19, ఆగస్టు 2024, సోమవారం

మత్తయి 19: 16-22

 మత్తయి 19: 16-22

అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?"  అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము.  అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను. 

ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన  ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే   ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు  పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.    

యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు.  యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు  ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు.  యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే  దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి.  మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి. 

ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక  లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది.  ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో  నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు  దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు. 

దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే  నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే  ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక  సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను,  కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను. 

ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి.  నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్ 

17, ఆగస్టు 2024, శనివారం

20 వ సామాన్య ఆదివారం

20 వ సామాన్య ఆదివారం 
సామెతలు 9:1-6, ఎఫెసీ5: 15-20, యోహాను 6:51- 58
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములు దివ్య సత్ప్రసాదము గురించి తెలుపుచున్నవి. గత కొన్ని వారాలుగా తల్లి శ్రీ సభ దివ్యసప్రసాదం గురించే బోధిస్తుంది. సాధారణంగా ఒక్కొక్క ఆదివారం ఒక్క ప్రత్యేక అంశం గురించి బోధిస్తున్నది కానీ దివ్యసప్రసాదం గురించి ఐదు వారాలుగా మనం ధ్యానించాలని కోరుచున్నది.
 ఈ యొక్క దివ్య సత్ప్రసాదం గురించి మరియు ప్రభు శరీర రక్తముల యొక్క విలువను మన యొక్క అనుదిన జీవితంలో గ్రహించాలి అన్నదే శ్రీ సభ యొక్క ఉద్దేశం. చాలామంది వాక్యము, వాక్యం కావాలి అని తహతహలాడుతుంటారు కానీ వాక్యము, శరీరము ధరించి మనందరినీ పోషిస్తున్నది, ఉత్తేజపరుస్తుంది, శక్తినిస్తుంది అనే సత్యమును మరిచిపోతున్నాం దివ్య సత్ప్రసాదానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలము వాక్యమునకు ప్రాముఖ్యతను ఇచ్చే జీవిస్తూ ఉంటాం కానీ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు జ్ఞానము కలిగి ఆ యొక్క ప్రభు ప్రేమ గౌరవం కలిగి ప్రభు శరీర రక్తములను స్వీకరించాలి అని తెలుపుతున్నారు. దివ్యసప్రసాదము శ్రీ సభకు కేంద్రం మరియు ఒక గుండె లాంటిది. ప్రభువే స్వయముగా స్వయంగా దివ్యసప్రసాదమును మన కొరకై ఏర్పరచి స్వీకరించమని తెలిపారు.

ఈనాటి మొదటి పఠణంలో విజ్ఞానము అనేటటువంటి స్త్రీ మూర్తి విందు చేసి అందరిని ఆహ్వానించినది జ్ఞానం లేని వాళ్ళందరని కూడా పిలుస్తుంది ఎందుకంటే వారు కూడా తనలాగా జ్ఞానవంతులు అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో. పాత నిబంధన గ్రంధంలో విజ్ఞానమును దేవునితో పోల్చి చెబుతూ ఉంటారు దేవుడు స్వయముగా విందులో ఏర్పరచి వారిని పిలుస్తూ ఉన్నారు. తన యొక్క విందులో పాల్గొనుట ద్వారా అజ్ఞానులు సైతం జ్ఞానులుగా మారుతారు అని అర్థం. దేవుడు ఏర్పరిచిన విందు ద్వారా అందరూ ఏకమవుతారు, సంతోషంతో జీవిస్తారు. విజ్ఞాన మూర్తి ఏర్పరిచిన విందు స్వీకరించుటవలన మరియు  ద్రాక్ష రసాన్ని సేవించడం వలన వారు జీవాన్ని పొంది సరియైన మార్గమును తెలుసుకొని జీవించగలుగుతారు. 
విజ్ఞానము పొందుట చాలా అవసరం ఎందుకనగా విజ్ఞానం మనలను సత్యము వైపునకు నడిపించును.ఏది నిజమో అబద్దమో గ్రహించేలా చేసి సత్యమునకు  సాక్షులుగా జీవించి లాగున చేస్తుంది. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు అన్యులను యూదులను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవించమని తెలుపుచున్నారు ఎందుకనగా వారిని తన యొక్క శరీర రక్తములను పంచుకొనుటకు ప్రభువు ఏకం చేశారు అలాగే మనలను వివేకవంతులవలె జీవించమని తెలుపుతున్నారు. ఈ లోక సంబంధాను సారముగా జీవించకుండా దేవుని యొక్క చిత్తము ప్రకారంగా జీవించమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష  భాగములో ప్రభుని శరీర రక్తములను భుజించి ఉన్నటువంటి వారికి కలిగినటువంటి ప్రయోజనం గురించి ఏసుప్రభు తెలుపుచున్నారు. ఏసుప్రభువు స్వయముగా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఈ యొక్క ఆహారం గురించి నటువంటి వారు నిరంతరము జీవిస్తారు అని తెలుపుతున్నారు. యోహాను శుభవార్తను, జీవము కలిగిన సువార్త అని పిలుస్తారు ఎందుకనగా ఆయన యొక్క గ్రంథంలో ఎక్కువ జీవము గురించి మాట్లాడారు ఇది మనము ప్రభుని శరీర రక్తములను స్వీకరించటం ద్వారా పొందుతున్నాం. ప్రభువే స్వయముగా, తాను ఒసిగేటటువంటి శరీర రక్తములను భుజిస్తే కానీ వారిలో జీవము ఉండదు అని తెలుపుతున్నారు. ఆదికాండములో ఆది తల్లిదండ్రులను దేవుడు చెట్టు పండు తినవద్దు అని పలికారు తినన ఎడల మీరు మరణిస్తారు అని తెలిపారు కానీ  మనలను ఆయన యొక్క శరీర రక్తమును భుజించమని కోరుతున్నారు.
ప్రభు నీ శరీర రక్తములను భుజించి మరణించినటువంటి వారిని ఆయన అంతిమ దినమున సజీవముగా లేపుతారు అని తెలుపుతున్నారు అదేవిధంగా భుజించినటువంటి వారి యెడల దేవుడు ఉంటారు అని తెలుపుచున్నారు అనగా మన యొక్క జీవితమును ప్రభువు పంచుకుంటారు మనము జీవితమును పంచుకుంటాము. క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా మన యందు ఎల్లప్పుడూ కూడా జీవము ఉంటుంది.
ప్రభువు అనేక అద్భుతాల ద్వారా దివ్య సత్ప్రసాద యొక్క శక్తిని మనందరికీ కూడా తెలుపుతున్నారు కావున మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటానికి మనల్ని మనము తయారు చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...