13, నవంబర్ 2024, బుధవారం

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత 

యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,  గొంతెత్తి, " ఓ  యేసు ప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి "మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు" అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే  శుద్ధిపొందిరి. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరియుడు. అపుడు యేసు "పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని  స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?" అనెను. పిదప యేసు అతనితో "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్లుము" అనెను. 

ఈ సువిశేష భాగంలో  కృతజ్ఞత, విశ్వాసం మరియు దేవుని కృపను గురించి చూస్తున్నాము. పది మంది కుష్టురోగులు అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తున్నారు.    వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు  అనేక విషయాలలో పొందుతూనే ఉంటాము. కాని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడములో మాత్రము విఫలం అవుతుంటాము. దేవుని దగ్గరకు వచ్చి  కృతజ్ఞత తెలియజేయుటము,  ఒక వ్యక్తిని  దేవునికి దగ్గర చేస్తుంది. దేవునితో సఖ్యత ఏర్పాటు చేస్తుంది. మరియు దేవునితో అనుభంధమును ఏర్పరచి మనలను ఆయనకు ఇష్టులను చేస్తుంది. 

విశ్వాసం మరియు విధేయత

పది మంది కుష్టు రోగులు యేసు ప్రభువునకు ఎదురయ్యారు, దూరంగానే ఉండి, ప్రభువా మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు. ప్రభువు  కరుణ మీద వారికి ఎంతో విశ్వాసం ఉన్నది. ఆయనకు తమ సమస్య తెలిపితే వారికి స్వస్థత దయచేస్తాడు అని వారు నమ్మారు.   యేసు ప్రభువు వారిని వెళ్లి  యాజకులకు తమను తాము చూపించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్లిపోతున్నారు. యాజకుడు మాత్రమే  కుష్టు రోగంతో బాధ పడేవారిని స్వస్థత పొందిన తరువాత వారు స్వస్థులైన విషయాన్నీ ధ్రువీకరించగలరు. అందుకే యేసు ప్రభువు వారిని పోయి యాజకుడిని కలవమని చెబుతున్నారు. యేసు ప్రభువు ఇతర సమయాలలో వలె వారిని తాకలేదు. వెళ్లి యాజకుడిని కలవమని చెప్పాడు. వీరు మమ్ములను తాకమని అడుగలేదు. ప్రభువు మాటకు విధేయించి వెళుతున్నారు. ప్రభువు చెప్పినట్లు చేయగానే వారు మార్గ మద్యంలో ఉండగానే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గమనించవలసినది,  ప్రభువు పొమ్మని చెప్పినవెంటనే వారికి  స్వస్థత కలుగలేదు, అయినప్పటికీ ప్రభువు చెప్పగానే వారు యాజకుని కలువడడానికి వెళుతున్నారు. ప్రభువు మాట  మీద వారికి ఉన్న నమ్మకం తెలియజేస్తుంది. ప్రభువు మాటను విధేయించడం ద్వారా వారు స్వస్థత పొందుతున్నారు. ప్రభువు మాటను మారు మాటాడకుండా   విధేయించిన తీరు ప్రభువు మాటకు వారు ఇచ్చిన గౌరవం మరియు ఆతని మీద ప్రగాఢమైన నమ్మకం తెలియజేస్తుంది.  వారి విధేయతకు తగినట్లే మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుతున్నారు. 

సమరియుని ప్రత్యేకత 

అందరు స్వస్థత పొందుతున్నారు. కాని తనలో వస్తున్నా మార్పును గమనించగలిగినది ఒక సమరియుడు మాత్రమే. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువు ద్వారా తమ జీవితంలో జరిగిన ప్రతి మార్పును గమనించగలుగుతాడు. కృతజ్ఞతచెల్లిస్తాడు. దేవుని అంతులేని అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తి కేవలం ఒక సమరియుడు మాత్రమే.యూదులు సమరియులతో ఏ పొత్తు ఉండకూడదు అనుకుంటారు. సమరియులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు అని వారిని దూరం పెట్టారు. వారిని విదేశీయులుగానే భావించేవారు. కాని దేవుడు అందరికి తన దయను కరుణను చూపిస్తూనే ఉంటాడు. మానవునిలా ఒకరిని దూరం పెట్టేవాడు కాదు ప్రభువు.  ప్రభువులోని ఈ గుణం మనం అనేక సార్లు చూస్తాము. సమరియును కృతజ్ఞత ప్రభువు తనకు చేసిన మేలును గుర్తు చేస్తుంది. అంతేకాక సమాజం తనను చూసిన విధంగా కాకుండా దేవుడు తనను నూతన సృష్టిగా చూస్తున్నాడు అన్న విషయం తనకు తెలుస్తుంది.  

యేసు ప్రభువు ఆ సమరియునితో పది మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ? అని అడుగుతున్నాడు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని అనుగ్రహాలు పొందుతాము కాని కృతజ్ఞత తెలుపుటకు మాత్రము  వెళ్లము. కృతజ్ఞత తెలుపడం అంటే  దేవున్ని స్తుతించటం. మన కృతజ్ఞత దేవుని మహిమను, కీర్తిని  వెల్లడి చేస్తుంది. అంతేకాక ఈ కృతజ్ఞత ఇతరులు ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత దేవుడు చేసిన మేలుకు సాక్ష్యంగా ఉంటుంది. 

 ప్రార్థన

కరుణామయుడైన ప్రభువా! మీ కరుణ అనంతం. ఎవరు మీ వద్దకు వచ్చి మిమ్ము కరుణించమని అడిగిన వారిని కరుణించారు. వారి జీవితాలలో లేమిని తీసివేసి వారికి కావలసిన వాటిని ఇచ్చి వారిని  సమృద్ధిగలవారీగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. అనేకసార్లు నా జీవితంలో కూడా సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా బలహీనంగా ఉన్న సమయాలలో సమాజం కుష్టువానిని బయట పెట్టినట్లు, నన్నును బయట పెట్టిన నీవు కరుణచూపించావు. నన్ను హత్తుకొనుటకు సంకోసించలేదు. నేను నీకు చెందినవాడినని ధృవీకరించావు.  అయినప్పటికీ  మీరు చేసిన మేలును గుర్తించకుండ ఉన్నాను. ప్రభువా! మీ మేలును గుర్తించకుండా,  మీకు కృతజ్ఞత తెలప కుండా ఉన్న సందర్భాలలో నన్ను క్షమించండి. మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని, కృతజ్ఞత తెలియజేస్తూ, మీకు కీర్తిని,  మహిమను కలిగిస్తూ , మీ మేలులకు సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

9, నవంబర్ 2024, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం 
1 రాజుల 17:10-16, హెబ్రీ 9:24-28, మార్కు 12:38-44
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మనము ఉదారముగా ఉండిన యెడల దేవుని యొక్క దీవెనలు పొందుతాము అనే అంశమును గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక విధముగా చెప్పుకోవాలంటే దేవునికి ఉదాహరణగా సమర్పించే అర్పణ గురించి ఈనాటి పఠణంలో తెలియచేస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన పొందిన ప్రతిదీ దేవునికి మరియు పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయము ఉండాలి. దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతూ మనకు ఉన్నదంతా సమర్పించుకుని జీవించిన ఎడల ఇంకా మనము అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారె ఫతు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యొక్క కృపను పొందుకున్నది. ఈ మొదటి పఠణం యొక్క సన్నివేశం మనం గమనించినట్లయితే ఆహాబు రాజు యెసబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవముల ఆరాధించే సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరముల పాటు ఆ దేశమున కరువు సంభవిస్తుందని ఏలియా ప్రవక్త తెలియజేశారు ఈ కరువు కాల సమయంలో దేవుడు ఏలియాను సారెఫతుకు పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయంలో దేవుడు ధనమున్న వారిని వదిలివేసి కేవలము అద్భుతము చేయుటకు ఒక పేద వితంతువును, అది కూడా అన్యురాలను ఎంచుకుంటున్నారు. బహుశా ఆమె మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, ప్రార్థన పరిరాలయుండవచ్చు సోదర ప్రేమ కలిగిన వ్యక్తి ఉండవచ్చు అందుకని దేవుడు ఆమె యొక్క జీవితమును రక్షించుట నిమిత్తమై ఏలియా ప్రవక్తను అచటకు పంపిస్తున్నారు. 
ఏమి జీవితంలో మనము కొన్ని విషయములను ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకోవాలి. 
1. ఆమె యొక్క గొప్ప విశ్వాసం: ఏలియా ప్రవక్త  తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్భంలో వెంటనే దేవుని యందు ఉన్న విశ్వాసము వలన ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. విశ్వాసము వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టే జాతులకు జ్యోతిగా దీవించబడ్డారు, మోషే విశ్వసించారు కాబట్టే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఉత్తమ నాయకునిగా చేయబడ్డాడు, కననీయ స్త్రీ విశ్వసించినది కావున దేవుని యొక్క వరము పొందినది, యాయీరు దేవుని విశ్వసించారు కాబట్టి తన యొక్క కుమార్తెను పొందగలిగాడు. విశ్వాసము ఉంటేనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేస్తారు ఈ యొక్క పేద వితంతువు కూడా తానున్నటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని యందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నది కావున దేవుడు ఆమె జీవితమును దీవించారు. 
2. ఉదాహరణగా ఇచ్చే మనసు- ఈ వితంతువు తన జీవితంలో తనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా కానీ తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నది. ఆమె ఏలియాతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం, ప్రేమ దాగి ఉన్నవని ఆమె భావించినది. ఉదారంగా ఇస్తే దేవుడి దీవిస్తారని భావించింది. లూకా6:38, ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారని నమ్మినది. 2 కొరింతి 9:6-7 ఈ యొక్క పేద వితంతువు ఉదారంగా ఇచ్చారు కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా దీవెనలు పొందింది. 
3. త్యాగం చేసే గుణం- ఈ వితంతువు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియనప్పటికీ ఆమె తన యొక్క ఆహారమును వేరే వారికి త్యాగం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే అది తిని వారు కూడా చనిపోదామనుకున్నారు ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అయినా ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో ఉన్న ఆమె త్యాగం చేసినది కావున ఆమె యొక్క త్యాగమును ప్రభువు దీవించారు. మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకుని దేవునికి సమర్పించు జీవిస్తే తప్పనిసరిగా అది పెద్ద సమర్పణ. చాలా సందర్భాలలో దేవుడు మెచ్చుకునే సమర్పణ ఏమిటంటే దేవునికి ఉదారంగా ఇచ్చుట. ప్రభువు పేద వెధవరాలి కానుకను మెచ్చుకున్నారు. తొలి క్రైస్తవ సంఘ జీవితమును మెచ్చుకున్నారు అలాగే ఈ సారెఫతు వితంతువు జీవితమును మెచ్చుకుంటూ ఆమె త్యాగముకు ప్రతిఫలంగా ఆహారం సమృద్ధిగా ఇచ్చారు. 
4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత- ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల విధేయత చూపినటువంటి అంశమును చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన వెంటనే ఆమె దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి జీవించినది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితములు నిండుగా దీవించబడతాయి. పవిత్ర గ్రంథంలో అబ్రహాము, మోషే, యెహోషువ ఇంకా చాలామంది వ్యక్తులు దేవుడికి విధేయుత చూపించి దీవెనలు పొందారు అదే విధంగా ఈ వితంతువు కూడా దేవుడి యెడల విధేయత చూపించి ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. 
ఈనాటి సువిశేష భాగములో పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం చదువుకుంటున్నాం. కానుకల పెట్టె దగ్గర ప్రతి ఒక్కరూ కానుకలను ప్రభువు పరిశీలించారు. చాలామంది ధనవంతులు వారు కానుక వేసేటప్పుడు అది అందరికీ కనబడాలి అని విసిరి వేస్తుంటారు. ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికీ కనబడేలా వారు కానుకలు పెట్టెలో ధనం వేసేవారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి కొంతగా దేవునికి సమర్పించేవారు కానీ ఈ యొక్క పేద వితంతువు తనకు ఉన్నది మొత్తము కూడా దేవునికి సమర్పించుకుని జీవించారు. ఆమె దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినది. తన యొక్క జీవిత మనుగడ కొరకు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి ఉంది. మనకు ఉన్న దానిలో దేవునికి ఇస్తే దానిలో గొప్ప త్యాగం ఏమీ లేదు కానీ మనకి ఉన్నది మొత్తం కూడా దేవునికి ఇస్తే అది గొప్ప త్యాగమే. ఈ యొక్క పేద వితంతువు తాను సమర్పించినది కొద్దిదైనప్పటికీ తన దగ్గర ఉన్న మొత్తము సమర్పించినది కావున ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అందుకనే ప్రభువు ఆమెకు న్యాయం చేశారు. ఈనాటి ఈ యొక్క పరిశుద్ధగా గ్రంధ పఠణముల నుండి మనం కూడా త్యాగ గుణము, ఉదార స్వభావం, విశ్వాసము కలిగి జీవించుట అనే అంశములను అలవర్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం

  యోహాను 13: 16-20 దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుక...