February 20
ఆదికాండము 9: 1-13
మార్కు 8: 27-33
యేసు శిష్యులతో కైసరయా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్లుచు, మార్గ మధ్యమున "ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు?" అని వారిని అడిగెను. అందుకువారు, "కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలీయా అనియు, లేదా మరియొక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు" అనిరి. అప్పుడు యేసు "మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? అని వారిని ప్రశ్నింపగా, పేతురు, "నీవు క్రీస్తువు" అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు "మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవదినమున ఉత్తానమగుట అగత్యము" అని ఉపదేశించి, వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసికొనిపోయి, "అటుల పలుకరాదు" అని వారింపసాగెను. యేసు శిష్యులవైపు తిరిగి పేతురును చూచి, "సైతానూ!నీవు నా వెనుకకు పొమ్ము నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవికావు" అనెను.
ఆదికాండము మొదటి పఠనంలో దేవుడు నోవతో ఒక నిబంధన చేస్తాడు మరియు ఆదాము హవ్వలతో నిబంధనను రూపొందించడంలో ఆయన ఉపయోగించిన పదాలను ఇక్కడ ఉపయోగిస్తాడు. ఆ నిబంధనను గుర్తుచేసేందుకు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతాడు, అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ప్రభువుతూ సఖ్యత కలిగి ఉంటారు. పునీత మార్కు సువార్తలో, క్రీస్తు శిష్యులతో తాను తీవ్రంగా హింసించబడతానని చెబుతున్నాడు, అపుడు ప్రభువును యెరూషలేముకు వెళ్లకుండా నిరోధించడానికి పేతురు ప్రయత్నిస్తున్నాడు, అది ప్రభువును బాధపెడుతుంది. అందుకు కొన్ని క్షణాల ముందు నీవు క్రీస్తువు; అనే మాటలతో పేతురు తన విశ్వాసాన్ని గొప్పగా ప్రకటించినప్పటికీ, క్రీస్తు సాధించిపెట్టె రక్షణ అయన పొందే శ్రమల మరణ పునరుత్తనాల ద్వారా వస్తుందనే విషయాన్ని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాడు పేతురు. ప్రభువు వాటిని అధిగమించి జయిస్తాడు అని అర్ధం చేసుకోలేకపోయాడు పేతురు. క్రీస్తుతో చేసుకొనే రక్షణ నిబంధన శాశ్వత నిబంధన.
పునీత పేతురు చేసినట్లుగా మనం ఆయనపై విశ్వాసం ఉంచాలని మరియు ప్రతిరోజూ ఆయన “నీవు క్రీస్తు” అని గుర్తుంచుకొని జీవించుటకు పిలువబడ్డాము. యేసు పేతురును “రాయి” అని పిలిచి ఉండవచ్చు, కానీ రక్షకుడికి పేతురు అనే రాయికి పగుళ్లు ఉన్నాయని తెలుసు. పేతురును అప్పుడప్పుడు ప్రభువు మార్గమునుకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసు. అయితే, పేతురు ఎంత అసంపూర్ణుడైనా, దేవుడు రాజ్యం యొక్క తాళాలను అతనికి అప్పగించాడు, ఎందుకంటే ఆయనను ప్రభువు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుతాడు. మనం ఎంత అసంపూర్ణులమైన, మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాడు మనలను సంపూర్ణులను చేయుటకు ప్రభువు ఇలా చేస్తుంటాడు. వాటిని అవకాశముగా మార్చుకొని ప్రభువు వలే పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుటకు ప్రయతించుదాం.
Br. Pavan OCD