9, నవంబర్ 2024, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం 
1 రాజుల 17:10-16, హెబ్రీ 9:24-28, మార్కు 12:38-44
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మనము ఉదారముగా ఉండిన యెడల దేవుని యొక్క దీవెనలు పొందుతాము అనే అంశమును గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక విధముగా చెప్పుకోవాలంటే దేవునికి ఉదాహరణగా సమర్పించే అర్పణ గురించి ఈనాటి పఠణంలో తెలియచేస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన పొందిన ప్రతిదీ దేవునికి మరియు పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయము ఉండాలి. దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతూ మనకు ఉన్నదంతా సమర్పించుకుని జీవించిన ఎడల ఇంకా మనము అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారె ఫతు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యొక్క కృపను పొందుకున్నది. ఈ మొదటి పఠణం యొక్క సన్నివేశం మనం గమనించినట్లయితే ఆహాబు రాజు యెసబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవముల ఆరాధించే సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరముల పాటు ఆ దేశమున కరువు సంభవిస్తుందని ఏలియా ప్రవక్త తెలియజేశారు ఈ కరువు కాల సమయంలో దేవుడు ఏలియాను సారెఫతుకు పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయంలో దేవుడు ధనమున్న వారిని వదిలివేసి కేవలము అద్భుతము చేయుటకు ఒక పేద వితంతువును, అది కూడా అన్యురాలను ఎంచుకుంటున్నారు. బహుశా ఆమె మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, ప్రార్థన పరిరాలయుండవచ్చు సోదర ప్రేమ కలిగిన వ్యక్తి ఉండవచ్చు అందుకని దేవుడు ఆమె యొక్క జీవితమును రక్షించుట నిమిత్తమై ఏలియా ప్రవక్తను అచటకు పంపిస్తున్నారు. 
ఏమి జీవితంలో మనము కొన్ని విషయములను ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకోవాలి. 
1. ఆమె యొక్క గొప్ప విశ్వాసం: ఏలియా ప్రవక్త  తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్భంలో వెంటనే దేవుని యందు ఉన్న విశ్వాసము వలన ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. విశ్వాసము వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టే జాతులకు జ్యోతిగా దీవించబడ్డారు, మోషే విశ్వసించారు కాబట్టే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఉత్తమ నాయకునిగా చేయబడ్డాడు, కననీయ స్త్రీ విశ్వసించినది కావున దేవుని యొక్క వరము పొందినది, యాయీరు దేవుని విశ్వసించారు కాబట్టి తన యొక్క కుమార్తెను పొందగలిగాడు. విశ్వాసము ఉంటేనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేస్తారు ఈ యొక్క పేద వితంతువు కూడా తానున్నటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని యందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నది కావున దేవుడు ఆమె జీవితమును దీవించారు. 
2. ఉదాహరణగా ఇచ్చే మనసు- ఈ వితంతువు తన జీవితంలో తనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా కానీ తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నది. ఆమె ఏలియాతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం, ప్రేమ దాగి ఉన్నవని ఆమె భావించినది. ఉదారంగా ఇస్తే దేవుడి దీవిస్తారని భావించింది. లూకా6:38, ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారని నమ్మినది. 2 కొరింతి 9:6-7 ఈ యొక్క పేద వితంతువు ఉదారంగా ఇచ్చారు కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా దీవెనలు పొందింది. 
3. త్యాగం చేసే గుణం- ఈ వితంతువు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియనప్పటికీ ఆమె తన యొక్క ఆహారమును వేరే వారికి త్యాగం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే అది తిని వారు కూడా చనిపోదామనుకున్నారు ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అయినా ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో ఉన్న ఆమె త్యాగం చేసినది కావున ఆమె యొక్క త్యాగమును ప్రభువు దీవించారు. మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకుని దేవునికి సమర్పించు జీవిస్తే తప్పనిసరిగా అది పెద్ద సమర్పణ. చాలా సందర్భాలలో దేవుడు మెచ్చుకునే సమర్పణ ఏమిటంటే దేవునికి ఉదారంగా ఇచ్చుట. ప్రభువు పేద వెధవరాలి కానుకను మెచ్చుకున్నారు. తొలి క్రైస్తవ సంఘ జీవితమును మెచ్చుకున్నారు అలాగే ఈ సారెఫతు వితంతువు జీవితమును మెచ్చుకుంటూ ఆమె త్యాగముకు ప్రతిఫలంగా ఆహారం సమృద్ధిగా ఇచ్చారు. 
4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత- ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల విధేయత చూపినటువంటి అంశమును చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన వెంటనే ఆమె దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి జీవించినది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితములు నిండుగా దీవించబడతాయి. పవిత్ర గ్రంథంలో అబ్రహాము, మోషే, యెహోషువ ఇంకా చాలామంది వ్యక్తులు దేవుడికి విధేయుత చూపించి దీవెనలు పొందారు అదే విధంగా ఈ వితంతువు కూడా దేవుడి యెడల విధేయత చూపించి ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. 
ఈనాటి సువిశేష భాగములో పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం చదువుకుంటున్నాం. కానుకల పెట్టె దగ్గర ప్రతి ఒక్కరూ కానుకలను ప్రభువు పరిశీలించారు. చాలామంది ధనవంతులు వారు కానుక వేసేటప్పుడు అది అందరికీ కనబడాలి అని విసిరి వేస్తుంటారు. ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికీ కనబడేలా వారు కానుకలు పెట్టెలో ధనం వేసేవారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి కొంతగా దేవునికి సమర్పించేవారు కానీ ఈ యొక్క పేద వితంతువు తనకు ఉన్నది మొత్తము కూడా దేవునికి సమర్పించుకుని జీవించారు. ఆమె దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినది. తన యొక్క జీవిత మనుగడ కొరకు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి ఉంది. మనకు ఉన్న దానిలో దేవునికి ఇస్తే దానిలో గొప్ప త్యాగం ఏమీ లేదు కానీ మనకి ఉన్నది మొత్తం కూడా దేవునికి ఇస్తే అది గొప్ప త్యాగమే. ఈ యొక్క పేద వితంతువు తాను సమర్పించినది కొద్దిదైనప్పటికీ తన దగ్గర ఉన్న మొత్తము సమర్పించినది కావున ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అందుకనే ప్రభువు ఆమెకు న్యాయం చేశారు. ఈనాటి ఈ యొక్క పరిశుద్ధగా గ్రంధ పఠణముల నుండి మనం కూడా త్యాగ గుణము, ఉదార స్వభావం, విశ్వాసము కలిగి జీవించుట అనే అంశములను అలవర్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...