అంటే చీకటి నుండి వెలుగు దగ్గరకు రావడం. ప్రభువు అనేక సార్లు నేనే వెలుగు అని చెబుతారు. ఇప్పుడు నికోదేము చీకటిని వదలి వెలుగు దగ్గరకు వచ్చి తనలో ఉన్న అంధకారాన్ని మొత్తంను వెలుగుతో నింపుకొనుటకు అవకాశము వచ్చి నందున దానిని పూర్తిగా వినియోగించుకొంటున్నాడు. తనలో ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రభువు ముందు వెల్లడిచేస్తున్నాడు.
ప్రభువు గొప్పతనాన్ని ఒప్పుకొనుట
నికోదేము స్వయంగా బోధకుడు కనుక అతనికి దేవుని గురించి దైవ జ్ఞానము గురించి అవగాహన ఉంది. యేసు ప్రభువు మాటలు విన్నప్పుడు అతనిలో ఉన్న దైవ అన్వేషణ, ప్రభువు వద్ద నుండి ఇంకా దేవుడిని గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ అయ్యింది. ప్రభువు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నారు. మానవుడు ఏమి హెచ్చించి అయ్యిన ఆ దైవ రాజ్యం పొందాలనే కోరిక ఎక్కువైంది, మరియు తనలో ఉన్న కొన్ని అనుమానాలు కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు దేవుని నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు, లేనిదే ఈ అద్భుత కార్యములు ఎవరు చేయలేరు అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభువు చేచేసిన అద్భుతాలు సాధారణమయినవి కావు. ఆయన పకృతి మీద, లోకం మీద జీవరాశుల మీద తన ఆధిపత్యాన్నే కాక ఎలా ఒక దానిని సహజ సిద్ద స్వభావాలు కూడా మార్చ గలిగాడో తెలుసుకున్నాడు. కనుకనే ఎవరు దేవుని నుండి రాకపోతే మీలా చేయజాలరు అని ప్రకటిస్తున్నాడు.
నీటివలన ఆత్మవలన పుట్టుట
యేసు ప్రభువును నికోదేము నీవు దేవుని నుండి వచ్చావు అని ప్రకటించిన తరువాత ప్రభువు నీకొదేముతో ఏ విధంగా దేవుణ్ణి చేరవచ్చు, అతనితో ఉండవచ్చు, అతనిని పొందవచ్చు అనే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అది ఎలా అంటే "మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అని ప్రభువు పలుకుతున్నాడు. దానికి నీకొదేము మరల జన్మించడము అంటే తల్లి గర్భంలోనికి ప్రవేశించి పుట్టడం ఎలా అని అనుకుంటున్నాడు. దానికి ప్రభువు మనిషి మరల జన్మించడం అంటే నీటి వలన ఆత్మ వలన అని చెబుతున్నాడు. నీరు పరిశుద్దతను సూచిస్తుంది. మనిషి తన మలినాన్ని కడుగుకొనవలెను అని చెబుతుంది. ఇది జ్ఞానస్నానమును సూచిస్తుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో మీరు వెళ్లి పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానము ఇవ్వమని చెబుతున్నారు. ఆత్మ జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని నిలుపుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు నూతన జీవితాన్ని ఎప్పుడు పడిపోకుండా ఉంచుతుంది.
ఆత్మను గుర్తించగలుగుట
ఆత్మను ప్రభువు గాలితో పోల్చుతున్నాడు. గాలిని మనం అనుభవించగలము కాని అది ఎక్కడ నుండి వస్తున్నదో, ఎక్కడకు వెళ్తుందో మనకు తెలియదు అటులనే ఆత్మ నుండి పుట్టినవాని జీవితంలో వచ్చిన మార్పును మనము గుర్తించగలం, ఎందుకంటే వారి జీవితం అంతలా మారిపోతుంది. మనము కూడా ప్రభువు చెబుతున్న ఆ దేవుని రాజ్యంలో చేరుటకు, మరల జన్మించుటకు బాప్తిస్మము పొందియున్నాము. నూతన జీవితము జీవించుటకు ఎప్పుడు సిద్ధముగా ఉండాలి.
ప్రార్ధన: ప్రభువా ! మీ వద్దకు రావడం అంటే వెలుగు దగ్గరకు రావడమే, జీవం వద్దకు రావడమే, మీజీవితంలో అనేక అంధకార శక్తులు ఉన్నవి వాటి అన్నింటిని వదలి మీ దగ్గరకు రావడానికి, మరియు మీరు చెబుతున్న ఆ దైవ రాజ్యంలో స్థానము పొందుటకు సహాయం చేయండి. నిజమైన సంపదను తెలుసుకొని, దాని కోసం పాటుపడేలా చేయండి. జ్ఞానస్నానం పొందిన మీ అనుచరులుగా జీవించ శక్తిని దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి