2, సెప్టెంబర్ 2024, సోమవారం

1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

 1 కొరింతి 2:1-5, లూకా 4:16-30

తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనామందిరమునకు వెళ్లెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా, యెషయా ప్రవక్త గ్రంధమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. "ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను." దీనిని చదివి యేసు గ్రంధమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరు, ఆయనవంక తేరిచూచుచుండగా, ఆయన వారితో "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది"అని  పలికెను. అది వినిన ప్రజలందరు దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి "యితడు యోసేపు కుమారుడు కాడా ?" అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో 'ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, "నీవు కఫర్నాములో ఏ యే  కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశంలో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలీయా కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టివలన దేశమంతట గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు యిస్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో యిస్రాయేలీయులలో చాలామంది కుష్ఠ రోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు" అని పలికెను. అపుడు ప్రార్ధనామందిరములోని ప్రజలు అందరు యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకునెట్టుకొని పోయి, తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొనివెళ్ళి, అచట నుండి తలక్రిందుగా  పడత్రోయతలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్లిపోయెను. 

మొదటి పఠనములో మానవ జ్ఞానము నిష్ఫలమైనదని పౌలుగారు తెలియజేస్తున్నారు. పౌలుగారుప్రసంగాలు కేవలం  దేవుని వాక్యమే. మనం కూడా పౌలులాగా వాక్యంలో క్రీస్తును చూపించాలి. లోక జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం పౌలు ఎన్నడు చేయలేదు. 

మన విశ్వాసము, మనుషుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను. ఈ రోజుల్లో ఆకర్షణీయమైన మాటలు చెప్పే బోధకులున్నారు. కానీ పవిత్రాత్మ చే నడపబడి దేవుని శక్తి వ్యక్తమయ్యే బోధకులు తక్కువగా ఉన్నారు.. మానవ జ్ఞానానికి దారి తియ్యని మాటలకు ఆకర్షితులై ఎంతో మంది విశ్వాసంలో తప్పు దోవ పడుతున్నారు. 

ఓ తండ్రి, పది సంవత్సరాల కొడుకు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మాములుగా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు ఎక్కడ? ఎప్పుడు?ఎందుకు?  ఏమిటి? ఇలా ఆ అబ్బాయి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చివరికి డాడీ రోడ్డుకు వేసే తారును దేనితో తయారు చేస్తారు? అని అడిగాడు. తండ్రి కొద్దిగా కొపంతో బాబు నీవు  ఈ రోజు నన్నడిగిన ప్రశ్నల్లో ఇది 999 వ ప్రశ్న. దయచేసి కొంత సేపు నన్ను వదిలెయ్యి అంటూ. నేను గనుక మా నాన్నను యిన్ని ప్రశ్నలను అడిగి ఉంటె నాకేమయ్యేది? అని అనుకున్నాడు. కొడుకు కొద్దిసేపు ఆలోచించి నా ప్రశ్నలకు చాలావరకు నాకు సమాధానాలు నాకు తెలిసేవి అన్నాడు. ఈ లోక జ్ఞానం చూసి, విని తెలుసుకునేలా ఉంటుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రాత్మ మాత్రమే ఒసగుతుంది. 

ఇవి అద్భుతం ద్వారా నిరూపిస్తున్నారు. అపవిత్రాత్మలు సైతం క్రీస్తు వాక్కుకు లోబడి ఉన్నవి . అధికారపూర్వమైన హెచ్చరిక రాగానే  అపవిత్రాత్మ వెళ్ళిపోతుంది. సువార్తలో ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు   క్రీస్తు అధికారాన్ని అంగీకరించారు. ఇలా గుర్తుల ద్వారా వచ్చిన విశ్వాసం గొప్పది  చూసి   విశ్వసించిన వారికంటే చూడక విశ్వసించిన వారు ధ్యనులు.  ఆ ధన్యతను మనకు ప్రసాదించమని విశ్వాసంలో బలపడేలా దీవించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్ధించుదాం. ఆమెన్

ఫా. రాజు సాలి OCD

31, ఆగస్టు 2024, శనివారం

22 వ సామాన్య ఆదివారం

22 వ సామాన్య ఆదివారం 
ద్వితీయో 4:1-2,6-8, యాకోబు 1:17-18, 21-22, 27, మార్కు 7:1-8,14-15,21-23
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఒక నిజమైన మత ఆచరణ అనేది కేవలము నామమాత్రపు నియమ నిబంధనలను పాటించు మాత్రమే హృదయ శుద్ధితో, నీతితో, న్యాయంతో, ప్రేమతో దయతో కూడినదిగా ఉండాలని తెలుపుతున్నవి.
 మతమును పాటించుట అనేది కేవలం బాహ్య ఆచారాలు, సాంప్రదాయాలు పాటించుట మాత్రమే కాదు మతము అనగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట, దేవునితో సంబంధం కలిగి జీవించుట, దేవునికి విధేయత చూపుట, దేవుడిని సంపూర్ణ హృదయముతో ఆరాధించి సేవించుట వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడిని తెలుసుకుని ఆ దేవుని యొక్క ప్రేమను నలుగురికి పంచటమే నిజమైనటువంటి మతం యొక్క సారాంశం. మనందరం కూడా క్రైస్తవ మతము ఆచరిస్తూ ఉన్న కాబట్టి కేవలము ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు మాత్రమే కాకుండా వాటన్నిటికన్నా విలువైన దేవుడు చేయమని తెలిపిన క్రియలను చేయాలి.
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త దేవుని యొక్క చట్టమును గురించి తెలుపుచూ దేవుని యొక్క గొప్పతనమును చాటి చెబుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, నవజీవనం కొరకు, వారి శ్రేయస్సు కొరకు దేవుడు చట్టమును మోషే ద్వారా ప్రజలకు అందజేశారు. ఈయొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే "మంచి జీవితమును దేవునితో తోటి ప్రజలతో జీవించుట". ప్రజల యొక్క జీవితము ఇష్టము వచ్చిన విధంగా కాకుండా వారి యొక్క జీవితం మంచి కొరకై ఉండులాగున ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ, దేవుడిని తెలుసుకుని సేవించాలి అన్నది ప్రభువు యొక్క ఉద్దేశము. దేవుని చట్టము, విధులు మన జీవితంను సరి చేస్తుంటాయి. ఈ యొక్క చట్టము దేవుడే స్వయంగా, ఏదైతే మానవుల యొక్క ప్రయోజనమునకు ఉపయోగపడుతుందో దానిని మాత్రము మోషేతో రాయించారు. ఈ చట్టం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కలుగు మూడు ప్రయోజనాలు మనము గ్రహించాలి; 
1. ఇశ్రాయేలు ప్రజలు మిగతా ప్రజల కన్నా భిన్నముగా జీవించుట కొరకే ఈ యొక్క చట్టమును దేవుడు ఏర్పరిచారు. (Their life must be something different from others. They were called to live a special life)
2. దేవుని చట్టము ఇశ్రాయేలు ప్రజలు గర్వించే లాగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు వారితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు ఇలాంటి ఒడంబడిక ఇంతకుముందు ఏ దేవుడు ఎవరితో చేసుకోలేదు కానీ మొదటిసారిగా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక చేస్తున్నారు.
3. ఇతర ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆశ్చర్యవంతులుగా చేస్తుంది ఎందుకంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న దేవుడు మాత్రమే పిలిచిన వెంటనే స్పందిస్తారు వారికి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క చట్టం ఇవ్వటం ద్వారా దాన్ని అనుసరించటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తండ్రిగా మరియు ప్రజలు బిడ్డలుగా మారుచున్నారు.
 దేవుడు ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిన యెడల మీరు బ్రతికెదరు అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క చట్టం అనగా మోషే ఇచ్చిన పది ఆజ్ఞలు మరియు బైబిల్ గ్రంధంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు (ఆదికాండము నిర్గమకాండం లేవియాకాండం సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము) వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి జీవిస్తారు. ప్రభువు, ఏ ఆజ్ఞలనైతే ఇచ్చి ఉన్నారో వాటిని తప్పనిసరిగా ఆచరించమని తెలుపుతూ ఇక వాటితో వేటిని కూడా జత చేయవద్దు అని తెలుపుచున్నారు ఎందుకంటే దేవుడు కన్నా అన్ని తెలిసినవారు ఎవరూ లేరు. దేవుడే స్వయముగా మన యొక్క మంచి కొరకు  ఏది ఉపయోగపడునో దానిని లిఖించి ఉన్నారు. మానవ మాతృల యొక్క జ్ఞానం చాలా తక్కువ కాబట్టి మనం ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు జత చేయకూడదు. ప్రభువు ప్రసాదించిన ఆజ్ఞలను మన యొక్క జీవితంలో ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితం కన్నా భిన్నంగా చేస్తుంది.
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్యమును కేవలము వినటం మాత్రమే కాక దానిని ఆచరింపమని తెలుపుచున్నారు. చెడు ప్రవర్తనను ఆలోచనలను విడిచి మంచిగా జీవించమని తెలుపుచున్నారు. మంచిగా జీవించుట కొరకు మన యొక్క హృదయము శుద్ధిగా ఉండాలి అప్పుడే మనం మంచిగా జీవించగలుగుతాం కాబట్టి విన్నటువంటి వాక్యం మనలను శుద్ధి చేయాలి. ఆ వాక్యము మన జీవితమును మంచి వైపు నడిపించాలి అప్పుడే మనందరం పవిత్రులుగా ఉండగలుగుతాం.
ఈనాటి సువిశేష భాగములో కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువు యొక్క శిష్యులు చేతులు కడుగకుండ భుజించుట చూసి, వారు ఏసుప్రభువునకు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్వులు చేతులు కడగకుండా భుజించలేదు అని  అదేవిధంగా ఇంకా పూర్వపు ఆచారాలను ఎన్నో పాటించేవారు అని తెలుపుచున్నాను దానికి ప్రతిఫలంగా ఏసుప్రభు, ఆచారములకన్నా, హృదయ శుద్ధి ముఖ్యమని తెలిపారు ఎందుకనగా ఉదయం సరిగా లేకపోతే జీవితం సరిగా ఉండదు. మన హృదయం మన జీవితమునకు కేంద్రంగా ఉంటుంది కాబట్టి హృదయము మంచిదైతే మనసు కూడా మంచిదవుతుంది అందుకే ప్రభువు బయట నుండి లోపలికి వెళ్లే దాని కన్నా లోపల నుండే బయటకు వచ్చేది ముఖ్యమైనది దానిని గురించి జాగ్రత్త వహించమని తెలుపుచున్నారు.
ఏసుప్రభు యొక్క కాలం నాటికి యూదుల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు చాలా విపరీతంగా పెరిగాయి. సాధారణ ప్రజలు మోయలేనటువంటి మహా భారంగా ఈ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు తయారయ్యాయి. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధికే ప్రాముఖ్యతను ఇచ్చారు కానీ హృదయ శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారు దేవుడిని ఆరాధించేది కేవలము వారి యొక్క పెదవుల ద్వారా మాత్రమే. (మార్కు 7: 1-8). దేవుడు ముఖ్యముగా కోరుకునేది మానవ హృదయం ఎందుకంటే విలువైనటువంటి అంశములన్నీ కూడా హృదయమునుండే పుట్టుకొని వస్తాయి మన హృదయము మంచిగా ఉండిన యెడల మన యొక్క జీవితం కూడా మంచిగానే ఉండును. బయటకు కంటికి బాగున్నదంతా లోపల బాగుండదు అలాగే బయట కంటికి బాగాలేనిది లోపలి కూడా బాగుండదు అని చెప్పలేము ఎందుకంటే మేడిపండు చూడటానికి బయట బాగానే ఉన్నా లోపల పురుగులు ఉంటాయి కాబట్టి బయట, లోపల ఒకే విధంగా మన స్వభావం ఉండాలి. 
మచ్చలు ఉన్న ఉల్లిపాయ బయటకు బాగుండదు కానీ పొరలు పొరలు తీయగా అది లోపల బాగుంటుంది. మన యొక్క జీవితంలో మనకి అందచందాలు ఉన్న, ఆచారాలు చట్టాలు పాటించినా హృదయం అనేది నిర్మలంగా లేకపోతే ఏమి చేసినా వ్యర్థమే కాబట్టి మనము బాహ్య శుద్ధి కాక అంతరంగిక శుద్ధిని అలవర్చుకోవాలి. 
మన యొక్క మతమును ఆచరించుటలో హృదయం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఆ హృదయమును ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉంచుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ జీవించటానికి ప్రయత్నించుదాం.

Fr. Bala Yesu OCD

దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి

 మత్తయి 5: 20-26 ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ...